శివరంజని నవరాగిణి
శివరంజని రాగం సంగీతంలో ఒక ప్రముఖమైన రాగం. ఆరోహణలోనూ అవరోహణలోనూ ఐదు స్వరాలే ఉండటం ఈ రాగం లక్షణాలు. శివరంజని రాగానికి హిందుస్తానీ కాఫీ ఠఠ్ రాగం మూలం. ఈ రాగం మోహన రాగానికి స్వరపరంగా చాలా దగ్గరగా ఉంటుంది. మోహన రాగంలోని తీవ్ర గాంధారం బదులు కోమల గాంధారం వాడితే శివరంజని అవుతుంది. 1940ల తర్వాతే ఈ రాగం ముఖ్యంగా లలిత సంగీతంలో ప్రాచుర్యం పొందింది.
తూర్పు పడమర సినిమాలో నాటి ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ రమేష్ నాయుడు స్వరపరిచిన శివరంజనీ.. నవరాగిణీ పాట ఈ శివరంజని రాగానికి ఉదాహరణ. డా. సి. నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటను బాల సుబ్రహ్మణ్యం తన గళంతో ప్రాణం పోసి అతి మధురమైన పాటగా మలిచారు.
శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృతవాహిని
ఆ ఆ ఆ శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
స్వర సుర ఝురీ తరంగానివి
స్వర సుర ఝురీ తరంగానివి
సరస హృదయ వీణా వాణివి
శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
ఆ కనులు పండు వెన్నెల గనులు
ఆ కురులు ఇంద్రనీలాల వనులు
ఆ కనులు పండు వెన్నెల గనులు
ఆ కురులు ఇంద్రనీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధుకలశం
శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రధమారోహించిన విధుషీమణి రుక్మిణి
రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
రావే రావే నా శివరంజనీ మనోరంజనీ
రంజనీ నా రంజనీ
నీవే నీవే నాలో పలికే నా దానివీ
నీవే నా దానివీ
నా దానివి నీవే నా దానివీ