Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
గౌరాబత్తిన కుమార్ బాబు
సంజీవరెడ్డి గారి ముఖ్యమంత్రిత్వము

శాసనమండలి ఏర్పాటులో సంజీవరెడ్డి గారి ప్రభుత్వ చొరవ :-

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటు చెయ్యాలని, ఇందుకు తగు శాసన నిర్మాణానికి పూనుకోవాలని పార్లమెంట్ కు సిఫారసు చేసే నిమిత్తం 4 డిసెంబర్ 1956న సంజీవరెడ్డి గారు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఆ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సంజీవరెడ్డి గారు ఇలా అన్నారు :-

"ఎన్నికలకు విముఖత చూపే పెద్దలు శాసన నిర్మాణ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలుగా ఎగువ శాసనసభ ఉపయోగపడుతుంది. ఇందువల్ల వివిధ రంగాల్లోని ప్రవీణుల సలహాలు పొందడానికి కూడా వీలవుతుంది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సులలో కూడా ఇట్టి ఎగువ సభలున్నాయంటే వీటి ప్రయోజనాలేమిటో ఊహించుకోవచ్చు."

ఈ తీర్మానాన్ని పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ నాయకుడు దేశ్ పాండే వ్యతిరేకిస్తూ, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలు పరచ వలసి ఉండగా, ఈ అదనపు ఖర్చును రాష్ట్రం భరించలేదని అన్నారు. ఎన్నికలకు ముందుగా ఎగువ సభను ఏర్పాటు చేయవలసిన అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది, జూలై,1958 నుండి శాసనమండలి అమలులోకి వచ్చింది.

దామోదరం సంజీవయ్య గారితో సంజీవరెడ్డి గారి సంబంధాలు :-

సంజీవరెడ్డి గారి మొదటి మంత్రి వర్గంలో సంజీవయ్య గారు కార్మిక శాఖా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సంజీవయ్య ఉన్నపుడు సంజీవరెడ్డి గారితో వారి సంబంధాల గురించి పోతుకూచి సాంబశివరావు గారి తన "సంజీవయ్య సందర్శనం"లో ఈ విధంగా రాశారు :-

"ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సంజీవయ్య ఉన్నపుడు మొదటి రోజుల్లో సంజీవయ్య, సంజీవరెడ్డి బాగా కలసిమెలసి ఉండేవారు. కానీ కాలక్రమంలో సంజీవరెడ్డి కులాభిమానానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇరువురూ క్రమంగా దూరమయ్యారు. తిమ్మారెడ్డి, సంజీవయ్య ఆంధ్రరాష్ట్రంలో చాలా సన్నిహితులుగా ఉన్నా క్రమంగా ఆంధ్రప్రదేశ్ లోని రెడ్డి వర్గాల వైషమ్యాల వల్ల సంజీవయ్య కొంత దూరమయ్యారు. సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణా జిల్లాల్లోని రెడ్లకు ఆయన ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేవారు. పరిపాలనా విషయాల్లో సంజీవయ్య ప్రతిపాదించిన కేసులను సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా తిరస్కరించేవారు. 'కలం చేతిలో ఉంటే సరిపోయిందా, రీజనో, రైమో ఉండొద్దా' అని సంజీవయ్య సంజీవరెడ్డిని విమర్శించేవారు. కాలక్రమంలో సంజీవరెడ్డి, సంజీవయ్య బద్ధ శత్రువులుగా మారిపోయారు".

రాజకీయ విలువలు ఉన్నతంగా ఉన్న ఆ రోజుల్లో కూడా గొప్ప నాయకులకు సహితం తమ కులానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. ఈ విపరిణామం భారతీయ సమాజంపై కులం యొక్క ప్రభావం గురించి తెలుపుతుంది. కులమన్నది ఓ మహమ్మారి అనడంలో సందేహం లేదు.

