Menu Close
తెలుగు పద్య రత్నాలు 44
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఈ నెల పద్యం చూసేముందు రాసినవారి గురించి చిన్న కధ చెప్పుకుందాం. ఒకానొక రాజ్యానికి సరిహద్దులో ఓ ముని తపస్సు చేసుకుంటూంటే ఆయన తపోఫలం ఒక మామిడి పండుగా చేతిలో పడింది. ఈ పండు రాజు చేతిలో ఉంటే అందరికీ మంచిది అని ఆయన దాన్ని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారికి భార్య అంటే భలే ఇష్టం. అలా ఆవిడకి చేరింది పండు. అయితే రాణీగారికో వేరే విటుడున్నాడని రాజుగారికి తెలియదు. ఆవిడ పండుని తన విటుడికి ఇచ్చింది. ఆ విటుడికి వేరే ఆవిడతో సంబంధం ఉంది. ఆయన ఆ పండుని ఆ వేరే ఆవిడకి ఇచ్చాడు. ఈ వేరే ఆవిడకి రాజు అంటే చచ్చే ఇష్టం. అందువల్ల ఆవిడ ఆ మామిడి పండు పట్టుకొచ్చి రాజుగారికి ఇచ్చింది. అలా ఈ మామిడి పండు ఐదారు చోట్ల తిరిగి మళ్ళీ రాజుగారి దగ్గిరకి వచ్చేసరికి ఆయనకి ఆశ్చర్యం వేసి ఇదెలా జరిగిందా అని విచారించాడు. పైన చెప్పిన కధంతా తేలింది. మనుషుల్లో ఇంతటి దారుణమైన స్వభావం ఉంటుందని ఆయనకి అప్పటిదాకా తెలియదు. ఇదంతా చూసి ప్రపంచం అంటే అసహ్యం వేసి సన్యసించాడు. ఈయననే భర్తృహరి అంటారు. ఈయన ఉజ్జయిని రాజ్య వంశం వాడనీ ఈయన తమ్ముడే విక్రమార్కుడనీ ఓ కధనం ఉంది. ఈయన సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతి లో నీతి శతకం ఒకటి. దీనిని ఏనుగు లక్ష్మణ కవి అనే ఆయన తెనిగించారు. ఈ శతకంలో అనేక మానవ సంబంధాల విషయాలు ప్రస్తావించారు. ఈ నెల పద్యం లక్ష్మణ కవి గారి నీతిశతకం లో “అర్థ పద్ధతి” అనే పాఠం లోనిదే. అర్థ పద్ధతి అంటే డబ్బు ఏ విధంగా చేరుతుంది, ఎలా వాడాలి, ఎలా పోతుంది అనేటువంటి విషయాలు.

మ.
యతి సంగంబున, బాలుడాదరముచే, జ్యాభర్త దుర్మంత్రిచే
శ్రుతిహానిన్ ద్విజు, డన్వయంబు ఖలుచే, గ్రూరాప్తిచే శీల, ము
ద్ధతిచే మిత్రత, చూపులేమిగృషి, మద్యప్రాప్తిచే సిగ్గు, దు
ర్మతిచే సంపదలున్, నశించు జెడు నర్ధంబుల్ ప్రమాదంబునన్ [నీతి శతకం 33]

ఇందులో భర్తృహరి చెప్తున్నాడు. స్త్రీ సంగమం చేత సన్యాసి (యతి సంగంబున), ఎక్కువ గారాబంతో పిల్లలూ (బాలుడాదరముచే), చెడ్డ మంత్రి చేత రాజు (జ్యాభర్త దుర్మంత్రిచే; జ్యాభర్త – భూమికి భర్త లేదా రాజు), వేదాధ్యయనం చేయక బ్రాహ్మణుడు (శ్రుతిహానిన్ ద్విజుడు; శ్రుతి – వేదము, ద్విజుడు – బ్రాహ్మణుడు) , దుర్మార్గుడి వల్ల వంశం (అన్వయము – వంశం, ఖలుడు – దుర్మార్గుడు), చెడ్డ మాటల వల్ల శీలం (క్రూరాప్తి – చెడ్డ మాటలు), అహంకారం వల్ల స్నేహం (ఉద్దతి – అహంకారం; మిత్రత – స్నేహం) , సరైన ముందు చూపు లేకపోతే వ్యవసాయం (కృషి – సేద్యము లేదా వ్యవసాయం), తాగుడు వల్ల సిగ్గు, చెడుబుద్ధి వల్ల సంపదలు (దుర్మతి – చెడ్డబుద్ధులున్నవాడు) - వీటి వల్ల నాశనం ఎలా కలుగుతోందో అలాగే ప్రమాదాల వల్ల (అర్ధంబుల్ ప్రమాదంబునన్) ధనం హరించుకు పోతుంది.

