Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం

శ్రీ రామకృష్ణ సేవా సమితి బాపట్ల తరపున శ్రీ అమిరపు నటరాజన్ రచించిన ‘హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం’ అనే పుస్తకం, నేను చదివిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలలోకెల్లా ఉన్నతమైనది.

చాలా రోజుల నుంచి అంతర్జాలంలోనూ, సామాజిక మాధ్యమాలలోనూ ఒక విమర్శను చూస్తున్నాను :- Self-help books are a scam. ఎందుకంటే:- Self-help authors promote toxic positivity, hustle culture, and phony motivation, depending on their angle. It’s just a brief mental high. Their suggestions offer only shallow fixes for problems that need more than surface-level solutions. సంక్లిష్టమైన మానవ జీవితానికి సరళమైన పరిష్కారాలు చూపడం వ్యక్తిత్వ వికాస పుస్తకాలపై ఉన్న ప్రధాన విమర్శ.

అయితే వ్యక్తిత్వ వికాసం కమర్షియల్ రాతల వల్ల కాకుండా ఆదర్శవంతమైన జీవితాలను పరిశీలించడం వల్ల జరుగుతుందని నా స్వీయ అనుభవం చెబుతుంది. అలానే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాసే వారు తాము ఆచరించి ఫలితాలు పొందిన విషయాలను రాసినప్పుడు అవి నిస్సందేహంగా ఉపయుక్తమైనవే అవుతాయి. ఉదాహరణకు యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పిన రెండు సూత్రాలు చెబుతాను :- "నీకు లేని దాన్ని గురించి విచారించకుండా, ఉన్న దాన్ని బాగా అభివృద్ధి చేసుకో", "మైండ్ అనేది రిజర్వాయర్ లాంటిది, ఎప్పటికప్పుడు దాన్ని జ్ఞానంతో నింపుకుంటూ ఉండు".

‘హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం’ అనే పుస్తకంలో హనుమంతుడి జీవిత ఘట్టాలను తీసుకుని వాటి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను బోధించడం జరిగింది. సంగ్రహంగా ఈ పుస్తకంలోని వ్యక్తిత్వ వికాసం కలిగించే విషయాలను అందించడమే ఈ వ్యాస ఉద్దేశం. ఒక్కో విషయానికి హనుమంతుడి జీవితంలోని సంబంధిత ఘట్టాలను తరచి చూడవలసిందిగా పాఠకుడికి నా విజ్ఞప్తి.

ఎవరైతే తన మాటల్ని, చేతల్ని తన ఆలోచనలతో సమానం చెయ్యగలుగుతారో అంటే ఏది ఆలోచిస్తే దానినే మాటలలో, చేతలలో చూపుతాడో అతడు అత్యున్నతుడైన శీలవంతుడవుతాడు.

శరీరం బలహీనంగా ఉన్నపుడు ఆలోచనలు కూడా బలహీనపడతాయి. స్వామి వివేకానంద - "శరీరము, మనస్సూ చేదోడువాదోడుగా ముందుకు సాగాలి. ఆ రెండిటినీ బలమైనవిగా చెయ్యాలి" అని బోధించారు.

మన వ్యక్తిత్వంలోని లోటుపాట్ల వల్ల పొరపాట్లు చేస్తాము. మన వ్యక్తిత్వం మెరుగుపడే కొద్దీ మనం చేసే పొరపాట్లు తగ్గుతాయి. మనం చేసిన పొరపాట్లను తెలుసుకుని మనలోని లోటుపాట్లను విశ్లేషించి ఆయా పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఇందుకోసం నిజాయతీ కావాలి. చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలని దృఢంగా నిశ్చయించుకోవాలి.వ్యక్తిత్వ నిర్మాణంలో మనం ముఖ్యంగా చేసేది ఇదే.

బుద్ధుడు మనం దేనిని గురించి ఆలోచిస్తే అదే విధంగా తయారవుతామని అన్నారు. స్వామి వివేకానంద - " ఒక ఆదర్శాన్ని ఎదురుగా ఉంచుకుని దానిని అనుసరించేటప్పుడు మనం తప్పు చేసేందుకు అవకాశం తక్కువ. జీవితంలో ఏదో ఒక ఆదర్శాన్ని తన ముందు ఉంచుకుని దానిని సాధించాలని ఆరాటపడే వ్యక్తి, వెయ్యి తప్పు చేస్తే, అసలు ఆదర్శమే లేకుండా జీవితాన్ని గడిపే వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడు. కాబట్టి ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉండటమే మేలు" అని సూచించారు. "గత కొన్ని వేల సంవత్సరాలుగా హిందూ సమాజం తమ గుండెల్లో దాచుకున్న సాంస్కృతిక వారసత్వమే రామాయణ, మహాభారతాలు. అవి రెండూ ఆర్యుల సనాతన జీవనాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకున్న రెండు విజ్ఞాన సర్వస్వాలు. ఒక ఆదర్శవంతమైన నాగరికత వాటిలో ప్రదర్శింపబడింది " అని వివేకానంద అభిప్రాయం. శిష్యులకు రామాయణంలోని ముఖ్య పాత్రైన హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోమని వివేకానంద సూచించారు.

