Menu Close
తెలుగు పద్య రత్నాలు 50
-- ఆర్. శర్మ దంతుర్తి --

విశ్వనాధ సత్యన్నారాయణ గారు అన్నట్టూ తెలుగు పుణ్యపేటి అయిన మన పోతన తెలుగులో రాసిన ప్రసిద్ధమైన గ్రంధం విష్ణు కధలు చెప్పే మహా భాగవతం అయినా పోతన మహా శివభక్తుడు. వీరభద్ర విజయం అనేది కూడా పోతన రాసినదే. వీరభద్రుడు ఎందుకు, ఎలా అవతరించాడు వగైరా అన్నీ అద్భుతమైన పద్యాలలో రాసాడు పోతన. అమ్మవారు పార్వతి ఒకనాడు పరమేశ్వరుడి దగ్గిరలో కూర్చుని మీ కంఠం ఎందుకు అలా నీలంగా ఉంది, మిగతా శరీరం కంటే వేరు రంగులో అని అడిగితే శివుడు చెప్తాడు – ఒకనాడు హాలాహలం తినడం వల్ల అని. ఆ కధంతా అంతా చెప్పండి అని అడిగినప్పుడు మొదట్లో దేవదానవులు మంధర పర్వతం లో పాలసముద్రం చిలకడం, అందులోంచి హాలాహలం ఎలా వచ్చిందీ అవీ చెప్తున్నాడు. హాహాహలం పుట్టాక బ్రహ్మ దగ్గిరకి వెళ్ళారు మొదట్లో. అబ్బే నేనేమీ చేయలేను అందరం కలిసి శివుడి దగ్గిరకి పోదాం అంటే వీళ్ళందరూ శివుడితో చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళగానే ఆయన్ని స్తుతిస్తూ చెప్పేదే ఈ నెల వీరభద్ర విజయంలోని పద్యం.

ఉ.
కాయజసంహరాయ! శశిఖండధరాయ! నమశ్శివాయ! కా
లాయ!హరాయ! భీషణబలాయ! కపాలధరాయ! దేవదే
వాయ!యమాంతకాయ! దృఢవజ్ర పినాక త్రిశూలదండ హ
స్తాయ!మునీంద్ర యోగివరదాయ! సురాధిపతే! నమోస్తుతే. [3-236]

జాగ్రత్తగా గమనించండి. ఇది తెలుగు పద్యమేనా? దాదాపు అన్నీ సంస్కృత పదాలుగా లేవూ? అదే తెలుగు భాషలో ఉండే అద్భుతం. శివుణ్ణి కీర్తిస్తూ మొదటగా చెప్తున్నారు. నువ్వు మన్మధుణ్ణి అంతం చేసినవాడివి (కాయజ సంహరాయ, కాయజుడు అంటే మన్మథుడు). సగం లేదా నెలవంక చంద్రుణ్ణి తల మీద ధరించినవాడివి (శశిఖండ ధరాయ, శశి=చంద్రుడు), మంగళకరుడవు (శివాయ=మంగళకరుడు), అన్నింటినీ హరించే కాలస్వరూపుడు (కాలాయ), పాపాలని హరించేవాడు (హరాయ), అతి బలవంతుడు (భీషణబలాయ, భీషణ=భయంకరమైన), కపాలం చేత్తో పట్టుకుని తిరిగేవాడు (కపాలధరాయ), దేవతలకే దేవుడు (దేవదేవాయ), యముణ్ణి అంతం చేసినవాడు (యమాంతకాయ), వజ్రం అంతటి ధృడమైన పినాకం అనే విల్లు, త్రిశూలమూ చేతబట్టినవాడు (దృఢవజ్ర పినాక త్రిశూలదండ హస్తాయ), ఇంతటివాడైనా ఒక్కసారి శంభో అనగానే మునులకీ, యోగులకీ సులభంగా వరం ఇచ్చేసేవాడు (మునీంద్ర యోగి వరదాయ), దేవతలకి అధిపతీ (సురాధిపతే), అయిన నీకు నమస్కారం.

ఇలా కీర్తించడం ఎందుకంటే పాలసముద్రంలో పుట్టినది ఎవరూ హరించలేని హాలాహలం. అది ప్రపంచాలని దహించడానికి సిద్ధంగా ఉంది. ముందు వెళ్ళి స్తుతిస్తే భగవంతుడు ప్రసన్నుడై ‘ఏం కావాలని ఇలా వచ్చారు, చెప్పండి’ అంటాడు కదా? అప్పుడు హాలాహలం గురించి చెప్పవచ్చు. దేవతలు హాలాహలం గురించి చెప్తే ‘సరే నేను దీన్ని హరిస్తాను’ అని చేత్తో పట్టుకుని దాన్ని నేరేడు పండులా మింగాడుట. అది కంఠంలోనే ఉంచుకున్నాడు. భగవంతుడి నుంచే కదా అన్ని లోకాలూ వెలువడింది? అవి ఉండేవి భగవంతుడి కడుపులోనే. హాలాహలం ఆ కడుపులోకి వెళ్తే లోకాలకి నష్టం కనక అది కంఠంలోనే ఉంచుకున్నాడు. అందువల్ల ఆయన కంఠం కమిలిపోయి నీలంగా అయింది. దాంతో నీలకంఠుడయ్యాడు. ఈ పద్యం వంటి స్తుతి మనకి చమకం మొదటి అనువాకంలో కనిపిస్తుంది – నమస్తే అస్తు భవగన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్రి రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయనమః

తెలుగు పద్యాలలో ఇలా సంస్కృతం వాడడం చాలాచోట్ల కనిపిస్తుంది. దానికి ప్రాస, యతి కూడా కలవడం యాదృఛ్ఛికం అనుకోవచ్చు. ఉదాహరణకి వామనావతారంలో పద్యం చూడండి.

శా.
“విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
దప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి” యంచుంగ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాచి పూజించి “బ్ర
హ్మప్రీత”మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్ [8-607]

మొదటి పాదం రెండో పాదం దాదాపు అంతా కూడా తెలుగు కాదు. అయినా సరే పద్యానికీ శార్దూలం వృత్తానికీ అందులో యతికీ ఏమీ దోషం లేదు. ఇటువంటిదే మనం పైన చెప్పుకున్న కాయజసంహరాయ, శశిఖండధరాయ, నమశ్శివాయ అనే ఉత్పలమాల కూడా.

ఈ కధలో పార్వతి శివుణ్ణి ఆయన కంఠం నీలంగా ఎందుకు ఉంది అడగడం అనే కధ వేరుగా ఉండడం గమనించవచ్చు. కొన్నిచోట్ల పార్వతి శివుడి కంఠం మీద చేయివేసి హాలాహలాన్ని అక్కడే ఆపిందనీ ఆవిడ త్రిమూర్త్యాత్మకమైన అమ్మవారు కనక లోకాలని కాపాడడానికి ఆ పని చేయగలిగిందనీ కనిపిస్తుంది పురాణాల్లో కొన్ని చోట్ల. ఇందులో ఉదహరించిన వీరభద్ర విజయం అనేది కింద చూడవచ్చు.
https://telugubhagavatam.org/?ViirabhadraVizayamu

****సశేషం****

Posted in August 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *