Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
గౌరాబత్తిన కుమార్ బాబు
మునసబు నుండి రాష్ట్రపతి దాకా రాజకీయ ప్రస్థానం

ముఖ్యమంత్రిగా రెండవ టర్మ్లో సంజీవరెడ్డిగారి పరిపాలన సంగతులు :-

ప్రజాస్వామ్యంలో పురపాలకుల బాధ్యతలు :-

Social-Cultural-Club-Madras-Competition

నవంబర్ 11,1963న హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాధ్యక్షుల మండలి, ఆంధ్ర పురపాలక కమీషనర్ల సంఘం వారి ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ - పురపాలక సంఘాలను రద్దు చేయటం ప్రభుత్వానికి సరికాదని, ప్రజలకు పురపాలక సంఘంలో విశ్వాసం లేకుండాపోయి వారంతా ఏకగ్రీవంగా కోరినప్పుడే అటువంటి చర్య తీసుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న విశ్వాసం దెబ్బతినకుండా నడుచుకోవాలని పురపాలకాధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సహకారానికి ఎదురు చూడకుండా తమ ఆదాయాలను పెంచుకోవటానికి పురపాలక సంఘాలు కృషి చేయాలని కోరారు. అదే సమయంలో - ప్రజాస్వామిక సామ్యవాదం దేశం ఆశిస్తున్న లక్ష్యమని, వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతూ సామ్యవాద సమాజాన్ని సృష్టించడమే ఈ లక్ష్యమని సంజీవరెడ్డి గారు చెప్పారు.

ఆహార సమస్య గురించి శ్రీ సంజీవరెడ్డి హెచ్చరిక :-

1964 ఫిబ్రవరి 22న హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆహార ధాన్య వర్తకుల సమావేశంలో సంజీవరెడ్డిగారు చేసిన హెచ్చరిక నేటి తరానికి ముఖ్యంగా నేటి రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది.

ఆ సమావేశంలో శ్రీ సంజీవరెడ్డి ఈ విధంగా అన్నారు :- “ప్రజల ఈనాడు ఎదుర్కుంటున్న అతి తీవ్రమైన సమస్య ఆహార ధాన్యాల సమస్యే. కార్ల ఉత్పత్తి తగ్గినా లేక మరీ చెప్పవలెనంటే దేశంలోని ఫ్యాక్టరీలన్నిటినీ మూసివేసినా దాన్ని పెద్ద నష్టంగా భావించకపోవచ్చు గానీ, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గితే మాత్రం దాని వల్ల కలిగే నష్టం అత్యంత తీవ్రమైనది.  దేశంలో ఆహార సమస్య పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని క్షుధార్తులైన అశేష ప్రజానీకం వ్యాపారస్థులపైన, వారికి సంబంధించిన వర్గాలపైన తిరుగుబాటు చేయగలరు. దేశంలో ఈ విధమైన తురుగుబాటు/ విప్లవం సంభవిస్తే ఇక ప్రభుత్వమెక్కడిది? అప్పుడు ప్రభుత్వమూ ఉండదు, వ్యాపారస్తులూ ఉండరు, బ్యాంకులలో వారి నిల్వలూ ఉండవు. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఒకటే ఒకటి ఉన్నది, అది ఆహార ధాన్యాల దిగుమతితో అవసరం లేకుండా ఉండేంతగా ఉత్పత్తిని పెంచడమే. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అవసరం."

13 నవంబర్ 1963న రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు మాట్లాడుతూ: - "నేడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన నిష్పక్షపాతంగా లేదు. పై నుంచి క్రింది దాకా రాష్ట్ర స్థాయి నుండి జిల్లా పరిషత్తులు , పంచాయతీ సమితులు దాకా అంతా పక్షపాతంతో నిండి ఉంది. ముఖ్యంగా పంచాయతీ సహకార శాఖల నిర్వహణకు సంబంధించినంత వరకు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికార వికేంద్రీకరణ తరువాత పక్షపాతం ఒక లలితకళగా తయారయ్యింది " అని సంజీవరెడ్డిగారి ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఆయన ఇంకా ఇలా విమర్శించారు - "నేడు ఎక్కడ చూచినా ఒక అభిప్రాయం ప్రబలి ఉంది. ఓట్లు తమకు ఇచ్చిన వారికే పనులు జరుగుతాయనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి అనుచరులం అనుకునేవారు ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు" అని అన్నారు.

సంజీవరెడ్డి గారి హయాంలోనే "మసులీపట్నం" అని ఇంగ్లీష్ లో వాడుకలో ఉన్న బందరు పేరును "మచిలీపట్నం" గా మారుస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1963వ సంవత్సరంలో శ్రీ గోపరాజు రామచంద్రరావు హైదరాబాద్ లో ఆడంబర వ్యతిరేక సత్యాగ్రహం నిర్వహించారు. తరువాత నవంబర్ 1963 మొదటి వారంలో  విజయవాడ పటమటలో జరిగిన సర్వోదయ సేవకుల సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి చేసిన వాగ్దానం ప్రకారం గ్రీన్లాండ్స్ నుండి మరొక చిన్న గృహానికి మారకుంటే జనవరి నుండి సత్యాగ్రహాన్ని ద్విగుణీకృతం చేయడానికి తీర్మానించారు.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in July 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *