Menu Close
తెలుగు భాష భవితవ్యం 7
- మధు బుడమగుంట

తెలుగు భాష పరిరక్షణకు మనలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో తెలుగు ప్రాచుర్యానికి పూనుకోవాలి. తెలుగు భాష ప్రాభవాన్ని నిలిపేందుకు కర్తవ్య స్ఫూర్తితో భారత దేశానికి వెలుపల ఎన్నో విధాలుగా భాషా సేవ చేస్తున్న ఆంధ్రులు మరియు సాహిత్య శిరోమణులైన వారి సేవల గురించి ఈ సంచికలో ప్రస్తావిస్తాను. నేను చెబుతున్న పేర్లు కేవలం నాకు కొంత పరిచయం ఉన్నవారు మాత్రమె. నాకు పరిచయం లేని వారు మరెందరో ఎనలేని సేవలు చేస్తున్నారు. వారందరికీ శిరసు వంచి కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను.

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా గడ్డపై నిరంతర కృషితో ఎంతో మంది రచయితలు, రచయిత్రులను ప్రోత్సహిస్తూ వారి రచనలను తన వంగూరి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ప్రచురిస్తూ, క్రమంతప్పక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషా సమావేశాలను నిర్వహిస్తూ అనేకమంది ఔత్సాహిక భాషాభిమానులకు సరైన వేదికనందించి వారిని ప్రోత్సహిస్తూ అనునిత్యం భాషా సేవలో తరిస్తున్న, సేవా తత్పరుడు, నిగర్వి శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు నిజంగా విదేశాలలో ఉన్న తెలుగు సాహిత్య ప్రియులందరికీ సుపరిచితులు.

యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా లో ఆచార్యులుగా పనిచేసి విశ్రాంత సమయంలో కూడా సాహిత్య శాస్త్రీయ రచనలు చేస్తూ, మాతృభాష ఉనికిని ఖండాంతరాలలో చాటాలనే సంకల్పంతో దాతలనుండి పోగుచేసిన డబ్బులకు న్యాయం చేస్తూ యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ లో తెలుగు కోర్స్ లను ప్రారంభించి, ఆ కోర్సు అలాగే సజావుగా సాగే విధంగా ఏర్పాట్లు చేసిన ఆచార్య వేమూరి వెంకటేశ్వరరావు గారు, మనందరం మెచ్చుకోదగిన వారు.

తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతులుగా పదవీ విరమణ చేసి అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్ననూ, సాహితీ సిరికోన సామాజిక మాధ్యమం ద్వారా ఎన్నో తెలుగు సాహిత్య రచనల విస్తృత విశ్లేషణలతో పాటు సంస్కృతాంధ్ర సాహిత్య సందేహాలకు చక్కటి వివరణతో కూడిన అధ్యయనాన్ని అందిస్తూ ఎన్నో తర్క, వితర్క, విమర్శనాత్మక అంశాలను ప్రోత్సహిస్తూ, తన పండిత శాస్త్ర అనుభవంతో అన్నింటా చక్కటి సేవాతత్పరతను కొనసాగిస్తున్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు మన ఆంధ్రదేశం అందించిన మరో సాహితీ శిరోమణి.

తెలుగు భాష, సంస్కృతి అంతర్జాలంలో అందుబాటులోకి ఉంచుతూ, భావితరాలకు కూడా ఒక సంపదగా అందించాలనే ఆశయంతో “కౌముది” అంతర్జాల మాస పత్రికను రెండు దశాబ్దాలుగా సేవా భావంతో నడిపిస్తూ, వందలకొద్దీ చేసిన, చేస్తున్న తన టాక్ షోల ద్వారా ఎంతోమంది ఆదర్శమూర్తుల జీవనశైలిని విశ్లేషిస్తూ, వారు చేసిన మహత్కార్యాలను వివరిస్తూ, ఆ మహానుభావుల గురించి ప్రపంచానికి తెలియని అనేక విషయాలను విడమర్చి వివరిస్తూ, సేవా దృక్పధంతో ముందుకు సాగుతున్న శ్రీ కిరణ్ ప్రభ గారు మరియు వారివెంటే ఉంటూ అనునిత్యం చేయూతనిస్తున్న వారి సతీమణి శ్రీమతి కాంతి గారు, ఆది దంపతుల వలె, ఎంతోమందికి స్ఫూర్తి నందిస్తూ భాషా ప్రేమికులుగా నిలుస్తున్నారు.

