Menu Close
తెలుగు పద్య రత్నాలు 38
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఈ నెల పద్యం చూసేముందు తెలిసిన కధే అయినా మరోసారి చెప్పుకుందాం. సూర్యవంశపు రాజైన సగరుడికి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. కేశినికి పుట్టినవాడు అసమంజసుడు, సుమతికి అరవై వేల మంది కొడుకులు పుట్టారు. సగరుడు అశ్వమేధం చేసినప్పుడు యాగాశ్వాన్ని ఇంద్రుడు పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న చోట దాచిపెడితే  సుమతి కొడుకులు అరవైవేలమందినీ తండ్రి యాగాశ్వం కోసం పంపుతాడు.  వీళ్లకి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న చోట యాగాశ్వం కనిపిస్తే ఆయన మీదకి వెళ్ళినపుడు ఆయన కోపంగా చూసేసరికి బూడిదగా మారతారు. అక్కడ ఉండిపోయిన వీరికి మంచిలోకాలు కలగాలంటే గంగ అక్కడకి రావాలి. కానీ గంగ విష్ణుపాదాల దగ్గిర ఉత్పన్నమై బ్రహ్మదేవుడి కలశంలో ఉంది. దాన్ని ఆయన వదలాలి. అది భూమ్మీదకి రావాలి.

అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. ఆయన తన జీవితంలో చేసిన ప్రయత్నాలన్నీ చేసాక ఈ పని తన కొడుకు దిలీపుడి చేతిలో పెడతాడు. దిలీపుడు కూడా తన జీవితకాలంలో గంగని భూమ్మీదకి దింపలేక తన కొడుకు భగీరధుడి చేతుల్లో ఈ పని పెట్టి తనువు చాలిస్తాడు.  భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించాక, తన తాత ముత్తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని, బ్రహ్మని గంగని వదలిపెట్టమని చెప్పడానికి మొదటి తపస్సు చేస్తాడు. ఆయన వప్పుకున్నాక దిగిరావడం కోసం రెండోసారి గంగ గురించి తపస్సు చేస్తాడు. తాను స్వర్గం నుండి భూమికి దిగితే, ఆ వేగానికి భూమిలో రంధ్రం పడి వెంఠనే పాతాళంలోకి వెళ్ళిపోవచ్చు, కావాల్సిన బూడిద రాసులకి తగలకుండా.  ఈ గంగ దిగే వేగానికి తట్టుకునే శక్తి మహేశ్వరుడికి తప్ప ఎవరికీ లేదు. అందువల్ల శివుడి అనుగ్రహం సంపాదించమని గంగ భగీరధుడితో చెప్పాక భగీరధుడు శివుడి కోసం మూడోసారి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు కూడా ఫలించాక శివుడు తన మీదకి దిగిన గంగలో ఒక పాయను మాత్రమే నేలపైకి వదిలాడు. భగీరధుడు ముందు రధం మీద వెళ్తూంటే భాగీరధి ఆ రధం వెంట సాగి సాగి చివరికి సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరాక, ఈ అరవైవేల మందికీ ఉత్తమ గతులు కలుగుతాయి.  ఇలా భగీరుధుడు తన జీవితాంతం ఒకే పనికి వినియోగించి సఫలం అయ్యాడు కనక ఎవరైనా అతి ప్రయాసమైన పనిచేస్తూంటే భగీరధ ప్రయత్నం అనడం అలవాటు అయింది. అలాగే భగీరుధుడివల్ల దివినుంచి కిందకి వచ్చింది కనన గంగకి భాగీరధి అనేపేరు. దివినుండి గంగ భువికి ఎలా దిగిందో ఉదహరించే ఈ నెల పద్యం మహాభారతం అరణ్య పర్వంలోని గంగావతరణం లోనిది.

మ.
ఇలకున్ గంగ తరంగసంగతులతో నేతెంచె నాశాంతరం
బులు నాకాశము గప్పుచుం దగ మహాభూత ప్రపంచంబుతో
జెలువై యుండగ దాని నీశ్వరుడు దాల్చెన్ సంగతోత్తుంగ పిం
గళజూటాగ్రమందు బద్మదళసంకాశంబుగా లీలతోన్ (అ. ప. తృతీయాశ్వాసం – 82)

