Menu Close
Kadambam Page Title
సొగసు చూడతరమా ....!
ఏ .అన్నపూర్ణ

మబ్బుపట్టిన ఆకాశం దిగులుపడుతున్నట్టు
అప్పుడప్పుడు చినుకులు రాలుస్తోంది
ఉరుములు మెరుపులతో నేను వస్తున్నా ..అంటూ
మేఘబాల సంకేతాలు పంపుతోంది.

ఏడురంగుల ఇంద్రధనుసులో
ఎన్నెన్ని అందాలో ఎన్నెన్ని సందేశాలో
మబ్బుల్లోంచి వచ్చిన చినుకులు
నేలమీదకు జారి నాట్యాలు చేస్తాయి
ఇక్కడపడిఅక్కడగంతులు వేస్తాయి
చూడాలని వెడితే
సూదుల్లాగుచ్చుకుని ఏడిపిస్తాయి
ఎన్నెన్నిహొయలు ఎన్నెన్నిసొగసులు

మబ్బులు కమ్మిన ఆకాశాన్ని చూసి
పుడమి పులకరించింది
తన అంతరంగంలో జనించిన
ఆనందకర మాటలకు అక్షర రూపం కల్పించింది.

చినుకులా వస్తావు కాలువలు కడతావు
వాగులువంకలై పరుగులుతీస్తూ పంటలు పండిస్తావు
గ్రీష్మంలో అలమటించిన నేలకు దాహార్తిని తీరుస్తావు
మోడువారిన చెట్లకు చిగుళ్లు తొడుగుతావు
పారే ప్రతి నీటి బొట్టులో ఎన్నెన్నో నిధులు
జగతి మురిసిపోయింది తరగని దాహార్తి సంపదను గని
మసకబారిన ప్రకృతిలో నీటిధారలు
పొగ మంచుతో కనువిందు చేస్తాయి
అనుకోని అతిథిలా వస్తావు అంతలోనే ఎటోవెళ్ళిపోతావు
నీవు వదిలివెళ్లినగుర్తులు నిలిచిపోతాయి
కొత్త అందాలకు తలుపులు తెరుస్తావు
మమ్మల్ని మైకంలో ముంచుతావు
వెచ్చని సూర్య కిరణాలు సోకి
కరిగిన మంచు ముత్యాల్లా జాలువారుతుంది
చెట్ల కొమ్మలను అలంకరించినట్టు మురిపిస్తుంది
ఆహ్లాదకర వేడుకలకు దీప తోరణాల్లా స్వాగతం పలుకుతుంది
మంచుపూలు పూసినట్టు కొత్త అందాలు సంతరించుకున్నాయి

ఓ తొలకరి వర్షమా!
నీ రాక సమస్త జనులకు ఒక శక్తినిచ్చే మధురానుభూతి
నీ సొగసు చూడటానికి ఎదురు చూస్తూనే వుంటాను అందుకో అభివందనం!!!

Posted in July 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!