గత సంచిక తరువాయి »
అన్నపూర్ణ పోయి నెల గడిచిందో లేదో నేను ఒంటరిగా అమెరికాలో కాలుపెట్టడం జరిగింది. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ పిల్లలూ – అంతా ఎయిర్పోర్టుకి వచ్చి నాకు ఆహ్వానం పలికారు. కోడళ్ళిద్దరూ అత్తగారి మరణాన్ని తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఆపై భార్యని కోల్పోయి నిర్భాగ్యుణ్ణైన నాకు, అక్కడికక్కడే ఓ నాలుగు ఓదార్పు మాటలు చెప్పారు.
నా నెక్స్టు స్టెప్పు పెద్దబ్బాయి ఇంట్లో. అందరం కలిసి పెద్దాడి ఇంటికి వెళ్ళాము. ఒకరోజు అందరితోనూ గడిపి, సెలవు లేదని తన ఊరికి వెళ్ళిపోయాడు చిన్నాడు కుటుంబంతో సహా.
పెద్దాడికి ఇద్దరు పిల్లలు. “తాతా! తాతా” అంటూ వెంట తిరిగే మనుమడు, మనుమరాలూ నా కెంతో ఉపశమనాన్నిచ్చారు. వీలైనప్పుడల్లా వాళ్ళకి పురాణ గాధలు చెపుతూ, నీతి శతకాల్లోని పద్యాలను నేర్పిస్తూ నెమ్మదిగా నా దుఃఖాన్ని తట్టుకోగలుగు తున్నాను. అలా మూడునెలలు గడిచేసరికి, ఒకసారి చిన్నాడి ఇంటికి కూడా వెళ్లిరావాలనిపించింది నాకు. ఆ మాట పెద్దాడికి చెప్పాను. దగ్గరలోనే “లాంగ్ వీక్ ఎండ్” ఉండడంతో అప్పుడు చిన్నాడి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు.
ఇద్దరన్నదమ్ముల ఇళ్ళ మధ్య దూరం మూడు గంటలుట! అలా దూరాన్ని కాలంతో కొలవడం అక్కడ మామూలే! దాన్ని మనం – ఒక కారు గంటకి అరవై మైళ్ళ వేగంతో ఫ్రీవే పై నడిచినప్పుడు ఆ ప్రదేశం చేరడానికి మూడు గంటలు పడుతుందని అర్థం చేసుకోవాలి! పెద్దవాడు ఒకరోజు తమ్ముడీంట్లో గడిపి తిరిగి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉండిపోయాను.
వీళ్ళపిల్లలు మరీ చిన్నవాళ్ళు. కోడలేమో ఉద్యోగస్థురాలు. అంతకు ముందు పద్ధతులు ఎలా ఉన్నా నేను వచ్చాక కొన్నిపనులలో నేను కల్పించుకున్నాను. పిల్లల్ని దగ్గరలోనే ఉన్న బడికి తీసుకువెళ్ళి, తీసుకువస్తూ, తల్లితండ్రులు ఆఫీసునుండి తిరిగివచ్చే వరకు “బేబీసిట్” చేస్తూ బిజీ ఐపోయానేమో పూర్ణను తలుచుకుని బాధపడేందుకు తగినంత తీరిక ఉండేది కాదు. పిల్లల ఉనికి నేను, నా ఉనికిని పిల్లలు బాగా ఆనందించాము. వాళ్ళు నా పక్కలోనే పడుకుని చిన్నచిన్న కథలు వింటూ నిద్రపోయేవారు. అలా రెండు నెలలు గడిచాయి.
ఒక వీకెండ్ పెద్దాడు మళ్ళీ చిన్నాడింటికి వచ్చాడు కుటుంబంతోసహా. వస్తూనే, “నాన్నా! ఫారాలు ప్రింట్ చేసి ఇస్తా, ఫిల్ చేసి సంతకాలు పెట్టి ఇయ్యి, నీకు “గ్రీన్ కార్డు”కి అప్లై చేద్దాం అనుకుంటున్నా” అన్నాడు.
అదివిన్న చిన్నాడు, “ఔను నాన్నా! అలాగైతేనే బాగుంటుంది. ఎలాగూ నేనూ అన్నయ్య ఇక్కడే ఉన్నాము కదా! ఇంక నువ్వు ఒక్కడివీ అక్కడుండి అవస్థలు పడడం ఎందుకు? నువ్వూ ఇక్కడే మాతోనే ఉందువుగాని” అంటూ అన్నగారికి వత్తాసు పలికాడు.
నాకు చాలా సంతోషమనిపించింది. మనుమలతో గడపడం అన్నది నాకు ఎంతో ప్రశాంతత నిస్తోంది. వాళ్ళను విడిచి వెళ్ళడం అన్నది నాకూ కష్టమే! పెద్దాడు తీసుకున్న నిర్ణయం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
ఆరోజు ఆదివారం. ఉదయమే అన్నదమ్ములిద్దరూ పిల్లల్ని తీసుకుని ఏదో “షో” ఉందని చూడ్డానికి వెళ్ళారు. స్పెషల్ పిండివంట ఏదో చేస్తామంటు తోటికోడళ్ళిద్దరూ వంటగదిలో చేరారు. నేను టీవీ చూస్తూ కూర్చున్నా. కొంతసేపటికి అది విసుగనిపించి, కాసేపు అలా తిరిగివస్తానని కోడళ్ళకు చెప్పి, బయలుదేరే సన్నాహం మొదలుపెట్టా.
వాకింగ్ షూస్ గరాజ్ లో ఉంటాయి. వాటికోసం తలుపు తెరిచి, గరాజ్లో ఒక కాలు పెట్టానో లేదో, సరిగా నొక్కకపోడం వల్ల స్టాపర్ పట్టు సడలి గరాజ్ తలుపు భడాలున మూసుకుంది. ఆ తలుపు సందులో నా కాలు చిక్కుకుపోయి, ఆ దెబ్బకి నాప్రాణం కడంటిపోయింది. “కెవ్వు” మంటూ వచ్చిన కేకను బలవంతంగా ఉగ్గబట్టి, గుమ్మంలో చతికిలబడి కూర్చుని, బాధపెడుతున్నచోట చేత్తో రాసుకుంటూ, సాయానికి కోడళ్ళను పిలవాలా వద్దా – అని తికమక పడుతున్న నాకు వాళ్ళిద్దరూ చెప్పుకుంటున్న మాటలు వినిపింఛాయి.
తలుపు మూసుకున్న చప్పుడు వినిపించడంతో, నేను బయటికి వెళ్ళిపోయాననుకున్నారు కాబోలు, వాళ్ళు మనసు విప్పి మాటాడుకోసాగారు….
“టిఫిన్ తినడం అయ్యిందిగా, ముసలాయన షికారుకి చిత్తగించారు కాబోలు! మళ్ళీ దర్శనం భోజనం వేళకే” అంది చిన్నకోడలు వెటకారంగా.
“ఆ ! ఇంక వేరే పనేముంది కనక, తినడం, తిరగడం తప్ప!” మరింత వెటకారం చూపించింది పెద్దకోడలు.
ఇంత గౌరవంగా నన్ను వాళ్ళు తలుచుకుంటూండగా నేనింక వాళ్ళని సహాయమేమడగ గలను! అలాగే, దెబ్బతగిలినచోట చేత్తో రాసుకుంటూ, జివ్వున ప్రాణం తోడేస్తున్న బాధను అలాగే ఓర్చుకుంటూ మౌనంగా అక్కడే కూర్చుండిపోయా. వాళ్ళమాటలు వద్దనుకున్నా నాకు వినిపిస్తునే ఉన్నాయి.
“ఔనుగాని అక్కా! బావగారు ఆయనగారికి గ్రీన్ కార్డుకి అప్లై చేస్తానంటున్నది నిజమేనా? అంటే ఆయన “స్థిరోభవ, వరదోభవ” అని – ఇక్కడే మన నెత్తిలమీదే పర్మనెంటుగా తిష్ట వేస్తారన్నమాట! అంతేనా?”
“అదేకదా దానర్థం! మీ బావగారికి నేనెన్నో విధాలుగా చెప్పిచూశా, వినిపించుకుంటే కదా? మనమైతే, ఏ లెఫ్టో వర్సో, పిజ్జాయో, పాస్టాయో – ఏదో ఒకటి తిని రోజు గడిపేస్తాం. ఈయనకోసం- మన కర్మ కాకపోతే ఏమిటి చెప్పు – ఏరోజునా ముద్దపప్పు, ముక్కలపులుసు వండి చావాల్సిందే కదా! ఆంధ్రా కుయిజిన్ తప్ప మరోటి సయించదు కదా!”
“నీకు ఉద్యోగానికి వెళ్ళే పని లేదు కనక తీరుబడిగా అలా వండి వడ్డించగలవు. అలా నాకెలా వీలౌతుంది? ఏది వండితే అదే పెడుతున్నా, ఇక తినడం, తినకపోడం అన్నవి ఆయన ఇష్టం. నాకేం దాంతో సంబంధం లేదు. ఆయన ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతానంటే నేను ఒప్పుకోను. కాదూ కూడదని నా మొగుడు పట్టుపడితే నేను విడాకులిచ్చి వెళ్ళిపోయి, వేరేచోట ఉద్యోగం వెతుక్కుంటా, అంతేగాని నాకు ఇష్టం లేని పని చస్తే చెయ్యను.”
“మరే పాపం! నేనే లోకువ అందరికీ! నువ్వు ఉద్యోగస్తురాలివని అంతా నా నెత్తిన తొక్కెయ్యాలనుకుంటే నేనూ ఒప్పుకోను. ఇప్పుడు నేనేం తీరుబడిగా లేను, ఉద్యోగం చెయ్యటం లేదని నేనేమీ ఊరికే లేను, సోషల్ సర్వీస్ చేస్తున్నాను. ఎంతమందో నిస్సహాయులకు సాయపడుతున్నాను. నేను ఒక్క క్షణం కనిపించకపోతే చాలు వాళ్ళు నాకోసం తహతహలాడిపోతారు. మానవసేవే మాధవ సేవ!”
“ఏమో అక్కా! అదేం నాకు తెలియదు. నాజోలికి మాత్రం మీరెవరూ రావద్దు. ఆయనకి గ్రీన్కార్డు తెప్పించాలన్న ఆలోచన మొదట మీకే వచ్చింది కనుక ఆ బాధ్యతంతా మీదే! ఇదివరకైతే అత్తగారు తోడుండే వారు కనుక, ఈయనకి కావలసినవన్నీ ఆవిడ చూసుకునేవారు. అంతేకాదు, మనకీ ఎంతో సాయంగా ఉండేవారు. ఏదో రెండు మూడు నెలలేకదా అని ఏదోవిధంగా గడిపేద్దామని ఈయన్ని తీసుకురమ్మన్నా, అంతేగాని ఇలాగైతే ….”
చిన్నకోడలి మాట ఇంకా సాంతం పూర్తవ్వకుండానే పెద్దకోడలు అందుకుంది, “ఐతే ఇక నాకే నన్నమాట ఈ వెట్టి చాకిరీ మొత్తం! రానియ్ ఆయన్ని, ఇప్పుడే, ఇక్కడే తేల్చిపారేస్తా తాడో – పేడో!”
ఇక చాలు, వినవలసిన మాటలన్నీ వినడం అయ్యింది. కాలునెప్పి కూడా తగ్గినట్లనిపించింది. కొత్తబాధ వచ్చి పాతబాధను మరపించినట్లుంది. ఎవరైనా వచ్చినన్ను చూస్తారేమోనని భయపడ్డాగాని, పని తొందరలో ఉన్నారు కాబోలు ఎవరూ అటు రాలేదు. కొంతసేపటికి బాధ చాలావరకు తగ్గడంతో, నెమ్మదిగా లేచి వీధితలుపు సడి చప్పుడుకాకుండా తెరుచుకుని, బయటికి వెళ్లి, తిరిగి అలాగే శబ్దం కాకుండా తలుపు మూసేశా. కాలికి జోడైనా లేకుండా పార్కువైపుగా నడవసాగాను.
