ఆచార్య స్టీఫెన్ హాకింగ్
సాధించాలనే పట్టుదల, సంకల్ప బలం స్థిరంగా ఉంటే, జయం ఖచ్చితంగా మనవైపే ఉంటుందని ఎంతోమంది మహానుభావులు తమ జీవిత అనుభవాల ద్వారా నిరూపించారు. ముఖ్యంగా మనకు తెలియని విషయాల మీద అవగాహన పెంచుకొని నూతన శాస్త్రీయ విషయాలను కనుగొనడంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు అవిరళ కృషి సల్పారు. ఈ భూమిపై నివసిస్తున్న మనకు ఇది అనంత విశ్వం లోని అశేష నక్షత్రాలలో ఒకటైన సూర్యుని కుటుంబంలోని ఒక చిన్న గ్రహం మాత్రమే అని తెలుసు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ అనంత విశ్వం గురించి మాత్రం నేటికీ మనకు తెలిసినది ఇసుమంత మాత్రమే.
విధివశాత్తు అంగవైకల్యం సిద్ధించినను వెరవక, తన అద్భుత మేధోసంపత్తే పనిముట్టుగా చేసి ఎన్నో అమూల్యమైన అంతరిక్ష విషయాలను అలవోకగా అందరికీ అర్థవంతముగా వివరించిన అనన్య సామాన్యుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో గణిత ఆచార్యుడు గా పనిచేసిన ప్రొఫెసర్ స్టీఫెన్ విలియం హాకింగ్ నేటి మన ఆదర్శమూర్తి.
1942 జనవరి 8 న ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ షైర్ కౌంటీ లో జన్మించిన స్టీఫెన్, బాల్యం నుండే గణిత గణాంకాల సిద్ధాంతీకరణ మీద ఎంతో ఆసక్తిని కనపరిచేవారు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా వైద్యులైనందున స్టీఫెన్ కూడా వైద్య రంగంలోనే రాణిస్తాడని ఆశించారు. కానీ ఆయన తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గణిత శాస్త్రం మీదే పరిణతి సాధించి చివరకు నాడు అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోని అప్ప్లైడ్ మాధ్మాటిక్స్ మరియు థీరెటికల్ ఫిజిక్స్ డిపార్టుమెంటు లో, డైరెక్టర్ అఫ్ రీసెర్చ్ గా ఎంతో గొప్ప పేరును తన పరిశోధనల ద్వారా సంపాదించారు. వందల కొలది పరిశోధనా వ్యాసాలను అనేక గొప్ప జర్నల్స్ లో పబ్లిష్ చేశారు. విశ్వనిర్మాణ శాస్త్రంలో అన్ని పరిశోధనలు చేసిన మొదటి వ్యక్తి మరియు ఏకైక వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ మాత్రమే.
ఖగోళ భౌతిక శాస్త్రంలో ఎన్నో సిద్ధాంతాలను తన పరిశోధనల ద్వారా కనుగొని ప్రపంచానికి కృష్ణ బిలాల ఉనికిని, వాటి స్వాభావాన్ని ఎంతగానో అధ్యయనం చేశారు. ఆ సిద్ధాంతాలు, అద్భుత పరిశోధనలు ఆయన తరువాత వచ్చిన శాస్త్రవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆయన గణిత శాస్త్రవేత్త అయినను, తన ఆసక్తి అంతా విశ్వనిర్మాణ శాస్త్రంమీదనే ఉండేది. కృష్ణ బిలాలకు రేడియో ధార్మికత ధర్మం ఉందని కనుగొన్న మొదటి వ్యక్తి స్టీఫెన్ హాకింగ్. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ మరియు ఏకతత్వ సిద్ధాంతాలపై ఎన్నో పరిశోధనలు చేశారు.
స్టీఫెన్ హాకింగ్ జీవితం మరియు ఆయన సాధించిన శాస్త్రీయ అంశాల మీద కొన్ని లఘు చిత్రాలు వచ్చాయి. 2014 లో “The Theory of Everything” అని James Marsh తీసిన పూర్తి నిడివి చిత్రం వచ్చింది. బహుశా అదే స్ఫూర్తితో రెండు వారాల క్రితమే, మన బాలివుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ “జీరో” అనే సినిమాను విడుదల చేశారు. అందులో నాయిక పాత్ర అంగవైకల్యం తో ఉన్న ఒక ప్రముఖ అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త.
స్టీఫెన్ హాకింగ్ వీల్ చైర్ కే పరిమితమైన సమయములో ఆయన దవడ కండరాల కదలికకు అనుగుణంగా పదాలను టైపు చేసే కీ బోర్డు మొదలు ఆయన ఉపయోగించిన కంప్యూటర్ పరికరాలు, ప్రోగ్రాం లు అన్నీ ప్రముఖ కంప్యూటర్ చిప్ కంపెనీ ఇంటెల్ సమకూర్చిందని ఆయన తన పర్సనల్ నోట్ లో వ్రాసుకొన్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన పరిజ్ఞాన పటిమ యొక్క గొప్పదనం ప్రపంచం గుర్తించిందని చెప్పడానికి.
దాదాపు అర్థ శతాబ్దం నరాలకు సంబంధించిన వ్యాధి తనను వీల్ చైర్ కే పరిమితం చేసినను, ఏ మాత్రం అధైర్యపడి క్రుంగిపోకుండా తన ఆశయాలను, ఆలోచనలను మరింత ద్రుఢత్వంతో పెంచి చివరి వరకు ఎన్నో అంతరిక్ష విషయాలను అందరికీ అందిస్తూ, అంతరిక్ష శాస్త్రీయ విజ్ఞానంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తన విషయ పరిజ్ఞానం ద్వారా సాధించి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఆ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త March 14, 2018 న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేకున్ననూ, కృష్ణ బిలాల ధార్మికతపై ఆయన రూపొందించిన భౌతిక సిద్ధాంతాలు ఎల్లప్పుడూ ఆయనను గుర్తుచేస్తూనే ఉంటాయి.
స్టీఫెన్ హాకింగ్ గురించిన ఎన్నో మంచి విషయాలు తెలిశాయి – ధన్యవాదాలు