గతసంచిక తరువాయి »
“గురూజీ! కన్యాకుమారి గురించి ఆలోచిస్తున్నారా?”
“లేదు. స్త్రీ ఔన్నత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను.”
“దాని ఔన్నత్యం కనపడుతూనే ఉంది.”
“డోంట్ బీ ఎ బ్రూట్! ఆమె ఎందుకు పెళ్లి చేసుకో లేదో?”
“పెళ్ళెందుకురా, పెదబాబు!” ముతక సామెత పొడిచాడు. నేను జూనియర్ అని పిలిచే రంగనాథ్.
ఎంత జుగుప్సాకరమైన భావన! సిగరెట్టు వెలిగించుకున్నాను. దుర్గంధానికి అక్కడికి అదే విరుగుడు.
“లంచ్ కి పిలుస్తున్నారు!”
నా కుడిపక్క కన్యాకుమారి, ఎడమ పక్క జూనియర్.
“సుందరిని మీరు ఒకసారి గోల్కొండ తీసుకొచ్చారు కదూ!” స్వీటు మునిపంట కొరుకుతూ అడిగింది కన్యాకుమారి.
అలాంటి చిక్కు పరిస్థితుల్లో మౌనమే శరణ్యం. అది మనసులో లేని లోతుల్ని ఇతరులకు స్పురింప చెయ్యగలదు.
“అజంతా శిల్ప సుందరిని ఇక్కడికెందుకు నడిపించుకొచ్చారు?”
నేను తెరుకొన్నాను. “యు ఆర్ ఎ క్లెవర్ రీడర్!”
“నన్ను పొగిడి మాట మార్చకండి. సుందరిలో ఏదో చెప్పలేని అందం. ఏ మాత్రం ఆలోచనలతో చదివినా ప్రతి రచనలోనూ ఆమే సాక్షాత్కరిస్తుంది. అదే మీ రచనలలోని అందం.”
“అదే అవగుణమని నా భార్య అంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది”
“రచయిత భార్యగా జీవించడం బిగువు తాటి మీద నడకేమో! డిఫికల్ట్ లైట్ రోప్ వాకింగ్ కదూ!” నా వాక్యానికి టీక చెప్పబోయింది ఆమె.
“భోజనం దగ్గర సాహిత్య చర్చా?” జూనియర్ నవ్వాడు.
“మళ్ళీ సుందరి పునర్దర్శనం ఎప్పుడో?”
“నా శరీర వ్యవస్థ నుంచి సుందరిని విసర్జించుకున్నాను..”
“మీకు మీరే హాని చేసుకుంటున్నారు!”
ఆమె అంత సూటిగా విషయాన్ని వెల్లడించగలదనుకోలేదు. ఎదో అడగాలని, అర్థం కానట్లు నటిస్తూ అడిగాను. “వై? ఎలాగ?”
“ఇదేనా భోజనం చేసే తీరు! మీకు సుందరిని జ్ఞాపకం చెయ్యడం పొరపాటయిపోయింది.”
సెన్సిటివ్ గర్ల్! సుందరిని ఆమె నాకు జ్ఞాపకం చేశాననుకుంటోంది.
ఏదో అద్భుతమైన కలను, అపురూపంగా పునర్జీవించగలిగిన నాకు కన్యాకుమారి మళ్ళీ నాలుగేళ్ల తరువాత తారసిల్లింది –వరంగల్ లో.
ఈ మారు నా పక్క రంగనాథ్ లేదు మరో జూనియర్ వచ్చాడు.
“ఈయన మా గురూజీ! సుప్రసిద్ధ అనను కాని ఎ కాంప్లెక్స్ నావెలిస్ట్!” నన్ను పరిచయం చేశాడు కన్యాకుమారికి.
ఆమె పక పక నవ్వేసింది. జూనియర్ తెల్లముఖం వేశాడు.
“రామప్ప దేవాలయంలో శిల్పసంపద చూడకుండా వెళ్ళిపోవడం అమానుషం. కేవలం మిల్లులో పనిచేయడమే జన్మకి సార్థకత కాదు!”
అబ్బురంగా మనసున్న ఒక ప్రభుత్వోద్యోగి బస్సులు కుదిర్చాడు. మూర్ఖులను ప్రాధేయపడకుండా వాళ్ళు కోరే పనివేళకు తిరిగి రావచ్చన్నాడు.
“చూశారా ఎంత పొగరో దానికి! నన్ను చూసి వెనుదిరిగి పోయింది.”