*****
పార్కుకి, ఇంటికి మధ్య ఒక్క ఫర్లాంగు దూరం ఉంటుందేమో! కల్లోల సాగరమధ్యంలో ఉన్న దీవిలా జనారణ్యం మధ్యలో ఒక ప్రశాంత వన వాటిక అది. పైన్, ఓక్, మేపుల్, అల్డర్వుడ్ -ఇలా రకరకాల వృక్షాలు పెరిగి ఉన్నాయి అక్కడ. కానీ, వాటిలో ఐదు చెట్లు మాత్రమే ఓక్ చెట్లు. అందుకే దానికి “ఫైవ్ ఓక్సు పార్కు” అని పేరు పెట్టారు. అక్కడ, పెద్దలు విశ్రాంతిగా కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి, పిల్లలు ఆడుకోడానికి కావలసినంత వీలు ఉంటుంది. అది ఎటూ కాని సమయం కావడంతో అప్పుడక్కడ ఎవరూ లేరు. ఎండనుండి తప్పించుకోడానికి చెట్ల గుబురుల్లో చేరిన పిట్టల కిలకిల రావాలు మాత్రం వినిపిస్తున్నాయి. నేనువెళ్ళి, దట్టంగా పెరిగిన ఓకుచెట్టు నీడలో, చెట్టు కింద నున్న బెంచీ మీద కూర్చున్నా. గాయపడిన మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది ….
వృద్ధాప్యం జీవులకు శాపం. అర్ధాయుష్కులు తప్ప మరెవరూ దీనినుండి తప్పించుకోలేరు. ఇన్నేళ్ళు బాగా బ్రతికినా జీవిత చరమాంకంలో జీవికి ముదిమితాలూకు అగచాట్లు తప్పవు. వయసు పెరిగి శిథిలమైపోతున్న శరీరం పెట్టే బాధలు ఎన్నో! మనసైనా ప్రశాంతంగా ఉండాలంటే కావలసింది ఆత్మీయమైన పలకరింపు. మనది పితృస్వామ్య సంస్కృతి కనుక వృద్ధులైన తల్లితండ్రుల్ని జీవిత చరమాంకంలో సాకవలసిన పూచీ కొడుకులమీదే ఉంచి, నరక యాతనల వంటి వృద్ధాప్యపు యాతనలకు “పున్నామనరక”మని పేరుపెట్టి, దానిని తరింపజేసే భాద్యత కొడుకులదే అన్న నియమంపెట్టారు. కాని భార్య సహకరించనప్పుడు ఏ పురుషుడైనా నిర్వీర్యుడు కావలసినదే కదా!
నేనింక వాళ్ళకి భారంగా అక్కడ ఉండదల్చుకోలేదు. నామూలంగా వాళ్ళ పచ్చని జీవితాలు పాడై పోకూడదు. అలాగని నేను ఇండియా వెళ్ళిపోతే అక్కడ నాకు దిక్కెవరు? మానవుడు సంఘజీవి. ఒంటరిగా బ్రతకడం కష్టం, ఏంచెయ్యాలి – అని ఆలోచనలో పడ్డాను.
తలెత్తి చూసిన నాకు, పైన గొడుగులా విస్తరించి సూర్య కిరణాలు నాపై పడకుండా అడ్డుకుని నన్ను కాపాడుతున్న ఓకు చెట్టు కనిపించింది. గాలికి కదులుతున్న దాని ఆకుల సందునించి దూసుకు వస్తున్న మధ్యహ్న భానుడి కిరణాలు సూటిగా కళ్ళలోపడి, కళ్ళను మిరిమిట్లు గోనేలా చేస్తున్నాయి. కళ్ళు గట్టిగా మూసుకుని, మనశ్శాంతికోసం ధ్యానం చెయ్యడం మొదలుపెట్టా. అప్పుడు స్ఫురించింది నాకీ సంగతి …. కొంతమంది వృద్ధులు ఒకరికొకరు సాయంగా ఒకచోట చేరి కలిసికట్టుగా బ్రతకడం బాగుంటుందన్నది. ఇండియా వెళ్ళిపోయి ఈ పధకాన్ని అమలు చెయ్యడం బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాను. అక్కడితో నాకు కొంత ప్రశాంతత చిక్కింది.
నెమ్మదిగా, నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయా కాబోలు, నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి సూర్యుడు పడమరకి తిరిగి పోయాడు. ఓకు చెట్టు నీడ చల్లగా సేదతీర్చేదిగా ఉంది. నా ఆలోచనలు ఒక కొలిక్కి రావడంతో నా మనసు నిర్మలమయ్యింది. లేచి ఇంటికి బయలుదేరా. కొద్ది దూరం వెళ్ళేసరికి మా అబ్బాయిలు నన్ను వెతుక్కుంటూ ఎదురువచ్చారు. అందరం కలిసి ఇల్లు చేరుకున్నాము.
*****
మా పెద్దబ్బాయి చెప్పిన ఫారాలమీద నేను సంతకం చెయ్యలేదు. ఇండియాని మిస్సవుతున్నాననీ, వెళ్ళక తప్పదనీ పట్టుపట్టా. చివరకు టిక్కెట్లు కొనక తప్పలేదు వాళ్ళకి. కొడుకులూ, కోడళ్ళు కలిసి నాకు గొప్పగా ‘సెండాఫ్’ ఇచ్చారు. హోటల్లో పార్టీ ఇచ్చారు. ఏవేవో బహుమతులు కొని ఇచ్చారు. అందరూ ఎయిర్ పోర్టుకి వచ్చి వీడ్కోలు చెప్పారు.
“బైబై అమెరికా! బై ఫరెవ్వర్” అంటూ మనసులోనే అమెరికాకి వీడ్కోలు చెప్పి సెలవు తీసుకున్నా. అందరికి వీడ్కోలు చెప్పా . పిల్లలు మాత్రం ఒక పట్టాన నన్ను వదలిపెట్ట లేదు. చివరిదాకా “తాతయ్యా! నువ్వు వెళ్లొద్దు” అని నన్ను పట్టుకుని ప్రాధేయపడుతూనే ఉన్నారు. వాళ్ళను వదిలి వెళ్ళడానికి నాకూ భారంగానే ఉంది. కాని, తప్పదు.
*****
“ఇదయ్యా ప్రొఫెసర్! ఈ అన్నపూర్ణ వృద్ధాశ్రమం వెనుకనున్న కథ. పార్కులోని ఓకు చెట్టు క్రింద నాకు జ్ఞానోదయమయ్యింది. అందని ప్రేమల కోసం ఆశించి భంగపడేకంటే, ఆ ప్రేమేదో నేనే నలుగురికీ పంచడంలోనే అర్థం, పరమార్థం కుడా ఉన్నాయని గ్రహింపు వచ్చింది నాకు ఆ చెట్టు క్రిందనే. అన్నపూర్ణకి పుట్టింటివారు స్త్రీ ధనంగా ఇచ్చిన భవనాన్ని ఆడవాళ్ళకోసం, నేను నా పూర్ణకి స్వార్జితంతో కట్టించి ఇచ్చినది, అంటే ఈ భవనం పురుషులకి కేటాయించాను. వసతి ఉన్నంతవరకు వీటిలో ఆసరా లేని వృద్దులెవరైనా సరే వచ్చి ఉండవచ్చు. ఖర్చులు మాత్రం అంతా కలిసి పంచుకోవాలి. మా రాంజీ కోడలు వీటికి మేనేజింగ్ ట్రష్టీ. నా పూర్ణ ఎప్పుడూ ఎవరికైనా సాయం చెయ్యాలని తాపత్రయపడుతూ ఉండేది. అదే పని ఇక్కడ ఇప్పుడు ఆమె పేరుమీద జరుగుతోంది. కష్టసుఖాల్నీ, ఖర్చుల్నీ కలబోసి పంచుకుంటూ, వృద్ధుల మిక్కడ ఒకరికొకరు తోడుగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాము” అంటూ చెప్పడం ముగించారు శివానందంగారు.
truthful agony! God save us all oldies
vvb