
తిరిగి జనవరి 1961లో సౌరాష్ట్రలోని సర్దార్ నగర్ లో జరిగిన 66వ కాంగ్రెస్ మహాసభలో సంజీవరెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
66వ కాంగ్రెస్ మహాసభలో సంజీవరెడ్డిగారు చేసిన అద్యక్షోపన్యాసంలో ముఖ్యాంశాలు: -
- భాషా, కుల, ప్రాంత, మత, వర్గ విభేదాలను విస్మరించి ప్రజలు సంఘటిత కృషి కావించకపోతే, దేశ సమైక్యతకు భంగం వాటిల్లగలదని సంజీవరెడ్డి గారు హెచ్చరించారు.
- ప్రాంతీయ మండలి కౌన్సిళ్లకు ప్రధానమైన అధికారాలివ్వడం వల్ల అంతర్రాష్ట్రీయ వివాదాలను పరిష్కరించి విచ్ఛిన్నకర ధోరణులను రూపుమాపగల అవకాశాలున్నవని కూడా సంజీవరెడ్డి గారు సూచించారు.
- నిస్స్వార్థం, నిజాయతీ గలవారు ఎన్నికలలో పోటీచేయడం మితిమీరిన ఖర్చుతో కూడి ఉన్నది. కనుక పరోక్షపు ఎన్నికల పద్ధతిని గురించి ఆలోచించాలని కూడా సూచించారు.
- కాంగ్రెస్ సంస్థను ఉత్తమ మార్గాలతో నడపడానికి ప్రస్తుతం పదవులలో ఉన్నవారు పది సంవత్సరాల పాటు అధికార విరమణ చేసి సంస్థ సేవలో నిమగ్నులు కావాలని శ్రీ సంజీవరెడ్డి అన్నారు. ప్రధాని నెహ్రూ వంటి వ్యక్తులు వారి అనుభవం దృష్ట్యా, వివేకం దృష్ట్యా పదవిలో ఉండి సలహాలివ్వవలసిన అవసరం ఉంది కానీ, ఈ సూత్రాన్ని పదవిలో ఉన్న వారందరికీ వర్తించరాదని ఆయన అన్నారు.
(ఇదే సూత్రాన్ని తరువాతి కాలంలో కామరాజ్ నాడార్ అమలుజేశారు. దీనినే కామరాజ్ పథకం అని అంటారు)
అఖిల భారత కాంగ్రెస్ 67వ మహాసభ జనవరి, 1962లో బీహార్ లోని శ్రీ కృష్ణపురంలో జరిగింది. సభకు అధ్యక్షత వహించడానికి సంజీవరెడ్డిగారు జనవరి 8, 1962న పాట్నా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.శ్రీ జగ్ జీవన్ రామ్ తదితరులు స్వాగతం పలికారు. ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షుని దర్శనం కోసం జనం తండోపతండాలుగా వచ్చారు. రైల్వేస్టేషన్ నుండి స్వాతంత్ర సమరయోధుల స్మృతి చిహ్నం వరకు సుమారు మైలు పొడవు ఊరేగింపు జరిగింది.'సంజీవరెడ్డి జిందాబాద్' అని నినాదాలు చేస్తున్న ప్రజల ఆదరాభిమానాలను ముకుళిత హస్తాలతో సంజీవరెడ్డిగారు స్వీకరిస్తూ ఊరేగింపుతో సాగిపోయారు. శ్రీ సంజీవరెడ్డిగారికి ఆ రోజు లభించిన ఘన స్వాగతంలో సుమారు రెండు లక్షలమంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పట్ల వ్యతిరేకత కనబరచిన సంజీవరెడ్డి :-
సంజీవరెడ్డి గారు 67వ కాంగ్రెస్ మహాసభలో మాట్లాడుతూ :- "ఇటీవల సంభవించిన జాతి విభేదాలు, భాషావాదాలు అనేక రకాల జాతి వైరుధ్యాలకు, సమాజ వ్యతిరేక ఉద్యమాలకు మార్గమయ్యాయి. వీటిని మనం సమూలంగా నిర్మూలించాలి.మళ్ళీ తెలెత్తనివ్వరాదు. ఇవి ప్రజలలో అవాంఛనీయమైన ఉద్రేకాలకు దారి తీయడమే కాక ప్రస్తుతం మన దేశానికి అవసరమైన ఆర్ధిక పురోగతిని కూడా దెబ్బతీస్తాయి. ప్రజలలో ప్రాంతీయ దృక్పథం జొనిపి,వారిలో తమ తమ స్థానిక ప్రాంతీయ అవసరాలను , భాషా ప్రయుక్త విషయాలను రేకెత్తిస్తే జాతీయ దృక్పథం వైపు వారిని తిప్పడం, దేశ సమైక్య బాధ్యతను వారి భుజాలకు ఎత్తడం కష్టమవుతుంది. నిజమే, 40సంవత్సరాల క్రితం కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదాన్ని బలపరచింది. 1945,46 నాటి ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ దేశంలోని ప్రతి ప్రాంతం ఆయా సంస్కృతి, భాష మున్నగు వాటిని పెంపొందించుకుంటూ స్వేచ్చాయుతంగా ప్రత్యేక రాష్ట్రాలుగా మనగలగాలని పేర్కొన్నాము కూడా. అయితే దేశంలోని ప్రాంతాలుగా అవి నాడు చెప్పబడ్డ సత్యాన్ని విస్మరించరాదు. విస్తృతమైన దేశమనే ఛట్రంలోనే ఇమిడి ఈ రాష్ట్రాలు పెంపొందాలి అన్నది ముఖ్యమైనది. నిజమే, తన భాష,తన రాష్ట్రం, తనది అనే దాంట్లోని గొప్పను సగర్వంగా చెప్పుకునే హక్కు అందరికీ ఉంటుంది. దాన్ని ఎవరూ కాదనరు. అయితే దానికి కొన్ని అవధులున్నాయి. అవి గుర్తించాలి. తార్కిక దృక్పథంతో ఆలోచిస్తే మనం దేశం మొత్తం మీద ప్రయోజనకరమైన దృక్పథాన్ని అలవరచుకోవాలన్నది స్పష్టమవుతుంది. దేశానికి అవసరమైన సేవ చేసినపుడే భాషా ప్రయుక్త రాష్ట్రాలు సార్ధకత పొందుతాయి. అందుకు మారుగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉద్రేకాలను రేకెత్తించేవిగా పెంపొందుతూ ఉంటే వాటిని తీసివేయాల్సిందే" అని అన్నారు.
నాటి ద్రావిడ కళగం, ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క వేర్పాటు వాదమే, సంజీవరెడ్డి గారితో ఈ మాటలు మాట్లాడించి ఉంటుంది. నెహ్రూ గారు సహితం ద్రావిడ కళగం చేష్టలు ఆదివాసుల వికృత చేష్టల కన్నా హీనమని అన్నారు. మన తరంలోనే మొదలై, కొనసాగి, ముగిసిన తెలంగాణ ఉద్యమం స్వభాషీయల మధ్యే ఎంతటి అగాధాన్ని సృష్టించిందో చూశాం. మనం అందరం మొదట భారతీయులం, తరువాతనే తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ మొదలగు భాషలకు చెందిన వారం అని ప్రతియొక్క భారతీయుడు తన మనోఫలకం మీద ప్రతిష్టించుకోవాలి.
****సశేషం****
అవతరణి – రచయిత మనో నేత్రం
నేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.
నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.
నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.
ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.
అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు