Menu Close
Rayavarapu-Saraswathi
స్నేహ బాంధవ్యం (కథ)
-- రాయవరపు సరస్వతి --

"కాలేజీరోజుల్లో రాధ, నేనూ మంచి స్నేహితులం. ఇద్దరి మధ్యా ఎలాంటి దాపరికాలూ ఉండేవి కావు.

అనుకోకుండా రాధ ప్రేమలో పడింది. అతని పేరు మురళీ. బ్రిలియంట్ స్థూడెంట్ మాకు సీనియర్ కానీ అతనికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. అప్పటికే ఇద్దరు, ముగ్గురమ్మాయిలతో ఆటాడుకున్నాడన్నది కాలేజీలో అందరికీ తెలిసిన విషయమే.

అలాంటి వాడి ప్రేమలో పడిన రాధను హెచ్చరించాను. మురళీ మత్తులో పడిన రాధ హఠాత్తుగా కనిపించటం మానేసింది. కాలేజీకి రావటం మానేసింది. నా దగ్గర ఏవిషయం దాచని రాధ తన ప్రేమ విషయంలో హెచ్చరించినందుకు కొన్ని సీక్రెట్స్ ను నావద్ద మరుగున పెట్టేది. ఇప్పుడు ఏకంగా మురళీతో లేచిపోయినట్లు వినికిడి.

ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం, వాళ్ళు బ్రాహ్మణ కులస్థులు కావటంతో వాళ్ళింట్లో ఆచార వ్యవహారాలు చాలా కఠినంగానే ఉంటాయి. తమ కులం కాని మురళీతో ప్రేమ వ్యవహారం ఇష్టపడని తల్లిదండ్రుల కన్నుగప్పిన రాధ అతనితో పరారైపోవటం శోచనీయం.

విషయం తెలుసుకోవాలన్న ఉత్కంఠతతో నేను రాధ ఇంటికి వెళ్లాను. నన్ను చూసిన ఆమె తల్లిదండ్రులు నా మీద విరుచుకు పడ్డారు. స్నేహం చెడ్డదన్నారు. స్నేహం వల్లనే రాధ జీవితం సర్వనాశనమైందన్నారు. వారి ప్రేమ వ్యవహారం వీళ్లకు ముందుగా తెలియజేయలేదని నన్ను అనరాని మాటలన్నారు. కూతురు కనపడని దుఃఖంలో వున్న వాళ్ళను చూసి నా కడుపు తరుక్కు పోయింది. రాధ అనాలోచితంగా చేసిన పనికి తాను బలైపోయింది. ఆమె మీద నన్ను తిడుతున్నా ఆమె తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది కానీ వాళ్లనేమి అనలేక నేను వెనుదిరిగాను.

%%%

మరో రెండు సంవత్సరాలు కాలగర్భంలోకలిసిపోయాయి. నా తల్లిదండ్రులు నా వివాహం ఒక ఇంజనీరుతో జరిపించారు. నాభర్త రాజేష్ చాలా మంచివ్యక్తి. వృత్తి పరంగా ఆయన హైదరాబాద్ లోనే వుంటున్నారు. అందువలన అంతవరకూ ఫ్రెండ్స్ తో ఉంటున్న ఆయన నేను రావటంతో అపార్ట్ మెంట్ తీసుకొని కొత్త కాపురం పెట్టేసారు.

మా కొత్తకాపురం మూడుపువ్వులూ ఆరు కాయలుగా గడిచిపోతోంది. నాభర్త నామనసెరిగి ప్రవర్తిస్తున్నారు. నా కెలాంటిలోటూ జరగనివ్వరు.నేనంటే ఆయనికి పంచప్రాణాలు.

%%%%

మరో రెండేళ్లు కాల గర్భంలో కలిసి పోయాయి. మా దాంపత్య జీవితానికి తీయని గుర్తుగా ముద్దులొలికే పాపాయి మా మధ్యకు వచ్చింది. ఇప్పుడు మా పాపాయి మృదుల మొదటి పుట్టినరోజు పండగ చేసుకొని రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

ఆ రోజు గదిలో పాప ఆలనా పాలనలోమునిగివున్న నాకు మా ఇంటిముందుకొచ్చిన ఓ 'స్త్రీ' "అమ్మా మీ ఇంట్లో పనిమనిషి అవసరమైతే చెప్పండమ్మా నేను చేస్తాను. ఒంటరిదాన్ని భోజనం చేసి నాలుగు రోజులయింది" అంటూ దీనాతి దీనంగా బయట వాకిట్లో చేతులు జోడించి అడుగుతోంది. ఆమె స్థితికి నా ఆడమనసు కరిగిపోయింది. మా ఇంట్లో అప్పటికే ఇద్దరు పనివాళ్ళున్నారు. ఆమె దీనమైన స్థితికి ఇక లోపలగదిలో ఉండలేని నేను బయటకు వచ్చి ఆమె ముందు నిలబడ్డాను.

అంతే, నాకాళ్ళ క్రింద భూమికంపించినట్లయింది. నాముందు నిలబడింది ఎవరో కాదు నా ప్రాణం స్నేహితురాలు రాధ.

ఇద్దరం తేరిపార చూసుకున్నాము అంతే "రాధా" అంటూ ఆమెను కౌగిలించుకున్నాను. గావు కేకతో నా ఆనందానికి అవధులు లేవు. చేయి జారిన రత్నం దొరికి నట్లయింది. కానీ నా కౌగిలిలో నున్న రాధ అప్పటికే మూర్ఛపోయింది. వెంటనే ఆమె ముఖాన నీళ్లుజల్లి తేరిపారజూసాను. కొంత సేపటికి ఆమె కళ్ళు తెరిచి నాకు దండం పెట్టి ఆకలంటూ సైగచేసింది. వంట గదిలోకి వెళ్లి ప్లేట్లో భోజనం సర్ది తెచ్చిఅందించాను. అందుకున్నఆమె ఆవురావురుమంటూ తిన్నతరువాత "మంజూ" అంటూ నా ఒడిలో వాలి పోయింది దుఃఖంతో. ఆమె దుఃఖం ఉపశమించిన తరువాత ఆమె జీవిత వివరాలు చెప్పింది. విన్న నేను ఖంగుతిన్నాను. ఆమెను లేవదీసుకెళ్లిన మురళీ హైదరాబాద్ లో మకాం పెట్టి కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాడట. తరువాత కొన్నాళ్ళకు తమ వెంట తెచ్చుకున్న సొమ్ము అయిపోవడంతో ఇద్దరి మధ్యా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆమెను కొట్టడం తిట్టడం చేసేవాడట.

ఒకరోజు ఒక అమ్మాయితో ఇంటికి వచ్చి "ఈమె నా భార్య గుళ్లో పెళ్లి చేసుకున్నాం. నువ్వు నీ దారి చూసుకో" అంటూ ఆమెను కొట్టి బయటకు నెట్టేసాడట. ఆమె అతని కాళ్ళా వెళ్ళా పడినా లాభం లేక బయటకు వచ్చేసిందట. దిక్కు తోచని స్థితిలో ఇలా పని కోసం నాలుగు రోజులు నుంచి సిటీలో ఇంటింటికీ తిరుగుతుందట. ఏ దేవుడో కనికరించి మా ఇంటికి పంపించాడని చెప్పిన రాధ కాసేపటికి తేరుకున్న ఆమె తల్లిదండ్రుల విషయం గుర్తొచ్చి అడిగింది. జరిగింది చెప్పి చీవాట్లు పెట్టాను.

"రాధా ప్రేమించటం తప్పు కాదు. కానీ, ప్రేమలో పడే ముందు వెనకా ముందూ చూసుకోవాలి. అసలు మీ ఇద్దరి మధ్యా వున్నది నిజమైన ప్రేమా లేక వయస్సుతోవచ్చిన ఆకర్షణా అన్నది తెలుసుకోవాలి. ముందుగా ప్రేమ మీద ఒక అవగాహన ఉండాలి. ప్రేమంటే పార్కుళ్ళంట తిరగటం, కలిసి సినిమాలు చూడటం ఇంకా తొందరగా ఉంటే లాడ్జీ గదుల్లో దొర్లటం లేదా ఇలా నమ్మినవాడితో అనాలోచితంగా బయటకొచ్చి మోసపోవటం ఇదేనా ప్రేమకు అర్ధం?

ఇప్పుడు చెడేది ఎవరు? అతనికేం మగాడు ఎందరినైనా మోసం చేయగలడు. నువ్వు ఆడదానివి నీ హద్దుల్లో నువ్వుండాలి, లేదంటే జీవితం అధోగతే. జీవితంలో ఎవరైతే అందం, ఆకర్షణ ముఖ్యం అని వాటికి విలువ ఇస్తారో వాళ్లకు ఎప్పుడో ఒకసారి తమ గమ్యం ఎండమావుల వెంట పరుగు అని అర్ధం అయితీరుతుంది. ఈ పరుగులో కొంతమంది డబ్బు, కొంతమంది మానప్రాణాలను, మరి కొంతమంది కన్నవారినీ బంధుజనాన్ని పోగొట్టుకుంటారు.

మనిషికి చాలా అసంతృప్తుల నుంచి పెళ్లి, పిల్లలు సేదదీర్చటం జరుగుతుంది. అసలు ప్రేమించేవాళ్ళు పిరికివాళ్ళు కాకూడదు. పిరికి వాళ్లకు ప్రేమించే హక్కు లేదు. మీది నిజమైన ప్రేమ అయితే ముందుగా ఇంట్లో మిమ్మల్ని కనీపెంచి ఇంతటి వాళ్ళను చేసిన మీ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళను ఒప్పించి వారి ఆశీర్వాదంతో వివాహంచేసుకొని ఒకటవ్వాలి. అలాంటి జంటలకు జీవితంలో ఎదురైన కష్ట నష్టాలను పెద్దల అండదండలతో ఇట్టే పరిష్కరించుకో గల్గుతారు కానీ ఈ తరం ప్రేమికులలో ప్రేమకంటే ముందువారి మధ్య ఆకర్షణే ఎక్కువగా ఉంటోంది. వాళ్ళు దానిని ప్రేమనుకొని మోసపోతున్నారు, జీవితాలతో ఆటాడుకుంటున్నారు. ఆ రీతిలో నడిచింది రాధ ప్రేమ వ్యవహారం.

మంజుల ఓ తల్లిలా రాధను ఆదుకొని ఊరడించింది.

"మంజూ నేను తప్పు చేసాను. ప్రేమనుకొని ఒక మనిషిని గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోయాను. నేను క్షమకు కూడా అనర్హురాల్ని, వీలైతే నీ పెద్దమనసుతో నన్ను క్షమించు, నీ మాటలు నాకు ఓ మంత్రంలా పని చేస్తున్నాయి, నాకెంతో ఊరటనిస్తున్నాయి. స్నేహితురాలివైనా ఓ తల్లిలా నన్నాదుకున్నావు. నీ మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను ప్రేమలో మోసపోయాను. నా తల్లిదండ్రులకు నాముఖం ఎలా చూపించను?" నెత్తి బాదుకొని విలపించసాగింది రాధ.

"ఆ విషయం గురించి నువ్వు మర్చిపో. నేను చూసుకుంటాను నువ్వు భయపడకు" ధైర్యం చెప్పి ఆమె వెన్ను తట్టింది మంజుల. భర్త సహాయంతో రాధ బ్రతుకు తెరువు కోసం ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పించింది. ఒక సుముహూర్తాన మంజు తమ స్వగ్రామం వెళ్లి రాధ తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించి హైదరాబాదుకు తీసుకు వచ్చింది. తమ వీధిలోనే ఒక ఇల్లు అద్దెకు తీసి ఆ కుటుంబాన్ని ఆ ఇంట్లో ఏర్పాటు చేసింది మంజుల.

రాధ స్నేహితురాలికి ఎనలేని కృతజ్ఞతలు తెలుపుకుంది. కానీ మంజుల స్నేహితుల మధ్య కృతజ్ఞతలకు తావు లేదని తేలిగ్గా కొట్టి పారేసింది.

'స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం' అంటూ అప్పుడే రేడియోలో శ్రావ్యంగా గీతాలాపన విన వస్తోంది."

********

Posted in July 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!