Menu Close
తెలుగు పద్య రత్నాలు 52
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఎప్పుడైనా భగవంతుడు అవతారం ధరిస్తే ఆయనకున్న మహాపురుష లక్షణాలని బట్టి ఆయన భగవత్స్వరూపుడు అని చెప్పవచ్చుట. అయితే ఈ మహాపురుష లక్షణాలు ఏమిటి అవి ఎలా ఉంటాయి అనేవాటికి మనకి భాగవతంలో సమాధానం దొరుకుతుంది.  నరసింహావతారంలో స్థంభంలోంచి వచ్చే శ్రీహరిని వర్ణిస్తూ పోతన చెప్తాడు అద్భుతమైన వచనంలో – “… ప్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర చాప హల కులిశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును…” అంటూ. అరికాలులో విచ్చుకున్న పద్మాలు, చక్రం, చాపం, నాగలి, మీనాకృతి అనేవి ఉంటాయిట. అకౄరుడు బలరామ కృష్ణులని కంసుడు తలపెట్టే యాగానికి పిలవడానికి వెళ్తుంటే గోకులం ఊరు పొలిమేరల్లో దిగి కృష్ణుడి పాద ముద్రలకి నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళాడుట ఆయన ఇంటికి. ఈ పాద ముద్రలు ఎలా గుర్తించాడంటే - ప్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర చాప హల కులిస జల చర రేఖాంకిత చారు చరణ తలుండును.. అనే వాటివల్లే. బుద్ధుడికి కూడా ఇటువంటివి ఉండేవి అంటారు. ఇందులో ఒకటి రాముడికి ఉన్నట్టే ఆజానుబాహుడుగా ఉండటం. అంటే చేతుల వేళ్ల చివరలు మోకాలిని తాకుతాయిట. ఈ మహాపురుష లక్షణాలు  ముప్ఫై రెండు అనీ, వాటితోపాటు వచ్చే అనువ్యంజనాలు ఎనభై నాలుగు అనీ అంటారు.

అవన్నీ అలా ఉంచుదాం. ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నవారు మనకి కనబడినా మనం గుర్తించలేం. అయితే స్వామి వివేకానందులు చెప్పినట్టూ మనిషి వాక్కుని బట్టీ ప్రవర్తన బట్టీ ఆయన ఎటువంటివాడో చెప్పవచ్చు. ఈ విషయాలు చెప్పే భర్తృహరి సుభాషితాలులో ఉన్న పద్యం వివరిస్తోంది.

చ.
కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పుడున్ [భర్తృహరి సుభాషితాలు – 53]

చేతులకు ఎల్లపుడూ దానం చేసే గుణం (కరమున నిత్యదానము), నోటికి సత్యవాక్కును పలికే లక్షణం (ముఖంబున సూనృతవాణి, అబద్ధం – అనృతం - ఆడకపోవడం), శిరస్సుకు గురువుల పాదాలకు నమస్కరించే గుణం (యౌఁదలం గురుచరణాభివాదన), రెండు బాహువులకు ఎదురులేని పరాక్రమం (అకుంఠిత వీర్యము దోర్యుగంబునన్) కలిగి ఉండే గుణం, మనస్సునకు అకళంకమైన ప్రవర్తన అనే లక్షణం (వరహృదయంబునన్, విశదవర్తన), చెవులకు శాస్త్రశ్రవణం అనే గుణం (మంచితవిద్య వీనులన్) - ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా (సిరి లేనియప్పుడున్) సహజాలంకారాలుగా (సురుచిరభూషణంబు) భావింపబడతాయి.

ఒకటి గమనించండి. పైన చెప్పిన పద్యంలో ఉన్న ఒక్క లక్షణం ఉంటే మహాత్ముడు అయిపోరు. ఈ విషయం కర్ణుడి విషయంలో చూడవచ్చు. ఎంత దాన ధర్మాలు చేసినా, పరాక్రమం ఉన్నా చివరకి దుర్యోధనుణ్ణి, అధర్మాన్నీ అంటిపెట్టుకోవడం వల్ల నాశనం అయ్యాడు కదా? అయితే స్వామి వివేకానందుల విషయంలో చూడండి. ఆయన అన్నీ వదులుకున్న సన్యాసి. అయినా తన గురువు శ్రీరామకృష్ణుల పేరుతోనే అన్నీ చేసినది. తన దగ్గిరకి ఎవరొచ్చినా లేదు అనేవారు కాదు. కేవలం ముప్ఫై ఏళ్ళ పై చిలుకు బతికి, దేహం వదిలి నూరేళ్ళు అవుతున్నా, ఈ నాటిక్కూడా ఆయన చెప్పే విషయాలు విస్మయం కలిగిస్తాయి – ప్రపంచంలో దేనికీ భయపడాల్సిన పనిలేదు అంటారు. జేబులో కాణీ లేకుండా అమెరికా వచ్చి ప్రపంచానికి ఆయన ఏనాటికీ మర్చిపోలేని సందేశం ఇచ్చారు కదా? ఆఖరికి గురువుగారి పేరు మీదే రామకృష్ణా మఠం స్థాపించి, దాని బొమ్మ మీద కూడా ‘ఆత్మనో మోక్షార్ధం జగత్ హితాయచ’ అనే రాయించారు. ఏదైనా మీకు అధైర్యం కలిగించే విషయం అయితే దాన్ని కాలివేళ్లతో కూడా ముట్టుకోకండి అంటారు. (Anything that brings spiritual, mental, or physical weakness, touch it not with the toes of your feet). అదీ మహాపురుష లక్షణం అంటే. అంతా చేసి స్వామి గారి ఆస్థి ఏమిటి? ఏమీలేదు, ఆయన సర్వసంగ పరిత్యాగి. మఠంలో ఎవరు ఉన్నా, డబ్బు ఉన్నాలేకపోయినా ఆయన ధారాళంగా ఏది తన దగ్గిర ఉంటే దాన్ని ఇచ్చేసేవారు. దీని గురించే ఆయన అనేకసార్లు చెప్పడం గమనించవచ్చు – మీరు ఇవ్వండి అది అనంతమై మీ దగ్గిరకి తిరిగి వస్తుంది. ఇదే విషయం దివ్య జీవన సంఘం స్థాపించిన శ్రీ శివానందుల విషయంలో కూడా చూడవచ్చు. ఆయనని చూడ్డానికి వచ్చిన ఒక విదేశీయుడు ‘ఇదేమిటి ఈయన తన దగ్గిర ఏమీ లేకపోయినా ఎలా ఇస్తున్నారు అని ఆశ్చర్యపోయి ఈయన పేరు ‘గివానంద’ (give – Ananda) – అంటే ఇవ్వడం లో సంతోషం పొందేవారు అని మార్చాలి అన్నారుట. ఆ ఇవ్వడం కూడా అలా ఉండాలంటే కుడి చేత్తో చేసిన దానం ఎడమచేతికి తెలియకూడదుట. అదీ అసలైన మహాపురుష లక్షణం అంటే. తాను ఏదో ఇచ్చినందుకు ‘నేను ఇలా ఇచ్చానోహో, నేనెంత గొప్పవాడినో’ అంటూ డబ్బా కొట్టుకోవడం కాదు.

****సశేషం****

Posted in October 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *