విద్యలేనివాడు వింత పశువు అని విన్నాం అనేక సార్లు. ఇలా అనడానికి మూలం భర్తృహరి రాసిన నీతి శతకమే. విద్వత్పద్ధతి అనే విషయంలో భర్తృహరి చెప్పిన శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు అనువాద పద్యం విద్య ఎటువంటిదో చెప్తోంది.
ఉ.
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు; విదేశ బంధుడున్
విద్య విశిష్టదైవతము; విద్యకుసాటి ధనంబులేదిలన్
విద్య నృపాల పూజితము; విద్యనెరుంగని వాడు మర్త్యుడే [నీతి శతకం 16]
విత్తము అంటే ధనం. విద్య కనిపించని రహస్యమైన ధనం (నిగూఢగుప్తమగు విత్తము). మానవులకి అందం కలిగించేది కూదా చదువే. కీర్తి (యశస్సు) కలిగించేది, భోగాలని ఇచ్చేది (భోగకరి) కూడా విద్య మాత్రమే. విద్యమాత్రమే మనకి గురువు, విదేశాలకి వెళ్ళినప్పుడు మనకున్న బంధువు విద్య ఒకటే. అన్ని దైవాలలో విశిష్టమైన దైవం విద్య (విశిష్టదైవతము). రాజులచేత పూజించబడేది విద్యమాత్రమే (విద్య నృపాల పూజితము). ఈ భూమి మీద విద్యకి సరిపోయేటువంటి ధనం వేరే ఏదీ లేదు. అందువల్ల విద్య అనేది లేనివాడు చచ్చినవాడి కిందే లేదా పశువు కిందే లెక్క (విద్యనెరుంగని వాడు మర్త్యుడే).
మొదటి పాదంలో నిగూఢగుప్తమగు విత్తము అనేది చూద్దాం. కోట్ల డాలర్లకి పడగెత్తిన వారెన్ బఫెట్ గారు చెప్తూ ఉంటారు. మీమీద మీరు పెట్టుబడి పెట్టుకోండి, చదువుకుని ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం కానీ, కొత్త పట్టా కోసం చదువు కోసం కానీ ఏదైనా సరే. దానికి ఎంత ఖర్చైనా వెనుకాడవద్దు. ఎందుకంటే ఒకసారి మీరు ఏదైనా నేర్చుకుంటే దాన్ని ఎవరూ తీసుకోలేరు. అది మీ దగ్గిరే రహశ్యంగా దాచుకోవచ్చు. దాని మీద ఎవరూ పన్ను కూడా కట్టమని అడగలేరు. ఆయన ఎందుకిలా చెప్తున్నారనేది సులభంగా అర్ధం చేసుకోవచ్చు. మీరు నేర్చుకున్నది మీకు బాగా ఉపయోగపడుతుంది. మంచి ఉద్యోగం రావచ్చు దానివల్ల లేదా మరో అద్భుతమైన అవిష్కరణ స్ఫురించవచ్చు. ఒకసారి విద్య నేర్చుకున్నాక ఆకాశమే హద్దు అన్నట్టూ డబ్బు సంపాదన కూడా రావొచ్చు. ఉదాహరణకి మీకు వేరే భాష హిందీ నేర్చుకోవాలనిపించింది. దానిమీద పెట్టుబడి పెట్టి బాగా మాట్లాడ్డం చదవడం రాయడం నేర్చుకున్నారు. ఒకసారి ఆంధ్రా దాటాక అది మీకు బాగా పనికిరావొచ్చు. నేను హిందీ నేర్చుకోవడం బాగా లాభించింది అని మీకు తెలుస్తుంది. అలాగే మీరు డాక్టర్ అయ్యారనుకోండి చదువుకుని. మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చినా ఢిల్లీలో ఉద్యోగం వచ్చినా మీ చదువు చూసి ఉద్యోగం ఇచ్చి నెత్తిమీద పెట్టుకుంటారు కదా? అయితే ఇది నిఘూఢం అని ఎందుకన్నారు? ఎందుకంటే మీరు నోరు విప్పి చెప్పేదాకా లేదా మీరు ఏదైనా చేసి చూపించేదాకా ఎవరికీ తెలియదు. దాన్ని ఎవరైనా దొంగిలించగలరా? ఏనాటికి దొంగిలించలేరు; అది ఎప్పటికీ మీ ధనమే (విత్తమే).
