శ్రీ గణేశ ప్రార్థన
ఉ.
నీ శుభరూపదర్శనమె నిత్య మొసంగును కార్యసిద్ధి; లో
కేశులు నీపదాబ్జముల కెంతయొు భక్తినమస్కరింతు; రా
పాశకుఠారముల్ చరణబద్ధమనస్కుల చేసి బంధముల్
లేశములేని సద్గతుల లెంకల కిచ్చితరింప చేయుగా
ఉ.
బ్రహ్మకు బ్రహ్మవీ వనుచు పల్కితి వీవె ‘గణేశగీత’ లో
జిహ్మగభూషణోద్వహము(1) చేయుతఱిన్ తొలుదొల్త వీక్షణా
జిహ్మగ(2)భిన్నవిఘ్నగణ! సిద్ధివినాయక! నిన్నెకొల్చెనా
బ్రహ్మయె కార్యసిద్ధికయి; పల్కగ శక్యమె నీ మహత్వమున్?
(1) నాగభూషణుడగు శివుని పెండ్లి
(2) చూపు అనే అజిహ్మగము (బాణము) చేత విఘ్నముల భేదించు వాడు
శా.
ఓంకారమ్మెగ సర్వమంత్రములకున్ హోమాదిసత్కార్యస
త్సంకల్పంబులకెల్ల ఆదియయి నిత్యశ్రీ నొసంగున్ నిరా
టంకంబై కొనసాగ; విద్యల కభీష్టప్రాప్తికిన్ మూల; మా
ఓంకారాకృతియౌ సమస్తగణనాథోపాసనన్ చేసెదన్
కం.
తలవంపులు కావుగ కవి
తలవంపులు(1) విఘ్నరాట్పదంబుల చెంతన్
తల వంచని గతి నిడు కవి
తల వంపులు(2) సొంపులగుచు తథ్యము నిలువన్
(1) కవి తల వంచి చేయునమస్కారములు'
(2) కవితలలో కలవంపులు (పలుఛందస్సులు, అలంకారములు)
మణిమాల
భజియింతు నిన్నె తొలుదొల్త భక్తసులభా! వినాయకవిభో!
సృజియింపరావె ప్రమదంబు సేవకజనార్తిభంజనగుణా!
రజనీకరాంచితలలాట! రక్తవసనా! చతుర్భుజ! లస
ద్భుజగోపవీత! కొను మగ్రపూజ్య! మణిమాల కూర్చితి నిదే