Menu Close
తెలుగు పద్య రత్నాలు 40
-- ఆర్. శర్మ దంతుర్తి --

దశావతారాలు అనగానే మనకి గుర్తొచ్చేవి మత్స్య, కూర్మ, వరాహావతారలతో పాటు రామ, కృష్ణావతారాలవరకూ కదా? చాలామంది చరిత్రకారులలాగానే రాముణ్ణి విష్ణువు అవతారంగా భావించడం ఉంది. దీనికి మరో కారణం ఏమిటంటే ‘నా విష్ణుః పృధ్వీపతిః” అనడం ఒకటి. విష్ణువు అంశలేకుండా రాజు అవలేడు అని దీని అర్ధం. ఈ నెల పద్యంలో కంచెర్ల గోపన్న రాముడితో ఏమంటున్నాడో చూడండి.

చ.
జలనిధిలోనదూరి కులశైలముమీటి ధరిత్రిగొమ్ము నం
దలవడ మాటిరక్కసిని యంగముగీటి బలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబము గూల్చినమేటి రామానా
తలపుననాటి రాగదవే దాశరధీ కరుణాపయోనిధీ (దాశరధీ శతకము - 33)

సముద్రంలోదూరి (జలనిధిలోన దూరి) పర్వతాన్ని ఎత్తావు (కులశైలము మీటి), మరోసారి భూమిని (ధరిత్రి) నీ కొమ్ములతో పొందికగా (అలవడిన్) పట్టుకుని పైకి తీసుకొచ్చావు; తర్వాత మరో రాక్షసుణ్ణి చంపావు (మాటి రక్కసిని యంగము గీటి), బలి చక్రవర్తిని (బలీంద్రునిన్) రసాతలంలోకి పంపించావు (రసాతలమున మాటి), రాజుల (పార్ధివక) గర్వం అణిచినటువంటి (దంబముగూల్చిన) దిట్టమైనవాడివి (మేటి) కనక రామా నా మనసులోకి (నా తలపుననాటి) వచ్చి ఉండు (రాగదవే) దాశరధీ కరుణాపయోనిధీ.

దేవ దేనవుల యుద్ధంలో దేవతలు నష్టమౌతూ ఉంటే వాళ్ళు విష్ణువు దగ్గిరకి వెళ్ళి అడిగారు – ఎలా ఈ ఆపద తప్పించుకోవడం అని. పాలసముద్రం చిలికితే అమృతం దొరుకుతుంది; దాంతో మనకి మృత్యువు లేదు కానీ పాలసముద్రం చిలకాలంటే మీ ఒక్కరి వల్లా కాదు కనక వెళ్ళి రాక్షసులని సహాయం కోరండి, ఇదీ విష్ణువు ఇచ్చిన సలహా. చిలకడానికి కవ్వం ఏదీ? మందరపర్వతం కవ్వంగా చేసుకోవాలి. చిలికే తాడు వాసుకి అనే మహా సర్పం. ఈ పర్వతాన్ని ఎవరూ మోయలేక కింద పడినప్పుడు మరోసారి విష్ణువు దగ్గిరకి పరుగులు. మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను ఈ పర్వతాన్ని అంటాడు ఆయన. అలా గరుత్మంతుడి భుజం మీద ఆ పర్వతాన్ని పెట్టి పాలసముద్రం దగ్గిర దింపాడు. చిలుకుతూంటే అది కిందన ఏమీ కుదురు లేక సముద్రంలోపలకి కుంగి పోయింది. దాన్ని కుదురుగా ఉంచడానికి కూర్మావతారం ఎత్తి దాన్ని నిలకడగా పట్టుకున్నాడు. ఇదే చెప్తున్నాడు గోపన్న ‘కులశైలము మీటి’ అనే పదాలతో పర్వతాన్ని ఎత్తావు అంటూ. ఆ తర్వాతది వరహావతారం. హిరణ్యాక్షుడు భూమిని రసాతలంలో పెట్టినప్పుడు దాన్ని కోరలతో పైకి తీసుకొచ్చాడు కదా అదే ‘ధరిత్రిగొమ్ము నందలవడమాటి’ అనేది. భూమిని ఉద్ధరించి హిరణ్యాక్షుణ్ణి చంపాక గోపన్న వాడినది, ‘రక్కసి యంగముగీటి’ అనేది. ఇది తన మీద శతృత్వం పెంచుకుని అహర్నిశలూ తననే తల్చుకుంటూ బతికిన హిరణ్యకశిపుడిని గోళ్ళతో చీల్చి చంపడం అనే నృసింహావతారానికి సంబంధించినది.

వామనవతారంలో విష్ణువు బలిచక్రవర్తితో తాను యుద్ధం చేయలేడు అని తెలుసుకుని వెళ్ళి మూడడుగుల భూదానం అడిగాక మూడో పాదం బలి తల మీద పెట్టి రసాతలంలోకి పంపడం ‘బలీంద్రునిన్ రసాతలములమాటి.’ ఆ తర్వాతది పరశురామావతారం. కోపంతో తన తండ్రిని కడతేర్చిన రాజునీ. అలా జనించిన కోపం వల్ల మిగతా రాజుల వంశాలనీ కడతేర్చి వాళ్ళ గర్వం అణిచాడు పరశురాముడు. అదే గోపన్న ఈ పద్యంలో చెప్పిన ‘పార్ధివక దంబము గూల్చి’ అనేది. ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు అసలు విషయం అడుగుతున్నాడు.

ఇన్నేసి పనులు నువ్వు అంత సులభంగా అలవోకగా చేయగలవు కదా, అదీగాక నువ్వు కరుణాపయోనిధివి, అందువల్ల వచ్చి నా మనసులో ఉండు. ఈ ‘వచ్చి నా మనసులో ఉండు’ అనేదాని గురించి ఓ సారి చూద్దాం. తులసీదాసు తెలుసు కదా, ఆయన వారణాసిలో ఓ చోట కూర్చుని అదే పనిగా రామనామం చేసుకుంటూ ఎవరైనా దగ్గిరకి వస్తే వాళ్లకేసి కూడా చూడకుండా మొహం మీద ఒక బొట్టు పెట్టి వారేమైనా ఇస్తే తీసుకునేవాడుట. అలా ఓ రోజు ఎవరికో బొట్టుపెట్టి ఈ వచ్చినాయన చేతులు మరీ పొడవుగా ఉన్నాయే అనుకుని పైకి చూసేలోపల ఆయన మాయమైపోయాడు. అప్పుడు తెల్సింది వచ్చినవాడు అజానుబాహుడైన (చేతులు మోకాళ్లకి తగిలేంత పొడవు) రాముడే. ఆ రోజు తన దగ్గిరకి వచ్చినా తాను రాముణ్ణి పూర్తిగా చూడనందుకు తులసీదాసు ఏడుపు ఆపుకోలేకపోతూంటే హనుమంతుడు వచ్చి ఓదార్చాడుట – మరోసారి కనిపిస్తాడు ఫర్వాలేదులే అని. తర్వాత మరో సారి తులసీదాసుకి రాముడు ఎప్పుడు కనిపిస్తాడో చెప్పి చూపించాడు హనుమంతుడు అంటారు. ఈ కృతజ్ఞతతో తులసీదాసు హనుమాన్ చాలీసా రాసాడు. దాని చివర్లో ఏమంటాడో చూడండి.

పవన తనయ సంకట హరణ మంగళ మారుతిరూప్
రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూప్

అన్ని సంకటాలు హరించే మంగళ మైన రూపం కల పవన సుతుడా, నువ్వు సీతా రామ లక్ష్మణులతో కలిసి వచ్చి నా హృదయంలో ఉండు. అలా వాళ్ళందరూ మన హృదయంలోకి రావాలంటే ముందు ఆ హృదయం శుభ్రపరుచుకోవాలి కదా? దానికోసమే ఈ జపం, తపస్సు, ధ్యానం వగైరా. త్యాగరాజు, తులసీదాసు అలా రామ జపం చేస్తూ అనేకానేక సంవత్సరాలకి మనసులో రాముణ్ణి ఉంచుకోగలిగారు. ఈ జపం గురించి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు – యజ్ఞానాం జప యజ్ఞోస్మి అంటూ. ఎందుకు అన్ని యజ్ఞాలకంటే జపయజ్ఞం మంచిది? ఎందుకంటే ఆ జపం వల్ల ఎటువంటి హింసా జరగదు కాబట్టీ, అలా చేసే జపం చేసేవారికీ, అందరికీ మంచిది కాబట్టీ. అందుకే గోపన్న ‘నా తలపుననాటి రాగదవే,’ అనే పదాలలో రాముణ్ణి తన మనసులోకి వచ్చి ఉండమని చెప్తున్నాడు.

****సశేషం****

Posted in October 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!