ఏనుగు నడుస్తూంటే ఎంత ఠీవిగా నడుస్తుందో చెప్పేటట్టూ గంగా ప్రవాహం ఉందని మత్తేభం అనే వృత్తంలో చెప్తున్నాడు నన్నయ. భూమ్మీదకి (ఇలకున్), అనేక అలల కలయికతో (తరంగసంగతులతో) గంగ దిగి వచ్చింది (ఏతెంచెన్). ఎలా వచ్చింది? దిక్కులు (ఆశాంతరంబులు), ఆకాశాన్నీ కప్పుతూ; అన్ని గొప్ప ప్రాణి కోటుల సముదాయంతో (మహాభూత ప్రపంచంబుతోన్; జెలువై యుండగ). అలా వచ్చిన గంగని ఈశ్వరుడు (దానినీశ్వరుడు), చక్కగా పొసిగి ఉన్న (సంగతోత్తుంగ) పశుపు రంగులో ఉండే జడముడి చివరిభాగంలో (పింగళ జూటాగ్రమందు) ధరించాడు (దాల్చెన్). ఎలా ధరించాడో అద్భుతమైన ఉపమానం చెప్తున్నాడు చూడండి. తామర పువ్వు తలలో పెట్టుకున్నట్టూ (పద్మదళసంకాశంబుగాన్), వినోదంగా (లీలతోన్).

ఈ గంగ భువికి దిగడం గురించి మరి కొంత చూద్దాం. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి మీ హిందూమతం అంతా చెత్త కధలు కబుర్లూ. ఇదిగో గంగానది పుట్టినది ఈ చిన్న రంధ్రంలో అని వెక్కిరించారు. హిమలయాల్లో తాము వెళ్ళినంతవరకూ వెళ్ళి గంగోత్రి అనేది చూసి. ఇప్పుడు అన్నీ అభివృద్ధి అయ్యాక వీళ్లకి తెల్సినది ఏమిటంటే cloud burst అనే వాతావరణ మార్పు ప్రకారం ఒక్కసారి అనేక లక్షల టన్నుల నీరు పడింది. ఎక్కడనుంచి? ఆకాశం నుంచి, అదీ సరిగ్గా కేదార్నాథ్ మహేశ్వరుడి గుడికి అతి దగ్గిరలో. గుడి చుట్టూ ఉన్న ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ఇదే మహాభూత ప్రపంచంబుతో అని చెప్పారు పద్యంలో. మరి అక్కడే ఉన్న మహేశ్వరుడికేమైంది? ఏమీ కాలేదు. అదీ గంగావతరణం పద్యంలో చెప్పిన పద్మదళసంకశంబుగాన్, లీలతోన్ అంటే.

cloud burst అనే దీనిమీద పరిశోధనలు చేస్తున్నారు ఇంకా. ఇది వాతావరణంలో మార్పు వల్ల అని కొందరూ అబ్బే దీనికీ దానికీ సంబంధంలేదని మరి కొందరూ వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఎవరి ఇష్టం వారిది నమ్మకాలలో. అయితే మనకి తెలియని రహస్యాలు అనేకం ఉన్నాయి. బైబిల్ లో నోవా అనే ఆయన నౌక (Ark) తయారు చేసారని ప్రాణులు దానిమీదకి చేర్చారనే కధ ఉంది. దానిమీద మనం ఏదైనా అంటే మన హిందువుల మీద పడి అరుస్తారు. మరి గంగావతరణం ఇలా cloud burst లేదా మనకి తెలియని మరో దాని వల్ల జరిగి ఉండొచ్చు అని అంటే అదంతా తప్పు. అన్నీ ఇప్పుడే సైన్స్ కి అందేయాలి. మనం ఏమిటి, మనకి తెల్సినది ఎంత అనేవి అనవసరం, భగవంతుడుంటే చూపించు ఇప్పుడే అంటారు వీరు. భగవంతుడు కనిపించాలంటే అరిషడ్వర్గాలు విడనాడాలి. ఆత్మార్ధే పృధ్వీం త్యజేత్ అని కదా అని చెప్తే కుదరదు. అలాంటి వారికి భగవంతుడు ఎందుకు కనిపించాలిట? ఇలా పిలిస్తే వచ్చి చేతులు కట్టుకుని మన ముందు నించునేవాడు, మొత్తం విశ్వాన్ని శాసించే భగవంతుడెలా అవుతాడు?

అందుకే ఏమీ తెలియకుండా మనం చదువుకున్న చదువులు గొప్ప, మనకి అన్నీ తెలుసు అనే గర్వంతో నోరు పారేసుకోకూడదు. ఈ cloud burst అనే విషయం అంతర్జాలంలో ఇక్కడ చూడవచ్చు.

****సశేషం****

Posted in August 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!