Menu Close
తెలుగు పద్య రత్నాలు 35
-- ఆర్. శర్మ దంతుర్తి --

తెలుగులో భాగవతం అనగానే పోతన గుర్తొస్తాడు కానీ పోతన నారాయణ శతకం కూడా రాసాడు. ఈ నారాయణ శతకంలో పద్యాలు చూస్తే భాగవతం పూర్తిగా తెనిగించాక ఇది రాసాడు అనిపించడం సహజం. మనకున్న దశావతారాలలో భగవంతుడు ఉద్ధరించిన భక్తులందర్నీ ఈ శతకంలో ఉదహరించాడు పోతన. ఈ దశావతారాలు కాక మరో కొన్ని భగవంతుడి అవతారాలు ఉన్నా(పృధువు, కపిలుడు) అవి సాధారణంగా లెక్కలోకి రావు అవతారాల గురించి చెప్పుకునేటప్పుడు. కొన్ని చోట్ల మహావిష్ణువే స్వయంగా వచ్చి భక్తుడికి సహాయం చేసాడని కూడా భాగవతంలో ఉంది (గజేంద్ర మోక్షం వగైరా). అలా రావడాన్ని కూడా అవతారం కింద కొంతమంది పరిగణించరు. ఈ సన్నివేశాలలో అన్నింటిలోనూ భక్తుడిని భగవంతుడు ఎందుకు ఎలా అనుక్షణం కాపాడుతాడనేది ఈ నెల పద్యంలో పోతన చెప్తున్నాడు.

మ.
హరుని నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం
గరి బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవున్ నారదున్
గరమొప్పన్ విదురున్ బరాశరసుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్
నరు నక్రూరుని బాయకండును భవన్నామంబు నారాయణా! [నారాయణ శతకం పోతన 39]

శివుణ్ణి (హరుని), పార్వతీ దేవి (అద్రిజ అంటే పర్వతం మీద పుట్టినది – హిమవంతుడి కూతురు, అంటే పార్వతి), హనుమంతుడు, గుహుడు (రామాయణంలో రాముడు వనవాసం మీద వెళ్తుంటే నావమీద నది దాటించినవాడు), అంబరీషుడు, ధ్రువుడు, ఏనుగు (కరి), ప్రహ్లాదుడు, విభీషణుడు, బలి, ఘంటాశ్రవుడు అనే రాక్షసుడు, నారదుడు, విదురుడు, వ్యాసుడు (పరాశర సుతుడు), భీష్ముడు (గాంగేయునిన్ – గంగకి పుట్టినవాడు), ద్రౌపదిన్, అర్జునుడు (నరున్), అక్రూరుడు, వీరందరూ కూడా నీ నామం పలుకుతూ ఉంటారు కనక వాళ్ళని వదలకుండా (బాయకుండును) ఉంటుంది నీ నామం (భవన్నామంబు; నారాయణ అనేది).

వినాయక వ్రత కల్పంలో మనం అందరూ చదివే కధలో గజాసురుడనే రాక్షసుడు శివుణ్ణి మెప్పించి తన హృదయంలో ఉండమన్నాడనీ పార్వతి శివుడు కనిపించక విష్ణువుతో చెప్తే నంది ని తీసుకెళ్ళి గంగిరెద్దు మేళంగా వెళ్ళి శివుణ్ణి అక్కడనుంచి తీసుకొచ్చాడనీ ఉంది. అలా శివుణ్ణీ, పార్వతినీ రక్షించాడు కనక మొదటి రెండు పదాలు అవే పద్యంలో. రామావతారంలో హనుమంతుడి గురించి చెప్పడం అనవసరం కదా? అయితే ఎంత రాముడి కోసం యుద్ధాలు చేసినా, నీకేం కావాలి అని అడిగితే హనుమంతుడు మాత్రం – నీ కృప తప్ప ఇంకేమీ వద్దు అంటాడు. తులసీ దాసు చెప్పినట్టూ చిరంజీవి అయిన హనుమంతుడు ఎక్కడుంటాడంటే – యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ రామనామం ఉంటే హనుమంతుడు ఉండేది అక్కడే. గుహుడు సంగతి తెల్సినదే. సరదాగా సినిమా పాటలో రాసినా ‘నువ్వు అడుగుపెడితే రాతి నాతి అయిందిట, నా నావ మీద అడుగుపెడితే ఏమౌతుందో?’ అనే ఆశ్చర్యం చూపించిన అమాయక రామ భక్తుడు గుహుడు.

అంబరీషుడి కధ తెలిసినదే. దుర్వాసుడు తనమీదకి కృత్య అనే భూతాన్ని పంపితే ఆ ముని గర్వం అణిగేదాకా సుదర్శనం వెంటబడి తరుముతుంది. అయిదేళ్ళ ప్రాయంలోనే పినతల్లి మీద కోపంతో తపస్సు చేయడానికి బయల్దేరిన ధ్రువుడు ఎన్ని కల్పాలు గడిచినా ఎప్పుడూ ‘అనేక మాయా విశేషాలకి కారణమైన’ విష్ణువు మోము చూస్తూ ఉండేలా కోరుకోవడం, అందుకే ధ్రువ నక్షత్రం ఏర్పడ్డం మనం చూస్తాం భాగవతంలో. గజేంద్ర మోక్షంలో ఏనుగు, ప్రహ్లాదుడు, బలి వీళ్లందరూ కూడా భగవన్నామం ఎడతెగకుండా జపించడం వల్లే కదా ముక్తి పొందారు? ఇంక నారదుడి సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆయన ఎక్కడున్నా, నారాయణ, నారాయణ అంటాడని మనకి తెలుసు.  అతి రధ మహారధులైన తన ఐదుగురు భర్తలూ, భీష్మ ద్రోణులంతటి వీరులూ చేతకాని దద్దమ్మలై చేతులు కట్టుకుని ఏమీ చేయలేకపోయినప్పుడు, ద్రౌపదికి కురు సభాభవనంలో మాన రక్షణ చేసి రక్షించినది ఆయనే కదా? భీష్ముడి చేత విష్ణు సహస్రనామం పలికించినదీ చివర్లో మోక్షం ఇచ్చినదే ఆయనే. మిగిలిన ఘంటాశ్రవ్రుడి గురించి చిన్న కధ చెప్పుకుందాం.

ఘంటాశ్రవుడు లేదా ఘంటాకర్ణుడనేవాడు ఒక రాక్షస గణం వాడు. చెవులకి భగవంతుడి పేరు వినబడకుండా ఉండడం కోసం చిన్నపాటి గంటలు తగిలించుకున్నాడు. ఈ గంటలు వినపడేసరికి ఎవరు భగవంతుడి గురించి మాట్లాడినా దాన్ని వినిపించుకోడు. ఈయన కుబేరుడి దగ్గిర ఊడిగం చేస్తున్న రోజుల్లో (కుబేరుడు శివుడి స్నేహితుడు కనక) శివుడి గురించి తపస్సు చేసాడు. అప్పుడు శివుడు చెప్పాట్ట – విష్ణువు గురించి చేయి తపస్సు అని. అప్పుడు చెవులకున్న గంటలు తీసేసి నారాయణ నామం మొదలుపెట్టాడు. ఈయన పిశాచాలకి నాయకుడు – చచ్చిన శవాల్ని పీక్కు తింటూ ఉంటాడు. ఓ సారి కృష్ణుడు బదరికాశ్రమంలో ఉన్న రోజుల్లో అటువైపుగా ఈ ఘంటాకర్ణుడు రావడం తటస్థించింది. కృష్ణుడు ఎదురుగా రాగానే పూర్వజన్మ సుకృతం అనండి మరోటి అనండి, భక్తి కలిగే సరికి ఓ శవాన్ని చీల్చి కృష్ణుడికి ప్రసాదంగా పెట్టాడు. కృష్ణుడు అప్పుడు చెప్తాడు, “నేను భగవంతుణ్ణి, ఇటువంటి అసహ్యం చేసే పనులు నాకిష్టం ఉండవు కానీ నువ్వు నా నామం పలుకుతున్నావు కనక నీకు మోక్షం ఇస్తున్నాను,” అని వాణ్ణి ముట్టుకునేసరికి ఆ స్పర్శ వల్ల వాడికి సద్గతి కలుగుతుంది. ఇక్కడ తెలుసుకునే విషయం ఏమిటంటే, భగవంతుణ్ణి ఎలా ఎన్ని సార్లు ఆరాధించాం అన్నది కాదు కానీ ఏ మనసుతో ధ్యానించాం అన్నది. దీనినే భాగవతంలో శుక మహర్షి చెప్తారు – భయంచేత కంస, హిరణ్యాక్ష హిరణ్యకశిపులూ, ప్రేమచేత గోపికలూ, వైరం, శత్రుత్వంతో శిశుపాలుడి లాంటి రాజులూ అనుక్షణం భగవంతుణ్ణి తల్చుకోవడంచేత వాళ్లకి సద్గతి కలిగింది అని.

****సశేషం****

Posted in June 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!