ద్వ్యర్థికందము
శివుడు
శ్రీకర(1)కలితపదాబ్జ! య
గౌకస(2)! కందర్పదర్పహర! సుందరది
వ్యాకృతి! కావుమ భవ! హర!
శ్రీకంఠ(3)! నతార్థిచక్రి! శ్రీధరహారా!(4)
(1) శుభకర (2) పర్వతనిలయుడు (3) విషకంఠుడు (4) సర్పములు హారములుగా కలవాడు
కేశవుడు
శ్రీకర(1)కలితపదాబ్జ! య
గౌకస(2)! కందర్పదర్పహరసుందరది
వ్యాకృతి! కావుమ భవహర!
శ్రీకంఠ(3)! నతార్థి! చక్రి! శ్రీధరహారా!(4)
(1) లక్ష్మీదేవి చేతులు (2) సర్పనిలయుడు (3) కాంతిమయమైన కంఠము కలవాడు
(4) కాంతిమంతమైన హారములు కలవాడు
సీ. పురహరుం డీతండు మురహరుం డాతండు
గజభేది యితడు రక్షకు డతండు
చర్మాంబరు డితండు భర్మాంబరు(1) డతండు
స్వర్ణదీశు డితండు జనకు డతడు
నీలకంఠు డితండు నీలకాయు డతండు
సర్పభూషు డితండు శయను డతడు
బర్హి(2)నేత్రుడితండు బర్హి(3)పింఛు డతండు
గిరిధన్వు(4) డీతండు ధరు డతండు
తే.గీ. శ్వశురగృహధాము(5) లిర్వురు పతితపావ
నాహ్వయులు భవాబ్ధితరు లనంతు లజులు
అట్టిశివకేశవుల మది నాశ్రయింప
గలుగు భాగ్యంబు వర్ణింప అలవియగునె?
బంగారు వస్త్రము కలవాడు (2) అగ్ని (3) నెమలి
(4) కొండను ధనుస్సుగా చేసికొన్నవాడు (త్రిపురాసుర సంహారము కొఱకు)
(5) అత్తవారింట్లో నివాసము ఉన్నవారు