ఇందులో విషయాలు చాలా వరకూ మన జీవితంలో చూడవచ్చు. అనుకోకుండా అదృష్టం తగిలి ధనవంతులైన వారు సరిగ్గా ఐదారేళ్ళలో అన్నీ తగలబెట్టుకుని యధాస్థితికి రావడం అనేకానేక సార్లు గమనిస్తున్నాం. దీనికి కారణం అతి సులభంగా చెప్పొచ్చు. ఆ డబ్బు కష్టపడి సంపాదించినది కాదు. అందువల్ల అది వచ్చేటప్పుడు అనేకానేక ప్రమాదాలు దాపురిస్తాయి. మద్యం, పొగ తాగడం అనేవి కొత్తగా అంటుకునే అవకాశం హెచ్చు కూడా. దాని వల్ల సిగ్గు అనేది పోతుందని చెప్తున్నాడు భర్తృహరి. డబ్బు సులభంగా వచ్చింది కనక ముందు చూపు లేదు అలా వచ్చిన డబ్బుతో ఏమి చేయాలో, చేయకూడదో. ఇదే చూపులేమి కృషి అంటే. అసలు లక్ష్మి ఎటువంటిది? అతి చంచలమైనది. ఒకచోట ఉండదు ఎప్పుడూను. కానీ ఎటువంటి ఖర్చూ చేయని పిసినార్ల దగ్గిర తిష్టవేసుకుని కూర్చుంటుందిట. భర్తృహరి వేరే చోట ఇదే చెప్తాడు.

దానం భోగో నాశస్తిస్రో
గతయో భవంతి విత్తస్య
యున్న దధాథి న భుక్త్కే
తస్య తృతీయా గతిర్భవతి (భర్తృహరి నీతి శతకం - 35)

ధనం ఉంటే అనుభవించగలగాలి. లేకపోతే అది కావాల్సిన వాళ్ళకీ, పాత్రులైన వాళ్ళకీ దానమివ్వడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధనానికి నలుగురు దాయాదులున్నారుట - ధర్మం, అగ్ని, రాజు, చోరులు అని. అనుభవించడం చేతకాక, దానమివ్వడం ఇష్టం లేకపోతే ఏమౌతుంది? దాన్ని మూడో దారిలో పై నలుగురిలో ఎవరో దోచుకుంటారుట. రాజు దోచుకోవడం అంటే పన్నులు కట్టమనీ మరోటనీ పీడించడం. డబ్బున్న వాడి దగ్గిరే దొంగలు దోచుకోవడం మొదలుపెడతారు కదా? మిగిలినది అగ్ని. ఖర్చు పెట్టకుండా దాచుకుంటే ఎప్పుడో ఓ నాడు ఇల్లు అంటుకుని అంతా బూడిదైపోవచ్చు. లేదా వేరేచోట దాచుకుంటే ఆ చోటు నాశనం కావొచ్చు. డబ్బు స్నేహితుల దగ్గిర దాస్తే వాళ్ళే మొండిచేయి చూపించి, అబద్ధం ఆడి దోచుకోవచ్చు. డబ్బు అధర్మంగా సంపాదిస్తే ఎలాగా పోతుంది.

రాజులు మంచివాళ్లైనా మంత్రులు/సలహాలిచ్చేవారు మంచివారు కాకపోతే రాజ్యాలు నాశనం కావడం అనేకసార్లు చూస్తాం చరిత్రలో. మహాభారతంలో శకుని వంటి మేనమామ, కర్ణుడి వంటి స్నేహితుడూ ఉన్న ధుర్యోధనుడు వారి మాట విని చివరకి అధోగతి చెందడం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కదా? ఇదే భర్తృహరి చెప్పిన విషయం - జ్యాభర్త దుర్మంత్రిచే అనేది.

****సశేషం****

Posted in February 2025, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!