Menu Close
తెలుగు పద్య రత్నాలు 37
-- ఆర్. శర్మ దంతుర్తి --

పాండవులు జూదంలో ఓడిపోయి పన్నెండేళ్ళు అరణ్యవాసంలోకి వెళ్ళాక ద్వైతవనం వదిలి సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నప్పుడు వ్యాసుడు వచ్చి పలకరిస్తాడు. ధర్మరాజు అడుగుతాడు అప్పుడు ఇంత జరిగాక తామేం చేయాలో. అర్జునుడు మంచి ధనుర్ధారి అనేది నిజమే కానీ యుద్ధం అంటూ వస్తే కౌరవుల వైపు హేమాహేమీలైన భీష్మ, ద్రోణ, కర్ణులు, మిగతావారూ ఉన్నారు. వాళ్లని ఎదిరించడం అసాధ్యం దివ్యాస్త్రాలు లేకుండా. దానికి ఉన్న ఒకే ఒక దారి తపస్సు చేయడం. అలా వ్యాసుడు తనకి ఇచ్చిన మంత్రాన్ని యుధిష్టిరుడు అర్జునుడికి ఇచ్చి వెళ్ళి తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించుకుని రా అని చెప్తాడు. దివ్యాస్త్రాలు కావాలంటే ఇంద్రుడు ఇవ్వగలడు కానీ అర్జునుడికి అవి తీసుకునే అర్హత ఉందా? ఆ దివ్యాస్త్రాలు కౌరవుల వద్ద కూడా ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది వీటికంటే ఉత్తమమైనది. అందువల్ల పరమేశ్వరుణ్ణి అడిగి ముందు పాశుపతం సంపాదించు ఆ తర్వాత మిగతా దివ్యాస్త్రాలు నేను ఇస్తాను అని చెప్తాడు ఇంద్రుడు. అలా శివుడి గురించి తపస్సు చేస్తూంటే కిరాతుడి రూపంలో అమ్మవార్ని కూడా ఉంచుకుని బయల్దేరాడు శ్రీకంఠుడు. తపస్సు బాగానే చేశాడు సరే కానీ అర్హత నిరూపించుకోవాలి పాశుపతం తీసుకోవడానికి. అర్జునుడు మహావీరుడో కాదో తాను కూడా చూస్తాను అని అమ్మవారు అడిగితే ఆవిణ్ణి కూడా తీసుకుని వచ్చాడు మహదేవుడు. ఇప్పుడు ఓ పందిరూపంలో ఒకణ్ణి పంపించాడు అర్జునుడి మీదకి. అది మీదకి రాబోతూంటే దాన్ని అర్జునుడు, దూరం నుంచీ మహదేవుడూ ఒకేసారి కొట్టాక, నేను ముందు, కాదు నేనే ముందు అని దెబ్బలాట పెట్టాడు శివుడు. అలా ఇద్దరికీ యుద్ధం మొదలైంది.

అర్జునుడు తన దగ్గిర అన్ని బాణాలూ వేసాక అక్షయ తూణీరం ఖాళీ అయింది. అక్షయ అంటే ఎప్పుడూ క్షయం లేనిది లేదా అందులో బాణాలు ఎప్పుడూ అయిపోవు. కానీ అదే ఖాళీ అయింది. ఇంతటి బాణవర్షాన్నీ పరమేశ్వరుడు ఎలా తట్టుకున్నాడు? చిరునవ్వుతో ఎడమచేత్తో అన్నింటినీ పక్కకి తోసేసి. ఇంత జరిగాక అర్జునుడి మనసులో ఏం మెదిలిందో ఈ కిరాతకుడి గురించి అనేది ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వంలో రాసిన పద్యంలో నన్నయ చెప్తున్నాడు. అర్జునుడు ఏమనుకుంటున్నాడో అనేది చంపకమాలలో,

చ.
ఇతడు సురేంద్రుడొండె, బరమేశ్వరుడొండె, ధనేశుడొండె గా
కతుల బలప్రభావయుతుడుడన్యుడు గాడొరుడైన మద్భుజా
వితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యిట్టు ల
క్షతుడు నమూర్ఛితుండు నయి కంపము బొందక యుండ నేర్చునే
(అ. ప. ప్రధమశ్వాశం-312)

ఈ కిరాతకుడు ఇంద్రుడో (సురేంద్రుడొండె), సాక్షాత్తూ శివుడో (బరమేశ్వరుడొండె) లేకపోతే కుబేరుడో (ధనేశుడొండె – ధనానికి ఈశ్వరుడు; కుబేరుడు) అయి ఉండాలి. లేదా మరో మిక్కిలి బలం కల వేరే ఎవరో బలవంతుడు (అతుల బలప్రభావయుతుడు). ఇతరులు ఎవరైనా అయితే (గాడొరుడైన) నా భుజాలలో (మద్భుజా) ఉన్న ధనస్సులోంచి వెళ్ళిన బాణాల వేగానికి (ధనుర్విముక్త శరవేగము) యుద్దం తట్టుకుని (పోర సహించి) గాయపడకుండా (అక్షతుడు), మూర్ఛపోకుండా (మూర్ఛితుండు), ఏమాత్రం చలించకుండా (కంపము బొందక) ఉండగలడా?

