విష్ణుభక్తులలో అగ్రగణ్యులైనవారిలో అంబరీషుడు మొదటివాడు. ఈయన భక్తి ఎటువంటిదంటే, అడగకుండానే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఆయనకి రక్షగా ఇచ్చాడు. అంబరీషుడు ద్వాదశి వ్రతం చేసేవాడుట క్రమం తప్పకుండా. ఈ వ్రతాలు కాక మరో కొన్ని యజ్ఞాలూ అవీ చేస్తూ ఉండేవాడు. యజ్ఞం చేసాక వేదవిదులకీ, వచ్చినవారికీ ఏది కావలిస్తే అది దానం ఇవ్వడం అనేదొక వ్రతంలాగా చేయాలి. ఆ రోజుల్లో ఉన్న నియమాల ప్రకారం గోవులని దానం ఇచ్చేవారు రాజులు. ఇచ్చే దానం ఎలా ఉండాలో అన్యాపదేశంగా చెప్తూ అంబరీషుడు ఎటువంటి గోదానం చేసాడో చెప్పే ఈ నెల పద్యం పోతన భాగవతంలోని అంబరీషోపాఖ్యానం లోనిది.
శా.
ల్మేలై ధూర్తులుగాక వెండిగొరిజల్హేమోరు శృంగంబులుం
గ్రాలం గ్రేపుల యఱ్ఱు నాఁకుచును రంగచ్చేలలై యున్న మం
దాలన్ న్యర్బుదషట్క మిచ్చె విభుఁ డుద్యద్వైదికశ్రేణికిన్ [పోతనభాగవతం 9.92]
రాజు అంబరీషుడు (విభుడు) వేదపండితులకు (ఉద్యద్వైదిక శ్రేణికిన్) గోదానం ఇస్తున్నాడు. ఆ గోవులు ఎటువంటివి? ఏరులు పారుతున్నట్టు పాలు సమృద్ధిగా ఇచ్చేవి (పాలేఱై ప్రహింపగన్), చక్కటి శరీర కాంతులు గలవి, మంచి ప్రాయం స్వరూపం కలవి (రూపముల్ మేలై), పొగరుమోతువి కానివి (ధూర్తులుగాక), వెండి తొడుగులు గల కాలిగిట్టలు (వెండి గొరిజల్), బంగారు కుప్పెలు గల (హేమోరు) పెద్ద కొమ్ములుతో(శృంగంబులన్) విలసిల్లేవి, దూడల అఱ్ఱులు నాకుతూ ఉన్నవి (గ్రేపుల యఱ్ఱు నాకుచును), తళతళలాడే వస్త్రాలు (రంగచ్చేలలై; చేలలు-వస్త్రాలు) అలంకరించినవి అయిన పాడిపశువులను (మందాలన్) దానం చేసాడు. ఎన్ని దానం చేసాడనేది చెపుతున్నాడు కూడా – ఆరువందల కోట్ల గోవులని ఇచ్చాట్ట (అర్బుదషట్కమిచ్చె). అర్బుదము అంటే వేయి కోట్లు.
ఇచ్చిన గోవులు ఎటువంటివి? పనికిరానివి, వాడి పారేసి, వట్టిపోయినవీ కాదు. దానం ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సినది ఇదే. ఓ చిన్న పిట్ట కథ చూద్దాం. మనం ప్రపంచానికేది ఇస్తామో దానికి రెట్టింపు మనకి వెనక్కి వస్తుంది అని చెప్తూ ఉంటారు. పూర్వాశ్రమంలో ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి రామకృష్ణా మిషన్ కి వెళ్ళి 'ఏమండి నా దగ్గిర కొన్ని వాడేసిన బట్టలు ఉన్నాయి. అవి మీకిస్తే మీరు ఎవరికేనా పేదలకి ఇస్తారా?' అని అడిగేను తెలివిగల వాడిలాగా, ఏదో పెద్ద దానం చేసేస్తూన్నట్టూ పోజు పెట్టి. అక్కడున్న స్వామిగారు నా కేసి చురుక్కున ఓ చూపు చూసి ఇలా చెప్పేరు "మేము ఇక్కడ ఎవరికీ ఏదీ వాడేసినది ఇవ్వము. అన్నీ కొత్తవే ఇస్తాము. మీరు కొత్తవి తెస్తే తప్పకుండా తీసుకుంటాము. ఈ మధ్య వరదల్లో చాలామందికి ఇల్లూ వాకిలీ పోగుట్టుకున్నారు. వాళ్ళకి కొత్త ఇళ్ళు కట్టించి ఇచ్చాము. బట్టల షాపులోంచి పంచెలూ, చీరలూ చెప్పించి ఇచ్చాము." అన్నారు. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నేల చూపులు చూస్తూంటే ఇంకా ఇలా అన్నారు నవ్వుతూ "మీకు ఎవరేనా వాడేసిన బట్టలు ఇస్తే తీసుకుంటారా? మీకు ఏది కావాలని అనుకుంటున్నారో అలాంటిదే మీరు అందరికీ ఇవ్వాలి. అయినా మనందరికీ ఇచ్చేది భగవంతుడైనప్పుడు అలా వాడేసినవి ఇద్దాం అని ఆలోచించకూడదు." పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను ఆ రోజున.
ఈ దానం గురించి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినది కూడా గమనించండి.
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతంయత్తు ప్రత్యుపకారార్ధం ఫల ముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం
అదేశకాలే య ద్దాన మపాత్రేభ్య శ్చ దీయతే
అసత్కృత మవజ్ఞాతం తత్తామస ముదాహృతం (భగవద్గీత, శ్రద్ధాత్రయ విభాగయోగం 20-22)
“దానం ఇవ్వడమనేది నా కర్తవ్యం” అనే భావంతో ప్రత్యుపకారం ఆశించకుండా పుణ్యప్రదేశాల్లో, పుణ్యకాలాల్లో పాత్రులైనవాళ్ళకి చేసేది సాత్వికమైన దానం. ప్రత్యుపకారం ఆశించో ఆముష్మికఫలం అభిలాషించో, అనిఛ్ఛాపూర్వకంగా చేసేది రాజసిక దానం. అపవిత్ర స్థానంలో, అయోగ్యులకి ప్రియవచనాది సత్కారాలు లేకుండా తిరస్కార భావంతో చేసేది తామసిక దానం.” అంబరీషుడు ఇచ్చినది సాత్విక దానం అని తెలుస్తోంది కదా?
మహా భాగవతంలో పోతన సరిగ్గా ఇదే చెప్తున్నాడు ఈ పద్యంలో అంబరీషుడు ఎటువంటి గోవులని ఇచ్చాడో చెప్తూ. ఇచ్చేది ఎప్పుడూ మంచిదై ఉండాలి. అలా ఇస్తే భగవంతుడు సంతోషిస్తాడు కానీ పనికిరానివీ, పారేసేవీ ఇస్తే మనకి భగవంతుడు కూడా అలాంటివే ఇస్తాడు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారి అధిపతి బిల్ గేట్స్ గారు తన సంపద దాదాపు అంతా ప్రజల కోసం ఖర్చుపెట్టడానికి ఒక వ్యవస్థ పెట్టాడు. ఏమైంది వెంటనే? తను ఎంత ఇచ్చాడో దానికి సమానమైన సంపద వారెన్ బఫెట్ గారు ఆయనకి ఇవ్వలేదూ? 'మీరు ఇవ్వండి అది అనంతమై మీ దగ్గిరకే వస్తుంది మళ్ళీ' అనే శివానంద సరస్వతి గారి సూక్తి ఎంత నిజమో గమనించారా? అందుచేతనే బలి చక్రవర్తీ, అంబరీషుడూ, శిబి ప్రముఖులందరూ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు తప్ప, తీసుకోవడానిక్కాదు. తీసుకోవడంలో పెద్దగా నేర్చుకుందుకేముంది? నేర్చుకునేది ఏమైనా ఉంటే అది ఇవ్వడంలో ఉండాలి.