Menu Close

Adarshamoorthulu

శ్రీమతి కృష్ణమ్మాల్

శ్రీమతి కృష్ణమ్మాల్

ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం .. నరజాతి సమస్తం పరపీడన .... అని మహా కవి శ్రీ శ్రీ అన్నట్లు, మన చరిత్రలో ఎన్నో మాసిపోని మరకలున్న పుటలు ఉన్నాయి. బడుగు ప్రజలను దోచుకొనే బడా బాబులు నాడు, నేడు ఏనాడైనా ఉంటారు. అయితే వారి అన్యాయాలకు అడ్డుకట్ట వేసే అభ్యుదయ వాదులు సామాజిక సేవా మూర్తులు ఎందఱో సగటు సమాజంలో చైతన్యం తీసుకొచ్చే సత్కార్యాలకు శ్రీకారం చుడుతుంటారు. అటువంటి వారినే మనం కారణజన్ములు అంటాం. వారి పుట్టుకకు ఒక ఉద్దేశ్యం ఉంటుంది. వారు అందుకు తగినట్లుగానే తమ జీవితాలను నిర్దేశించుకొని సామాజ శ్రేయస్సు కొఱకు ఎంతగానో శ్రమిస్తారు. అటువంటి వారు పదవులు, పట్టభిషేకాలు, ప్రశంసా పత్రాలు ఆశించి పనిచేయరు. అటువంటి మహా మనిషి, మానవతావాది శ్రీమతి కృష్ణమ్మాల్, నేటి మన ఆదర్శమూర్తి.

సమాజ శ్రేయస్సే తన ప్రథమ కర్తవ్యం, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తన అనుభవం, ఆలోచనలే ఆయుధంగా మలిచి వయసుతో నిమిత్తము లేకుండా ఉద్యమించే ఈ మహా సాధ్వి ముదివయసులో కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న ఈ మహిళా ధీశాలి ఎంతో మంది అభ్యుదయవాదులకు పోరాట స్ఫూర్తి.

శ్రీమతి కృష్ణమ్మాల్తమిళనాడు లోని ఒక మారుమూల పల్లెటూరులో జన్మించిన కృష్ణమ్మాళ్‌, తన బాల్యంలో అందరమ్మాయిల వలె నాటి సామాజిక పరిస్థితులకు మానసికంగా ఎంతో వ్యధకు గురైంది. ముఖ్యంగా వర్ణ వివక్ష, వర్గ పోరు, ఆధిపత్య పోరులో బలైపోతున్న సగటు బడుగు జీవుల జీవన విధానం తనను ఎంతో ఆలోచింపజేసింది. బాల్యంలోనే తను నివసించిన దళితవాడ లో, తన ఇంటిలోనే తన తల్లి పడుతున్న కష్టాలు, భూస్వాముల దోపిడీని ప్రత్యక్షంగా చూసి ఎవరో వస్తారు ఎదో చేసి మనకు మంచి జీవితాన్ని ఇస్తారు అని కాకుండా తానే ఆ ‘ఎవరో’ ఎందుకు కాకూడదు అని స్థిరంగా నిర్ణయించుకొని అనుభవాలే పాఠాలుగా నేర్చుకొని ఉద్యమించడం మొదలుపెట్టింది.

'ఈ పూట ఏ ఒక్కరు ఆకలితో పడుకున్నా ఈ సృష్టికి జీవం లేదు. మానవత్వానికి అర్థంలేదు’ అన్న సుబ్రహ్మణ్యభారతి సూక్తితో స్ఫూర్తినొంది ‘అందరం ఒక్కటై ఆకలిని తరిమేద్దాం’ అంటూ అలుపెరుగక తన ఆశయ సాధనకు ఉపక్రమించింది.

భూదాన ఉద్యమ కర్త వినోభాబావే, మహాత్మాగాంధీ, జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రముఖుల ఆదర్శాలకు ప్రభావితమై, అందుకు తగిన విధంగా తన జీవితాన్ని మలుచుకొని 'దేవుడు మనకు ఈ జన్మ నిచ్చింది స్వార్థంతో మన బతుకు మనం బతకడానికి కాదు. మనతో పాటు మన చుట్టూ ఉన్న పదిమందికి సహాయం చేయడానికి కూడా. మనకు లభించిన సుఖసంతోషాలను అందరితో పంచుకుందాం. అందరికీ ఆ సంతోషాలు కలిగేటట్లు చేద్దాం.' అనే నినాదంతో ఎన్నో కోట్ల విలువైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా పూర్తిచేసింది.

శ్రీమతి కృష్ణమ్మాల్ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. ఆ దిశగా ఆలోచించి ఆ సమస్యను అధికమించాలి అనే సిద్ధాంతంతో ప్రపంచంలోని ఎంతో మంది మహానుభావుల బోధననలు, తత్వాలను ఆకళింపుచేసుకొని ముందుకు సాగేది. తన జీవితం, తన కుటుంబం, తన కలిమి అని అనుకోకుండా బడుగులకు ముఖ్యంగా భూమిలేని పేదవారికి మంచి చేయాలనే తలంపుతో వినోభాబావే భూదానోద్యమ సమయంలో ఆయన వెన్నంటి భర్త శంకరలింగం జగన్నాథన్‌ తో కలిసి కృష్ణమ్మాళ్‌ వేల మైళ్ళు నడిచి ఎన్నో వేల ఎకరాలు సంపాదించి పేదలకు పంచిపెట్టారు. ఈ చిన్న ఉదాహరణ చాలు ఆమె వ్యక్తిత్వం ఎటువంటిదో చెప్పడానికి.

బడుగు ప్రజలకు అన్యాయం జరిగితే ఆమె తట్టుకోలేదు. ‘దున్నేవాడికి భూమే ఆధారం, ఆత్మవిశ్వాసం. పిడికెడు మట్టే వారి జీవనానికి మార్గదర్శి. అటువంటి పేదరైతులకు, దళితులకు అన్యాయం జరిగితే వారికి న్యాయం జరిగేవరకూ నేను విశ్రమించను' అన్న ఆమె స్థిర సంకల్పమే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. కాని తను తలపెట్టిన బృహత్ కార్యం కార్యరూపం దాల్చి ఆ ఫలాలు పేదలకు అందినప్పుడే తనకు అసలైన తృప్తి అని అంటారు.

తన జీవన పయనంలో ఎన్నో సత్కార్యాలకు శ్రీకారం చుట్టి వాటిని సాధించి 80 ఏళ్ల వయసులో కూడా ఎంతో స్థిరంగా, ఇంకా సామాన్య మానవుని జీవితాలలో వెలుగు నింపాలనే తపనతో ఉద్యమిస్తున్న ఆ మాహా శక్తి, శ్రీమతి కృష్ణమ్మాళ్ జగన్నాధం ను మనందరం మనసారా అభినందిద్దాం.

Posted in October 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!