ఇంతవరకూ వచ్చాక ఆఖరికి కోపంతో చేతిలో ఉన్న ధనుస్సు పెట్టి శివుడి నెత్తిమీద కొడతాడు అర్జునుడు. అది విరిగి రెండు ముక్కలౌతుంది. ఈ ధనస్సు ఎక్కడిది అసలు? అది గాండీవం, అగ్నిహోత్రుడు అర్జునుడికి ఇచ్చాడు ఖాండవ దహనం సమయంలో. అదీ కూడా వరుణుడి దగ్గిర్నుంచి అప్పుతెచ్చి ఇచ్చాడు, అక్షయ తూణీరాలతో బాటు. అటువంటి గాండీవం విరిగిపోయింది. అక్షయతూణీరాలు ఖాళీ అయ్యాయి. అప్పటికి కూడా ఈ కిరాతకుడు ఎవరో అర్ధం కాక వంటిమీద దెబ్బలతో అలసిపోయి అక్కడే సైకత లింగం (ఇసుక) తయారు చేసి పూజ చేస్తాడు శివుడికి. ఒక్కసారి వేల ఏనుగుల బలం కలిగినట్టౌతుంది. మరోసారి యుద్ధానికి తలపడబోతూ లేచి చూసేసరికి తాను సైకత లింగానికి పూజ చేసిన పుష్పాలు కిరాతకుడి మెడలో కనిపిస్తాయి. అప్పటికి తెలుస్తుంది - ఇన్ని రోజులూ ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడో ఆయనే ఎదురుగా ఉన్నది. కాళ్ళు పట్టుకుని చేసిన పనులకి క్షమాపణ అడిగితే శివుడు అంటాడు – నువ్వు నన్ను ఎదిరించి నించోగల మహావీరుడివి. నీ ప్రతాపం చూడ్డానికి పార్వతి ఆసక్తి చూపిస్తే తీసుకుని వచ్చాను. ఏమి కావాలో కోరుకో.” అర్జునుడు అడిగినట్టూ ఆ తర్వాత ప్రయోగ ఉపసంహారాలతో పాటు పాశుపతం ఇచ్చి చెప్తాడు, “ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఎంతో అవసరం ఉంటే తప్ప దీన్ని వాడరాదు.”

రెండు విషయాలు ఇక్కడ గమనించదగ్గవి. భగవంతుడంటే ఎవరు? మనం ఏమి ఇచ్చినా స్వీకరించేవాడు. ఇక్కడ ముందు అర్జునుడు తపస్సు చేసి తనకి ఉన్నమంచి మనసు పూజ రూపంలో ఇచ్చాడు. తర్వాత యుద్ధంచేసి మనసులో ఉన్న మాలిన్యాన్ని (బాణాలరూపంలో) కూడా శివుడికి ఇచ్చాడు. ఈ రెండూ – మంచీ, చెడూ - ఇచ్చాక ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు. అవన్నీ ఇచ్చాక, భగవంతుడు వాటిని స్వీకరించాక మాత్రమే భగవద్దర్శనం అవుతుంది.  రెండో విషయం ఎంతో ధీరత్వం ఉంటే తప్ప భగవద్దర్శనం అవదు. అందువల్ల చివరివరకూ కూడా ఎప్పుడూ భగవంతుడంటే నమ్మకం పోకూడదు.  అందుకే గాడీవం, అక్షయ తూణీరాలూ అన్నీపోయినా అర్జునుడు చివర్లో సైకత లింగాన్ని పూజించి పైకి లేచాడు మరోసారి – అప్పటికి తాను ధీరుణ్ణి, వీరుణ్ణి నిరూపించుకున్నాడు కదా? అందుకే భగవంతుడు అన్నీ క్షమించి ఏమి కావాలో కోరుకో అని అడిగాడు.

ఈ పాశుపతం మొత్తం మహాభారత యుద్ధంలో ఒకే ఒక్కసారి, అదీ కృష్ణుడి సలహా ప్రకారం సైంధవుడి తల దూరంగా ఎక్కడో తపస్సు చేసుకుంటున్న వాడి తండ్రి చేతిలో పడేలాగా కొట్టడానికి వాడతాడు అర్జునుడు.

****సశేషం****

Posted in July 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!