ఒకసారి మన దేశం నుంచి విదేశాలకి వెళ్ళే జనాలని చూడండి. అందరూ వచ్చేది ఏదో పై చదువులు చదువుకోవడానికో లేదా ఇప్పటికే బాగా చదువుకుని ఉద్యోగంలో పై మెట్టు ఎక్కి విదేశాలలో పనిచేయడానికో కదా వస్తున్నారు. ఆ విద్య వల్లే మనం ఉద్యోగాలు సంపాదించి డబ్బు సంపాదించగలుగుతున్నాం కదా? అదే విద్య రాకపోతే? మనకి విలువే లేదు. అందుకే మనకి ఉన్న విద్యే విదేశంలో ఉన్న పెద్ద బంధువు. దానికి సాటిలేదు. పెద్ద పెద్ద పండితులు కూడా ప్రభుత్వంలో పనిచేయాలంటే వాళ్ల విద్య తెల్సి ఉండాలి. బాగా చదువుకున్న అనేక మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం, రాష్ట్రపతులూ వాళ్లని గుర్తించి – ఈ ఫలానా వారు మంచి చదువూ అదీ ఉన్నవారు అని ఉద్యోగం ఇస్తున్నారు. ఇదే విద్య నృపాల పూజితము అంటే.
పూర్వ కాలంలో కూడా – మహాభారతం రచించిన కవిత్రయం నుంచి ఈకాలం వరకూ ప్రభుత్వం సహకారం ఇస్తూ ఉండడానికి కారణం విద్య మాత్రమే. అందుకే చదువుకి అంత ప్రాధాన్యత. ఇప్పటికీ కూడా అన్ని దేశాలలో పుస్తకాలు రాసేవారికీ, బాగా చదువుకుని పాఠాలు చెప్పే ఆచార్యులకీ డబ్బులూ పేర్లూ ఇచ్చి ప్రోత్సాహించడం చూడవచ్చు. ప్రతీ ఏటా ఇచ్చే నోబుల్ బహుమానాలు కూడా చదువూ, దాన్ని బట్టి వచ్చే అర్హతా, వారు చేసిన పనీ బట్టీ ఇచ్చేవే. ఇదే భర్తృహరి అంటున్నాడు.
దీనికి ముందు పద్యంలో భర్తృహరి అంటాడు. మనిషికి బట్టలూ, భుజకీర్తులూ, నగలూ, అత్తర్లూ అనేవి అలంకారాలు ఎప్పటికీ కావు ఎందుకంటే అవి ఏదో ఒకరోజు నశిస్తాయి. అయితే చదువు వల్ల వచ్చే నడవడీ వాగ్భూషణం ఒకటే మనకూడా ఎప్పటికీ నిలిచి ఉండేది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. స్వామి వివేకానందులని లండన్ లో ఎవరో అడిగారుట. మీ భారతీయులందరూ బట్టలూ అవి ఛండాలంగా వేసుకుని అసహ్యంగా కనిపిస్తారు. మీకు సిగ్గూ లజ్జా లేవు అని. అప్పుడు స్వామి గారు చెప్పారు ఆయన్తో. మీ దేశంలో డబ్బు బట్టి, వేసుకున్న బట్టల బట్టీ గౌరవం ఇస్తారు మనుషులకి. అందుకే మీకు అహంకారం ఎక్కువై ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడరు. మా దేశంలో మనిషికి తెలిసిన విషయం, విద్య బట్టీ గౌరవం ఇస్తాం. అందువల్ల మేము ప్రతీవారితోటి దుర్మార్గపు ఆలోచనలు చేయం. అదీ అసలు విషయం. గాంధీ గారు ఎటువంటి బట్టలు వేసుకునేవారో తెల్సినదే కదా? అంతటి పీలగా ఉండే మనిషి సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని నేలకి దించాడు. ప్రస్తుతానికి వస్తే ఒకప్పటి ఆ సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం భారద్దేశంలో ఒక చిన్న రాష్ట్రం అంత లేదు. అదీగాక ఇంగ్లీషూ, మిగతా విద్యలన్నీ నేర్చుకుంటున్న భారత దేశం అద్భుతంగా రాణిస్తూ ఉంది. అదే విద్య నిఘూఢమగు విత్తము, విద్యకుసాటి ధనంబులేదిలన్ అనే వాటి వల్ల లాభం.