గత సంచికలో, భావితరాలకు తేటతెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చూపుతూ, ఆసక్తి కలిగిస్తూ తద్వారా మాతృభాష పరిరక్షణ కొరకు స్వయంగా నేను ఏ విధంగా శ్రమిస్తున్నానో వివరించాను. అయితే ఈ ‘తెలుగు భాష భవితవ్యం’ మరో విధంగా ‘మన సాహిత్యం మన చేతిలో..’ అని పెట్టడం జరిగింది. అందుకు ప్రేరణ గత ఐదు సంవత్సరాలుగా మన సిరిమల్లె లో నేను వ్రాస్తున్న ‘మన ఆరోగ్యం మన చేతిలో..’ శీర్షిక. మరి ఆ శీర్షిక వ్రాయడానికి కారణం సాటి మనుషులలో నేను ప్రత్యక్షంగా చూసిన, చూస్తున్న అనేక రకాలైన ఆరోగ్య పరమైన ఇబ్బందులు. అలాగే సామాజిక స్థితిగతుల మెరుగుదల వలన మనందరం సుఖజీవన సౌఖ్యాలను అనుభవిస్తూ శరీరాన్ని కష్టపెట్టడం మరిచిపోయాము. కష్టం అంటే శరీరానికి కావలిసిన వ్యాయామాన్ని ఇవ్వడం లేదు. అలాగే మనిషి మెదడులోని ఆలోచనలను సరైన మార్గంలో ఉంచడం లేదు.
ప్రస్తుత కాలంలో మన దేహానికి, మెదడుకు మధ్యన ఉన్న సున్నితమైన పొరను భయం అనే బూడిదతో నింపేస్తూ, లేనిపోని వాదనలను ప్రతిరోజూ వింటూ మనలను మనం భయపెట్టుకుని ఎదుటివారిని భయపెడుతూ తద్వారా మానసిక ఆందోళనకు గురౌతూ కాలం గడిపే స్థితిలో ఉంటున్నాము. సామాజిక మాధ్యమాల హంగామా మరింత అయోమయం లోకి నెట్టేస్తున్నది.
అయితే మన మెదడు లో జరిగే రసాయన చర్యలతో పాటు ఏర్పడే భావ తరంగాల ఆలోచనల ఉధృతి, తద్వారా శరీరానికి పంపుతున్న సంకేతాల ఒరవడిని కొంచెం జాగురూకతతో గమనించి, మన దేహం పంపుతున్న సంకేతాలను అర్థం చేసుకునే స్థాయిలో మనం ఉండాలి. అందుకు శాస్త్రీయ పరిజ్ఞానం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
నిత్య విద్యార్థిగా శాస్త్ర సాంకేతికతో పాటు నేను నేర్చుకుంటున్న అనేక భాష, సంస్కృతి, సంప్రదాయ విషయాలు, నాకు అనుభవంతో కూడిన పరిజ్ఞానాన్ని చేకూర్చాయి. అవి కేవలం నా అభిప్రాయాలు, విశ్లేషణలు మాత్రమే కానీ సూచనలు, సలహాలు కాదని మనవి. ఎందుకంటే సమాజంలో ఒక స్థాయిని చేరిన తరువాత మనలో ప్రతి ఒక్కరికీ ఒక నిర్దిష్టమైన జీవన శైలితో ఏర్పడిన అభిప్రాయాలు, అలవాట్లు, భాషా పరమైన భావజాలాలు ఉంటాయి. ప్రత్యేకంగా సూచనలు స్వీకరించే స్థాయిలో ఎవ్వరూ ఉండరు. కాకుంటే మెదడును సరిగా అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడేవారికి ఖచ్చితంగా సరైన మార్గ నిర్దేశం చేసే గురువు అవసరం ఉంటుంది. కనుక నేను చెప్పే విషయాలు ఈ శీర్షిక చదివేవారికి ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియదు కాని కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను.
సాధనమున పనులు సమకూరు ధరలోన..
మనం మనంగానే మిగిలిన రోజు మానసిక పరిణతి పొంది మనోల్లాసం తో మెదడు చురుకుగా పనిచేసి మనలోని సాహితీ పిపాసి బయటకు వచ్చి మన ఆలోచనల ఉధృతి ని పెంచి అన్నింటా మెరుగైన అక్షరక్రమాన్ని మనకు అందించడం జరుగుతుంది. మనలోని మానసిక పరిపక్వత ను గుర్తించిన నాడు, మనలోని స్వార్థ చింతన తరిగిపోయి సహజమైన మానవత్వ పోకడలు కనబడతాయి. అప్పుడు మాతృభాష మాధుర్యాన్ని ఉగ్గుపాలతో చవిచూసిన మనవంటి భాషా ప్రేమికులకు భాషా సాహిత్య పరిరక్షణ పెద్ద విషయం కాదు. మన బాధ్యత ను గుర్తెరిగి విధిని నిర్వహించడమే.
అయితే అందుకు ఆత్మాభిమానం లేక తోటి సమాజం మనలను చూపెట్టిన విధానం వల్లనో ఏర్పడిన అలవాట్లను త్యజించి సహజ సిద్ధంగా మనలోని మనలను గుర్తించాలి. అందుకు ఆత్మపరివర్తన కలగాలి. మనలను మనం పరిశీలించుకుంటూ వెళుతున్నప్పుడు కలిగే నిజజీవన విశ్లేషణ మనకు నిజమైన ఆత్మ పరిజ్ఞానాన్ని అందిస్తుంది. తద్వారా జీవితం యొక్క సార్థకతను గుర్తించి అది సాధించేందుకు ప్రయత్నించి సఫలం అవుతాము. అప్పుడే మన యొక్క ఉనికి ఈ సమాజంలో ఎంతవరకు అవసరమో కూడా అర్థమై తదనుగుణంగా మనం నిర్వర్తించే సేవా కార్యక్రమాలు ఉండాలి. అది ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఇక్కడ భాష గురించి మాట్లాడుకుంటున్నాము కనుక ప్రస్తుతానికి భాష యొక్క భవితవ్యం బంగారు బాటలో నడవాలంటే మన వంతు కృషిని చేసేందుకు ప్రణాళిక వేసుకోవాలి.
మనిషిగా మన ఉనికిని పొందడానికి మనం మన దిశానిర్దేశం ఏమిటో తెలుసుకుని అందుకు తగిన విధంగా కృషి సల్పి మన పనిని మనం చేసుకుంటూ వెళుతుండాలి. దాని పర్యవసానం మనలను మనిషిగా నిలబెడుతుంది. అలా కాకుండా ఆ ఉనికి కోసం పదే పదే ఆలోచిస్తూ మన ఆచరణలో స్వచ్ఛత లోపించినప్పుడు మన ఉనికి కోసం మనం పడే తపన మనలోని మానసిక పరివర్తనను ఏమారుస్తుంది. అందుకే నేను మా పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటాను. “Do your best and leave the rest” మనం కేవలం మన మూలాలను పరిరక్షించడానికి పనిచేస్తున్న సేవకులం మాత్రమే. మనవల్లనే అంతా సిద్ధిస్తుందనే భావన వదలాలి.
వచ్చే సంచికలో తెలుగు భాష ప్రాభవాన్ని నిలిపేందుకు తమ వంతు బాధ్యతగా ఆంధ్రదేశానికి వెలుపల ఎన్నో విధాలుగా భాషా సేవ చేస్తున్న సాహిత్య శిరోమణుల గురించి ప్రస్తావిస్తాను.