Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
శివుని పంచముఖాలు
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
మ.కో. శక్తిభూతశరీరప్రాణదిశాహృషీక(1)ప్రతీకలౌ 
         శక్తినాథుని పంచవక్త్రవ్రజంబు నెంచుచుఁ గాంచినన్ 
         భక్తిమై యభిషేకపూజల, జ్ఞానదీపపు కాంతిచే
         త్యక్తమౌ భవపాపవృత్రము, వ్యక్తమౌ శుభశాంతులే
               (1) ఇంద్రియములు
[ఈ క్రింది పద్యములలో శివుని ఒక్కొక్కరూపము ఏ దిక్కు వైపు తిరిగిన
ముఖము కలిగి ఉండునో, ఏ రంగుతో ఉండునో, పంచభూతములలో
మఱియు పంచశక్తులలో దేనికి ప్రతీకయో, ప్రధానముగా ఏ లక్షణములను
కలిగి ఉండునో చెప్పబడును.]

తత్పురుషుఁడు
తే.గీ. తూర్పుముఖుఁడయి స్థితికి, ‘సంతోషశక్తి’
        నీరములకుఁ బ్రతీకయై నిలుచు నేత,
        కాంచనచ్ఛాయతో నుదయించు తరణి,
        రోదసీయజ్ఞమునకుఁ బురోహితుండు

వామదేవుఁడు
తే.గీ. అరుణవర్ణముతో లసదభయవరద
       హస్తములు ‘క్రియాశక్తి’యు ననిలమునకు
       ఉత్తరముఖుండు సర్వమహోన్నతమగు
       స్వాభిమానస్వరూపుఁడై యతిశయించు

సద్యోజాతుఁడు 
తే.గీ. స్వచ్ఛవర్ణముతోఁ దానె వ్యాకృత(1)మగు
       కల్పనాపాటవమున కాకాశమునకు
       ‘జ్ఞానశక్తి’కిఁ బ్రత్యఙ్ముఖంబు(2)తో స
       దాశివుండె ప్రతీకయై దయనుఁ జూపు
            (1) ప్రకటింపబడినది (2) పశ్చిమముఖము

అఘోరుఁడు
తే.గీ. భయ మెఱుంగని ధర్మరూపంబు దాల్చి 
        లయ మొనర్చు ‘నిచ్ఛాశక్తి’నయనిధాన
        మయిన యామ్యాస్య(1)కాలవర్ణాగ్నిలక్ష్మ(2)
        లక్షితుండయి శోభిల్లు నక్షరుండు
            (1)దక్షిణముఖము (2) అగ్నికి చిహ్నము

ఈశానుఁడు
తే.గీ. ‘సృష్టిశక్తి’స్వరూపుఁడై యిలకు సంజ్ఞ,
       ఊర్ధ్వముఖకాంస్యవర్ణుఁడై యొప్పి వేద
       విధివిధానాల దన్నయి(1) విశ్వవిభుని
       యాధిపత్యము నెలకొల్పు నద్భుతముగ 
             (1) దన్ను+అయి

--- ఓం నమః శివాయ ---

Posted in December 2024, సాహిత్యం

1 Comment

  1. GSS Kalyani

    పరమేశ్వరుడి పంచముఖాలలో శివ’శక్తి’ని వర్ణించిన విధానం అద్భుతం🙏!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!