మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బ్రిడ్జి వాటర్, న్యూ జెర్సీ, యు.ఎస్.ఎ
గత సంవత్సరం అక్టోబర్ మాస ఆలయసిరి లో న్యూ జెర్సీ రాష్ట్రం లోని అక్షర పురుషోత్తం సంస్థాన్ వారు నిర్మించిన అత్యంత ఖరీదైన లక్ష్మీనారాయణ మందిరం గురించి వ్రాశాను. కానీ, ఈ సంచిక ఆలయసిరి, అతి సామాన్యమై ఎక్కువ సంప్రదాయ బద్దమై ఆగమ శాస్త్ర ధర్మాలకు అనుగుణంగా నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ బాలాజీ మందిరం.
ఈ ఆలయ నిర్మాణం సంప్రదాయ బద్ధంగా నిర్మితమైననూ, ఎన్నో న్యాయసంబంధ చిక్కులను పరిష్కరించుకోవాల్సివస్తున్నది. ముఖ్యంగా చుట్టుప్రక్కల నివసిస్తున్న వారి నుండి కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అయిననూ భగవత్ సంకల్పం ఉంటే అంతా సవ్యంగానే జరుగుతుందనే నమ్మకం ఈ ఆలయ నిర్వాహకులలో ఉన్నందున నూతన నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.
ది హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సొసైటీ అఫ్ యు.ఎస్.ఎ అనే పేరుతో 1989 ఏర్పడిన హిందూ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయ ఆకృతి పూర్తిగా దక్షిణ భారత ఆగమ సంప్రదాయ శైలిలో రూపుదిద్దుకొని 9 సంవత్సరాల నిర్మాణం తరువాత 1998 లో మహా కుంభాభిషేకం జరిగింది. నాటినుండి నిత్య కల్యాణం పచ్చ తోరణం అన్న రీతిలో ఆ కలియుగ వేంకటేశ్వరుని వైభవం వెలుగొందుతున్నది. ప్రధాన రాజగోపురం చోళ రాజుల వాస్తు సంప్రదాయ శైలిలో నిర్మించడం జరిగింది.
ఇక్కడి వంటశాలలో మన సంప్రదాయ భోజన వంటకాలు, తినుబండారాలు చాలా చౌకగా లభిస్తాయి మరియు ఎంతో రుచికరంగా కూడా ఉంటాయి. శని, ఆదివారాలలో ఇక్కడి భారతీయులు వారి మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడే కానిచ్చేస్తారు. ఇంట్లో వంటపని మరియు వేరే హోటల్ కు వెళ్ళే బాధ తప్పుతుంది.
ఈ ఆలయంలో ప్రధాన ఆలయం వేంకటేశ్వరుని సన్నిధానం అయినను, శివుడు, వినాయకుడు, పార్వతి, అయ్యప్ప, ఇలా దేవతలందరూ ఈ ప్రాంగణం లోనే కొలువై ఉన్నారు. ఈ ఆలయ నిర్వాహకులు తమ వెబ్సైటు లో అసలు ఆలయం అంటే అర్థం ఏమిటి మొదలు ఆలయంలో మనం చేయవలసిన కర్మల గురించి, పాటించవలసిన నియమాల గురించి మరియు ఆలయం లోని ప్రతి అంశాన్ని ఎంతో సోదాహరణంగా వివరించారు. క్రింద ఇచ్చిన లింక్ లో మీరు చూడవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు ఇందులో ఉన్నాయి.