Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

“శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి బోధనల్లో సమాజవాద మానవవాద ధోరణులు”

కమ్యూనిస్టు హ్యూమనిస్టు ధోరణులు భారతదేశానికి అవతల నుండి వచ్చినవి అనుకోవటం పొరపాటు. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఈ ధోరణులు అక్కడక్కడా పొడసూపుతూనే ఉన్నాయి.

మధ్యయుగాల్లో వేమన, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తెలుగుదేశంలో అభ్యుదయ భావాలకు ప్రతీకగా భాసిల్లారు. మనం మొదట శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామిని మహిమలున్న వ్యక్తిగా చూడకుండా ఉండాలి. వారిని తత్వవేత్తగా, కాలజ్ఞానకర్తగా మాత్రమే కాకుండా సంఘసంస్కర్తగా అవగాహన చేసుకుని అధ్యయనం చేయాలి. ప్రాచీన తెలుగు సాహిత్యమంతా పురాణేతిహాసాల అనువాదాలు, అనుసరణలతోనూ, మత పరమైన కథలతోనూ నిండి ఉన్నప్పటికీ, వీటికి భిన్నమైన ఆధునిక, సామాజిక దృక్పథం కలిగిన రచనలు కొన్ని ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. వాటిలో వేమన, బ్రహ్మంగారి తత్వాలు ప్రధానమైనవి.

బ్రహ్మంగారి రచనల్లో కాళికాంబా సప్తశతి సాంఘిక స్వభావం ఎక్కువగా కలది. కాళికాంబా సప్తశతిలో ఏడువందల ఆటవెలది పద్యములు కలవు. ఈ పద్యముల యొక్క మకుటం "కాళికాంబ హంస కాళికాంబ". ఇపుడు కాళికాంబా సప్తశతిలోని సమాజవాద మానవవాద ధోరణిగల పద్యములు కొన్నిటిని తరచి చూద్దాం :-

Karl Marx said “Religion is opium of masses”. మతం అనేది సామాన్య మానవులు ఆర్ధిక అసమానతలపైన, సమాజంలో జరుగుతున్న వర్గ సంఘర్షణలపైన దృష్టి సారించకుండా ఆధ్యాత్మిక అంశాలపైకి, మరణాంతర జీవితంపైకి, కర్మ సిద్ధాంతంపైకి వారి దృష్టిని మరలించి ఉంచే సాధనం వంటిదని ఇంకా సూటిగా చెప్పాలంటే మతం అనేది మత్తుమందు వంటిదని మార్క్స్ అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని బ్రహ్మంగారు కాళికాంబా సప్తశతిలోని ౬౯౩వ పద్యంలో "మతము మత్తు గూర్చు మార్గమ్ము కారాదు హితము గూర్పవలయు నెల్లరుకును హితము గూర్పలేని మతము మానగవలె" అంటూ వ్యక్తపరిచారు. మతం అనేది ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో విశదీకరించారు.

"సర్వమానవులను సమముగా ప్రేమించు కులమతాలనెంచి కోపపడకు" అంటూ ౨౯౬వ పద్యంలో వర్గ రహిత సమాజాన్ని కోరుకున్నారు. "జీవకోటికెల్ల శ్రేయమ్ము దలచెడు పరమార్థికునకు పట్టు దొరకు పరుల హింసపెట్టు పాపి యాతనలందు", "సాటిమానవునకు సాయమ్ము పడబోక నల్లరాళ్లు తెచ్చి గుళ్లుకట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కపడంబోదు" అంటూ ౨౮౮,౨౯౧ పద్యాల్లో మానవులు మధ్య సహకారం స్వభావం ఉండవలసిన అవసరం నొక్కి చెబుతూనే మూఢ విశ్వాసాలను ఖండించారు. ౨౯౪వ పద్యంలో "అష్టమదములున్న అధమాదముండగు కష్ట పడెడువాడు ఘనుడు జగతి పరులకూటి కాసపడును దౌర్భాగ్యుండు" అంటూ, ౧౨౯వ పద్యంలో “పరుల బాధ పెట్టువాడు పశువు, పశువు మేలుగాదె పరులకు తోడ్పడు ?” అంటూ ఇతరుల శ్రమలను దోపిడీ చేస్తూ జీవించే పద్ధతిని ఖండించారు. సమాజంలో అందరూ శ్రమలు చేయాలని చాటారు.

