Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

1955 మధ్యంతర ఎన్నికలు

1955 మధ్యంతర ఎన్నికల్లో సంజీవరెడ్డి గారు మరల చిత్తూరు జిల్లా కాళహస్తి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కాళహస్తి అప్పుడు ద్విసభ్య నియోజకవర్గం. జనరల్ స్థానం నుండి పోటీ చేసిన సంజీవరెడ్డి గారు తన సమీప కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యర్థి బి.రాజారెడ్డి గారిపై 30,047 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి 196 స్థానాలకు గాను 146 గెలుచుకోగా, కమ్యూనిస్టులకు 15, ప్రజా సోషలిస్టులకు 13 లభించినవి. 22 మంది స్వతంత్ర అభ్యర్థులు ఆంధ్ర శాసన సభకు ఎన్నికయినారు. 146 స్థానాలు ఐక్య కాంగ్రెస్ కూటమికి వచ్చినాయి. అందులో కాంగ్రెస్ అభ్యర్థులు 119 మంది, కృషికార్ లోక్ పార్టీ వారు 22 మంది, ఐదుగురు ప్రజాపార్టీ వారు ఉన్నారు.

ఈ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులుగా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు ఉన్నారు. మార్చ్ 11, 1955న ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, శాసనసభ నాయకత్వానికి ఎవరిని ఎన్నుకోవాలి అనే సమస్యపై చర్చిండడానికి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు.యన్.ధేబర్, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి  విజయవాడకు వచ్చారు. వారి ఉద్దేశం పై రెండు పదవులకు నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం. మార్చ్ 11, 1955న రాష్ట్ర అసెంబ్లీ కాంగ్రెస్ పక్ష నాయకుడిగా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారిని నిర్ణయించారు. శ్రీ సంజీవరెడ్డి గారు పోటీ నుండి తప్పుకున్న కారణంగా ఈ నిర్ణయం సర్వజన సమ్మతంగా జరిగింది. వివిధ వర్గాలవారు అధిష్టాన వర్గం ప్రదర్శించిన రాజనీతిజ్ఞత, సంజీవరెడ్డి గారి త్యాగం, ప్రకాశంగారి వాస్తవిక దృష్తి ఈ ఏకగ్రీవ నిర్ణయానికి దోహదం చేశాయని కొనియాడారు.

బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు శ్రీ యస్.కె.పాటిల్ మార్చ్ 14న మద్రాసులో పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ "శ్రీ గోపాలరెడ్డి, శ్రీ సంజీవ రెడ్డి గార్లలో శ్రీ గోపాలరెడ్డి గారికి పరిపాలన  అనుభవం ఎక్కువగా ఉందని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. శ్రీ సంజీవరెడ్డి గారు శ్రీ గోపాలరెడ్డి గారికి అనుకూలంగా నిస్వార్ధ త్యాగంతో ఉదాత్తంగా ప్రవర్తించారు" అని అన్నారు.

అయితే మార్చ్ 17న కర్నూలులో జరిగిన బహిరంగసభలో శ్రీ టి. ప్రకాశం పంతులుగారు యునైటెడ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకుని ఎంచుకునే సందర్భంలో ప్రజలచే అమోఘంగా సమర్ధించబడ్డ తన మంత్రివర్గాన్ని పూర్తిగా ఉపేక్షించడం చాలా అమర్యాదతో కూడినదని అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు జరపాలని తానూ ముఖ్యమంత్రిగా గవర్నర్ కు సిఫారసు చేసినపుడు బ్రహ్మానండమైన ఎన్నికల బాధ్యతను తనపై వేసుకున్నానని ప్రకాశంగారన్నారు.

తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డిగారిని నాయకత్వం కోసం చివరివరకు ఉంచి, అప్పుడు అధిష్టాన వర్గం వారి సలహాపై విరమింపజేయవలసిందని, తాను ముసలివాడినని, విశ్రాంతి తీసుకోవలసిందిగా తనకు చెప్పి ఉండవలసిందని ప్రకాశంగారన్నారు.

‘గత మంత్రి వర్గాన్ని కూలత్రోయడానికి కృషి చేసిన శక్తులే ఇప్పుడు కొత్త నాయకుణ్ణి ఎంచుకోవడాన్ని బలపరుస్తున్నట్లు తాము భావిస్తున్నామని, కమ్యూనిస్టులను పూర్తిగా ఓడించిన ఈ సమయంలో అటువంటి శక్తుల పన్నాగంలో తిరిగి పడకుండా జాగ్రత్త పడవలసి ఉన్న’దని ఆయన హెచ్చరించారు.

Cartoon-1955

‘గత మంత్రివర్గంలో నాతో కలసి పని చేసిన కారణం వల్ల సంజీవరెడ్డికి నాయకత్వ అవకాశం లేకుండా చేయబడిందని నేను ఆరోపించడం లేదని. కానీ సంజీవరెడ్డి లాంటి ఉటమ్మ పరిపాలనా దక్షుడిని నాయకత్వ పోటీ నుంచి విరమించుకోవలసిందిగా బలవంత పెట్టడం మాత్రం తప్పు అని నేను భావిస్తున్నా’నని ప్రకాశంగారన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు :

‘తాను బ్రతికి ఉన్నది ముఖ్యమంత్రి పదవి కోసం కాకపోయినా, ఆంధ్ర వ్యవహారాలలో ముఖ్య పాత్ర నిర్వహించగల స్థితిలోనే ఉన్నా’నని ఆయన అన్నారు. అయితే తనను ఎవరూ లెక్క చేయలేదన్నారు. అందుకే శ్రీ దేబర్ తాను ప్రతిపాదించిన నాయకుని దీవించమన్నపుడు "ఒక మనిషి మరొక మనిషిని దీవించజాలడు" అని తాను జవాబిచ్చానన్నారు.

తరువాత మార్చ్ 20వ తేదీన విజయవాడలో పార్టీ నాయకుడిగా శ్రీ గోపాలరెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆ రోజు ఉదయం పదిగంటలకు ఇరవై నిమిషాలకు ఆంధ్రరత్న భవనంలో ఐక్య కాంగ్రెస్ పార్టీ సమావేశం ప్రారంభమైంది. శ్రీ సంజీవరెడ్డిగారు, గోపాలరెడ్డిగారి పేరు ప్రతిపాదించగా శ్రీ గౌతు లచ్చన్నగారు, శ్రీ బి.రామకృష్ణా రెడ్డి గారు బలపరిచారు. సమావేశంలో శ్రీ ప్రకాశంగారికి ప్రత్యేకంగా ఒక కుర్చీ ఏర్పాటు చేశారు. సంజీవరెడ్డిగారు మాట్లాడుతూ శ్రీ గోపాలరెడ్డి గారితో కలసి తాను కొంతకాలం క్రిందట కాంగ్రెస్ అధ్యక్షుడిని కలుసుకున్నపుడు, పార్టీ నాయకుని ఎన్నికల పోటీ నుంచి ఎవరో ఒకరు ఉపసంహరించుకొనడం అవసరమన్న సలహా చెప్పారు. దానిపై తామే ఉపసంహరించుకోగలమని చెప్పి ఉన్నామని అన్నారు. ఆంధ్రులు నిస్వార్ధ త్యాగానికి విధులని, పదవుల కోసం వారు లక్ష్య పెట్టరని, పదవులు వస్తూ, పోతూ ఉంటవి కానీ నిస్వార్ధ త్యాగం మాత్రం చిరకాలం ఉండిపోగలదని ఉద్ఘాటించారు.

కర్నూల్ నుంచి శ్రీ ప్రకాశం గారి ప్రయాణం

గోపాలరెడ్డి గారి మంత్రివర్గం మార్చ్ 28, 1955న ప్రమాణ స్వీకారం చేసింది. అంతకు ముందురోజు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశం పంతులు గారు తాను బస చేస్తున్న బంగళాను ఖాళీ చేసి స్వస్థలమైన ఒంగోలు వెళ్లారు. శ్రీ ప్రకాశంగారు బయలుదేరి వెళుతూ పత్రికా విలేఖరులతో - "నేనేమీ ఆందోళన చెందడం లేదు. సుఖంగా ఉండండి” అని అన్నారు."తిరిగి ఎప్పుడు వస్తారని" ఒక విలేఖరి ప్రశ్నించగా కొత్త అసెంబ్లీ తొలి సమావేశానికి హాజరవుతాను అని అన్నారు.

83 సంవత్సరాల వయసుగల శ్రీ ప్రకాశం గారు, తనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారి నుంచి సెలవు తీసుకుంటూ ఉండగా ఆ దృశ్యం చాలా మందిని కదిలించింది. సంజీవరెడ్డి గారు డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ ఏ.కే.కే.నంబియార్ తో కలసి శ్రీ ప్రకాశం గారికి వీడ్కోలు చెప్పారు.

చివరకు శ్రీ ప్రకాశంగారు అక్కడ ఉన్న వారితో కర స్పర్శ చేసి, స్టేషన్ వ్యాగన్ లో బయలుదేరి వెళ్ళిపోతున్నపుడు అక్కడ చేరిన వారంతా కంటతడి పెట్టారు.

****సశేషం****

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in July 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!