హనుమంతుడి జీవితం నుంచి మనం నేర్చికోవాల్సిన వ్యక్తిత్వ వికాస పాఠాలు :-

మనం చెయ్యాల్సిన విధిని చక్కగా నిర్వహించినపుడు, మన శక్తి యుక్తులకు తగినట్టుగా, మరింత గొప్ప బాధ్యతలు వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.వ్యక్తిత్వ నిర్మాణంలో ఇది ముఖ్యమైన అంశం.

సామర్ధ్యం కొద్దీ పని చెయ్యడమే సంపూర్ణమైన వ్యక్తిత్వానికి వారధి. ఎవరైతే తాను నెరవేర్చవలసి వచ్చిన బాధ్యతను సంతోషంగా భుజాలకెత్తుకుని క్రమక్రమంగా చేస్తూ ముందుకు పోతాడో అతడే వికాసాన్ని పొందుతాడు.

మన మాటలమీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి.కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు, నష్టం లేదు.సరిగా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం. అలానే ఎదుటివారి మనసు తెలుసుకుని మాట్లాడాలి.

ఏ సమయంలో ఏ పని చెయ్యాలో దానిని ఏ మాత్రం కాలాతీతం లేకుండా చెయ్యాలి. పరిస్థితులు ఎలా మారిపోతున్నా అనుకున్న పనిమీద నుంచి మన దృష్టి మరలిపోకుండా ఉంచుకోవాలి.

కష్టపడి పనిచేసేవారికి ఎక్కడ నుంచి వచ్చిందో తెలియకుండానే సహాయం లభిస్తుంది. ఇంతకు ముందు మనం సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి. మన పూర్వీకుల గొప్పతనాన్ని గుర్తుచేసుకోవాలి.అది మనకు ఉత్సాహాన్ని,స్ఫూర్తిని ఇస్తుంది.

రకరకాల విషయాలు తెలిసి ఉండాలి, వాటి గురించి సరైన అవగాహన ఉండాలి . మన మనసును మనమే దిటువు చేసుకుని పనిని ముందుకు తీసుకుపోవాలి.

ఎదుటి వ్యక్తుల పట్ల ఎంపతీ కలిగి ఉండకపోతే తరువాత సింపతీ చూపించినా ఉపయోగంలేదు. ఏ పని చెయ్యాలో నిశ్చయించుకునే ముందు దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆలోచించాలి. ఏ పని చెయ్యాలన్నా అన్ని వైపుల నుంచీ లోతుగా ఆలోచించి చెయ్యాలి. ముందుచూపు అనేది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు,క్రమక్రమంగా దాన్ని అలవరచుకోవాలి.

సాధారణంగా వ్యక్తులు పని చెయ్యవలసిన పరిస్థితి ఎదురైనపుడు మాత్రమే పని చేస్తారు. లేకపోతే తర్వాత చూసుకోవచ్చులే అని వాయిదా వేస్తారు. కానీ ఏ పని చెయ్యాలో చక్కగా ఆలోచించి ఆ పనిని తాముగా చేపట్టి చెయ్యడం అనేది గొప్ప వ్యక్తుల లక్షణం.

కోపానికి, ద్వేషానికి లోబడిపోయే మనిషి ఏ పనినీ సక్రమంగా చెయ్యలేదు. ఎవరైతే శాంతంగా, అన్నిటినీ సహిస్తూ, మనస్సును సమతూకంలో ఉంచుకుని ఆలోచించగలుగుతారో అటువంటి వారే అందరికన్నా ఎక్కువ పని చేయగలుగుతారు.

మన గొప్పలు చెప్పుకోకూడదు. తోటి వారిని తక్కువ చేసి మాట్లాడకూడడు. విషయాన్ని ఏ మాత్రం తెలుసుకోకుండా అది మంచి లేక చెడు అన్న అభిప్రాయాన్ని ముందుగానే మనస్సులో ఏర్పరచుకో కూడదు. విషయాన్ని కూలంకషంగా అన్ని కోణాల నుంచీ పరిశీలించిన తర్వాతే దాని మీద ఒక నిర్ణయానికి రావాలి.

దేనినీ ఆశించకుండా, చక్కగా పని చెయ్యడమే లక్ష్యంగా, పని మీదున్న ప్రేమతో, పని చెయ్యడం కోసమే పనిచేయాలి. అలా పని చెయ్యగలిగిన వాడే అద్భుతమైన వ్యక్తిత్వం గలవాడు. ఒక మనిషి వ్యక్తిత్వం అంటే ఆ మనిషి చెప్పే మాటలు, చేసే పనులే. చెప్పినది చేసి చూపడమే గొప్ప వ్యక్తుల లక్షణం.

హనుమంతుడిలోని పై లక్షణాల గురించి నిరంతరం చింతన చేస్తూ మనం కూడా అటువంటి ఉన్నతమైన లక్షణాలను అలవరచుకోవడానికి ప్రయత్నించాలి.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in August 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *