Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
గౌరాబత్తిన కుమార్ బాబు
మునసబు నుండి రాష్ట్రపతి దాకా రాజకీయ ప్రస్థానం

అఖిల భారత కాంగ్రెస్ 65వ మహాసభ జనవరి 16, 1960న బెంగళూరు సదాశివనగర్ మైదానంలో ప్రారంభమైంది. ఈ మహాసభల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుండి సంజీవరెడ్డి గారు అధ్యక్ష పదవి స్వీకరించారు. సభాస్థలికి సంజీవరెడ్డిగారు శ్రీ నెహ్రూ మరియు ఇతర వర్కింగ్ కమిటీ సభ్యులతో కలసి ఊరేగింపుగా వచ్చారు. బెంగుళూరు కాంగ్రెస్ లో సంజీవరెడ్డి గారికి ఘనమైన సన్మానం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ సహితం సంజీవరెడ్డికి జై అన్నారు.

సంజీవరెడ్డి గారి అధ్యక్ష ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు :-

  1. భారత్, చైనాల సరిహద్దు వివాదం పట్ల భారత కమ్యూనిస్టుల వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ ప్రభుత్వం పట్ల, దేశం పట్ల భక్తి విశ్వాసాలు ప్రదర్శించే విషయంలో భిన్నాభిప్రాయానికి తావే లేదని, ప్రతి పౌరునిలో దేశం పట్ల భక్తి విశ్వాసాలు సహజంగా ఉండి తీరాలని అన్నారు.
  2. కమ్యూనిస్ట్ ప్రభుత్వ హయాంలో కేరళ ప్రజలకు కలిగిన ఇక్కట్ల బట్టియేమి, భారత భూభాగంపై చైనా జరిపిన దురాక్రమణల పట్ల భారత కమ్యూనిస్టులు ప్రదర్శించిన వైఖరి బట్టియేమి, సరిహద్దులలోనే గాక దేశంలోని ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ నిరంతరం అప్రమత్తత అవసరమని హెచ్చరిక జారీచేశారు.
  3. స్వాతంత్ర సమర కాలంలో కాంగ్రెస్ సంస్థలో వెల్లివిరిసిన స్వయం సహాయ ధోరణి, త్యాగ బుద్ధి అంతరించి అధికారం, పదవుల పట్ల వ్యామోహం పెరిగినవని విచారం వెలిబుచ్చుతూ, కాంగ్రెస్ సంస్థ సమర్థతతో శక్తివంతంగా పని చేయగలుగుటకై క్రమశిక్షణారాహిత్యాన్ని తీవ్ర చర్యలతో అరికట్టాలని ఉద్ఘాటించారు.
  4. వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల ఇండియా వంటి దేశంలో వ్యవసాయం ప్రధాన పాత్రను వహించక తప్పదు. వ్యవసాయోత్పత్తులను హెచ్చించడం ద్వారానే పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోగలము. పారిశ్రామికాభివృద్ధి ద్వారానే మనము అంతిమంలో దారిద్య్ర నిరుద్యోగాలను నిర్మూలించగలము. కావున వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండింటిలోనూ ఒకేసారి మనము అభివృద్ధి సాధించాలి. ఇవి రెండు పరస్పర పోషకాలు.
  5. ప్రపంచంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా గల ప్రతి దేశంలోనూ వ్యవసాయాభివృద్ధికి సహకార పద్ధతిని అనుసరించడం అత్యవసరమని గుర్తించారు. చిన్న చిన్న కమతాలు గల ఇండియాకు ఈ విధానం మరింత ప్రయోజనదాయకం. భారతదేశంలో ప్రతి గ్రామానికీ ఈ సహకారోద్యమాన్ని విస్తరింపజేయాలి.
  6. స్వతంత్ర పార్టీ అవతరణను ప్రస్తావించి శ్రీ సి.రాజగోపాలాచారి పట్ల తమకు ఈనాటికీ గౌరవాభిమానాలున్నాయనీ, అలాంటి వ్యక్తి తన జీవిత ప్రథమ భాగంలో ఏ ఆదర్శాల కోసం,ఆశయాల కోసం నిలబడ్డారో ఆ ఆదర్శలకే భిన్నమైన పార్టీని నెలకొల్పటం దురదృష్టమని శ్రీ సంజీవరెడ్డి అన్నారు. ఆ కొత్త పార్టీకి సిద్ధాంతపు పునాదులు లేవనీ,అస్పష్టమైన సూత్రాలు తప్ప నిర్దిష్టమైన కార్య విధానం లేదని అన్నారు.
  7. హిందీకి,ఇతర ప్రాంతీయ భాషలకు కల వివాదం పెద్దది కావడం దురదృష్టకరం. ఇంగ్లీష్ నుంచి హిందీకి మారటం కంటే, ఇంగ్లీష్ నుంచి ప్రాంతీయ భాషలకు మార్పు చెందడం చాలా ప్రధానమని ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. రాష్ట్రాల మధ్య , కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించినంత వరకు హిందీ ప్రవేశంతో కష్టనష్టాలకు గురి అయ్యేవారు కోరేటంత వరకు ఇంగ్లీష్ కూడా ఉంటుందని ప్రధానమంత్రి ఇచ్చిన హామీ ఈ విషయంలోని భయాలను నివృత్తి చేస్తుంది. ఏది ఏమైనా, జాతి గౌరవం, ఆత్మ గౌరవం కోసం మనమందరం కలసి ఒక భారతీయ భాషను పెంపొందించుకోవడం మాత్రం అవసరం. దేశంలోని అత్యధికులు మాట్లాడే భాష మాత్రమే అందుకు అనువైనదనడంలో సందేహం లేదు. అలాంటి భాష హిందీ. యూరోప్ ఖండంలోని అనేక జాతుల ప్రజలు నివసిస్తున్న అమెరికాలో కూడా వారందరూ కలసి ఒకే సాధారణ భాషను అంటే ఆంగ్లాన్ని ప్రవేశపెట్టుకుని అనుసరిస్తున్నారు. అలాగే మనమంతా ఒక జాతిగా ఉన్నంత కాలం మనకూ మన జాతీయ భాష ఒకటి ఉండాలి. హిందీ తప్ప మరొక భాష జాతీయ భాష కాజాలదు. అయితే ఈ మార్పు మాత్రం త్వరగా జరగరాదు. ఈ మార్పు మూలంగా ప్రజలలో ద్వేషం, వైరభావం ప్రబలరాదు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంజీవరెడ్డిగారి మొదటి టర్మ్లోనే కేరళ, ఒరిస్సా రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేశారు.

కేరళ రాష్ట్రం ఏర్పడ్డాక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్రీ నంబూద్రిపాద్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. నంబూద్రిపాద్ గారి ప్రభుత్వం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలను జాతీయం చేసే బిల్లు, భూసంస్కరణల బిల్లులను ప్రవేశపెట్టింది. వీటికి వ్యతిరేకంగా కాథలిక్ చర్చి, కేరళ నాయర్ సర్వీస్ సొసైటీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ "విమోచన సమరం" పేరిట ఉద్యమాన్ని నడిపాయి.ఇందువలన రాష్ట్రంలో చెలరేగిన అశాంతిని కారణంగా చూపుతూ నెహ్రూ ప్రభుత్వం నంబూద్రిపాద్ గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది.ఈ రద్దు వెనుక అమెరికా హస్తం ఉందని కూడా విస్తృత ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించిన వెంటనే ఎదుర్కోవాల్సి వచ్చిన కేరళ రాజకీయ సంక్షోభం గురించి సంజీవరెడ్డి గారి మాటల్లో :-

"భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించిన వెంటనే కొబ్బరి తోటలతో, అరటి తోటలతో అందాలు చిందే కేరళ రాష్ట్ర సీమకు నేను పరుగులు తీసి, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై కమ్యూనిస్ట్ ప్రభుత్వం విసిరిన సవాలును ఎదుర్కొనవలసిన అవసరం ఏర్పడింది. నేను కేరళ రాష్ట్రంలో ఎదుర్కొనవలసి సమస్య కత్తి మీద సాము వంటిది.ఆ తరువాత అక్కడ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలుపొందింది. మన దేశ ప్రజలు స్వతస్సిద్ధంగా ప్రజాస్వామ్యతత్వం గలవారనే విషయాన్ని కేరళలో రుజువు చేసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఏర్పడింది కూడా."

సంజీవరెడ్డి గారి ముందర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన ఇందిరాగాంధీ గారి అధ్యక్షత గురించి కొంత చర్చించడం అవసరం.

సోషలిస్ట్ తరహా సమాజ స్థాపనాశయాన్ని చేపట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ధేబరైతే, ఆ ఆశయానికి సంబంధించి విప్లవ నినాదాన్నిచ్చి దేశాన్ని ఆలోచనలో, అలజడిలో ముంచింది శ్రీ ఇందిరాగాంధీ అధ్యక్షత.  ఇందిరమ్మ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాకుంటే కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పోయేది కాదు; బొంబాయిని భాషా ప్రయుక్తంగా విభజించాలనే నిర్ణయం జరిగేది కాదు;టిబెట్ విషయంలో చైనాకు వ్యతిరేకంగా నెహ్రూ విధానం అంత కరకుగా ఉండేది కాదు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆశయపరంగా ప్రజాస్వామ్య సామ్యవాద వర్గాలకు కాంగ్రెస్ నెలవు అనే అభిప్రాయం గాఢంగా కలిగింది నాగపూర్ కాంగ్రెస్ తర్వాతనే. రాజకీయంగా నిర్దుష్టమైన పార్టీలేర్పడే అవకాశం ఇందిరమ్మ అధ్యక్షతలోని కాంగ్రెస్ కల్పించింది. నాగపూర్ కాంగ్రెసే స్వతంత్ర పార్టీ ఏర్పాటును త్వరితపరచిందని విశ్లేషకుల అభిప్రాయం. స్వతంత్ర పార్టీ ఏర్పాటుకు సమాధానంగా సంజీవరెడ్డి గారి ఎన్నిక జరిగిందని కూడా అప్పట్లో వదంతులు వచ్చాయట.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in February 2025, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!