Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
గౌరాబత్తిన కుమార్ బాబు

గతసంచిక తరువాయి »

మునసబు నుండి రాష్ట్రపతి దాకా రాజకీయ ప్రస్థానం

1966 జనవరి 11న ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో అకాల మృత్యువాత పడ్డారు. తాష్కెంట్ లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తో కలసి శాంతి ఒప్పందం మీద సంతకం చేశాక సోవియట్ ప్రధాని కోసిగిన్ ఇచ్చిన విందులో ఉల్లాసంగా గడిపిన శ్రీ శాస్త్రి సుమారు పది గంటలకు తన బసకు చేరుకున్నారు. వచ్చిన తరువాత రేడియో టెలిఫోన్ లో తన సతీమణితోను, అల్లుడితోనూ, శ్రీ నందాతోను మాట్లాడారు. తాను బుధవారం కాబుల్ మీదుగా ఢిల్లీకి వస్తున్నట్లు తెలిపారు. పదకొండు గంటల దాటిన తరువాత నిద్ర పోయారు. సుమారు ఒంటి గంట ఇరవై నిమిషాలకు దగ్గు రావడంతో బయటకు వచ్చి తన డాక్టర్ ను పిలిచారు. ఆ వార్త తెలిసిన వెంటనే సుమారు ఒక డజను మంది రష్యన్ డాక్టర్లు అక్కడకు చేరుకున్నారు. శాస్త్రి నోటిలోకి గాలి ఎక్కించడానికి, గుండెను పునరుజ్జీవితం చేయడానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. శాస్త్రిగారు శాశ్వతంగా కన్నుమూశారు. శ్రీ శాస్త్రి భౌతికకాయాన్ని ఒక శవపేటికలో పెట్టి తాష్కెంట్ విమానాశ్రయం వద్దకు తెస్తుండగా సుమారు పదిహేడు కిలోమీటర్ల దారిపొడుగునా లక్షలాది రష్యన్ పౌరులు విచారవదనాలతో నిలబడి జోహార్లు అర్పించారు. విమానాశ్రయ ప్రవేశ ద్వారం దగ్గర నుండి విమానంలోకి శాస్త్రి శవపేటికను శ్రీ కోసిగిన్, శ్రీ ఆయూబ్ ఖాన్, శ్రీ స్వర్ణ సింగ్, శ్రీ చవాన్ మరియు కౌల్ మోసుకువచ్చారు. శ్రీ శాస్త్రి భౌతికకాయం సోవియట్ విమానంలో పాకిస్తాన్ భూభాగం మీదుగా పాలం విమానాశ్రయంకు చేరుకుంది. పాలం విమానాశ్రయం నుండి శాస్త్రి నివాసం 10 జనపథ్ కు వెళ్లే దారి పొడుగునా జనం బారులు తీరి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం తొమ్మిదిగంటల ముప్పై నిమిషాలకు శాస్త్రి భౌతిక కాయాన్ని ఊరేగింపుతో అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. నెహ్రూ సమాధి అయిన శాంతివనం లోనే శాస్త్రి దహన సంస్కారాలు జరిగాయి.

అరుదైన సామ్యత :- ఇంగ్లీష్ తేదీలను బట్టి చూస్తే గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2నే శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కూడా జన్మించారు. తిథులను బట్టి చూస్తే గాంధీజీ మరణించిన బహుళ పంచమి ఘడియల్లోనే శ్రీ శాస్త్రి కూడా అశువులుబాశారు. గాంధీజీ లాగే శాస్త్రి నిరాడంబరుడు, వినమ్రుడు, భారతీయ హృదయానికి దగ్గరగా వచ్చినవాడు.

శాస్త్రి గారి మరణం ఎంతో శోకపూరితం అయినప్పటికీ రాజ్యాంగ ఏర్పాట్లు తప్పలేదు. తాత్కాలిక ప్రధానిగా శ్రీ గుల్జరీలాల్ నందా 11వ తేదీ తెల్లవారుజామున సుమారు మూడు గంటలకు అంటే శ్రీ శాస్త్రి మరణించిన రెండుగంటల లోపే ప్రమాణస్వీకారం చేశారు. నెహ్రూ మరణాంతరం కూడా శ్రీ నందా గారే తాత్కాలికంగా ప్రధాని పదవి నిర్వహించారు. 1963లో అమెరికన్ విలేఖరి వెల్లెస్ హెంగెన్ “నెహ్రూ తరువాత ఎవరు?” అనే పుస్తకం రాశారు. అందులో ఆయన సూచించిన మొరార్జీ, కృష్ణమీనన్, ఇందిర, పాటిల్, చవాన్, జయప్రకాశ్ మొదలైన వారెవరూ నెహ్రూ తరువాత ప్రధాని కాలేకపోయారు. నెహ్రూ తరువాత శాస్త్రి ప్రధానమంత్రి కావడం అపూర్వమైన ఘట్టం అయితే ఆ అపూర్వ ఆశాజ్యోతి అకాలంగా ఆరిపోవడం భారతదేశ ప్రజాస్వామ్యచరిత్రలో కీలకమలుపు. వెల్లెస్ హెంగెన్ “నెహ్రూ తరువాత ఎవరు?” అనే పుస్తకం లో శ్రీ శాస్త్రి గారి గురించి రాసిన వ్యాసం ప్రస్తావించదగ్గది.

“శ్రీ శాస్త్రికి ప్రతి విషయాన్ని గురించి నిశ్చితాభిప్రాయాలు లేవుగానీ బలమైన అనుభవం లోలోతుల వరకూ వ్యాపించి ఉంటుంది. మొరటుతనానికి దూరమై, దౌర్జన్యతను చూచాయిగానైనా కన్పించనీయని ఇలాంటివారు బహుస్వల్ప సంఖ్యలో ఉంటారు. తెలివైనవాడేకానీ మేధావి మాత్రం కాదు. దేశంలోని సుచివంతులైన సాధారణ జనుల్లా అనుభవించి ఆలోచించగలిగిన శక్తిమంతుడు.”

శ్రీ శాస్త్రి తరువాత ఎవరు?

శ్రీ శాస్త్రి తదనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకత్వానికి జరిగిన పోటీలో శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ మొరార్జీదేశాయ్ పై 186 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనవరి 24 1966న ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రెండేళ్ల క్రితం నెహ్రూ గారి తరువాత శ్రీ శాస్త్రిని ప్రధానమంత్రిగా చేయడానికి ఏ ఏ వర్గాలు, శక్తులు సమిష్టిగా కృషి చేశాయో అవే వర్గాలు ఇందిరాగాంధీని ప్రధాని అవ్వడంలో కీలకపాత్ర పోషించాయి. శ్రీ సంజీవరెడ్డి ఆదిలో శ్రీ గుల్జారీలాల్ నందానే ప్రధానిగా కొనసాగించాలని వాదించారు. కామరాజ్ గారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పొందవలసిన ఆవశ్యకత దృష్ట్యా ఇందిరాగాంధీనే ఈ తరుణంలో నాయకత్వం వహించదగిన వ్యక్తిగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పిమ్మట ఇతరులతోపాటు తాను కూడా అభిప్రాయాన్ని మార్చుకున్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో సంజీవరెడ్డిగారికి రవాణా, విమాన సర్వీసులు, నౌకా వాణిజ్యం, వినోదయాత్రల శాఖ లభించింది. సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి మధ్య అభిప్రాయభేదాలు శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికతోనే ప్రారంభమయ్యాయని రాజకీయపరిశీలకులు అన్నారు. తనతో సంప్రదించకుండా ఇందిరాగాంధీ అభ్యర్థిత్వానికి బ్రహ్మానందరెడ్డి తన మద్దతు ప్రకటించడం సంజీవరెడ్డిగారికి కష్టం కలిగించిందని పరిశీలకుల ఉద్దేశం.

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎన్నికలు – సంజీవరెడ్డి విజయం :-

1966 మే నెలలో బొంబాయిలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు దేశంలో పెద్ద కలకలాన్ని కలిగించడం మాత్రమే కాకుండా కాంగ్రెస్ నాయకత్వ గందరగోళ పరిస్థితిని బయటపెట్టాయి. ఈ ఎన్నికల్లో సిండికేట్ మొరార్జీ దేశాయ్ ఒకటైతే, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ మరోవైపు నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఐదు మంది నెగ్గితే, ముగ్గురు సిండికేట్ సభ్యులు కాగా, ఇద్దరు ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుల వర్గీయులు. ఎన్నికల్లో గెలిచిన వారు :- నీలం సంజీవరెడ్డి, డి.పి.మిశ్రా, సి.బి.గుప్త, జి.యం.సాదిక్, డాక్టర్ రామ్ సుభాగ్ సింగ్. ఓడిపోయినవారు :- కె.డి.మాళవ్య, కె.హనుమంతయ్య, దామోదరం సంజీవయ్య, యస్.యన్.మిశ్రా.

సంజీవరెడ్డి గారు అందరికంటే ఎక్కువగా 118 ఓట్లు సాధించి మొదటి లెక్కింపులోనే ఎన్నికయ్యారు. అతుల్య ఘోష్ ను శాస్త్రి గారి స్థానంలో పార్లమెంటరీ బోర్డు కు పంపారు. వారు పశ్చిమ బెంగాల్ ఓట్లలో అధిక భాగం, అస్సాం ఓట్లలో కొన్ని సంజీవరెడ్డిగారికి వేయించారు. బిజూ పట్నాయక్ గారి ఒడిశా ఓట్లు, నిజలింగప్పగారి మైసూరు ఓట్లు కూడా సంజీవరెడ్డిగారికొచ్చాయి. ఆంధ్రలోని 41 ఓట్లలో 21 సంజీవరెడ్డి గారికి వచ్చాయని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది. తనకు కేటాయించబడిన వాటిలో ఏమైనా క్రాస్ వోటింగ్ మూలంగా పోతాయేమోనని సంజీవరెడ్డి గారు ఇతర రాష్ట్రాలవి స్వయంగా కొన్ని సాధించుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం సంజీవరెడ్డి గారికి రాష్ట్రాల వారీగా వచ్చిన ఓట్లు: పశ్చిమ బెంగాల్ 45,ఆంధ్ర 21, ఒడిశా 9, అస్సాం 10, మైసూరు 15, ఇతర రాష్ట్రాలు 18. సంజీవరెడ్డి గారు తన స్వగ్రామమైన ఇల్లూరులో పత్రిక విలేఖరులతో మాట్లాడుతూ తాను అపూర్వ విజయం సాధించడానికి కారణం ఒడిశా, మైసూరు సభ్యుల మద్దతేనని అన్నారు. ఈ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ ఓట్లు పొంది శ్రీ సంజీవరెడ్డి తన బలాన్ని నిరూపించుకున్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య ఈ ఎన్నికల్లో పూర్తిగా విఫలమయ్యారు. శ్రీమతి ఇందిరాగాంధీ అండతో ఎన్నికల్లో పాల్గొన్న సంజీవయ్యకు 17 ఓట్లు వచ్చాయి…అవి సంజీవరెడ్డికి పడని ఆంధ్ర ఓట్లు.

ఆంధ్ర రాజకీయాల్లో శ్రీ సంజీవరెడ్డి అధ్యాయం పరిసమాప్తి?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ 11వ స్థానానికి 1966 సెప్టెంబర్ లో జరిగిన ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో బ్రహ్మానందరెడ్డిది పైచేయిగా నిలిపింది. 1951లో రంగా గారిని ఓడించి సంజీవరెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనప్పటి నుండి పదిహేనేళ్లపాటు ఆంధ్ర రాజకీయాలను సంజీవరెడ్డి శాసించారని; మళ్ళీ ఇప్పుడు ఈ జరిగిన ఎన్నిక సంజీవరెడ్డి ప్రాబల్యానికి తెరదించి రాష్ట్రానికి బ్రహ్మానందరెడ్డి రూపంలో కొత్త నాయకత్వం అందించిందని; శ్రీ సంజీవరెడ్డి గారన్నా, వారి మాటన్నా, ఆంధ్ర కాంగ్రెస్ వాదులకు హడల్, వారి ముందుకు పోవాలన్నా, వారికి ఎదురు చెప్పాలన్నా దుస్సారమైన విషయంగా ఉండేది. ఈ పరిస్థితిని బ్రహ్మానందరెడ్డి మార్చి వేశారని; శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఇకనుండి బహిరంగంగానే తన సహాయసహకారాలు అందిస్తుందని; రాజకీయ పరిశీలకులన్నారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి అభ్యర్థి శ్రీ కాకాణి వెంకటరత్నం సంజీవరెడ్డిగారు బలపరచిన శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తి రాజును ఓడించారు. వోటింగ్ లో శ్రీ కాకాణి వెంకటరత్నంకు 163 ఓట్లు, శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తి రాజుకు 136 ఓట్లు వచ్చాయి.

ఈ ఎన్నికల్లో పరాజయం అనంతరం అక్టోబర్ లో సంజీవరెడ్డి హైదరాబాద్ కు వచ్చారు. వ్యక్తిగత కారణాలపై తాను కుటుంబాన్ని హైదరాబాద్ తరలించదలచుకున్నానని, ఇక మీదట ఎన్నికల కార్యక్రమం ముగిసే వరకు ఆంధ్రదేశానికి తరచూ వస్తూ ఉంటానని సంజీవరెడ్డి గారు ప్రకటించారు. నేను హైదరాబాద్ వచ్చినపుడల్లా అద్దె ఇల్లు చూసుకోవాల్సి వస్తున్నదని, ఈ సమస్యను ఈ సరి పరిష్కారం చేసేయాలని చూస్తున్నాను, హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇల్లు ఇస్తారేమోననుకుంటే, అది రాకుండా పోయింది – అన్నారు సంజీవరెడ్డి గారు. మామూలుగా అందరిలా దరఖాస్తు పెట్టి తీసుకొనడంకాక ప్రతి ఇంటికి బోర్డు రూల్స్ కు విరుద్ధంగా నలభై వేలకు పైబడి ఖర్చు చేయించుకుని ప్రత్యేకంగా నిర్మించుకున్నందువల్లే శ్రీమతి సంజీవరెడ్డిగారికే గాక శ్రీమతి బ్రహ్మానందరెడ్డి, శీలం సిద్ధారెడ్డి మరి ముగ్గురు తమ ఇళ్లను రెండేళ్ల క్రితమే వదులుకోవలసి వచ్చింది. సంజీవరెడ్డిగారు తమకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించకపోయినందువల్లే ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో ఓడిపోయామని తిరుగుబాటువర్గం వారు భావించారు. సంజీవరెడ్డిగారు చివరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించినా ప్రవేశించకపోయినా ప్రవేశిస్తారన్న భావమైనా కాంగ్రెస్ వాదుల్లో కలిగించవలసిన అవసరమున్నదని వారు భావించారు. శ్రీ సంజీవయ్య ఢిల్లీలో ఉండేట్లు, శ్రీ సంజీవరెడ్డి ఆంధ్రాలో ఉండేట్లు అవగాహనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. సంజీవరెడ్డి గారు తిరిగి రాష్ట్ర శాసనసభా కాంగ్రెస్ పక్ష నాయకత్వానికి పోటీ చేయాలని సిండికేట్ నాయకులు నిర్ణయించుకున్నారనే వార్త రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించింది. సంజీవరెడ్డి గారు సహితం ‘ద్రోణాచలం నుంచి నేను పోటీ చేస్తానని ఒక వార్త చెలామణీలో ఉన్నదంటే ఉండనివ్వండి ఔననిగానీ, కాదనిగానీ నేనెందుకు చెప్పాలి? చూద్దాం’ అని సందిగ్ధ సమాధానం ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఎవరు నాయకులు అనేది అధిష్టాన వర్గం ఇంకా తేల్చలేదని, తేల్చినదనడం తప్పు అని సంజీవరెడ్డిగారు తెలిపారు.

సంజీవరెడ్డి గారి వ్యాఖ్యల అనంతరం ముఖ్యమంత్రి వర్గంలో ఆందోళన వ్యాపించింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ వి.బి.రాజు, శ్రీ సంజీవరెడ్డిని కేంద్రం నుండి విడుదల చేయవద్దని, తిరిగి రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడానికి అనుమతినివ్వక ముఖ్యమంత్రిగా శ్రీ బ్రహ్మానందరెడ్డినే కొనసాగించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధానమంత్రిని కొరడానికై హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ రాజకీయ పరిణామాలు ఇలా ఉండగా శ్రీ అమృతరావు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం స్థాపించాలని అక్టోబర్ 15,1966 నుండి నిరాహార దీక్ష చేబట్టారు. ఈ విధంగా సంజీవరెడ్డి గారు తిరిగి రాష్ట్రానికి వస్తున్నారనే వార్తల వల్ల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం మొదలై క్రమంగా హింసాత్మక రూపం తీసుకున్నది.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత “విడివడని బాధ్యత” విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ “వై” సిరిమల్లెలో, తొలి విమర్శ “పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి” ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం “మునసబు నుండి రాష్ట్రపతి దాకా…” ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in February 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *