Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

భూపేంద్రనాథ్ దత్తా జీవనరేఖలు

(మరుగునపడిన మహనీయులు)

అద్వైత ధర్మాన్ని అనుష్టాన వేదాంతంగా జనులకు అందించి హైందవ జాతికి పునరుత్తేజాన్ని కలిగించిన స్వామి వివేకానంద తమ్ముడైన భూపేంద్రనాథ్ దత్తా స్వతంత్ర సమరయోధుడు మఱియు కమ్యూనిస్టు విప్లవకారుడు.

Bhupendranath Datta
Source: Writing website of Vinayak Lohani

సెప్టెంబర్ 4 1880న కలకత్తాలో విశ్వనాధ్ దత్తా, భువనేశ్వరీదేవి దంపతులకు జన్మించిన భూపేంద్రనాథ్ దత్తా యుక్త వయసులో బ్రహ్మ సమాజం పట్ల ఆకర్షితులయ్యారు. అలానే తన అన్నగారైన స్వామి వివేకానంద చేత కూడా బాగా ప్రభావితులయ్యారు. 1902లో ప్రమథనాథ్ మిశ్రా స్థాపించిన బెంగాల్ విప్లవ సంఘంలో చేరి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1906లో జుగంతర్ పత్రికకు ఎడిటర్ అయ్యారు. ఆ సమయంలో శ్రీ అరబిందోకు సన్నిహితులయ్యారు. 1907లో దేశద్రోహం ఆరోపణలపై ఒక సంవత్సరం పాటు జైలుపాలయ్యారు. భూపేన్ కేసు ట్రయిల్ జరుగుతున్నపుడు జడ్జితో - ఏయే వ్యాసాలపై కేసు జరుగుతుందో వాటికి పూర్తి బాధ్యత తనదేనని, దేశానికి ఏది మంచిదో అది తన కర్తవ్యంగా భావించి చేశానని, ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయడానికి కష్టపడనవసరం లేదని - స్పష్టం చేశారు. భూపేన్ బెంగాలీల మనసులపై మజినీ, గారిబాల్డీల గురించి జోగేంద్ర విద్యాభూషణ్ చేసిన అనువాదాలు, బంకించంద్ర ఛటర్జీ ఆనందమఠం ప్రభావం చూపెట్టాయని, వారిని చైతన్యవంతం చేశాయని రాశారు.

జైలు నుండి బయటకు వచ్చాక సోదరి నివేదిత, సోదరి క్రిస్టిన్ సహకారంతో 1908లో చదువు నిమిత్తమై అమెరికా వెళ్లారు. అక్కడ బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి యం.ఏ పట్టా పొందారు. అక్కడే కాలిఫోర్నియా గదర్ పార్టీలో చేరి సామ్యవాదం, కమ్యూనిజం గురించి అధ్యయనం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నపుడు జర్మనీ వెళ్లి అక్కడ విప్లవ రాజకీయాలు మొదలుపెట్టారు. 1916లో బెర్లిన్ లోని భారత స్వాతంత్య్ర సంఘానికి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. బెర్లిన్ కమిటీ భారతదేశంలో విప్లవ కార్యకలాపాలు సాగిస్తున్న రాజ్ బిహారి బోస్, బాఘా జతిన్ లకు తోడ్పాటునందించేది. 1921లో మాస్కో వెళ్లి లెనిన్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కు హాజరయ్యారు. ఆ సమావేశంలో యం.యన్.రాయ్, బీరేంద్రనాథ్ దాస్ గుప్తా కూడా పాల్గొన్నారు. అప్పుడు భూపేంద్రనాథ్ వర్తమాన భారతదేశ రాజకీయ పరిస్థితులపై వ్లాదిమిర్ లెనిన్ కు పరిశోధన పత్రం సమర్పించారు. లెనిన్ సలహాపై రైతులను, కార్మికులను సంఘటితం చేసి స్వాతంత్రోద్యమంలోకి తీసుకురావాలని భారత జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సెషన్ కు వినతి పత్రం పంపించారు.

భూపేన్ 1920లో జర్మన్ ఆంత్రోపాలాజికల్ సొసైటీలో, 1924లో జర్మన్ ఆసియాటిక్ సొసైటీలో సభ్యులుగా చేరారు. 1923లో హంబర్గ్ విశ్వవిద్యాలయం నుండి ఆంత్రోపాలజీలో డాక్టరేట్ పొందారు.

1925లో భూపేంద్రనాథ్ దత్తా భారతదేశానికి తిరిగి వచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి తన కార్యకలాపాలు కొనసాగించారు. 1927లో బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడయ్యారు, 1929లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడయ్యారు. 1930లో జరిగిన కరాచీ కాంగ్రెస్ లో రైతుల ప్రాథమిక హక్కులను భూపేన్ ప్రతిపాదించగా, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ ఆ ప్రతిపాదనలను అంగీకరించారు. శాసనోల్లంఘన ఉద్యమంలోనూ, ఉప్పు సత్యాగ్రహంలోనూ పాల్గొని పలుమార్లు జైలు పాలయ్యారు.

జవహర్ లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఒకసారి, సుభాష్ చంద్ర బోస్ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు మరోసారి, భూపేన్ అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు వైస్ ప్రెసెడెంట్ గా పనిచేశారు. భూపేన్ 1927లో కలకత్తా ట్రామ్ వర్కర్స్ యూనియన్ ఏర్పరచి అనేక సంవత్సరాలు ప్రెసిడెంట్ గా పనిచేశారు. బెంగాల్ నాగపూర్ రైల్వే సమ్మె జరుగుతున్నపుడు ఖరగ్ పూర్ లో క్యాంపు ఏర్పాటు చేసి కార్మికులకు ఉత్తేజం కలిగించడానికి అనేక ప్రసంగాలు చేశారు. మీరట్ కుట్ర కేసు జరుగుతున్నపుడు బాధితులకు న్యాయ సహాయం అందజేయవలసిందిగా భూపేన్ జవహర్ లాల్ నెహ్రూకు లేఖ రాశారు. నెహ్రూ సలహా పై కేసు ఖర్చుల కోసం మీరట్ డిఫెన్సె ఫండ్ ను ఏర్పాటు చేశారు. సభ్యత్వం లేనప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతగానో సహకరించారు. అలానే వర్కర్స్ పీసెంట్స్ పార్టీ కార్యకలాపాల్లో కూడా పాలుపంచుకున్నారు. 1943లో బెంగాల్ లో కరువు తలెత్తినపుడు భూపేన్ అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

భూపేంద్రనాథ్ దత్తా బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, జర్మన్ భాషల్లో అనేక పుస్తకాలు రాశారు. తన అన్నగారైన నరేంద్రనాథ్ దత్తా పై ఆంగ్లంలో స్వామి వివేకానంద: దేశభక్తుడు ప్రవక్త అనే పుస్తకం రాశారు. ఫ్రెడరిక్ ఎంగెల్స్ రచించిన సామ్యవాదం: కల్పితము – శాస్త్రీయము అనే పుస్తకాన్ని భూపేన్ బెంగాలీలోకి అనువదించారు. కోశాంబి వంటి చరిత్రకారుల కంటే ముందుగానే మార్క్సిస్ట్ దృక్పథంతో భారతీయ సమాజాన్ని, సంస్కృతిని అధ్యయనం చేశారు. హిందూ కర్మకాండలలో గతి తార్కికత, భారతదేశ భూఆర్థిక వ్యవస్థలోని గతి తార్కికత అనే పుస్తకాలను ఆంగ్లంలో రచించారు.
భూపేన్ రాజకీయ ఆలోచనలు స్థూలంగా ఏంటంటే :- రాజకీయ విప్లవం అనంతరం తప్పనిసరిగా సామాజిక విప్లవం రావాలి, రాజకీయాలు మతం పై కాకుండా సామాజిక ఆర్ధిక అంశాలపై ఆధారపడి నడవాలి,సమాజం శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలి,రాజకీయాలు ఏ కొందరికో పరిమితం కాకూడదు - యువత, విద్యార్థులు,కార్మికులు,రైతులు సంఘటితం కావాలి.

Bhupendranath Datta
Source: Writing website of Vinayak Lohani

భూపేన్ ఇలా అంటారు :- “స్వామి వివేకానందులు మార్క్సిస్టు కాదు, ఆర్థిక శాస్త్రవేత్త కూడా కాదు. కానీ తన ప్రవచనాత్మక సహజ జ్ఞానంతో భారత ప్రజల పునరుత్థానానికి దారి తీసే దశను ఆయన ముందుగానే సూచించారు - అది కులాలూ, వర్గాలూ లేని, భారత ప్రజల కొత్త సాంస్కృతిక చైతన్యంపై ఆధారపడిన సమాజం. ఆయన కోరుకున్నట్లుగా, తూర్పు మరియు పడమరల మధ్య సమన్వయాన్ని సాధించే ఈ కొత్త భారతదేశాన్ని ఆవిర్భవింపజేయాలి”.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భూపేన్ సమరయోధులకిచ్చే సౌకర్యాలేవీ స్వీకరించకుండా కలకత్తాలోని తన పూర్వీకుల ఇంట్లోనే తన అన్నగారైన మహేంద్రనాథ్ దత్తాతో కలసి నిరాడంబరంగా జీవించారు. భూపేంద్రనాథ్ దత్తా 25 డిసెంబర్ 1961న కీర్తిశేషులయ్యారు. ఇప్పటి తరం తప్పకుండా స్మరించుకోవాల్సిన దేశభక్తుడు భూపేంద్రనాథ్ దత్తా.

***ఓం తత్ సత్***

Posted in February 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *