కృష్ణావతారంలో కృష్ణుణ్ణి హాస్యాస్పదంగా పిలిచే పదం ఒకటి ఏమిటంటే ‘దొంగ.’ కృష్ణుడు పాలూ పెరుగూ వెన్నా దొంగిలించడమే కాక గోపికల మనస్సులు దోచినవాడూ, మునులు ఎంత తపస్సు చేసినా అందకుండా పోయే చోరుడూను. ఎవరికీ అందని అతి పెద్ద దొంగ అయినా ఆయనని కృష్ణం వందే జగద్గురుం అని కీర్తించడానికి కారణం కృష్ణుడు సాక్షాత్తు లీలామానుషవిగ్రహుడైన భగవంతుడు. ఈ చోరుడు, దొంగ అనే పదం పట్టుకుని శ్రీకృష్ణకర్ణామృతం రాసిన లీలాశుకుడు లేదా బిల్వమంగళులు రచించినదే చౌరాష్టకం. లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి అనీ వీరి పేరు బిల్వమంగళుడనీ చెప్తారు. తులసీదాసుకి తన భార్య వల్ల జరిగినట్టే ఈయనకీ ఒక వేశ్య వల్ల మనోనేత్రం తెరుచుకుంది. ఒక వర్షపు రాత్రి ఈయన ఆ వేశ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఈయనని ఈసడించింది – నా ఈ శరీరం అనే మాంసపు ముద్దకోసం ఇంత వర్షాన్నీ లెక్కచేయకుండా వచ్చావా? ఇలా రావడం బదులు నీ మనస్సు కృష్ణుడి మీద ఉంచితే ఎంత బాగుణ్ణు అంటూ. దానితో ఆయన మనోనేత్రం తెరుచుకుని కృష్ణ నామస్మరణలో పడ్డాడు.
ఆయన రచించిన చౌరాష్టకం లో కృష్ణుణ్ణి చోరుడంటూ కీర్తించడం చూడవచ్చు. కృష్ణుడు దొంగతనం చేయలేనిది ఏమీ లేదు కదా ప్రపంచంలో? అందువల్ల, నా సర్వస్వాన్నీ దొంగిలించావు; నిన్ను నామనస్సనే చీకటికొట్టులో బంధించాను, ఇంక ఎక్కడికీ పోలేవు సుమా అంటారు ఈ చౌరాష్టకంలో. ఈ సంస్కృత చౌరాష్టకాన్ని తెలుగులోకి శ్రీ తాడిగడప శ్యామలరావుగారు అనువదించారు. దీనిలో ఏడవ పద్యమే హృద్యంగా ఉన్న చంపకమాల.
చ.
హరి పదునాల్గులోకముల నట్లగుటన్ నిను పట్టి దెచ్చి చె
చ్చెర నట కార బెట్టితిని చేసిన చిత్రము లిన్ని యన్నియా
మురహర నీవొనర్చినవి ముట్టిన శిక్షప్రశస్తమైనదే [తాడిగడప శ్యామలరావు, చౌరాష్టకం 7]
పెద్ద దొంగని పట్టుకుంటే ఏం చేస్తాం? చీకటి కొట్టులో పెట్టి ఎక్కడకీ పారిపోకుండా ఉంచాలి కదా? చూడబోతే (అరయగ) పధ్నాలుగు లోకాలలో ఉన్న మనకి తెల్సిన అతి ప్రసస్తమైన చీకటి కొట్టు ఏది? భగవంతుడు కనిపించకముందు మన మనస్సే (నా మనోకుహరమంతటి) అతి చీకటి కొట్టు కదా? అందువల్ల భగవంతుణ్ణి పట్టుకొచ్చి (నిను పట్టి దెచ్చి) నా మనస్సనే చీకటి కొట్లో పెట్టాను (చెచ్చెర నట కార బెట్టితిని) అంటున్నారు. ఎందుకయ్యా అలా పెట్టావు అని అడుతావేమో సుమా? ఎందుకంటే నువ్వు చేసిన చిత్ర విచిత్రాలు ఇన్నీ అన్నీ కావు కదా? (చిత్రము లిన్ని యన్నియా మురహర నీవొనర్చినవి). ఇన్ని చిత్ర విచిత్రమైన దొంగతనాలు చేసావు కనక చీకటి కొట్లో పెట్టడం అనే నీకు ముట్టిన శిక్ష ప్రశస్తమైనదే సుమా అంటున్నారు.
ఈ మనస్సనే చీకటి కొట్టు గురించి ఓ మారు చూద్దాం. భగవంతుడు కనిపించాలంటే ఒకే ఒక దారి ఏమిటంటే మనసు పవిత్రంగా ఉంటే చాలు. ఏమి తింటున్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ విధంగా దుస్తులు వేసుకున్నాం అనేవన్నీ భగవంతుడికి అక్కర్లేదు. అందుకే మన మనస్సు శుభ్రం చేసుకోవడానికే ప్రాధ్యాన్యత. భగవంతుడు రానంతవరకూ అది పధ్నాలుగు లోకాల్లోనూ ఉన్న అతి పెద్ద చీకటి కొట్టే. ఒకసారి భగవంతుడు మనసులోకి వస్తే? శ్రీ రామకృష్ణులు చెప్పినట్టూ తలుపులు తెరవగానే వెల్తురూ, గాలి లోపలకి వచ్చినట్టూ అయ్యి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే జనన మరణాలకి విముక్తి. భగవంతుడు రాగానే మనసులో ఎందుకు ఒక్కసారి చీకటి పోయి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందనేదానికి సమాధానం భట్టాత్తిరి గారి నారాయణీయంలో చూడవచ్చు. ఆయన రాసిన నారాయణీయంలో భగవంతుణ్ణి “యత్త్రైలోక్య మహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్, కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్య ధుర్యాదపి….” అంటారు. త్రిభువనాలలో అతి కాంతివంతమైనదేది ఉందో దానికంటే కాంతివంతమైనవాడుట భగవంతుడు. అలాగే అన్ని మహాన్వితమైన వాటికంటే భగవంతుడు ఎక్కువ మహాన్వితుడు. వేరేగా చెప్పాలంటే, భగవంతుడి మహిమ ఇదీ అని మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన మంత్రపుష్పం చెప్పినట్టూ “అనంతమవ్యయం కవిం సముద్రేంతం విశ్వసంభువం.” అదీగాక ప్రపంచం ఆయననుండే ఉద్భవించింది కనక ఆయనకన్నా మహాన్వితమైనదేముంటుంది?
పైన ఇచ్చిన తెలుగు పద్యానికి మూలమైన లీలాశుకుడి సంస్కృత శ్లోకం ఇక్కడ చూడండి.
మన్మానసే తామసరాశిఘోరే
కారాగృహే దుఃఖమయే నిబద్ధః
లభస్వ హే చౌర! హరే! చిరాయ
స్వచౌర్యదోషోచితమేవ దండం
ఇందులో తామసరాశి అంటే చీకటి కొట్టు. మొత్తం చౌరాష్టకం ఎనిమిది పద్యాలూ ఇక్కడ ఇచ్చిన ఈమాట పత్రికలో చూడవచ్చు.