౨౯౮వ పద్యంలో మంత్ర యంత్ర తంత్ర మహాత్మ్య గాథలు భారతీయులకు భారమాయె జనులపాలికవియె శాపమాయె అంటూ మూఢ నమ్మకాలను వ్యాప్తిజేసే పురాణ గాథలను ఖండించారు. నిజమైన ఆధ్యాత్మికత అలవడకుండా, కేవలం కోరికలు తీర్చుకునే నిమిత్తం దేవతలకు జరిపే కర్మకాండలను ప్రచారం చేసే పురాణ గాథల వల్ల మతం సామాన్యులకు భారమయ్యిందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి పురాణేతిహాసాలు మతాన్ని సామాన్యులకు దగ్గరయ్యేందుకు రాసినప్పటికీ, కాలక్రమంలో సారం వదలి పిప్పి మాత్రమే ప్రచారానికి నోచుకోవడంవల్ల అవి మూఢ విశ్వాసాలకు ప్రతీకలయ్యాయి. స్వామీ వివేకానంద సహితం పురోహితులు మతాన్ని సంక్లిష్టం చేశారని విమర్శించారు.

౧౭౯వ పద్యంలో "ఎవరు గనిరి పూర్వమెక్కువ తక్కువ తక్కువెక్కువులకు తానె కర్త ఎక్కువనుట పాప హేతువధర్మమ్ము" అంటూ నిచ్చెనమెట్ల సమాజాన్ని నిరసించారు,సమాజంలో ఒకరికంటే నేను ఎక్కువ అనుకొనుట పాపహేతువన్నారు.

ఈ విధంగా అనేక పద్యాల్లో ఆధునిక ప్రగతిశీల భావాలని వ్యక్తం చేసి, ప్రచారం చేసి సమాజం పురోగమించాలని బ్రహ్మం గారు తపన పడ్డారు. బ్రహ్మం గారిని సహితం ఒక కులానికి పరిమితం చేసి పూజించే దౌర్భాగ్యపు స్థితిలో నేడు మనమున్నాం. ఈ దుస్థితిని తప్పించి బ్రహ్మం గారు చూపిన బాటలో పురోగమించడమే వారికి మనం అందించే ఘనమైన నివాళి.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in October 2025, సాహిత్యం

5 Comments

  1. G. Kumar Babu

    మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు… తప్పక ప్రయత్నిస్తాను.

  2. Siva

    .మీరు చేసిన విశ్లేషణ బహుశా తెలుగు సాహిత్యంలో సమాజపరమైన ప్రగతిశీల ధోరణులపై ఒక మంచి మద్దతుగా నిలుస్తుంది. మీరు స్పష్టంగా చూపించారు – కమ్యూనిజం, హ్యూమనిజం వంటి భావాలు భారతదేశానికి పూర్తిగా విదేశీ కాని, మన సాంస్కృతిక వారసత్వంలోనూ, ప్రత్యేకించి వేమన, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి రచనల్ల
    నూ ఉన్నాయని.

    1. బలమైన తాత్విక ఆధారం: మీరు కార్ల్ మార్క్స్ వంటి అంతర్జాతీయ తత్వవేత్తల మాటలను భారతీయ కంటెక్స్ట్‌లో అనుసంధానించడం చాలా బాగా చేశారు. ఇది పాఠకుని దృష్టిని విస్తృతం చేస్తుంది.

    2. ప్రామాణిక ఉదాహరణలు: కాళికాంబ సప్తశతిలోని పద్యాలను వివరించి, వాటి ఆధారంగా బ్రహ్మంగారి మానవతావాదాన్ని వివరిస్తూ మీరు చక్కగా విశ్లేషించారు.

    3. మానవతా విలువలపై దృష్టి: కులమతాల వ్యతిరేకత, సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల ఖండన వంటి అంశాలపై మీరు చాలా స్పష్టంగా మరియు శక్తివంతంగా వాఖ్యానించారు.

    మీ అభిప్రాయాలు విలువైనవి — మరిన్ని ఇలాంటి రచనలు ఆశిస్తున్నాను.

    • G. Kumar Babu

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు… తప్పక ప్రయత్నిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *