Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
గౌరాబత్తిన కుమార్ బాబు
మునసబు నుండి రాష్ట్రపతి దాకా రాజకీయ ప్రస్థానం

సంజీవరెడ్డి సోషలిజం - ఓ కాంగ్రెసువాది విమర్శ :-

శ్రీ కామరాజ్ నాడర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 68వ కాంగ్రెస్ మహాసభలు 1964 జనవరి 9 మరియు 10వ తారీఖుల్లో భువనేశ్వర్ లో జరిగాయి. స్వాతంత్య్రానంతరం జరిగిన కాంగ్రెస్ మహాసభలలో భువనేశ్వర్ కాంగ్రెస్ చాలా ముఖ్యమైనది. 1955 సెప్టెంబర్ 7 నుండి 9 మధ్యన ఆవడిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో సోషలిస్టు తీర్మానం చేసిన కాంగ్రెస్ భువనేశ్వర్ మహాసభలలో తాము సోషలిస్ట్ గమ్యం వైపు ఎంత దూరం పయనించామో సరి చూసుకుంది. అలానే సోషలిస్ట్ గమ్యం చేరడానికి కాలనిర్ణయం కూడా చేసుకున్నది. ఐదవ ప్రణాళిక ముగిసేనాటికి అంటే 1975 నాటికి దేశంలో ఎవ్వరికీ తిండి, గుడ్డ, ఇల్లు, విద్య, వైద్యం కొరత ఉండకూడదని నిర్ణయించుకుంది. ఒకవేళ ఐదవ ప్రణాళిక నాటికి లక్ష్యం నెరవేరకపోయినా కనీసం ఆరవ ప్రణాళిక నాటికి అంటే 1980 నాటికి లక్ష్యాన్ని చేరుకోగలమని కాంగ్రెస్ నాయకులు విశ్వసించారు. పార్లమెంటరీ విధానంలో, శాంతియుత పద్ధతులలో సోషలిస్టు సమాజ స్థాపనే కాంగ్రెస్ లక్ష్యమని నిర్వచించడం, ఆసియాలో కమ్యూనిస్టు చైనాకు ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్ధిక విధానాలను, కమ్యూనిస్టేతర సోషలిస్టు మార్గాన్ని చూపడం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్న అంశాలు.

ఆవడిలో జరిగిన కాంగ్రెస్ మహాసభల నుంచీ ఈ విధంగా సోషలిస్టు లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతున్న కాలంలో రాష్ట్రంలో సంజీవరెడ్డి గారు అనుసరించిన విధానాలపై ఓ కాంగ్రెసువాది ఘాటైన విమర్శలు చేశారు.

NSReddy-SanjivaReddy-BrahmanandaReddy
(నెల్లూరుకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ తో సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి)

"కాంగ్రెస్ సోషలిజం తన ధేయ్యంగా ప్రకటించిన నేడు సంజీవరెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర పేపర్ మిల్లును పబ్లిక్ రంగం నుండి ప్రైవేట్ రంగానికి అప్పగించాలని తీర్మానించడం ఈ దఫా కాంగ్రెస్ ప్రభుత్వాలు సోషలిజంను కచ్చితంగా అమలు జరుపుతాయని అనుకున్న నాబోటి వారికి దిగ్భ్రమ కలిగించింది. సోషలిజంకు పునాది ఆస్తులను వ్యక్తిపరం నుండి సంఘపరం చెయ్యడం. దానికి ప్రాథమిక మెట్టు ముందు ప్రభుత్వపరం చెయ్యడం. ఇతర ఆస్తుల సంగతి ఎట్లా ఉన్నా ముందు "ఉత్పత్తి సాధనాలు" అంటే ప్రధానంగా పెద్ద పారిశ్రామిక సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వాటి ద్వారా వచ్చే లాభాలను ప్రభుత్వ ప్రణాళికాభివృద్ధికి వెచ్చించాలనేది సోషలిస్టు సూత్రం. ఈ విధానమును అనుసరించి ఆంధ్రాలో ఉన్నపెద్ద పరిశ్రమలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసి ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రభుత్వ నడక అందుకు వ్యతిరేకంగా ఉంది. సిర్పూరులో ఉన్న సిర్ సిల్క్, పేపర్ ఫ్యాక్టరీలు, ఆల్విన్ మెటల్ వర్క్స్ వగైరాలు ప్రభుత్వం స్థాపించింది. కానీ కొంతకాలం తరువాత వాటిని బిర్లా కంపెనీకి అమ్మివేసింది.అయితే ఈ పని కాంగ్రెస్ సోషలిస్ట్ ధ్యేయమును ప్రకటించకముందు అందులోనూ శ్రీ బూర్గుల రామకృష్ణారావు హయాంలో జరిగినది కాబట్టి సంజీవరెడ్డి గారి ప్రభుత్వానికి అంటగట్టకూడదు. అయితే సోషలిజం ధేయ్యంగా ప్రకటించిన నేడు సంజీవరెడ్డిగారి ప్రభుత్వం చేస్తున్నదేమిటి? అన్నదే ప్రశ్న. సంజీవరెడ్డికి సోషలిజంలో నమ్మకం ఉందా? లేనియెడల కాంగ్రెస్ లో, అందులోనూ ముఖ్యమంత్రిగా ఎలా ఉండగలడు? అనే ప్రశ్నలు రావచ్చు. కాంగ్రెసును అర్ధం చేసుకుంటే సంజీవరెడ్డిని అర్థం చేసుకొనడం కష్టం కాదు. ఆయనకు ఒక రాజకీయ విశ్వాసం గానీ, నమ్మకాలు గానీ ఉన్నట్లు కనిపించవు. ఆయన అధికార తృష్ణకు లోనైపోయిన వ్యక్తిగా కనిపిస్తాడు. తన అధికార కాంక్షను సాధించుకొనను ఏ సిద్ధాంతమునైనా స్వీకరించడం, త్యజించడం ఆయనకు అభ్యంతరం లేనట్లుంది. శ్రీ సంజీవయ్య హయాంలో సింగరేణిలో ప్రభుత్వం స్థాపించనున్న ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి పెట్టుబడి, నిర్వహణ బాధ్యతలు కేంద్రం తీసుకుంటే అభ్యంతరం లేదంటే, సంజీవరెడ్డి రాగానే "ఇది అర్థం లేనిది. కేంద్రానికి ఇది సంబంధం లేనిది. ఆంధ్ర ప్రభుత్వం దాన్ని నిర్వహిస్తుంది" అని ప్రకటించారు. సోషలిజం పై చవకగా ఉపన్యాసాలు చేసే వీరికి ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పులు తమ ఇష్టులకు ఇప్పించను అభ్యంతరం లేదుగదా! ఒక పెద్ద పారిశ్రామిక యజమానికి ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులివ్వవచ్చునంటాడు. తేజ గ్లాస్ ఫ్యాక్టరీని నిర్మించి, నడిపించను ప్రభుత్వం లక్షలాది ఖర్చు చేసి పదేండ్లకు నష్టం వస్తుందని కనుక్కున్నదట! దాన్ని ఒక పెద్ద మనిషికి అమ్మివేశారు. కానీ తిరిగి మరొక గ్లాస్ ఫ్యాక్టరీ కట్టను పెట్టుబడి పెట్టవచ్చునని అసెంబ్లీలో ప్రకటన! ఆంధ్ర పేపర్ మిల్లుపై ఏడు కోట్లు ఖర్చు పెట్టినా వడ్డీ గిట్టనందు వల్ల అమ్మివేస్తానంటాడు. కానీ మోటార్ బండ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటానంటాడు. దీనిని బట్టి వీరికి ఏవైనా స్పష్టమైన నమ్మకాలు ఉన్నవని చెప్పగలమా? కావున ఈ చర్యల వెనుకనున్న సత్యమేమిటి అని విచారించితే విచారకరమైన వాస్తవాలు వినవస్తున్నాయి. సోషలిజం పేరుతో ప్రభుత్వ ధనాన్ని (ప్రజలిచ్చే పన్నును) వెచ్చించి ఫ్యాక్టరీలు కట్టి, యంత్రాలు తెప్పించి, అవి సరిగా  పనిచేయడం లేదని పేరు పెట్టి పెట్టుబడిదారులకు ఇచ్చి వేయడమే సంజీవరెడ్డి సోషలిజమని ఎవరైనా అంటే ఏమనగలం? ప్రభుత్వ నిర్వహణలో అంతా నష్టమేనని ఈ మధ్యన సంజీవరెడ్డిగారన్నారు. అదే నిజమైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బస్సులను వదిలివేయరాదా? సోషలిజం అర్థంలేని విధానమని సంజీవరెడ్డి నిజంగా నమ్మితే - ఆ విషయం స్పష్టంగా బహిరంగంగా ప్రకటించెయ్యటం గౌరవం కదా? నెహ్రూ అభిమానం కొరకు ప్లాట్ ఫారం పై సోషలిజం, తనకు ఇష్టం లేని వారిని దెబ్బతీయుటకు సోషలిజం; కానీ ఇలాంటి పరిశ్రమలను వ్యక్తులకు కట్టబెట్టను మాత్రం సోషలిజం అడ్డు రాదు. ఇదా సంజీవరెడ్డి సోషలిజం అని ఎవరైనా అంటే సమాధానమేమిటి? శ్రీ సంజీవరెడ్డిగారి ఈ విధానం కాంగ్రెస్ సోషలిస్ట్ ధ్యేయాన్ని అపహాస్యంపాలు జేయడమేగాక ; వ్యక్తిగతంగా అది వారి పట్ల అపోహలకు ఆస్కారం కలిగిస్తుంది."

సంజీవరెడ్డి గారి హయాంలో డిసెంబర్ 1963లో ముఖ్యమంత్రి, మంత్రులు , తదితర ముఖ్యులను అతివిలువైన బహుమతులతో సన్మానించే సాంప్రదాయం సముచితమైనది కాదని; కావున ఇక మీదట ఈ పద్ధతికి స్వస్తి చెప్పవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరువు జారీ చేసింది. దేవాలయాల మంత్రిణి శ్రీమతి సదాలక్ష్మి నెల్లూరు జిల్లా ఆలయాల నుండి వేల విలువజేసే చీరలు కానుకలుగా పుచ్చుకోవడం, శ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు ఆక్షేపించడం, అది చిన్న తుఫానుగా పరిణమించడం, కడకు ముఖ్యమంత్రి దృష్ఠికిపోయి ఈ చర్య తీసుకోవడం జరిగింది.

ముఖ్యమంత్రి పదవికి సంజీవరెడ్డి రాజీనామా :-

జనవరి 16 1964న విలేఖరుల గోష్టిలో సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ :- "కాంగ్రెస్ సేవకుడిగా ఏ పని చేయడానికైనా నేను సంసిద్ధమే. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని సంవత్సరాలు ఉండటం మంచిది, అవసరం కూడా. కనీసం మరో రెండు సంవత్సరాల పాటు ఇక్కడ రాష్ట్రంలోనే ఉండదలచాను" అని అన్నారు.

సంజీవరెడ్డి గారు ఒకటి తలిస్తే విధి ఇంకోలా తీర్పు చెప్పింది. అదే నెలలో కర్నూలు జిల్లాలోని బస్సు రూట్ల జాతీయీకరణపై సుప్రీం కోర్ట్ ముఖ్యమంత్రిని అభిశంసిస్తూ తీర్పు చెప్పింది. దాంతో తన పదవికి జనవరి 29న సంజీవరెడ్డి గారు రాజీనామా చేయటం కొరకు అనుమతికై కాంగ్రెస్ అధ్యక్షునికి ఒక విజ్ఞప్తి పంపారు.

ఆ ముందు రోజు శాసనసభలో నేషనల్ డెమొక్రాట్స్ పక్షం నాయకుడు శ్రీ తెన్నేటి విశ్వనాధం మాట్లాడుతూ :- "కర్నూలు జిల్లాలో బస్సు రూట్ల జాతీయీకరణపై కొందరు ఆపరేటర్లు దాఖలు చేసిన అప్పీళ్లను అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యానాల దృష్ట్యా రాజ్యాంగ రీత్యా ఆయన రాజీనామా చేయవలసి ఉంటుంది. భారతదేశంలో ప్రధాన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏ మంత్రి పైన అయినప్పటికీ పరిపాలనలో పక్షపాతం ప్రదర్శించినట్లు ప్రకటించినట్లైతే ఆయన అధికారం విడిచి పెట్టవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి విషయంలో సుప్రీం కోర్ట్ ఈ విధమైన విమర్శలు చేసింది కాబట్టి ఆ పదవిలో శ్రీ సంజీవరెడ్డి ఉండటాన్ని నైతికంగా సమర్ధించే అధికారం లేదు." ఆ ప్రకటనపై ప్రజాపార్టీ జాయింట్ కార్యదర్శి మరియు శాసనసభ్యులు సంతకం చేశారు.

ఫిబ్రవరి 11 1964న ప్రధానమంత్రి నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించిన అనంతరం రాజీనామా చేయడానికి శ్రీ సంజీవరెడ్డికి అనుమతినిస్తూ అధిష్టానవర్గం ప్రకటన విడుదల చేసింది.

తన అభ్యర్ధన మన్నించినందుకు అధిష్టానానికి కృతజ్ఞత చెబుతూ సంజీవరెడ్డి ఈ విధంగా అన్నారు :- "సుప్రీం కోర్టు తీర్పును చదివినపుడు, రాజీనామా చేయాలని నిర్ణయించడం, క్షణమాత్రమైన ఉద్వేగంతో చేసిన పని కాదని , సాంకేతికమైన వివరాల చాటున దాక్కుని, తీర్పులోని అభిశంసనల నుండి తప్పించుకోవాలనే ఆలోచన తనకు లేదని కాంగ్రెస్ అధ్యక్షునికి విస్పష్టంగా రాశాను."

కర్నూలు బస్సు రూట్ల జాతీయీకరణపై సుప్రీం కోర్టు తీర్పు :-

"ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ముఖ్యమంత్రి ఆదేశాలపై వ్యవహరించిందనే ఆరోపణలు కౌంటర్ అఫిడవిట్ లో ఖండించినప్పటికీ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేకించి ఎన్నుకోవడానికి సహేతుకమైన కారణాలను పేర్కొనడం జరగలేదు. కాబట్టి ఈ పథకాలు మోటార్ వాహనాల చట్టంలో 68వ సెక్షన్ లోని క్లాజులకు అనుగుణంగా లేవని మేము నిర్ణయానికి వచ్చాము."

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in August 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *