Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

ప్రథమాంధ్ర మంత్రివర్గ పతనం

నవంబర్ 3, 1954న ఆంధ్ర మంత్రివర్గం పై అవిశ్వాసం తెలిపే మూడు తీర్మానాలను ప్రతిపాదించడానికి అసెంబ్లీ అనుమతించింది. ప్రతిపక్ష నాయకుడు శ్రీ టి.నాగిరెడ్డి, కృషికార్ లోక్ పార్టీ నాయకుడు శ్రీ గౌతు లచ్చన్న, కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడు శ్రీ పి.వెంకటేశ్వర్లు ఈ మూడు తీర్మానాలను ప్రతిపాదించారు. నవంబర్ 4న కృషికార్ లోక్ పార్టీ వారి అవిశ్వాస తీర్మానం పై అసెంబ్లీ లో చర్చ ప్రారంభమైంది. కమ్యూనిస్టుల ప్రతిపాదనలు ఉపసంహరింపబడ్డాయి.

నవంబర్ 3న గవర్నర్ ప్రసంగానికి కమ్యూనిస్ట్ సభ్యుడు ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా 59 ఓట్లు, వ్యతిరేకంగా 67 ఓట్లు వచ్చాయి. ప్రభుత్వ పక్షానికి చెందిన ఏడుగురు సభ్యులు,ప్రతిపక్షానికి చెందిన నలుగురు సభ్యులు మొత్తం పదకొండు మంది సభ్యులు సమావేశానికి రాలేదు. ఇద్దరు సభ్యులు తటస్థంగా ఉండిపోయారు. ఆ విధంగా బలాబలాల పరీక్షలో ప్రభుత్వం తొలి విజయం సాధించింది.

ప్రకాశంగారు అంతకు కొన్నాళ్ళ క్రిందట, ఎప్పుడైనా మా ప్రభుత్వం ఓడ వలసి వస్తే స్పీకర్ గారి తప్పుడు రూలింగ్ వల్లనే ఓడిపోతామని హాస్య ధోరణిలో అప్పటి స్పీకర్ వెంకట్రామయ్య గారినుద్దేశించి అన్నారు. సరిగ్గా ప్రకాశంగారన్నట్లు స్పీకర్ గారు తప్పుడు రూలింగ్ ఇస్తూ మొదటి తీర్మానంలో ప్రభుత్వం గెలిచినా వెంటనే రెండవ తీర్మానానికి అనుమతిచ్చారు.

Cartoon-1953
మంత్రి పదవుల పందేరంపై ఆంధ్రప్రభలో అక్టోబర్ 3,1953న పడిన కార్టూన్

అసెంబ్లీలో గౌతు లచ్చన్న గారు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని మూడు రోజులు చర్చించిన మీదట, తీర్మానానికి అనుకూలంగా 69, ప్రతికూలంగా 68 ఓట్లు వచ్చినవి. మాజీ మంత్రి యన్. శంకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అడుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వర రావు, ప్రజాపార్టీ సభ్యులు బత్తిన రామకృష్ణా రెడ్డి, బాపన్న దొరలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. రాయలసీమ స్వతంత్ర సభ్యుడు చిదానందం గారు తటస్థంగా ఉన్నారు. శ్రీ కె.కూర్మి నాయుడు గారు శాసన సభకు రాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ సభ్యులలో ఒకరు లేచి మాకు ప్రభుత్వం మీద ఏమీ కోపం లేదు, కానీ, సంజీవరెడ్డి గారి అహంభావానికి మా తిరస్కారం తెలియజేయడానికి విశ్వాసరాహిత్య తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తున్నట్లు ప్రకటించాడు.

ఆ విధంగా ప్రథమాంధ్ర మంత్రివర్గం నవంబర్ 6, 1954న పతనమయ్యింది.

సంజీవరెడ్డి గారు మరుసటి రోజు వచ్చే మే నెల నాటికి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్మకం వెలిబుచ్చారు. శ్రీ ప్రకాశంగారు, కాంగ్రెస్, ప్రజా పార్టీ తదితరులందరూ కలసి ఉమ్మడిగా ఈ సారి ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారు. మరుసటి రోజు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి ప్రభుత్వ పతనానికి కారకులైన కమ్యూనిస్టేతర శాసన సభ్యులలో కొందరు ముఖ్యమంత్రిని కలుసుకుని, మంత్రి వర్గాన్ని విస్తృతం చేసే పక్షంలో, మంత్రి వర్గంపై తిరిగి విశ్వాసం ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయం ఢిల్లీలో ఉన్న ఉపముఖ్యమంత్రికి కూడా తెలియజేయబడింది.

ఆ శాసనసభ్యులు నీరా విధానంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని, ఈ స్పష్టీకరణ ముఖ్యమంత్రి ప్రకాశంగారే స్వయంగా చేయాలని, ఆయన తప్ప ఇంకెవరూ చేయకూడదని ముఖ్యమంత్రిని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు శాసన సభ్యులు సంజీవరెడ్డి గారికి తంతి పంపుతూ అసెంబ్లీ రద్దు సిఫారసును వెనక్కి తీసుకోవడానికి, మంత్రి వర్గాన్ని విస్తృతం చేయడానికి అన్ని అవకాశాలను తక్షణం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

నవంబర్ 10న ఢిల్లీ నుండి తిరిగివచ్చిన వెంటనే కర్నూల్ లో ఉప ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు - రాష్ట్ర శాసనసభను రద్దు చేసి ఎన్నికలు జరిపించడం మినహా వేరే మార్గం లేదు. వేరే ఏమి ఆలోచించినా ప్రజాస్వామ్యానికి చెరుపు చేసిన వాళ్లమవుతాం అని స్పష్టం చేశారు.

నవంబర్ 11న రాష్ట్ర గవర్నర్ త్రివేదిగారు ఆంధ్రలో రాజ్యాంగ విహితమైన ప్రభుత్వం భగ్నమైందని ఢిల్లీకి వర్తమానం పంపారు. నవంబర్ 15, 1954న ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ రద్దు చేయబడింది.

నవంబర్ 21న నెహ్రూగారి సలహాననుసరించి ప్రకాశంగారు కాంగ్రెస్ లో పునః ప్రవేశం చేశారు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు 1955 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మర్చి 5వ తేదీ వరకు పోలింగ్ జరుగుతుందని, మార్చ్ 15 కల్లా ఫలితాలు ప్రకటింపబడతాయని గవర్నర్ ప్రకటించారు.

***సశేషం***

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in June 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!