

శ్రీరామనవమి
కం. శ్రీరామనవమి హరి యవ తారము ధరియించి దనుజదమనము ధర్మో ద్ధారణతో ధాత్రేయీ భార మ్మడఁచుటకు నాది, భద్రప్రదమున్ కం. శ్రీరామనామమహిమను గౌరీపతి సకలసృష్టిఁ గావ ధరించెన్ ఘోరవిషంబును గళమున నేరికి సాధ్యంబుగాని యెడ ధృతిమతియై కవికులతిలకము (స్వీయవృత్తము) [ప్రతిపాదమునకు 24 అక్షరములు, న-న-స-స-స-స-స-స గణములు మఱియు 9, 15, 21వ యక్షరములు యతిస్థానములుగా కలిగిన సమవృత్తము] రవికులతిలకుఁడు రాఘవరాముని రాజలలాముని రాజధర స్తవసముచితగుణశాలిని దానవసంహృతిశీలిని సత్యవచో ధ్రువనియమితు ద్విజతోషణుఁ(1) గిల్బిషదుఃఖవిదూరుని దోర్బలునిన్ పవనతనుజవిభు వాసురజాప్రియుఁ(2) బ్రార్థన సేసెద భక్తిమెయిన్ (1) బ్రాహ్మణులను / పక్షియైన జటాయువును సంతోషపఱచినవాని (2) భూమిజయైన సీతకు ప్రియుడైనవాని శా. “మీరే దిక్కని నమ్మినారము సదా మేల్సేయ రారే వెసన్ గారుణ్యామృతపూర్ణలోచనములన్ గానంగ రారే మమున్ ఘోరాంహర్విటపీకుఠారు(1) లగుచున్ క్షోణీతనూజాయుత శ్రీరామానుజులార!(2) పావనినతశ్రీమత్పదాంభోజులై(3)” (1) ఘోరమైన పాపము లనెడు వృక్షములకు గొడ్డళ్ళు (2) సీతారామలక్ష్మణులు (3) ఆంజనేయునిచే నమస్కరింపబడిన ప్రకాశవంతమైన పాదకమలములు కలవారై