Menu Close
తెలుగు పద్య రత్నాలు 45
-- ఆర్. శర్మ దంతుర్తి --

శ్రీమద్రామాయణంలో సీతని రావణుడు ఎత్తుకుపోయాక రామలక్ష్మణులు ఆవిడని వెతుకుతూ బయల్దేరుతారు. వాళ్లకి ఆ సమయంలో సీతని ఎవరి ఎత్తుకుపోయారో తెల్సిన విషయం ఒకటే – అదీ జటాయువు చచ్చిపోతూ సగం మాత్రమే చెప్పినది “... వాడు విశ్రవసువు కొడుకు, కుబేరుడి తమ్ముడు... ” అది పట్టుకుని ముందుకి సాగుతూంటే కబంధుడనే రాక్షసుడు పట్టుకున్నాడు అన్నదమ్ములనిద్దర్నీ. ఈ కబంధుడి కధ చూద్దాం స్థూలంగా. ఒకానొక కాలంలో ఈ కబంధుడు అతి అందమైన గంధర్వుడు. అందంతో పాటు వచ్చే గర్వం వల్ల వికృతమైన వేషాలు వేసి అందర్నీ ఏడిపించడం ఆయనకో సరదా. అటువంటి రోజులలో స్థూలశిరుడనే ఋషిని ఏడిపించబోతే ఆయన శపించాడు “నువ్వింక ఇదే వికృత రూపంలో బతుకు” అని. “బుద్ధి గడ్డి తిని ఇలా అయింది, క్షమించాలి” అని అడిగితే రామ లక్ష్మణుల వల్ల శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు. ఈ యక్షుడు తర్వాత తపస్సు చేసి దీర్ఘాయువు సంపాదించాడు బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల. దాంతో ఇంద్రుడి మీదకి యుద్దానికి బయల్దేరాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి తల కడుపులో పెట్టి ఇంక ఇలాగే బతుకు అని వెళ్ళాడు. అప్పట్నుంచీ ఈ కబంధుడి పని అడవిలో బతుకుతూ చుట్టూ ఉండే వాటిని ఆ చేతులతో పట్టుకుని తినడమే.

సీతని వెదుకుతూ వచ్చే రామలక్ష్మణులని ఈ కబంధుడు పట్టుకుని తినబోతే ఇద్దరూ తలో చేయి ఖండించాక అప్పుడు తెలుస్తుంది వచ్చినవారు తన శాపవిమోచనం కోసం వచ్చారని. మీరెవరు, మీకేమి సహాయం కావాలి అని అడిగితే సీత గురించి చెప్తారు. అప్పుడు కబంధుడు అంటాడు, “ఈ ప్రస్తుత శరీరంలో జ్ఞాననాడి పనిచేయదు, [అంటే తల కడుపులో ఉంది కదా, అందువల్ల ఆలోచించే జ్ఞానం పోయింది ఈ తలకి, శరీరానికి] ఈ శరీరాన్ని దహనం చేస్తే నా పాత యక్ష రూపం వస్తుంది. అప్పుడు మీకు ఉపాయం చెప్తాను అంటాడు. అలా దహనం చేసాక ఆ మంటల్లోంచి యక్షుడు బయటకొచ్చి చెప్తాడు “సుగ్రీవుడితో స్నేహం చేసుకోండి. ఆయనకి ఈ భూమండలం అంతా తెలుసు తప్పక సహాయం చేస్తాడు” అని. అలా చెప్పేటప్పుడు సుగ్రీవుడు ఎక్కడుంటాడో, ఎటువంటివాడో రాముడితో చెప్పే ఈ నెల పద్యం శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణగారి రామాయణ కల్పవృక్షం లోనిది.

ఉ.
ఆతడు ఋష్యమూకగిరియందు వసించును పంప కా భృ
త్తాతలిగట్టు, నల్గురు సహాయులు వానికి వానరుల్ సదా
ప్రీతుడు సత్యసంధుడును వీరుడు బుద్ధిమదగ్రగణ్యుడున్
చేతమునం దధర్మమును చెందడు శార్యపయోధి రాఘవా [రామా. కల్పవృక్షం, శబరీ ఖండము 298]

