Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
శ్రీవేంకటేశ్వరాత్మీయదర్శనము - కవితాసంతర్పణ
అయ్యగారి సూర్యనారాయణమూర్తి

శ్రీవేంకటేశ్వరాత్మీయదర్శనము

చం.
మకుటలసద్వరాంగపరిమండితకర్ణకృపాకరేక్షణ
ప్రకటితసుస్మితోష్ఠకటరాత్రికరాంచితనర్మఠస్ఫుర
న్నకుటలలాటలగ్నమృగనాభిసుధానిధిచిత్ర మొప్పఁగా
నికటము నందుఁ గన్పడిన నీవు వినా మన శక్యమే? హరీ!

భావము-
కిరీటముతోప్రకాశించుచున్నశీర్షము, చక్కగా అలంకరింపబడిన చెవులు, కృపకు నిలయమైన కన్నులు, స్పష్టమైన మంచినవ్వుకలిగిన పెదవులు మఱియు చెక్కిళ్ళు, కర్పూరముతో పూజింపబడిన గడ్డము, మెఱయుచున్ననాసిక, నుదుటిపై స్థిరముగా ఉన్న కస్తూరి, కర్పూరముతోడి నామము, ఒప్పుచు, నాకు దగ్గఱగా కనుపించిన నీవు లేక బ్రతుక సాధ్యము కాదు, నారాయణా!

ఉ.
కాంచనవర్ణగాత్రునిగఁ గాంచితి నిన్ను భవత్కటాక్ష మే
కొంచెము కల్గ దుఃఖనగకూటము పిండిగ మాఱు మారుతీ!
ప్రాంచదనన్యరూప! లవణార్ణవలంఘనదక్ష! యక్షరా!
కుంచితకేశ! కావు రఘుకుంజరనామజపాప్తధీనిధీ!

కవితాసంతర్పణ

సీ. చిన్నివైనను రుచుల్ చిందించు చిట్టికా
         జాలు కందాలు; లడ్డూలు కావె
    ఆటవెలందులు, తేటగీతులు?; జిలే
         బీలు వృత్తా లెన్నొ; వేడివేడి
    బజ్జీలు ద్విపదలు; పాయసా లందించు
         పలువర్ణ(1)సీసాలు; మెలిక లొలుకు(2)
    పేణీలు బంధాలు; ప్రియమైన పూర్ణాలు
         గర్భితపద్యాలు; కడు పొడవగు
    సేమ్యాలు మాలికల్; చిత్రాన్నములు చిత్ర
         కవిత; లిందందునఁ గానుక లగు

తే.గీ. జీడిపప్పులు, ద్రాక్షలతోడి యేల
       కులును మిరియాలు భాష కుజ్జ్వలము(3); లిట్టి
       రసగుళికలైన బహుపదార్థముల(4) విందు
       సుకవికవితలనే చవిచూడ నగును
       (1)రంగుల/రూపముల/జాతుల/అక్షరముల (2)ప్రకటించు 
       (3)అలంకారములు (4)వస్తువులు/శబ్దముల అర్థములు
Posted in July 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!