గత నాలుగు సంచికలలో తెలుగు భాష ఔన్నత్యాన్ని ఎత్తిచూపుతూ తెలుగు భాష ప్రాభవం గురించి వివరించాను. అలాగే భాషా పండితులు నుడివిన తెలుగు మాధుర్య పలుకులను కూడా మీకు పరిచయం చేశాను.
మరి వూరికే పుంఖాలు పుంఖాలుగా వ్యాసాలు వ్రాస్తుంటే అనుకున్న సంకల్పం సిద్ధించి మన తెలుగు భాష బంగారు భవితవ్యాన్ని పొందుతుందా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కనుకనే ఈ వ్యాసకర్త గా నా ఆలోచనలకు అక్షర రూపంతో పాటు కార్యరూపాన్ని కూడా చేసి ఒకింత ఆత్మసంతృప్తికి కూడా లోనైన పిదప కలిగిన ధైర్యంతో ఈ వ్యాసాన్ని వ్రాస్తున్నాను. నేను చేస్తున్న సాహిత్య సేవ ఏమిటో వివరిస్తాను.
మాతృభాష మాధుర్యానికి ముగ్డుడనై
తేనెలొలుకు తెలుగు మమకార బద్దుడనై
సాహితీ సౌరభాల గుబాళింపులకు సమ్మోహితుడనై
అమ్మ నుడికి ఆనందకర ఆత్మబాంధవుడనై
అక్షరజ్ఞానం అట్టడుగున ఉన్ననూ
అ,ఆ అంటూ అక్షరాల అమరికను అవపోసన పడుతూ
భయ భక్తులతో బాల్యంలో నేర్చుకొన్న
విభక్తులను వితరణతో మననం చేసుకుంటూ
ఆశతో, ఆశయాల ఆచరణ శుద్ధితో
భావితరాలకు బాధ్యతగా భాషను అందించాలనే తపనతో
నా ఈ సాహిత్య సేవకు శ్రీకారం చుట్టి దాదాపు పన్నెండు సంవత్సరాలు దాటింది. నా జీవిత భాగస్వామి శ్రీమతి ఉమాప్రియ, ఈ మహా యజ్ఞంలో కూడా భాగమై నిలిచి నాకు ఎల్లవేళలా ఎంతో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే జన్మించింది మా మానస పుత్రిక “సిరిమల్లె”.
సిరిమల్లె అంతర్జాల మాస పత్రికను నేను నా శ్రీమతి ఉమాప్రియ కలిసి నిరాఘాటంగా ఎనిమిది సంవత్సరాల మైలురాయిని దాటేశాము. గత ఏడాది చివరలో వంద సంచికలను పూర్తిచేశాము. మరో రెండు నెలలలో 9వ వార్షిక సంచిక కూడా రాబోతున్నది.
ఇది కేవలం మా సత్ సంకల్పమే కాదు. ఎంతో మంది సాహితీ శిరోమణుల ఆశీస్సులు, సహాయ సహకారాలు, రచనాసక్తి ఉన్న తెలుగు భాషాభిమానుల కృషితో సాధ్యమైనది. మీవంటి స్వయం పోషక సాహితీ ప్రియులు, కళాభిమానులు ఉన్నంతవరకు మన సిరిమల్లె ఇలాగే అప్రహితంగా నిత్య సాహితీ విరుల సువాసనలతో విలసిల్లుతుంది.
ఈ తెలుగు భాష భవితవ్యం అనే శీర్షిక వ్రాసే విధానానికి (ఆలోచనకి కాదు) కూడా ప్రేరణ అనేది మరొకటి ఉంది. దానిని గురించి మరింతగా వచ్చే సంచికలో వివరిస్తాను.