ఈ సుగ్రీవుడనే వానరుడు ఋష్యమూక పర్వతం మీద ఉంటాడు, పంపానది కి అవతలి గట్టు మీద. కూడా నలుగురు వానర సహాయులు ఉన్నారు. నిత్య సంతుష్టుడు (సదా ప్రీతుడు), మాటమీద నిలబడేవాడు (సత్యసంధుడు), బుద్ధిలో అగ్రగణ్యుడు (బుద్ధిమదగ్రగణ్యుడున్), అధర్మం చేసేవాడు కాదు (చేతమునం దధర్మమును చెందడు), శౌర్యుడు (శార్యపయోధి). గమనించారా సరిగ్గా? సుగ్రీవుడి గురించే చెప్తున్నాడు కానీ వాలి గురించి చెప్పటం లేదు.  దీనికి రెండు కారణాలు. మొదటిది - వాలికి తన బలం చూసుకుని ఎవరూ తననేమీ చేయలేరని గర్వం. ఈ యక్షుడికి తాను అందగాడిననే గర్వం వల్ల రాక్షసుడైన అధోగతి గుర్తు ఉంది కనక రాముణ్ణి గర్వం ఉన్న వాలి దగ్గిరకి వెళ్లమని చెప్పడం లేదు. రెండోది, రాముడు ఎటువంటివాడు? రామో విగ్రహాన్ ధర్మః అంటారు వాల్మీకి రామాయణంలో. పోతపోసిన ధర్మమే రాముడు. అటువంటి ధర్మమూర్తి - అధర్మపరుడూ [తన తమ్ముడు సుగ్రీవుణ్ణి అధర్మంగా ఇంట్లోంచి గెంటేసాడు కదా?] గర్వోన్నతుడైన - వాలిని సహాయం అడగడం ఎంత వరకూ సమంజసం?

నిజంగా రాముణ్ణి వాలి దగ్గిరకి వెళ్ళమని చెప్పి ఉంటే ఏమై ఉండేది అని ఆలోచిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి. రావణుడు వాలిని జయించడానికి వస్తే ‘ఆయన ఇలా సంధ్యావందనం చేయడానికి నాలుగు సముద్రాలకి వెళ్ళాడు, వచ్చాక మీ సంగతి చూస్తాడు’ అని చెప్తారు అనుచరులు. ఈ రావణుడికి అంతవరకూ ఆగే ఓపిక లేక తానే బయల్దేరుతాడు సముద్రం దగ్గిరకి. సంధ్య వారుస్తూంటే తన వెనకి నుంచి పట్టుకోవడానికి వచ్చిన రావణుణ్ణి చేతుల మధ్య ఇరికించుకుని వాలి అన్ని సముద్రాల్లో సంధ్య వార్చి వెనక్కి వచ్చాక నేల మీద పారేసి అడుగుతాడు, ‘ఎక్కడనుంచి రాక రావణా?’ అని. దాంతో బెదిరిపోయి రావణుడు ‘నీతో అగ్నిసాక్షిగా స్నేహం వాంఛిస్తున్నాను’ అంటాడు. అలా వాలీ రావణుడు స్నేహితులు. రాముడు వాలి దగ్గిరకి వెళ్తే ‘రావణుడు నా స్నేహితుడు, నీకు సహాయం చేయను’ అనొచ్చు. అదీగాక అధర్మ రూపుడైన రావణుడితో స్నేహం చేసినవాడూ, బలం చూసుకుని గర్వంతో మిడిసిపడేవాడూ అయిన వాలితో రాముడు స్నేహం చేయగలడా? అసలు రాముడు పుట్టినదే ధర్మ రక్షణ కోసం కదా? అధర్మం చేసే అందర్నీ రాముడు దారిలోకి తీసుకువావాలి. అందువల్లే వనవాసంలో ప్రతీ ఒక్కరూ కూడా రాముణ్ణి ఇంకా ముందుకి, ఇలా ఈదారిలో వెళ్తే మంచిది అని చెప్తారు తప్ప అక్కడేం జరుగుతుందో చెప్పరు. ఆఖరికి అగస్త్య మహర్షి కూడా ‘మీరు ఇక్కడే నా ఆశ్రమంలో ఉండొచ్చు, కానీ ఇంకా ముందుకు పంచవటికి వెళ్లండి, అక్కడే బాగుటుంది; పనిలో పనిగా ఈ ధనుస్సు నీ దగ్గిర ఉంచు’ అంటూ ముందుకి తోస్తారు. వాళ్ళందరికీ జరగబోయేది తెలుసు. కానీ అవన్నీ రాముడితో చెప్పడం అనవసరం.

అందుకే కబంధుడు రాముణ్ణి సుగ్రీవుడి దగ్గిరకి వెళ్ళమని సలహా చెప్తున్నాడు. గమనించారా? బలం అనేది మనని రక్షించదు. బలం, అందం అనేవి గర్వానికి కారణం అవుతాయి. ఆ గర్వం వచ్చాక అది మన అధోగతికి కారణం అవుతుంది. ధర్మం అనేది ఒకటే మనని రక్షించేది. అందుకే వాలి బలవంతుడైనా రాముణ్ణి వాలి దగ్గిరకి వెళ్ళమని చెప్పడం లేదు కబంధుడు. ఇదే హిందూ మతంలో చెప్పే, “ధర్మో రక్షతి రక్షితః”

****సశేషం****

Posted in March 2025, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!