నేను తలతిప్పకుండానే ఆ విసురు కన్యాకుమారి మీదనేనని గ్రహించాను.
“నిన్నుచూసిన, నీకునచ్చిన ప్రతి యువతీ నీతో ప్రేమలో పడిందన్న భావన షేక్స్పియర్ మనకి అందించిన మాల్ వోలియోకే చెల్లింది. మనం అందరం ఒకప్పుడు కాకపొతే మరొకప్పుడు మాల్ వోలియోలమే.. నువ్వు ఇంకా ఎదగాల్సి ఉంది.”
“కన్యాకుమారి వస్తోందట రామప్ప గుడికి.”
“వోహో! అలాగా!” నాకు ఆసక్తి చచ్చిపోయింది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని మధించబోతే మణులే దొరుకుతాయో, తిమింగాలాలే ఎదురవుతాయో!
కేకలు వేసే మామూలు మూకలు వెగటు పుట్టిస్తాయి. నేనూ, జూనియర్ గెస్ట్ హౌస్ కి ఆనుకొనివున్న శిధిలాలయం లోకి వెళ్ళాము. గర్భగుడిలో అగ్గిపుల్ల వెలిగించాను.
లోపల బుగ్గి తప్ప మరేం లేదు. నిధి నిక్షేపాలు అక్కడలేవని తెలుసుకున్నారంతే.
చీకతిలోనుంచి వెలుగులోకి వచ్చేసరికి ఎదురుగా నంది, వెనుక కన్యాకుమారి! “మీరూ, వచ్చారా?”
ఎందుకో నా కళ్ళకు చటుక్కున రాణి కనపడింది. నా గుండె లయ తప్పింది.
“క్రాంతికుమార్ రాలేదా” అని అడగబోయి ఎంతో కష్టంతో పెదవి జారనున్న ప్రశ్నను నిగ్రహించుకుని పొదివి పట్టుకున్నాను.
జూనియర్ ముందు కనపడుతున్న గుంపులో కలిసిపోయాడు, రామప్ప సరస్సు మీద సూర్యోదయ కిరణాలను చూడడానికేమో!
“మొన్న వరంగల్ జిల్లాకు వెళ్లాను. ఆడవాళ్ళతో. మీరు అక్కడ తారసిల్లుతారనుకున్నాను.”
“స్వయంభు: పాతకోట..మేం వచ్చిన రెండవరోజునే చూశాం. ఆ తోరణాల మధ్య ఆ శిధిలాలలో నాకు దుఃఖం ఆగలేదు. అక్కడ ఆలయంలో నందిని చూశారా? మనం ఎటు తిరిగితే అటు మన వంకే చూస్తున్నట్టు ఉంటుంది. నేనూ గుర్తించలేదు. ఎవరో పుణ్యాత్ముడు అది నా దృష్టికి తెచ్చాడు..పురోభివృద్ధి అంటూ ఈ కళలన్నింటికీ ఎంత దూరంగా పోతున్నామోనన్న తపన మనకు లేదు. రండి వెళదాం..”
బస్సు రామప్ప గుడి వద్ద ఆగింది.
నేను బస్సు దిగాను. కన్యాకుమారి నా దగ్గరకు వచ్చింది.
తీరికగా గుడి బయట శిల్ప సౌందర్యాన్ని చూస్తూ అలా ప్రదక్షిణాలు చేస్తున్నాం.
పేదకి పెన్నిధి దొరికితే మణులేవో, మరకతాలేవో తెలుసుకోలేక రత్నరాసుల్ని నెత్తి మీద పోసుకొని ఆనందంలో జలకాలాడుతాడు.
అదే నాస్థితి. ఒక్కొక్క ప్రదక్షిణలో ఒక్కొక్క ఎత్తు చూస్తున్నాం. మదనికలు, నాగినులూ, దేవతలు.. కళ్ళు చెదిరిపోతున్నాయి.
ఒక దగ్గర ఆగిపోయాను. మెడ కిందకు దింపకుండా అలా మైమరచి చూస్తున్నాను.
ఆ శిల్ప సుందరి వివస్త్ర – నగ్నంగా ఉన్నానన్న భావన లేని కారణాన్నేమో ఆమె ముఖంలో ఏమి శోభ! ఏం తళుకులు!
శృంగారభావం ఆమె ముఖంలో చిందులేస్తూంది.
ఏ రసికుని సన్నిధిలోనో .. ఆమె కించిత్ ఆచ్ఛాదన..
ఎవరో రాక్షసుడు ఆ చేతిని...అరచేతిని మోచేతిని పగలగొట్టాడు.
ఏం కనపడింది? వారనుకున్న అందం కాదు. ఆచ్ఛాదనగా వేసుకున్న అరచెయ్యి కింద శిల్పి ఏం చేక్కగలదు? చేతి కింద ఉన్నది శిలే!
స్త్రీ సౌందర్య రహస్యాన్ని – జీవిత మాధుర్యాన్ని ఎంతో తెలివిగా శిలపై సాక్షాత్కరింప చేశాడు. ఆచ్ఛాదనలోనే ఉంది ఉండాల్సిందీ, ఉన్నదీ అంతా.
గుప్పిడి విప్పితే ఏముంటుంది! అదే సౌందర్య మర్మం.
కీచకులకూ, పాషాండులకు, సౌందర్యోపాసనా, రాసాస్వాదనా తెలుస్తాయా!
శిల్ప సుందరి నా వంక అదోలా చూస్తూంది. నా వంకే కాదు, అందరి వంకా.
ప్రియుని సన్నిధిలో తన శృంగారహేలను మూడవ కంటివాడు చూస్తే ఎలా సిగ్గుపడుతుందో అలానే సిగ్గుపడుతూంది.
ఆమె చూపులో మార్పు? కాలక్రమేణా సౌందర్య హంతకుల చేత పది తర్వాత ఆమె చూపులో మార్పు వచ్చిందేమో!
కాని ఆ నాగిని మనల్ని చూసి ఎవగించుకుంటూందనలేం.
ఎవగింపూ, ద్వేషమూ అవగాహనా లోపానికి నిదర్శనాలేనా! ఆమె మనల్ని చూసి జాలి పడుతూందేమో! లేదా ఆ జాలి తన మీద తనకే వేస్తుంటే వాళ్ళలో ఆ భావన వచ్చిందా?
సన్నగా ఎక్కడినుంచో రోదన.
భళ్ళున ప్రస్తుతం లోకి మేల్కొన్నాను.
రాతి మండపంలో కన్యాకుమారి చీర చెంగులోకి వెక్కుతూంది. ఆలయం చూడవచ్చిన మా వాళ్ళు నగ్నసుందరులందరినీ గబ గబా చుట్టేసి చెల్లా చెదరై పోయారు.
“క్షమించండి! మిమ్మల్ని..అ శిల్పం... ఏమనాలో, ఏమంటున్నానో తెలియకుండా మాట్లాడేస్తున్నాను.”
ఆమె లేచి నుంచుంది. కళ్ళు తుడుచుకుంది.
అంత తొందరగా తెప్పరిల్లుకో గలగడం ఆడవాళ్లకే చెల్లింది.
“సారీ! ఎదో జ్ఞాపకం వచ్చింది. మీ సుందరి ఈ పరిసరాల్లో పునర్దర్శనం ఇస్తుందని పాఠకురాలిగా నేను అనుకోవచ్చా?”
దుఃఖంలో నుండి తెప్పరిల్లుతున్న మగువ ఇంతటి ప్రశ్న వేస్తుందని నేను ఊహించలేదు.
“సుందరి?..ఆ రాణీయా?” అనుకోకుండా బయట పడిపోయాను.
నా ముఖం సిగ్గుతో మండిపోతూంది. చేతులూ వణుకుతున్నాయి. తడబడుతూ సిగరెట్టూ ముట్టించుకున్నాను. పొగ మింగడంలో పొల మారిపోయాను. ఉక్కిరి బిక్కిరి...
“మీది చాలా సున్నితమైన మనసు”
ఈ మారు తెల్లబోయాను.
“శిల్ప సుందరిని చూస్తూ మైమరిచిపోయాను. “పదండి వెళదాం.”
ఆమె ఎదో చెప్పాలని ఆరాతపడుతుందా?లేదా చెప్పాలని ఆరాటపడుతున్నది నేనా?
“కాకతీయ రుద్రమదేవి ఈ ఆలయనిర్మాణం స్వయంగా పర్యవేక్షించిందట!”
“ప్రతి అద్భుతమైన కృషి వెనకా, కళాఖండం వెనకా ఒక స్త్రీ మూర్తి ఉంటుంది. కొంచెం తీ తాగుదామా?”
“పోనీ, ఇక్కడికే తెప్పిస్తా.” నేను గబగబా బయటకు వచ్చి టీ కుర్రాడికి చెప్పాను.
ఇద్దరం ఆలయ ప్రాంగణంలో చతికిలబడ్డాం. టీ తాగేసింది కన్యాకుమారి.