1960లో సంజీవరెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంజీవరెడ్డి గారికి ఇది ఇష్టం లేకపోయినా అధిష్టాన వర్గం ఆదేశాలకు తలొగ్గారు. వాస్తవానికి అల్లూరి సత్యారాయణ గారే తన రాజకీయ చతురతతో ఢిల్లీ వర్గాలలో సంజీవరెడ్డి గారి గురించి చెప్పవలసినవి చెప్పి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయించారంటారు. సంజీవరెడ్డి గారి తరువాత ముఖ్యమంత్రి కావడానికి అల్లూరి ప్రయత్నించారు. ఈ ప్రతిపాదనను సంజీవరెడ్డి గారు హర్షించలేదు. అల్లూరి గారు ముఖ్యమంత్రి కారాదని సంజీవరెడ్డి గారు పట్టుబట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. సంజీవరెడ్డి గారు తన వారసుడిగా బ్రహ్మానందరెడ్డి గారిని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఏ.సి.సుబ్బారెడ్డి గారితో సహా అనేక మంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు రాజీ అభ్యర్థిగా అధిష్టానం సంజీవయ్య గారి పేరును పైకి తెచ్చింది. అల్లూరి, బోయి భీమన్న గార్లు సంజీవయ్య హరిజనుడు గనుక ఆయనను ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక గౌరవం దక్కుతుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అల్లూరి గారే స్వయంగా వెళ్లి సంజీవయ్య ముఖ్యమంత్రి కావడానికి ఇందిరాగాంధీని ఒప్పించారు. సంజీవయ్య గారి పేరు కూడా సంజీవరెడ్డి గారికి ఇష్టం లేదట, కానీ కొందరి రాజకీయ పెద్దల జోక్యంతో ఎంతైనా సంజీవయ్య పరాధీనుడు అన్న భావంతో చివరకు ఆయన పేరును ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకున్నారట.

11 జనవరి 1960న సంజీవయ్య గా ముఖ్యమంత్రిగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ :-

"మనమందరమూ ఆశించిన విధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పక్ష నాయకునిగా సమర్ధుడు, యువకుడు, హరిజనుడు ఐన సంజీవయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకుని భారతదేశంలో మనము ఆదర్శమైన విధంగా ప్రవర్తించగలిగామని చెప్పడానికి గర్విస్తున్నాను. ఆంధ్ర ఏర్పడిన ఐకమత్యం తాత్కాలికంగా ఏర్పడినది కాదు అని మనం ఇతరులకు నిరూపించగలిగాము. సంజీవయ్య నాయకుడిగా ఎన్నికైనందుకు నాకు కలిగిన ఆనందము మరెవరికీ కలిగి ఉండదని చెబుతున్నాను. సంజీవయ్య నిక్కచ్చి మనిషి, మచ్చలేని మనిషి. యువకుడు, ఉత్సాహవంతుడు. దాదాపు మంత్రిగా పదేళ్ళ పాలన నిర్వహించినాడు. ఈ బాధ్యతను నిర్వహించడానికి తగిన శక్తిని, బలాన్ని సంజీవయ్యకు ఇవ్వాలని దైవాన్ని కోరుతున్నాను. సహనాన్ని భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుతున్నాను. సంజీవయ్య అదృష్టవంతుడు, అదృష్ట జాతకుడు. పోటీలేకుండా ఎన్నుకోబడ్డాడు. ఆయనకు మనమంతా కలసి హృదయపూర్వకమైన సంపూర్ణ సహకారం ఇవ్వాలి".

కానీ సంజీవయ్య గారి హయాంలో వారి పట్ల సంజీవరెడ్డి గారు చాలా వ్యతిరేకత కనబరిచారు. "గుర్రం ఎక్కితే కళ్లెం పట్టే శక్తి ఉండాలి" అని సంజీవరెడ్డి గారు సంజీవయ్య పై వ్యాఖ్యానిస్తూ ఎత్తిపొడిచారు.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in December 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!