Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
-- గౌరాబత్తిన కుమార్ బాబు --
శ్రీ నీలం సంజీవరెడ్డి జీవితచరిత్ర
(మునుసబు నుండి రాష్ట్రపతి స్థాయిదాకా రాజకీయ ప్రస్థానం)

సంజీవరెడ్డి గారు మొదట్లో పట్టాభి గారి వర్గంలో ఉంటూ ప్రకాశం గారికి వ్యతిరేకంగా పని చేసినా వ్యక్తిగతంగా ప్రకాశంగారంటే చాలా గౌరవంతో ఉండేవారు. బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత కొన్ని నెలలకు తపాలా శాఖకు సంబంధించిన ఏదో కార్యక్రమం కోసం విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది. ఆ సభలో ఉపన్యసిస్తూ సంజీవరెడ్డి గారు ఇలా అన్నారు :-

"నేను ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపముఖ్యమంత్రిగా ఉండేవాడిని. ఇప్పుడూ ఉపముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పటి మాటకేమిలేండి, చేస్తే ప్రకాశంగారితోనే కలసి పని చేయాలి. ఆ వేగం, ఆ కార్య దీక్ష, ఆ ప్రజా సంక్షేమ ప్రేమ - మరే ముఖ్యమంత్రి పరిపాలనలోనూ కలుగవు అని నా మనస్సులో నిశ్చయమైపోయింది."

అలానే సంజీవరెడ్డి గారి సొంత ఊరైన ఇల్లూరులోని వారి ఇంట్లో ఆయన పడక కుర్చీకి దగ్గర ఉన్న గోడకు ఆయనకు ఇష్టమైన రెండు ఫొటోలు  తగిలించి ఉండేవి. ఒకటి ప్రకాశం పంతులు గారితో సంజీవరెడ్డి గారు ఉన్నది. మరొకటి నెహ్రూగారితో సంజీవరెడ్డిగారి కుటుంబం మొత్తం కలసి ఉన్నది.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తరువాత నెహ్రూ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1953 డిసెంబర్ నెలలో జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని నియమించింది. 1955వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఫజల్ అలీ కమీషన్ తన రిపోర్టును సమర్పించింది.

అనేక అంశాలను పరిశీలించిన తరువాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతాన్ని ప్రస్తుతానికి ప్రత్యేక రాష్ట్రంగా ఉంచుతూ 1961లో జరిగే సార్వత్రిక ఎన్నికల తరువాత, ఒకవేళ తెలంగాణా అసెంబ్లీలో రెండు వంతుల మంది శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్రంతో కలసిపోతామని తీర్మానిస్తే అప్పుడు విశాలాంధ్రను ఏర్పాటు చేయవలసిందిగా ఫజల్ అలీ కమిషన్ తీర్మానించింది.

అపుడు ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డి గారు 6 సెప్టెంబర్ 1955న నిజాం కళాశాల తెలుగు సారస్వత సమితి ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ "నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ రాష్ట్రం విభజింపబడి కర్ణాటక ప్రాంతం ఐక్య కర్నాటకంలోను, మరట్వాడా బొంబాయి రాష్ట్రంలోనూ కలుస్తాయి, తెలంగాణం ప్రత్యేక రాష్ట్రంగా నిలుస్తుంది" అని ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల గురించి అన్నారు. అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా ఆంధ్ర, తెలంగాణాల ఏకీకరణను వ్యతిరేకించారు. అయితే కాంగ్రెస్ అగ్రనాయకులు తెలంగాణా నాయకులను విశాలాంధ్రకు ఒప్పించారు. ఆంధ్ర తెలంగాణా నాయకుల మధ్య 20 ఫిబ్రవరి 1956న పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు, తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణా రావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్ రావు పెద్దమనుషుల ఒప్పందం పై సంతకాలు చేశారు.

తెలంగాణా నాయకులు కోరిన, ఆంధ్ర నాయకులు అంగీకరించిన షరతులు ఇవి :- రాజధాని, హై కోర్ట్ హైదరాబాద్ లో ఉండాలి, తెలంగాణా అభివృద్ధి, విద్యా సౌకర్యాలు, ఉద్యోగాలు మున్నగు విషయాలలో శ్రద్ధ వహించుటకు తెలంగాణా ప్రాంతీయ కౌన్సిల్ ఏర్పరచాలి, అన్ని విషయాల్లో జనాభా నిష్పత్తి లెక్కలోకి తీసుకోబడాలి, మంత్రివర్గంలో కూడా ఈ నిష్పత్తిలోనే సభ్యులుండాలి.

1956వ సంవత్సరం ఆరంభంలో జరిగిన అమ్రిత్ సర్ కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ గారు ప్రాంతీయ తత్వంపై నిశిత విమర్శలు చేశారు. రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యపై దేశంలో జరిగిన కల్లోలాలు ఆటవిక మనస్తత్వానికి మచ్చుతునకలని, ఈ తత్త్వం తలలు నరికే నాగాజాతి వారి ఆచారం కన్నా కడుహీనమైనదని, ఆ ఆటవిక మనస్తత్వం కాంగ్రెస్ వారితో సహా ప్రజలందరిలోనూ గోచరిస్తున్నదని, దీనిని అరికట్టకపోతే అది భారతదేశంలో అంతర్యుద్ధానికి దారితీయగలదని నెహ్రూ గారు అన్నారు.

సంజీవరెడ్డిగారు 17 ఫిబ్రవరి 1956న సూళ్లూరుపేటలో విద్యుత్ప్రసార ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ విశాలాంధ్ర విషయం ప్రస్తావించి, తెలంగాణా నాయకులు తమది మిగులు బడ్జెట్ అని, మనది తరుగు బడ్జెట్ అని ఆక్షేపిస్తున్నారని, ఏ మూలకెళ్లినా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ, కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మిగులు బడ్జెట్ ఎలా ఉంటుందని, తెలంగాణా వలె ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా వెనుకబడి ఉంటే, మనదీ మిగులు బడ్జెట్ అవుతుందని, తెలంగాణలో అంతాకలసి 36 ఉన్నత పాఠశాలలున్నాయని, ఈ సంఖ్య నెల్లూరు జిల్లాలోని నాలుగు తాలూకాలలో ఉన్న సంఖ్యతో సరితూగదని, ఒక్క గుంటూరులోనే రెండు వందల ఉన్నత పాఠశాలలున్నాయని అన్నారు.

విశాలాంధ్ర ఏర్పడడానికి ఆరు నెలల ముందు నుంచీ సంజీవరెడ్డి గారు, ఆయన వర్గీయులైన బ్రహ్మానందరెడ్డి, అల్లూరు సత్యనారాయణరాజు గార్లు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు విస్తృతంగా పర్యటనలు చేసి ప్రజాభిప్రాయాన్ని సంజీవరెడ్డి గారికి అనుకూలంగా మార్చుకున్నారు. విశాలాంధ్ర నాయకత్వానికి గోపాలరెడ్డి, సంజీవరెడ్డి గార్ల మధ్య పోటీ జరిగింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సంజీవరెడ్డిగారు నాయకునిగా ఎక్కువ మందిచే ఎన్నుకోబడ్డారు. అధికారయుత ఎన్నికకు ముందు, ఇష్టాగోష్టిగా రహస్యంగా ఓట్లు తీసుకోబడ్డాయి, అందులో ఎవరికి  ఎక్కువ ఓట్లు వస్తే, వారి పేరును తక్కువ ఓట్లు వచ్చిన వారు ప్రతిపాదించాలనే షరతుకు ఇరువురు నాయకులను ఒప్పించి కాంగ్రెస్ నేత శ్రీమన్నారాయణ్ గారు ఎన్నికను నిర్వహించారు. ఈ రహస్య ఓటింగ్ లో సంజీవరెడ్డి గారికి ఎక్కువ ఓట్లు రావడంతో, గోపాలరెడ్డిగారు బహిరంగ సమావేశంలో సంజీవరెడ్డి గారి పేరును ప్రతిపాదించారు. మధ్యస్థంగా ఉన్నవారి పరిశీలన ప్రకారం సంజీవరెడ్డి గారి మెజారిటీ పదహైదు నుండి ఇరవై వరకు ఉన్నది.

సంజీవరెడ్డి గారి విజయానికి చాలా కారణాలున్నాయని, వారికి ప్రతి జిల్లాలోనూ ఏ.సి.సుబ్బారెడ్డి గారి వంటి ఉక్కు మనుషులు అనుచరులుగా ఉన్నారని, ప్రకటన వెలువడిన దగ్గర నుండీ నిరంతర కృషి చేసి తెలంగాణలో అత్యధిక సభ్యుల మద్దతు సంపాదించారని, దీని ప్రభావం ఆంధ్రాలోనూ కనిపించిందని, ఇదిగాక సంజీవరెడ్డిగారి వర్గమంటే మధ్యతరగతి వర్గమని , వీరు వస్తే విప్లవకర సంస్కరణలు జరగగలవనే ప్రచారం జరగడం వల్ల ప్రజల్లో అనుకూల వాతావరణం ఏర్పడిందని పత్రికలు విశ్లేషించాయి.

అలానే గవర్నర్ గా నియమింపబడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు, కె.వి .రంగారెడ్డి గారు మొదట్లో తటస్థంగా ఉన్నా చివర్లో సంజీవరెడ్డి గారికి  ఓటు వేయడంతో సంజీవరెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

Jameen-Raithu-19561 నవంబర్ 1956న కాకతీయులతో అంతమైన విశాలాంధ్ర సామ్రాజ్యం పునః ప్రతిష్ట జరిగిందని పత్రికలు ఈ శుభసందర్భాన్ని కొనియాడాయి. "ఓరుగల్లు అంటే ప్రస్తుత తెలంగాణలోని వరంగల్ రాజధానిగా , బలవత్తరమైన ఆంధ్ర సామ్రాజ్యాన్ని నిర్మించి, ఆంధ్ర సంస్కృతీ వికాసానికి, ఆంధ్ర భాష, ఆంధ్ర కళలను అభివృద్ధి పరచి, ఏకఛత్రాధిపత్యంతో చరిత్రలో ప్రశస్తిగాంచిన కాకతీయుల పరిపాలనా వైభవం మనం ఎరుగనిది కాదు, ఆ తరువాత మళ్ళీ ఈ ప్రజాస్వామిక యుగంలో ఆంధ్ర దేశం అంతా ఆంధ్రుల స్వపరిపాలన క్రిందకు వస్తున్న ఈ శుభసమయం ఆంధ్ర జాతి చరిత్రలో ఒక చారిత్రాత్మక దినం" అని జమీన్ రైతు పత్రికలో శ్రీ ఎం.ఎల్. నరసింహారావు గారు రాశారు.

"మూడు కోటుల నొక్కటే ముడి బిగించి పాడినాడ మహాంధ్ర సౌభాగ్య గీతి"

తన మంత్రివర్గంలో చేరవలసిందిగా గోపాలరెడ్డిగారిని సంజీవరెడ్డిగారు ఆహ్వానించారు. గోపాలరెడ్డి గారితో పాటు ఆయన వర్గంలో మరొకరికి చోటు ఇవ్వడానికి కూడా సంజీవరెడ్డి గారు అంగీకరించారు. అయితే ఆ రెండవ స్థానానికి లచ్చన్న, చెన్నారెడ్డి, ఓబుల్ రెడ్డి గార్లను చేర్చుకోవడానికి మాత్రం సంజీవరెడ్డి గారు ఒప్పుకోలేదు. అలా 30 నవంబర్ 1956న గోపాలరెడ్డిగారు సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో ఆర్దికమంత్రిగా చేరారు.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in September 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!