Menu Close
తెలుగు పద్య రత్నాలు 42
-- ఆర్. శర్మ దంతుర్తి --

క్రితం నెల పద్యంలో దేవదానవుల సంహారం అంటే ఏమిటో చూసాం. ఈ సంగ్రామంలో కాలకూటం/హాలాహలం అనే దాన్ని ఆహ్వానించి నేరేడు పండుని మింగినట్టూ భగవంతుడు శంకరుడి రూపంలో తిన్నాడని అది కడుపులోకి వెళ్లకుండా కంఠంలో ఉంచుకున్నాడని అనేదానికి రెండు రకాల కధనాలు ఉన్నాయి. పోతన చెప్పడం ప్రకారం భగవంతుడి ఉదరంలో ఉండేవి పధ్నాలుగు లోకాలూ కనక ఆ లోకాల హితం ఎంచి విషం కడుపులోకి వెళ్లకుండా కంఠంలోనే ఉంచి నీలకంఠుడయ్యాడు ఆయన. రెండో కధ ప్రకారం పార్వతి శివుడి కంఠం మీద చేయి వేసి ఆ విషం లోపలకి దిగకుండా ఆపింది. భాగవతంలో ఈ కధ చెప్పేటపుడు చెప్పేది శుకమహర్షి; వినేవాడు పరీక్షిత్తు. వారం రోజుల్లో తక్షకుడు వచ్చి చంపుతాడు పరీక్షిత్తుని అందువల్ల ఈ లోపుల భగవత్కధా శ్రవణం చేయమని చెప్తే ఈ దేవదానవుల కధ, భగవంతుడి అవతారాలూ శుక మహర్షి ఒక్కొక్కటే చెప్తున్నాడన్నమాట. ఇక్కడ కధలో శుకమహర్షి చెప్పాడు, “ఇలా కాలకూటం పుడితే దేవతలు వెళ్ళి శివుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన పార్వతి తో ఈ విషాన్ని నేను హరిస్తాను అని అంటూ చేతిలోకి దాన్ని తీసుకుని అతి సులభంగా మింగాడు; అలా హాలాహాలం అనే విషాన్ని మింగడానికి అక్కడే శివుడి పక్క కూర్చుని ఉన్న పార్వతీ దేవి వప్పుకుంది” అని చెప్పాడు కధ.

కధ వినేది పరీక్షిత్తు; మనలాగే మానవమాత్రుడు కనక ఒక సందేహం వచ్చింది. ఒక కుటుంబంలో భార్యా భర్తా ఉన్నారనుకోండి. భర్త ఎవరికో సహాయం చేయడం కోసం ప్రాణం పణంగా పెడతాను అన్నాడు. అప్పుడు భార్య ఏమంటుంది? సరే అంటుందా? వద్దు అంటుందా? అదే విధంగా పరీక్షిత్తు మనం ఆలోచించినట్టే అడుగుతున్నాడు శుకమహర్షిని భాగవతంలో పోతన ఈ రాసిన పద్యంలో.

మ.
అమరన్ లోకహితార్థమంచు నభవుం డౌఁ గాక యం చాడెఁ బో
యమరుల్ భీతిని మ్రింగవే యనిరి వో యంభోజగర్భాదులుం
దముఁ గావన్ హర! లెమ్ము లెమ్మనిరి వో తాఁ జూచి కన్గంట న
య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె న య్యుగ్రానల జ్వాలలన్. [8-239]

తాను చేసే పనివల్ల చక్కగా (అమరన్) లోకాలకి హితవు చేకూరుతుందని (లోకహితార్థమంచున్) పరమేశ్వరుడు (భవుడు – సమస్తం తానే అయినవాడు; లేదా భవము అంటే సంసారం నుంచి ఉద్ధరించేవాడు, వగైరా) ఎంచుకున్నాడు సరే (ఎంచాడె బో). దేవతలు (అమరుల్) భయంతో (భీతిని) తినమన్నారు సరే (మ్రింగవే యనిరి వో), బ్రహ్మతో సహా మిగతా దేవతలు (అంభోజగర్భాదులు – అంబుజము – పద్మము, అందులో పుట్టినవాడు బ్రహ్మ) లే లే (లెమ్ము లెమ్మనిరివో) మమ్మల్ని రక్షించు (తము గావన్) పరమేశ్వరా (హర) అంటే అన్నారు గాక; కానీ ఇవన్నీ తన కళ్ళతో చూసి కూడా (తాజూచి కన్గంట) ఉమాదేవి (అయ్యుమ) తన భర్త (ప్రాణేశ్వరుని) ఎలా మింగమంది (ఎట్లు మ్రింగుమనె), ఆ హాలాహలాన్ని? (ఉగ్రానల జ్వాలలన్)

మంచి ప్రశ్నే కదా? దీనికి సమాధానం చూసేముందు చిన్న పిట్ట కధ చెప్పుకుందాం. శివపార్వతుల కల్యాణానికి ముందు ఆవిడకి పరీక్ష పెట్టడానికి ఒక ముసలివాడి రూపంలో వస్తాడు శివుడు. వచ్చి పార్వతితో ‘శివుడు బూడిద పూసుకుని శ్మశానంలో తిరుగుతాడు, డబ్బూ దస్కం ఏదీ లేనివాడు. మంచుకొండల్లో దిగంబరంగా ఉంటాడు’ అంటూ ఏవో కధలు చెప్పి ‘ఆయన్ని చేసుకుంటే నువ్వేం సుఖపడలేవు’ అని చెప్తాడు. దానికి పార్వతి సమాధానం చెప్తుంది – “నువ్వు ఎవరివో నాకు తెలియదు కానీ నీకేమీ తెల్సినట్టు లేదు. శివదూషణ చేసినవారికి ఏడు తరాలపాటు దరిద్రం కలుగుతుంది. శివుడు ఆష్టైశ్వర్యాలు కలవాడు. వాటిని వదులుకుని కుబేరుడికి ఇచ్చేశాడు ఎందుకంటే పరమేశ్వరుడు (క్రితం వ్యాసంలో చెప్పినట్టూ మోక్ష సన్యాసయోగం దాటి) బ్రహ్మజ్ఞాని. మీరు చెప్పిన అబద్ధాల వల్ల నా అబిప్రాయం మారదు. ఇంక మీరు వెళ్లవచ్చు.” ఇప్పుడు అర్ధం అయింది కదా ఎందుకు కాళిదాసు ఆదిదంపతులని “వాగర్ధా వివసంప్రక్తౌ వార్గర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” అన్నాడో? వాక్కులోంచి అర్ధం ఎలా విడదీయలేమో అలాగే ఈ ఆదిదంపతులు ఒకరే; ఇద్దరు కాదు. అందుకే ఆవిడ, శివుడు హాలాహలం తింటానంటే వద్దు అనలేదు.

కానీ ఇక్కడ పరీక్షిత్తుకి అర్ధం అయ్యే స్థాయిలో సమాధానం చెప్పాలి కనక శుక మహర్షి ఏమంటున్నారో చూడండి.

క.
మ్రింగెడి వాడు విభుండని
మ్రింగెడిదియు గరళమని మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో

హాలాహలం మింగేది తన భర్త శివుడు (శివుడు అంటే అర్ధం మంగళకరుడు. అందుకే నమకంలో నమః శివాయచ, శివతరాయచ అనే మంత్రం వస్తుంది), మింగేది హాలాహలం (గరళం) కానీ దాన్ని తింటే ప్రజలకి మేలు జరుగుతుంది. అందుకే సర్వులకీ మంగళం/శుభం ఆకాంక్షించే పార్వతి (సర్వమంగళ) దాన్ని తినమంది – తన మంగళసూత్రం మనసులో ఎంత నమ్ముకుందో కదా?

ఇందులో రెండు విషయాలు గమనించవచ్చు. ఒకటి భగవంతుడంటే మన క్షేమం కోరేవాడు. ఎన్ని సార్లు తప్పులు చేసినా క్షమించగలిగేవాడు. అందువల్ల మనం ఆయనకి నీటితో అభిషేకం చేసినా గరళం ఇచ్చినా ఏమనుకోకుండా స్వీకరించగలడు (పత్రం పుష్పం ఫలం తోయం.. అనేది భగవద్గీతలో చెప్పినదే) దీన్నే రమణ మహర్షి అనడం ప్రకారం, మనం చేసిన పుణ్యం (మంచి విషయాలు), పాపం (హాలాహలం వంటి దుర్గుణాలు, కోపం, మద, మాత్సర్యాలు వగైరా) కూడా భగవంతుడికి ఇవ్వాలి. అలా ఇచ్చాక మరోసారి పాపం చేయడానికి ఆస్కారం తగ్గుతుంది కదా? అప్పుడే సంపూర్ణ శరణాగతి.

రెండో విషయం ఏమిటంటే పరీక్షిత్తుకి అర్ధమయ్యే రీతిలో, భాగవతం చదివే మనలాంటి వారికి మనకి అర్ధమయ్యే స్థాయిలో ఎందుకు అమ్మవారు వప్పుకుందో సమాధానం చెప్తున్నాడు శుక మహర్షి. శుకమహర్షి అంటే బ్రహ్మజ్ఞాన కోవిదుడు. ఆయన స్థాయిలో చెప్తే పరీక్షిత్తు (అంటే మామూలు మానవుడు) కి అర్ధం కాకపోవచ్చు కదా. అదీగాక పోతన తెలుగువాడు. అందువల్ల ఈ ప్రశ్నకి సమాధానం సులభంగా అర్ధమవడానికీ మన తెలుగు వారి ఆలోచన ఎలా ఉంటుందో చెప్పడానికి “మంగళసూత్రం మనసులో ఎంత నమ్ముకుందో కదా “ అని వాడాడు. పోతన తెలుగు భాగవతం ముక్కస్య ముక్కార్ధః అన్నట్టూ సంస్కృతంలోంచి తెలుగులోకి దించేయకుండా అందరికీ అర్ధమయ్యేలా మధురంగా రాసాడు. అందుకే విశ్వనాథ గారు అన్నట్టూ పోతన ఏనాటికైనా సరే తెలుగువారి పుణ్యపేటి.

****సశేషం****

Posted in December 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!