Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
గౌరాబత్తిన కుమార్ బాబు
సంజీవరెడ్డి గారి ముఖ్యమంత్రిత్వము

విద్యుద్దీకరణ :-

సంజీవరెడ్డి గారు ఉపముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గ్రామాలు, పట్టణాల విద్యుధీకరణ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. మా ఊరు వెంకటగిరిలో కూడా సంజీవరెడ్డి గారి చేతులు మీదుగానే విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డును 1959లో ఏర్పరిచారు. వాస్తవానికి పరిమిత అధికారాలతో ఎలక్ట్రిసిటీ బోర్డును ఏప్రిల్ 1 1958 నుంచే నియమించడానికి జనవరి 6,1958న సంజీవరెడ్డిగారి ప్రభుత్వం నిశ్చయించింది. ప్రారంభంలో ఈ బోర్డుకు వివిధ విద్యుచ్ఛక్తి సరఫరా సంస్థల నిర్వహణ, సమీప ప్రాంతాలకు సరఫరా విస్తరణ కార్యక్రమం అప్పగించారు. తరువాత పనితీరు ఆధారంగా ఉత్పత్తి, సరఫరా పంపిణీ బాధ్యతలు ఈ సంస్థకే అప్పజెప్పారు. తరువాత పనితీరు ఆధారంగా ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు ఈ సంస్థకే అప్పజెప్పారు. 1998లో చంద్రబాబు గారి విద్యుత్ సంస్కరణల అమలులో భాగంగా ఎలక్ట్రిసిటీ బోర్డును జెన్కో, ట్రాన్స్కో మరియు నాలుగు పంపిణీ సంస్థలుగా విభజించారు. సంజీవరెడ్డి గారు పవర్ స్కీంల విషయంలో ఆంధ్రప్రదేశ్ మైసూరు, మద్రాసు రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉందని, వాటి వేగాన్ని పదిరెట్లు పెంచాలని ఆరాటపడేవారు.

సింగరేణి గనుల సందర్శన :-

ఆగస్టు, 1957లో సంజీవరెడ్డి గారు దక్షిణ భారతంలో కల్లా పెద్దవైన సింగరేణి బొగ్గు గనులు చూసేందుకు వెళ్లారు. వేలాది కార్మికులు బారులు తీర్చి నిల్చుని ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రి కార్మికుల మధ్యకు వెళ్లి వారి యోగక్షేమాలను విచారించారు. కార్మికులు మా వాడకు వచ్చి మా సంగతులు సందర్భాలు స్వయంగా తెలుసుకోండి అని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నలభై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నానని ఓ ఉద్యోగి చెప్పగా "ఓ అట్లాగా నేనింక రెండు సంవత్సరాలకు పుడతాననగా నువ్వు ఈ ఉద్యోగంలో చేరావన్న మాట" అని ముఖ్యమంత్రి అనగా అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు.

భారతదేశానికి ఆంధ్రప్రదేశ్  "అన్నపూర్ణ" కావాలి - సంజీవరెడ్డి కోరిక  :-

మే 18, 1957న హైదరాబాద్ లో పంటల పోటీలలో గెలుపొందిన రైతులకు బహుమతులను ఇస్తూ సంజీవరెడ్డి గారు ఇలా అన్నారు :- "ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించాలి. ఎక్కువగా పంటలు పండించేందుకు కృషి చెయ్యాలి. యావత్ భారత దేశానికి ఆంధ్ర ప్రదేశ్ అన్నపూర్ణ కాగలదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సౌకర్యాలను రైతులు వినియోగించుకోవాలి. పంటల పరిశోధన ఇంకా బాగా జరగవలసి ఉన్నది. ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయం పోషకంగా తయారుకావాలి. ఎకరానికి 75 బస్తాల ధాన్యం రైతు పండించగలిగాడంటే అంతకంటే సంతోషించ తగ్గ సంగతి మరేమీ  ఉంటుంది?"

ఈ మాటలు సంజీవరెడ్డి గారి దార్శనికతకు, వాస్తవిక దృక్పథానికి అద్దం పడుతున్నాయి. నేడు వ్యవసాయం చేయడానికి రైతులు జంకుతున్నారు. ఆహార ధాన్యాలు ఎక్కువగా పండే విధంగా చూడాల్సిన ప్రభుత్వాలు భూమిని మార్కెట్లో వస్తువుగా మార్చేస్తున్నారు.

భూసంస్కరణలు :-

ముఖ్యమంత్రి హోదాలో సంజీవరెడ్డి గారు మే19 1957న భూ సంస్కరణల గురించి మాట్లాడుతూ "రైతు తాను పండించుకునే దానితో పొట్ట నింపుకోవడమే కాక బిడ్డలకు చదువు కూడా చెప్పించుకోవాలి. అందుకు సాలుకు మూడు నాలుగు వేల రూపాయలు కావాలి. దాన్ని బట్టి మనం కనీస పరిమితి అనే దానిని నిర్ణయించాలి" అని అన్నారు. “పెద్ద కమతాలున్న భూస్వాములు ఆంధ్రలో ఏ కొద్ది వందల మందో ఉంటారు. భూసంస్కరణల వల్ల ఆంధ్రలో వచ్చే పెద్ద మార్పేమీ నాకు కనిపించడం లేదు. వ్యాపారులను అరికట్టకుండా ఒక్క రైతుల ఆస్తికి మాత్రం హద్దు నిర్ణయించాలనుకోవడంలోని సబమేమిటో కూడా ఆలోచించాలి. ఏమి సంస్కరణలు తెచ్చినా, జాగ్రత్తగా ఆలోచించి తీసుకురావాలి" అని అన్నారు.

సంజీవరెడ్డి గారు వెలిబుచ్చిన ఈ అభిప్రాయాల గురించి జమీన్ రైతు పత్రిక మే 24 1957 సంచికలో తీవ్ర విమర్శ వచ్చింది.

"భూసంస్కరణలు కావాలంటే, శ్రీ సంజీవ రెడ్డి నే నాయకుడిగా ఎన్నుకోవాలని, గత సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో ఆయన అనుచరులు, సహచరులు, ముఖ్యంగా శ్రీ అల్లూరి సత్యారాయణ రాజు ప్రభృతులు ఇచ్చిన నినాదాలలో ఒకటి. శ్రీ గోపాలరెడ్డి, ఆయన్ను బలపరుస్తున్న మాజీ కృషికార్ లోక్ పార్టీ వారు భూస్వాములనీ, లేక వారి ఏజంట్లనీ రాష్ట్రమంతా ప్రచారం జరిగింది. కానీ నిన్నటి పత్రికా విలేఖరుల సమావేశంలో ఈ సమస్య పట్ల ముఖ్యమంత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏ భూస్వామ్య ఏజెంట్ భావాలకూ తీసిపోవు. ఆయన ధోరణి చూస్తుంటే ఆంధ్రలో అసలు భూసంస్కరణల సమస్యే" అని రాశారు.

వాస్తవానికి 1952 మరియు 1955 ఎన్నికల సమయంలో ఆంధ్రలో భూసంస్కరణలు తెస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. సంజీవరెడ్డి గారి కేబినెట్ లో భూసంస్కరణల మంత్రిగా ఉన్న కళా వెంకట్ రావు గారు అంతకు ముందు నెలలోనే మూడు నెలల్లో సమగ్రమైన భూసంస్కరణల బిల్లును ప్రతిపాదిస్తామని శాసనసభలో ప్రకటించారు.

జమీన్ రైతు పత్రికలో ఇంకా ఇలా రాశారు :-

"ముఖ్యమంత్రి అన్నట్టు మన రాష్ట్రాల్లో పెద్ద కమతాలు ఉన్న రైతులు కొన్ని వందల మంది కావచ్చును. అంత మాత్రంతో భూమి సమస్య అంటూ లేదని ఎట్లా అనడం? జమిందారీ రద్దుతోనే పరోక్షపు భూస్వామ్యత్వం(Absentee Landlordism) అన్ని రూపాలలో నశించిందా? సామ్యవాద సరళి సమాజమనే లక్ష్యానికనుగుణంగా మన నేటి గ్రామ ఆర్థిక సాంఘిక వ్యవస్థ ఉన్నదా? వరుసగా పెక్కు సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్న రైతుకు స్వామ్యపు హక్కులు ఉన్నాయా? గ్రామాలలో తమ పొలాలను కౌలుకు ఇచ్చుకుని పట్టణాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారెంత మంది లేరు? వీరందరూ కొంత వ్యవధిలోగా వ్యవసాయానికి పూనుకోకపోతే వీరికి గల భూ యాజమాన్యాన్ని తొలగిస్తే వీరిలో చాలా మంది ఆదిలో కొంత ఇబ్బందులకు లోనైనప్పటికీ అట్లా చేయడమే సామ్యవాద సూత్రాల దృష్ట్యా న్యాయం కాదా? అందరికీ గిట్టుబాటయ్యే పరిణామంలో భూములను పంచడమే భూసంస్కరణల ఉద్దేశమనుకుని, అందుకు చాలినంత భూమి దేశంలో లేదు కాబట్టి సంస్కరణల అమలు అవసరం లేదనడం అర్ధరహితమే కదా. పరిశ్రమల అభివృద్ధితో ఈనాడు భూమిపై ఆధారపడుతున్న పెక్కు మంది ఇతర వృత్తులను అవలంబిస్తారు. దానికి తోడు పరోక్షపు భూస్వామ్యంను తొలగిస్తే ఇక వ్యవసాయం చేసుకునే వారికే భూమి అవసరం ఉంటుంది. అప్పుడు ఉన్న భూమిని వారికి పంచవచ్చు. గత రెండు శతాబ్దాలలో చరిత్రకమైన పెక్కు కారణాల వల్ల ఒక్క భూమికే నిలకడైన ఆర్థిక విలువ ఏర్పడి, ఏదో రూపంలో భూమి పొంది ఉండాలన్న ధోరణి ప్రజలలో కలిగింది. ఆర్థికంగా దేశం సర్వతోముఖాభివృద్ధి జెందినపుడు ఈ ధోరణి సన్నగిల్లుతుంది. మన వ్యవసాయ వ్యవస్థకు గట్టి పునాదులు ఏర్పడి ఉత్పత్తి హెచ్చాలంటే ఇట్లా జరగక తప్పదు కూడా. అప్పటికే సమస్య పరిష్కారం కాకపోతే వినోబాజీ, జయప్రకాష్ గార్లు ప్రబోధిస్తున్నట్లుగా భూమిని గ్రామీకరణే చేయవలసి ఉంటుందేమో!"

సంజీవరెడ్డిగారి ప్రభుత్వం జూన్, 1958లో ఆంధ్ర ప్రదేశ్  భూ సంస్కరణల బిల్లును తయారు చేసి చిత్తు ప్రతిని కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించింది. అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్న శ్రీ పి. తిమ్మారెడ్డి భూసంస్కరణల వల్ల ఆహారోత్పత్తికి దెబ్బ అని, గరిష్ట ప్రమాణ నిర్ణయం అన్యాయమని, సహకార వ్యవసాయం ఆచరణ సాధ్యం కాదని అన్నారు. జూన్ 19న సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ వ్యక్తిగతమైన భావాలు ఎలా ఉన్నా, ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రులందరూ కట్టుబడి ఉండవలసిందే అన్నారు. 1961లో ఆంధ్రప్రదేశ్ భూ పరిమితి చట్టం అమలులోకి వచ్చింది.

'ఇక ఒకే నిద్రలే' - సంజీవరెడ్డి గారితో ప్రకాశం పంతులు: -

మే 21,1957న శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు అస్తమించారు. ఆ సందర్భంగా సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ :- "మొన్న వారిని చూసి పంతులు గారూ! బాధపడుతున్నారల్లే ఉంది" అని అన్నాను. వారు "ఇక ఒకే నిద్రలే! పరవాలేదు" అని అన్నారు. "వారికి పద్మవిభూషణ్ బిరుదునివ్వాలని మేము ఢిల్లీకి రాశాము. ఇంతకూ పంతులు గారికి బిరుదులెందుకూ!" అని అన్నారు. సంజీవరెడ్డి గారు ఇంకా ఇలా అన్నారు :- "ఆంధ్రకేసరి ఇకలేరు. వారిని ఇక చూడము. వారి జీవిత గాథలు వేలకు వేలున్నాయి. సంవత్సరాల తరబడి వాటిని మనం చెప్పుకుంటాము. వారు స్వార్ధరాహిత్యం పొందిన మహనీయులు. వారి అంశలో మనకు ఏ కొంత లభించినా మనం ధన్యులమే".

ప్రజల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి గురించి అక్టోబర్ 31, 1957న శాసనసభలో :-

"పోలీసు స్టేషన్ల దగ్గరే ఖూనీలు జరుగుతుంటే, ఇంకా ఎక్కువ పోలీసు స్టేషన్లు పెట్టినంత మాత్రాన ఖూనీలు ఆగుతాయా? పోలీసు స్టేషన్లు ఖూనీలు జరగకుండా ఆపలేవు" అని సంజీవరెడ్డి గారన్నారు. ఈ సందర్భంగా విలేఖరుల నుండి ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, అనంతపురం జిల్లాలో తరచూ ఖూనీలు జరుగుతాయని,తన సొంత జిల్లా గురించి సంజీవరెడ్డి గారు వాపోయారు.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in November 2024, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!