వృత్తి వేరు ప్రవృత్తి వేరు అంటూ, ఒక పక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ మరో పక్క మాతృభాష మీది మమకారంతో రెండు దశాబ్దాలుగా అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటో శివారు పట్టణంలో   నివసిస్తూ అక్కడి శాక్రమెంటో తెలుగు సంఘం ఫౌండేషన్ సభ్యుడిగా ఉంటూ ఎన్నో వ్యాసాలూ,సంపుటాలు స్వయంగా వ్రాస్తూ వాటిని పలు అంతర్జాతీయ తెలుగు సదస్సులలో ప్రచురిస్తూ, తనే స్వయంగా తెలుగు వెలుగు పత్రికను నడుపుతూ, స్థానిక తెలుగు సంస్థ TAGS తో మమేకం అయి నిత్యం తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేస్తున్న శ్రీ వెంకట్ నాగం గారు నిజమైన సాహితీ సేవకులు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

అమెరికాలోనే ఉంటూ భారత మూలాల విలువలను గుర్తెరిగి, తెలుగు భాషలోనే Ph.D. పట్టాను పుచ్చుకుని, నిరంతర సాహిత్య పిపాసిగా, రచయిత్రిగా తన రచనలను కొనసాగిస్తూనే, కాలిఫోర్నియా బే ఏరియాలో నివసిస్తూ, ‘వీక్షణం-సాహితీ గవాక్షం’ అనే సమూహాన్ని ఏర్పరిచి గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి నెల క్రమతప్పక స్థానికంగా సాహిత్య సమావేశాలను నిర్వహిస్తూ, అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా ‘నెచ్చెలి’ అంతర్జాల మాస పత్రికను నడుపుతున్న శ్రీమతి గీతామాధవి గారికి మనఃపూర్వక అభినందనలు.

ప్రపంచంలోని తెలుగు అభిమానులందరూ ఒకచోట సమావేశమయ్యే రీతిలో అమెరికా తెలుగు కూటమి వాట్స్ యాప్ సమూహాన్ని ఏర్పరిచి, గత నాలుగు ఏండ్ల నుంచి రచ్చబండలో క్రమం తప్పక నిత్యం అనేక విషయాలలో అందరి అభిప్రాయాలను వినిపించే విధంగా ప్రోత్సహిస్తూ, అమ్మనుడి కాపుదలకై కంకణం కట్టుకుని, తెలుగు నుడి ఊడిగంలో అవిరళ కృషి సలుపుతున్న శ్రీ పారుపల్లి కోదండ రామయ్య గారు, పురాణం రామప్రసాద్ మరియు వారి బృందం నిజమైన భాషా పరిరక్షకులు అని చెప్పవచ్చు.

ఇక సంస్కృతాంధ్ర సాహిత్య ప్రపంచంలో నిష్ణాతులై అనేక విధములైన అవధాన ప్రక్రియల ద్వారా అన్ని రకాల భాషా వితరణలను పరిశీలిస్తూ, తర్కిస్తూ, సాహిత్య సేవలో తరిస్తున్న శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గారి వంటి వారిని కూడా అభినందించాలి.

ఇలా చెప్పుకుంటూ వెళుతుంటే ఎంతోమంది తమవంతు బాధ్యతగా నిరంతరం భాషా పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తూనే ఉన్నారు. కొందరికి గుర్తింపు లభించింది. మరి కొందరికి లేదు. అయిననూ గుర్తింపుల గురించి సమయం వృధా చేసుకోకుండా శ్రమిస్తున్న సాహిత్య సేవకులందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలి.

వచ్చే సంచికలో నాలుగు ముగింపు వాక్యాలను వ్రాస్తూ ఈ శీర్షికను ముగించాలనే ఆలోచనలతో ఉన్నాను. మరేదైనా మంచి విషయాలు స్ఫురిస్తే తప్పక పొడిగిస్తాను.

నమస్కారములతో - మధు బుడమగుంట

**** సశేషం ****

Posted in July 2024, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!