Menu Close
Ayyagari-Suryanarayana-Moorthy
తెలుగు భాష – ప్రత్యేకతలు
అయ్యగారి సూర్యనారాయణమూర్తి

పలుకే ఆరోగ్యదాయకం

తెలుగు పలుకే ఆరోగ్యరక్షణకు ఆయుధం. తెలుగు పదాల ఉచ్చారణ వలన శరీరంలోని 72,000 నాడుల ప్రకంపనలతో రక్తప్రసరణ సవ్యంగా జరగడమే కాక, రక్తశుద్ధి కూడా అవుతుంది. దానివలన బుద్ధి కూడా వికసిస్తుంది. ప్రపంచంలోని భాషలన్నిటిలో ఇంత పెద్ద సంఖ్యలో నాడులను చైతన్యపరచే భాష తెలుగు ఒక్కటే.

సౌందర్యరాశి తెలుగులిపి

తెలుగులిపిలో వత్తులు అక్షరము ప్రక్కన కాకుండా క్రింద వ్రాయబడతాయి. పలు ఒంపుసొంపులతో అతి సుందరంగా సాగేది తెలుగులిపి. 2012లో International Alphabet Association నిర్వహించిన లిపి అందాలపోటీలో ప్రపంచభాష లన్నిటిలో ద్వితీయస్థానంలో ఎన్నుకొనబడింది తెలుగు భాషే.

తెలుగుమాటలను చక్కగా, ముత్యాలవరుసలా దిద్దిన చేతులు కళానైపుణ్యాన్ని కూడా సంపాదిస్తాయి. పూర్వపుపద్ధతిలో వర్ణక్రమంతో నేర్చుకుంటే, ఎంత క్లిష్టమైన వత్తులున్న మాటలైనా తప్పులు లేకుండా సులభంగా వ్రాయవచ్చును. తెలుగువ్రాత వలన వ్రేళ్ళు చక్కని కదలికలు కలిగి ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇంత విశిష్టమైన తెలుగులిపిని అంతర్జాతీయంగా వాడుకొనడానికి వీలు కల్పిస్తూ గూగుల్ సంస్థ ‘గౌతమి’ వంటి చక్కని fontsను ప్రవేశపెట్టింది.

అజంతాలమూట

తెలుగులో మాటలన్నీ అచ్చులతోనే అంతం అవుతాయి. పశ్చిమదేశాలలో ఇటాలియన్ భాష, తూర్పు దేశాలలో తెలుగుభాష మాత్రమే ఈ లక్షణం కలిగి ఉన్నాయి. దీని వలన వినడానికి సొంపుగా ఉండడమే కాక, కర్నాటక సంగీతానికి సరిపడే పాటలు వ్రాయడానికి తెలుగుభాషనే ఎన్నుకునే స్థాయిని తెలుగు సంపాదించింది. కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలెన్నిటికో తెలుగుపాటలు ప్రాణం పోసేయి. ఇలా సరస్వతీస్వరూపాలైన సంగీతసాహిత్యాలకే కాక లలితకళాభివృద్ధికి కూడా తనవంతు సేవ చేసే భాష మన తెలుగుభాష.

అరసున్నాలు, బండిరాలు

చాలా పోలికలున్న ఉచ్చారణతో కూడా, పూర్తిగా వేఱే అర్థాలను సృష్టించే ప్రత్యేకతను తెలుగుతల్లికి మాత్రమే అందించే ఆత్మీయబంధువులు వీరిద్దరు. ఉదాహరణకి ‘కలుగు’ అంటే ఉండు లేదా అగు అయితే, ‘కలుఁగు’ అంటే రంధ్రము లేదా బొరియ అవుతుంది. ‘నీరు’ అంటే జలము అయితే, ‘నీఱు’ అంటే బూడిద అవుతుంది. దంతాలసహాయంతో పలికే చ, జ లుకూడా తెలుగుబాస ప్రత్యేకతలే.

తెలుగు మాధుర్యం

పల్లెపదాలలో కూడా తెలుగు తియ్యదనము, స్వచ్ఛత ఎల్లవేళలా సజీవమై వెలుగొందుతూ ఆనందాన్ని అందిస్తుంది. అందుకే ‘దేశభాషలందు తెలుగు లెస్స’, ‘Italian of the East’ వంటి మన్ననలను ప్రాజ్ఞుల నుండి పొందింది తెలుగుభాష. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ భారతీయభాష లన్నిటిలో అత్యంత మధురమైనది తెలుగుభాష అన్నాడు. ఒక తెలుగుకవి అన్నాడు “తేటి కెఱుక లేమి తెలుఁగు పద్దియములు, తియ్యఁదనము నిండి తేనె లొలుకు”.

తెలుగు సామెతలు

తెలుగులో ఉన్నన్ని సామెతలు ఇంకే భాషలో లేవు. ఇవి ఎంతో అనుభవపూర్వకమైన విజ్ఞానాన్ని తరతరాలకు అందజేస్తాయి.

ప్రాసకు పుట్టినిల్లు

తెలుగుసామెత ప్రాసకు పుట్టినిల్లు. తెలుగుకవిత ప్రాసకు మెట్టినిల్లు. ప్రాసలు తెలుగుబాస అందాలకు మూసలు. జనపదాలలో సామాన్యజనాల నోళ్ళలో సైతం నిత్యం నృత్యం చేసే సత్యం ప్రాస. తెలుగుకవులకు ప్రాస చాలా ఆత్మీయం. అంత్యానుప్రాసలకు పెట్టింది పేరు ప్రముఖతెలుగుకవి బమ్మెరపోతనామాత్యులు. ఈయన పద్యగద్యాలలో ప్రాసను అనర్గళంగా ప్రయోగించిన దిట్ట.

వృత్తపద్యాలలో ప్రాసనియమం తెలుగులోనే పురుడుపోసుకుంది. ఇంతేకాక, యతులకు బదులు ప్రాసయతులకు కూడ తెలుగుఛందస్సు స్థానం కల్పించడం విశేషం.

జంటపదాలపంట

తెలుగు జంటపదాల జాతర నిజమైన భాషానుభూతిని అందిస్తూ మనలో ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. జన్మకు మొదలు అయిన తల్లిదండ్రులు, అందచందాలు వంటివి ఎన్నో...

భాషాపాటవం

చాలా తక్కువ అక్షరాలలోనే ఎక్కువ అర్థాన్ని శక్తిమంతంగా వ్యక్తీకరించడం తెలుగు భాషకి సొంతం. ఇందులో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలోని తిక్కనసోమయాజి సిద్ధహస్తుడు. తెలుగుభాషకు విస్తారమైన పదజాలం, అనన్యమైన వ్యాకరణం ఉన్నాయి.

సాహిత్యప్రక్రియలు

సాహిత్యప్రక్రియలలో తెలుగు చాలా విశేషపాత్ర వహిస్తుంది. వైవిధ్యం కల రచనలతో తెలుగు కవిత్వము అనితరవిశేషాదరణ పొందింది. అందులో కొన్నిటిని పరిశీలిద్దాం.

అవధానాలు

అవధానప్రక్రియ తెలుగులోనే పుట్టి, ఇతరభాషలకు వ్యాపించింది. పద్యాలతో మొదలయి పాటలతో కూడ సాగే అవధానాలు తెలుగులో వచ్చేయి. ఇవి అష్టావధానాలనుండి శత, సహస్ర, ద్విసహస్ర, పంచసహస్ర అవధానాల వఱకు విస్తరించేయి. వీటిలో సమర్థులైన పృచ్ఛకుల (ప్రశ్నలు చేసేవారి) ప్రశ్నలకు వారు కోరుకొన్న విధంగా తగిన సమధానాలు అవధాని (అవధానం చేసేవాడు) సభాముఖంగా అప్పటికప్పుడు ఇవ్వాలి. ఇవి అవధాని యొక్క బహుశాస్త్రజ్ఞానమేకాక సమయస్ఫూర్తి, వివిధ అంశాలపై ఒకే సారి ధ్యాస, పద్యాలలో ఆశుకవితాపాటవం, జ్ఞాపక మఱియు ధారణ శక్తులకు అగ్నిపరీక్షలు. ఎందఱో మహానుభావులైన మేధావులు ఈ ప్రక్రియను విజయవంతంగా చేసి తెలుగుభాషకు విశ్వవిఖ్యాతిని సంపాదించిపెట్టేరు. అతిచిన్న వయసులోనే అవధానాలను సమర్థవంతంగా చేసి మన్ననలు పొందిన వారు, తెలుగుతోపాటు ఇతరభాషలను కూడా జోడించి అవధానాలు చేసిన ప్రముఖులు, తెలుగువారిలో ఎందఱో ఉన్నారు.

పద్యరచన

పద్యం ఎందఱి నోళ్ళనో ఆడుతుంది. వాళ్ళ నాలుకలపై ముద్రింపబడుతుంది. ఆ కారణంచేత పద్యంలో చెప్పినదేదైనా తరతరాలకూ సజీవంగా నిలిచిపోతుంది. తెలుగులో పద్యరచన సంస్కృతభారతమును తెనిగించిన నన్నయభట్టారకునితో మొదలయింది.

పద్యానికి విశేషమైన శక్తి ఉంది. అందుకే పద్యాలు వివిధ ప్రక్రియలలో ఎంతో ప్రాచుర్యాన్ని సాధించేయి. శతకాలలో, కావ్యాలలో, ప్రబంధాలలో, చాటువులలో, నాటకాలలో - ఇలా ఎన్నిటిలోనో ఇవి ముఖ్యపాత్ర వహిస్తాయి.

శతకాలు బాల్యం నుండే తెలుగు వారికి పరిచయ మౌతాయి. ఉదాహరణకు, వేమనశతకం అతిసులభంగా అర్థమయ్యే పదాలతో చిన్న చిన్న ఆటవెలది పద్యాలతో, సుమతిశతకం కందపద్యాలతో, నరసింహశతకం సీసపద్యాలతో, దాశరథీశతకం మొదలగునవి వృత్తపద్యాలతో, తెలుగు పాఠకప్రపంచానికి చక్కని భావాలను/లోకజ్ఞానాన్ని అందిస్తాయి. భక్తిశతకాలు, నీతిశతకాలు మొదలైన ఎన్నో రకాల శతకాలు తెలుగులో ఆవిర్భవించి సమాజసంక్షేమానికి తోడ్పడ్డాయి.

ఇక కావ్యాలకు, ప్రబంధాలకు వస్తే – తెలుగులో ఎందఱో కవులు, మహాకవులు కావ్యాలు, ప్రబంధాలు రచించి శాశ్వతకీర్తి గడించేరు. వీటిలో కవియొక్క కవిత్వపాటవానికి గీటురాళ్ళయి నిలిచే ఒకపద్యంలో వేఱొకటి లేదా ఇంకా ఎక్కువ పద్యాలు ఇమిడి ఉండే గర్భకవితలు, ఒక నిర్ణీతమైన విన్యాసంలో ఒక్కొక్కసారి ముందుకు వెనకకి కూడా సాగే బంధకవితలు కూడా ఉన్నాయి. 17వ శతాబ్దానికి చెందిన గణపవరపు వేంకటకవి తాను రచించిన ‘ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసము’ అనే కావ్యంలో ఒకే సీసపద్యంలో 41 పద్యాలను గర్భితం చేసేడు. వాటిలో మళ్ళీ 21 పద్యాలు బంధాలు. ఇంతేకాక, తెలుగుకవుల రచనా పాటవానికి పరాకాష్ఠ ద్వ్యర్థి, చతురర్థి కావ్యాలు. వీటిలో అన్ని కావ్యలక్షణాలను పాటిస్తూ ఒకే రచనలో రెండు, నాలుగు ఇతివృత్తాలు ఒకే సమయంలో ప్రతిపద్యంలో నడుస్తాయి.

రాజులు, పరిపాలకులు తెలుగు కవులను ఎంతో గౌరవించి పోషించేరు. స్వయంగా తెలుగుకావ్యాలను రచించిన శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజులు కూడా ఉన్నారు. వీరి తెలుగుకవిత్వాభిమానానికి కవులకు లభించిన గజారోహణలు, బంగారు గండపెండేరాలు, కనకాభిషేకాలు, అగ్రహారదానాలు, మొదలయినవి చిరస్మరణీయచిహ్నాలు.

తెలుగు చాటువులు సుప్రసిద్ధమైన ప్రజాదరణ పొందేయి. ప్రతిచాటుపద్యం భావపరిపూర్తి, రసస్ఫూర్తి కలిగి హృదయరంజకమై ఉంటుంది. చాటువు అంటేనే ‘ప్రియమైన మాట’ అని అర్థం. చాటువులు సమాజంలోని వివిధ స్థితిగతులను చమత్కారంతో చిత్రీకరిస్తాయి. శ్రీనాథుని చాటువులు ఎఱుగని తెలుగువారు ఉండరు. వాక్శుద్ధితో వరదనీటిముంపు నుండి గ్రామాన్ని కాపాడిన అడిదం సూరకవి, అనుకున్నది సాధించిన వేములవాడ భీమకవి మొదలగువారు చెప్పిన తెలుగు చాటుపద్యాలు అమోఘం.

పాండవోద్యోగవిజయాలు వంటి నాటకాలలోని ‘జెండాపై కపిరాజు....’ మొదలయిన తెలుగు పద్యాలు తెలుగువారి అందఱి నాలుకలపై నేటికీ తిరుగుతూనే ఉంటాయి.

పద్యకవితలలో కందాలు (6 రకాలు), సీసాలు (7 రకాలు), గీతులు (9 రకాలు - తేటగీతులు, ఆటవెలదులు, ఇందులోవే), ద్విపదలు, అక్కరలు (5 రకాలు), రగడలు (9 రకాలు), మొదలగునవి ఎన్నో తెలుగుభాషకే సొంతం.

తెలుగుకవిత్వంలో చాలా స్వల్పమైన, లేదా కేవలం ఉచ్చారణలో, భేదాలతో విశేషార్థాలను కల్పించడం పరిపాటి. ఉదాహరణకు - “....జనపాలునకే యుర్విన్ జెల్లును” అని పొగిడిన ఒక తెలుగుకవి “....జనపాలునకు+ఏ యుర్విన్ జెల్లును?” అని వ్యతిరేకార్థాన్ని స్ఫురింప చేసేడు. నీచరణాన్ని(అంటే నీచమైన యుద్ధాన్ని) సైతం నీ చరణంగా (అంటే నీయొక్క పాదంగా) మార్చగల శక్తియుక్తులు తెలుగుభాషకే ఉన్నాయి.

హాస్యరసపోషణలో కూడా తెలుగుపద్యాలది అందెవేసిన చేయి. బావ, మరదళ్ల సరసాల పద్యాలు మొదలు చమత్కారపద్యాలు ఎన్నిటికో తెలుగుభాష కాణాచి.

తెలుగుపాటలు, కీర్తనలు

తేనె లొలికే తెలుగు పాటలు, కీర్తనల గురించి వేఱే చెప్పనక్కఱ లేదు.

పంటపొలాల గట్లమీద, చెట్టుల పుట్టల దగ్గఱ, ఆటలలో, గుళ్ళలో, జాతరలలో, భజనలలో, పెళ్ళిళ్ళు, సీమంతాలు, బాలసారెలు మొదలైన శుభసందర్భాల సంబరాలలో, ఒక టేమిటి ఎన్నో సరదాలు, ముచ్చట్లు, పోటీలలో, పడుచువాళ్ళ దగ్గఱ నుండి పెద్దవాళ్ళదాకా, జనపదాలనుండి పట్టణాల దాకా స్వేచ్ఛగా ఆడుకొని పాడుకొనే పాటలు, ‘ముక్తికాంతపెళ్లి’ వంటి వేదాంతపు పాటలు, భాగవతోత్తములైన త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, మొదలగు వాగ్గేయకారుల కీర్తనలు, తెలుగు భాషకి పట్టం కట్టేయి. పదకవితాపితామహుడైన అన్నమయ్య 32,000 తెలుగుపాటలతో కలియుగప్రత్యక్షదైవ మైన శ్రీవేంకటేశ్వరుని అలరించిన పద్ధతి అనన్యం, అజరామరం.

ఇతర రచనలు

పద్యాలు, పాటలు మాత్రమే కాక వ్యాసాలు, ఛలోక్తులు, నవలలు, కథలు, కథానికలు, పొడుపుకథలు, బుఱ్ఱకథలు, హరికథలు, మొదలగునవి తెలుగులో ఎంతో ప్రసిద్ధి కెక్కేయి. హరికథల్లో ఆదిభట్ల నారాయణదాసుగారిని ఎఱుగని తెలుగువారు ఉండరు.

చలనచిత్రరంగంలో కూడా తెలుగుభాష అధికసంఖ్యలో ముఖ్యపాత్రను పోషించి ప్రేక్షకుల స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచిపోయే ఎన్నో అపురూపచిత్రాలను సృష్టింపజేసింది.

భారతదేశంలో అత్యధికస్థానికులు మాట్లాడే భాషలలో తెలుగు, మూడవ స్థానంలో ఉండడం మనందఱికీ గర్వకారణం.

తెలుగువాడిగా పుట్టడం అదృష్టమైతే, తెలుగును వాడిగా వాడి, వీలైతే పాడి, అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించి, ముందు తరాలవారికి కూడా ఈ భాగ్యాన్ని పదిలపఱచి, అందిచడం తెలుగుతల్లికి నే నిచ్చే నీరాజనంగా భావిస్తాను.

--- తెలుగుతల్లి ముద్దుబిడ్డ, అయ్యగారి సూర్యనారాయణమూర్తి

Posted in September 2024, సాహిత్యం

1 Comment

  1. చెన్న నర్సంగ్ రావు

    చాల బాగ తెలిపినారు తెలుగు బాష గూర్చి ధన్యవాదములు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!