శంకరంబాడి సుందరాచారి
ఆదికవి నన్నయ్య మొదలు, తిక్కన, ఎఱ్రాప్రగడ కవిత్రయం సాక్షిగా, నాటి నుండి నేటి వరకు ఎందఱో మహానుభావులు, భాషా పండితులు మన తెలుగు సాహితీ భాండాగారాన్ని తమ అనిర్వచనీయమైన రచనలతో నింపి తెలుగు భాషామతల్లికి సదా నీరాజనాలు అర్పిస్తూనే ఉన్నారు. ఒకరు కాదు వందమంది కాదు వేలమంది తెలుగు కవులు తమదైన శైలిలో ఎన్నో రచనలను మనందిరికీ అందించి మనకు భాష మీద మమకారం రెట్టింపు అయ్యేందుకు, మనలో అణగారిపోతున్న భాషా శ్వాసకు ఊపిరి పోసి మన తెలుగు భాష పరిరక్షణకు పూనుకొన్నారు. అటువంటి ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొంది, మన తెలుగు రాష్ట్ర గీతమైన “మా తెలుగుతల్లికి మల్లెపూదండ...” ని రచించిన శ్రీ శంకరంబాడి సుందరాచారి నేటి మన ఆదర్శమూర్తి.
ఇరవయ్యో శతాబ్దంలో పుట్టిన ప్రతి తెలుగువానికి సుపరిచితమైన గేయ రచయితులలో మన సుందరాచారి ఒకరు. అయితే ఎంతటి పాండిత్య పటిమ కల వారైననూ అదృష్టం వరించకపోతే వారి ప్రతిభకు సరైన గుర్తింపు లభించదు. వారి రచనలు అంతగా ప్రాచుర్యం పొందవు. తన వ్యక్తిగత గుర్తింపుకోసం ఏనాడు ప్రయత్నించని ఈ స్వాభిమానికి, తన రచనలకు తగిన గుర్తింపు లభించలేదనే చెప్పవచ్చు.
అక్టోబర్ 8, 1914, కమలమ్మ, రాజగోపాలాచారి దంపతులకు జన్మించిన మన సుందరాచారి బాల్యం అంతా తిరుపతిలోనే జరిగింది. ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి అయిన తరువాత మదనపల్లె లో మదనపల్లె బెసెంట్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
మన సుందరాచారి లేతవయసునుండే తెలుగు సాహిత్యం మీద ఎంతగానో ఆసక్తి కనబరుస్తూ ఎన్నో వ్యాసాలు, కవితలు వ్రాయడం మొదలుపెట్టారు. కనుకనే చదువు పూర్తైన వెంటనే నాడు ఎంతో పేరుపొందిన ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రిక లో ఉద్యోగం సంపాదించి, తన ప్రతిభతో ఉపసంపాదకుడి ఉపసంపాదకుడి స్థాయికి ఎదిగాడు. ఆ తరువాత కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిని కూడా చేపట్టాడు. అయితే ఎక్కడ కూడా ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం మరియు ఇతరుల కోసం తన స్వాభిమానాన్ని తాకట్టుపెట్టి జీవించలేదు. అందుకనే వివిధ రంగాలలో ప్రవేశించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించారు.
సుందరాచారి గారు ఆంధ్రపత్రికలో కళావని శీర్షికతో వ్రాసిన వ్యాసాలు ఆయనను సాహిత్య ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ తరువాత ఆయన నాస్వామి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృతులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యుడు వంటి ప్రబోధ రచనలు, శాంతి దూతలు, రంగిరాస్యం వంటి జానపద రచనలు చేశారు.
కానీ, దురదృష్టవశాత్తూ ఎక్కడా కూడా స్తిరత్వాన్ని సంపాదించి జీవితంలో ఎదుగుదలకు ప్రయత్నించలేదు. ఆయనలాగే ఆయన రచలను కూడా తరువాతి కాలంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు. అయితే ఒకే ఒక్క పద్యపూరిత గీతం ఆయనను యావత్ తెలుగు జాతికి పరిచయం చేయడమే కాకుండా ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అదే నన్ను ఈ వ్యాసం వ్రాయుటకు ప్రోత్సహించింది.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు,
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ...
మా కన్న తల్లికి మంగళారతులు.
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ...
మా కన్న తల్లికి మంగళారతులు.
గలగలా గోదారి కదలిపోతుంటేను,
గలగలా గోదారి కదలిపోతుంటేను...
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ,
బంగారు పంటలే పండుతాయీ...
మురిపాల ముత్యాలు దొరలుతాయి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ...
మా కన్న తల్లికి మంగళారతులు.
అమరావతి గుహల అపురూప శిల్పాలు,
అమరావతి గుహల అపురూప శిల్పాలు...
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం,
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లీ...
ఏనాడు తనకు గుర్తింపు రావాలని పాకులాడని మహానుభావుడు సుందరాచారి. కనుకనే ఇంతటి మహత్తరమై, జాతికి స్ఫూర్తిని రగిలించే గీతం రచించినను, ఈ పాటకు గుర్తింపు రావడానికి దశాబ్దాలు పట్టింది.
అయినను ఈ రచనే వారి జీవితంలో మల్లెపూదండ గా నిలిచి ఆయనను యావత్ తెలుగు జాతికి పరిచయం చేసి గుర్తింపు నిచ్చింది. 1975 ఏప్రిల్ 12న ఉగాదినాడు జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహాసభలో, నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ తెలుగు రాష్ట్ర గీతంగా గుర్తించింది. అటు పిమ్మట ఈ గీతం అన్నీ విద్యాలయాలలో, పాఠ్యాంశాలలో ఒక భాగమైంది.
పేదా గొప్ప అనే తేడాలేకుండా మనిషి మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు ఉపశమనం కలిగించేది మద్యం అనే అపోహలో అందరూ ఉండిపోతున్నారు. అందుకు విజ్ఞానవంతులు, పండితులు ఏమీ అతీతులు కారు. కారణం మనిషి బుర్ర ఎక్కడైనా ఒక్కటే. పరిస్థితులకు అనుగుణంగా మనిషి ఆలోచనలను మారుతుంటాయి. తాత్కాలిక ఉపశమనం కోసం తీసుకొంటున్న ఆ మద్యపానమే చివరకు వ్యసనంగా మారి మనిషి జీవితాన్ని బలి తీసుకొంటున్నది. ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం. మహానటి సావిత్రి గారి జీవితమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే ఒంటరితనం మనిషి మానసిక వ్యధకు కారణమైతే, చుట్టూ ఉన్న సమాజం ఆ వ్యసనాన్ని ప్రోత్సహించే ఉత్ప్రేరకం అవుతుంది. చివరకు ‘ఎవరి కర్మకు ఎవరు భాధ్యులు?’ అనే ప్రశ్నార్ధక చిహ్నంతో సరిపెట్టుకుంటున్నాం.
మన సుందరాచారి గారు కూడా మద్యానికి బానిసై చివరిరోజులు చాలా దుర్భరంగా గడిపారని తెలుస్తున్నది. ఆయనకు గుర్తింపు వచ్చేసరికి ఆయన జీవితం చివరి అంకంలో ఉండినది. కనుకనే ఆయనకు ఆ గుర్తింపు, గౌరవం, ప్రభుత్వం అందించిన సహాయం ఏవీ కూడా ఆయన ఆయుష్షును పెంచలేదు. అనారో గ్యంతో 1977 ఏప్రిల్ 8న, తను పుట్టిన తిరుపతి గడ్డ మీదే తుదిశ్వాస వదిలారు.
కానీ, మా తెలుగుతల్లికి మల్లెపూదండ గేయం తెలుగు ప్రజల మనసులో ఉన్నంత కాలం ఆయన తెలుగు జాతికి సదా చిరస్మరణీయుడు.