“మీరు అడగరు. నాకు తెలుసు.”
ప్రశ్నించబడడానికి ఇదే ఆహ్వానమైనా నేను మౌనీ ముద్రే వేశాను.
ఒక్క లిప్తలో ఉప్పెన బద్దలైంది.
“క్రాంతికుమార్ పెళ్లి చేసేసుకున్నాడు.” ఆమె తల దించుకుని అంది. ఇక మౌనం కృతకంగా, క్రూరంగా ఉంటుంది. “ఇక్కడికి రాలేదేం?”
నేను వస్తున్నానని..”
“శిధిలాలలోనూ ఒక అందం ఉంది. అందుకే ఆ కవి మధురాతి మధురమైన కధనాలు విచారకమైన ఆలోచనలు చెప్పేవే నన్నాడు.”
“నిజంగా తనదాకా వచ్చినప్పుడు ఈ తాత్విక చింతన ఉంటుందా? ఉండగలదా?” ఆమె గొంతులో ఉక్రోషం.
“బతకాలి కాబట్టి ఆ ఆలోచనా సరళి అలవరచుకోవాలి!” అనేసి ఒక క్షణం తరవాత తల ఎత్తి ఆమె కళ్ళ లోకి చూశాను.
నా వంకే తదేకంగా చూస్తుంది ఆమె.
నాకు సిగ్గు వెయ్యలేదు – భయం వేసింది.
“మీరు...మీరు...యు ఆర్ గ్రేట్!”
నేను లేచి నుంచున్నాను. ఆమెకు చెయ్యి అందించాను. ఆ ఊతతో ఆమె లేచి నిలబడింది.
“గురూజీ!”
జూనియర్ అల్లంత దూరానా ఆగిపోయాడు. అతను చూశాననుకుంటున్న దేమిటో నాకు తెలుసు.
“కమాన్, లెట్స్ గో! బస్సు బయలుదేరుతుందట”
“ఫరవాలేదు. ఒక్క అయిదు నిమిషాలలో మిమ్మల్ని కలుస్తా!” కన్యాకుమారి జూనియర్ వంక చూడకుండా నా చేతిని ఆమె చేతిలోకి తీసుకుని మలుపు తిరిగింది.
నాకు వెనక్కి చూడాలనిపించలేదు.
“అదో బజారు మనిషి. ఆ క్రాంతి గాడితోనూ ఇలాగే తిరిగింది. ఒక్కొక్క క్యాంపులో ఒక్కొక్కడిని పడుతుంది!” ఎవరో అంటున్నారు.
కన్యాకుమారి ఆ మాటలు విందా?
శివలింగం ఎదుట నేను చేతులు జోడిస్తుండగా నన్ను అడిగింది. “కాకతి రుద్రమకీ, శిల్పాచార్యుడికి సంబంధం ఉందని మీరు నమ్ముతారా?”
“నమ్మను. ఉందని ఎవరైనా ఋజువు చెయ్యగలిగితే, ఉన్నందుకు దిగ్భ్రాంతిచెందను. కాకతి రుద్రమ కాకతి రుద్రమే!”
“సుందరి ఎక్కడుంది?” ఆమె చటుక్కున అడిగింది.
ఎదుటి వారి వ్యక్తిగత విషయాల మీద మనుషులకు ఎందుకో ఇంత ఉత్సుకత!
నేను వినపడ్డా వినపడనట్టు నటించాను. కళ్ళు మూసుకుని చేతులు జోడించాను.
“ఈ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పండి! ప్లీజ్” ఆమె అడిగింది మళ్ళీ.
నాకు శివమెత్తిందేమో! ఆమె చెయ్యి పట్టుకుని గబగబా ఆమెను బయటకు తీసుకొని వచ్చి చెయ్యి విరగ్గొట్టబడిన శిల్ప సుందరి వంక వేలెత్తి చూపించాను.
నిదానంగా ఆమె ఆ శిల్పం వంక చూసి తల దించుకుంది.
బస్సు హారన్ మృతులను మేల్కొల్పడానికా అన్నట్టు మార్మోగి పోతోంది.
కన్యాకుమారి నా చేయి పట్టుకుని నన్ను ముందుకు తీసుకుపోతోంది. బస్సులు ఉన్న మనుషులంతా తన వంకే చూస్తున్నారన్న ఆలోచన లేకుండా!
------ సమాప్తం -----
**(ఆంధ్రప్రభ, 28.07.1982 సౌజన్యంతో )**