పెదపూడి గ్రామంలో వుంటున్న రాఘవరావు ఆర్ధికంగా వున్నవాడు. పొలాలు, డబ్బు, నగలు అబ్బో అన్నీ విధాలా సంపాదించాడు. పెద్ద ఇల్లు, నౌకర్లు పగలు ఎప్పుడూ సందడిగా వుంటుంది. రాఘవరావు గారి అబ్బాయి ప్రవీణ్ చాలా తెలివైన వాడు. దగ్గరగా వున్న పాఠశాలలో ఐదవ తరగతి చదువు తున్నాడు.
ఒకరోజు నాన్నతో కలిసి బజారుకి వెళ్ళాడు ప్రవీణ్. అక్కడొకడు రామ చిలుకలు అమ్ముతున్నాడు. ఆకుపచ్చగా ముద్దుగా వున్న చిలుక కొనమన్నాడు ప్రవీణ్.
“ఇప్పుడెందుకు అయినా అలా పక్షులను బంధించకూడదు.” అన్నాడు రాఘవరావు.
“ఫరవాలేదు నాన్నగారు అంతగా అయితే నేను నాలుగు రోజులు ఆడుకుని వదిలేస్తా. అప్పుడు దానికి స్వేచ్ఛ కూడా దొరుకుతుంది” అన్నాడు ప్రవీణ్.
కొడుకు మాట కాదనలేక ఒక చిలకను కొన్నాడు.
“బాబు నువ్వు దానికి మాటలు నేర్పితే అది మాట్లాడుతుంది” అని చెప్పాడు ఆ చిలకలు అమ్మేవాడు.
“భలే భలే అంటూ ఆ చిలకను పంజరం తో సహా ఇంటికి తెచ్చి వరండాలో ఒక కొక్కానికి తగిలించాడు ప్రవీణ్. చిలకకు దోర జాంపండు పెట్టేవాడు. దానికి రోజూ “శుభోదయం” అని చెప్పేవాడు. నాలుగు ఐదు సార్లు చెప్పిన తరువాత చిలక “శుభోదయం” అనే మాట నేర్చుకుంది. అప్పటి నుండి ఎవరు కనిపించినా ఆ చిలుక “శుభోదయం” అని మాట్లాడేది. ఆ మాటకు ప్రతిగా వాళ్ళు కూడా “శుభోదయం” అనే వారు, అప్పుడు చిలక రెక్కలు ఆడించేది ఆనందంగా.
ఉదయం పది గంటలకు రాఘవరావు ఇంటి ముందు నిలుచున్నారు ఇద్దరు దొంగలు.
“ఒరే ఇదే ఇల్లు. ఈ ఇంట్లో చాలా డబ్బు, నగలు వున్నాయని అందరూ అనుకుంటున్నారు. మనం గాని ఈ ఇంట్లో దొంగతనం చేసామా ఇక చాలాకాలం దొంగతనం చేయక్కరలెద్దు,” అన్నాడు ఒక దొంగ, మరో దొంగతో.
“సరే అన్నీ కనుకున్నావుగా కుక్కలు లేవు కదా!” అన్నాడు రెండో దొంగ.
“కుక్కలు లేవు ఒక చిలక మాత్రం వుందట. దానికి ఒకే మాట వచ్చు అన్నారు. అన్నాడు మొదటి దొంగ.”
“చిలక దేముందిలే పంజరంలో వుంటుంది. అయితే ఈ రాత్రికే మనం ఈ ఇంట్లో దొంగతనానికి వెడుతున్నాం” అన్నాడు రెండవ దొంగ.
అలా ఇద్దరు మాట్లాడుకుని ఆ రాత్రి ఆ ఇంటిలో ప్రవేశించారు. అప్పుడు రాత్రి పన్నెడు కావొస్తోంది. లోపలికి వచ్చిన దొంగలని చూసి చిలక ”శుభోదయం” అంది.
“చూశావా దీనికి ఈ ఒక్క మాటే వచ్చు. ఇంత రాత్రివేళ శుభోదయం అంటోంది” అన్నాడు మొదటి దొంగ నవ్వుతూ. కాని చిలక మాటకి ప్రతిగా “శుభోదయం” అనలేదు. దాంతో చిలక మరలా శుభోదయం అంది. దొంగలు ఏమి మాట్లాడలేదు. ఇక చిలక శుభోదయం.. శుభోదయం.. శుభోదయం .. అని అరవసాగింది.
చిలక మాటలు విన్న రాఘవరావు, పనివాళ్ళు లేచి గబ గబ లేచి లైట్లు వేసి అప్పుడే బీరువా తెరవ బోతున్న దొంగలని చూశారు. అంతా దొంగలు.. దొంగలు.. అనడం తో అమ్మో అనుకుంటూ దొంగలు గోడ దూకి పారి పోయారు. కొంత దూరం వెంబడించి వాళ్ళు దొరకక వెను తిరిగారు రాఘవరావు పనివాళ్ళు.
“రాఘవరావు గారి ఇంట్లో దొంగలు పడ్డారట. వాళ్లని చిలక పట్టించిదట” అని అనుకోసాగారు అక్కడ ప్రజలు.
“చిలక ‘శుభోదయం’ అన్నప్పుడు దొంగలు కూడా ‘శుభోదయం’ అంటే సరి పోయేది దొంగలు అలా ఆనక పోవడం వలనే చిలక అరిచింది. దాంతో అంతా లేచి ఆ దొంగలని తరిమారు అన్నాడు ఒక వ్యక్తి.
“హర్ని .. చిలకకు ఒక్క మాటే తెలుసు అని తెలుసుకున్నాం గానీ మనం అదే మాట అంటే ఇక అది మాట్లాడదు అని తెలుసుకోలేకపోయాం. ఇక అక్కడ కాపలా ఎక్కువై పోయింది. చేతులారా అవకాశం పాడు చేసుకున్నాం” అని అనుకున్నారు దొంగలు.
“చూశారా నాన్న గారు మన చిలక దొంగలని ఎలా కనిపెట్టిందో” అన్నాడు ప్రవీణ్ తండ్రితో.
“అవును చిన్నా .. నీవన్నది నిజమే. ఆ చిలుకకు మరిన్ని మాటలు నేర్పేందుకు ప్రయత్నించు అలాగే మంచి ఆహారాన్ని, నీరును అందిస్తూ దానిని జాగ్రత్తగా చూసుకో” అన్నాడు రాఘవరావు.