బెర్ట్రాండ్ రస్సెల్ భావాలు అనుభవాలు
(ఆర్ధిక న్యాయం - ఆర్ధిక వ్యవస్థపై రస్సెల్ ఆలోచనలు)
“I dislike Communism because it is undemocratic, and Capitalism because it favours exploitation” అని అంటారు బెర్ట్రాండ్ రస్సెల్.
క్యాపిటలిజంలో శ్రమ దోపిడీ ఉంటే దానికి విరుగుడుగా వచ్చిన కమ్యూనిజం వ్యక్తి స్వేచ్ఛను హరించింది. ఒకప్పటి సోవియెట్ యూనియన్ నేటి చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల్లో సమసమాజం పేరిట ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థలు వ్యక్తి స్వేచ్ఛను హరించి శ్రామిక నియంతృత్వం పేరిట వ్యక్తి నియంతృత్వాన్ని ఏర్పరిచాయి.
“స్వాధీనత భావం యుద్ధానికి మూలం, అలానే అన్ని రకాల రాజకీయ రుగ్మతలకు పునాది. ఈ కోరిక యొక్క బలాన్ని, మానవ జీవితంపై ఈ కోరిక యొక్క ప్రభావాన్ని తగ్గిస్తేనే కొత్త సామాజిక వ్యవస్థలు మానవాళికి మంచి చేస్తాయి. క్యాపిటలిజంను మరియు వేతన పద్ధతిని రద్దు చేయాలి. ఇవి రెండూ మానవ జీవితాన్ని వేపుకు తింటున్న క్రూరమైన శక్తులు” అన్న రస్సెల్ ఆర్ధిక న్యాయం అంటే అందరికీ సమానమైన ఆదాయం ఉండాలనికాదు అని కూడా అన్నారు. ఒకరికి తన కష్టానికంటే ఎక్కువ ప్రతి ఫలం మరొకరికి తక్కువ ప్రతిఫలం ఉండకూడదని రస్సెల్ అభిప్రాయం. ఒకరి దగ్గర తన అవసరాలకంటే చాలా ఎక్కువ ధనం పోగుబడకుండా మరొకరి దగ్గర తన కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి ఉండకుండా ఆర్ధిక వ్యవస్థను రూపొందించుకోవాలనేదే రస్సెల్ అభిప్రాయం.
ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా నాలుగింటిని సాధించాలి అని రస్సెల్ అభిప్రాయం పడ్డారు :- ఉత్పత్తిని బాగా పెంచాలి,సాంకేతిక అభివృద్ధిని సాధించాలి; పెరిగిన ఉత్పత్తి న్యాయంగా పంపిణీ అవ్వాలి; జనులను బీదరికం భారిన పడకుండా చూడాలి; సృజనాత్మక భావాలకు స్వేచ్ఛ కల్పించి స్వాధీనత భావాన్ని తగ్గించాలి. క్యాపిటలిజం వీటిలో మొదటి దాని మీదే దృష్టి సారిస్తుంది. సహజ వనరులను అభివృద్ధి పేరిట హరిస్తుంది. క్యాపిటలిజంలో కొద్ది మంది దగ్గరే సంపద పోగుబడి ఉండడం వల్ల అధికశాతం జనాభా జీవన సమరంలో అధిక సమయాన్ని వస్తుసేవోత్పత్తి చేస్తూ గడపవలసి పరిస్థితి ఉంటుంది. బీదరికం, నిరాశ్రయం వంటి భయాలతో అధిక శాతం మంది జనాభా ఆర్ధిక సంఘర్షణలోనే జీవితం గడిపేస్తారు. ఆర్ధిక అసమానత్వం ప్రస్తుత వ్యవస్థలో స్పష్టంగా కనపడే రుగ్మత. ఈ పరిస్థితి పోవాలంటే క్యాపిటలిజంలో అన్యాయానికి గురయ్యే వర్గాల బాగు కొరకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలి.
రస్సెల్ కార్ల్ మార్క్స్ ను విమర్శిస్తూ ఇలా అన్నారు:- మార్క్స్ ధనికులు మరింత ధనికులై పేదవారు మరింత పేదవారై వర్గ సంఘర్శణ అనివార్యమై విప్లవం వస్తుందని అనుకున్నారు.కానీ మార్క్స్ అనుకున్నట్లుగా కాకుండా పెట్టుబడిదారీ పారిశ్రామిక దేశాలు కార్మికుల సంక్షేమం కొరకు చట్టాలు చేసి వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలుచేశాయి,దాంతో వర్గ సంఘర్షణ అనేది తలెత్తలేదు, అలానే మార్క్స్ సూత్రీకరణకు విరుద్ధంగా కమ్యూనిజం పెట్టువాడిదారీ దేశాలైన పశ్చిమ యూరోప్ లో కాకుండా వ్యవసాయ అధారిత రష్యాలో వచ్చింది.
The Prospects of Industrial Civilisation అనే వ్యాసంలో రస్సెల్ క్యాపిటలిస్టులు మతం పట్ల దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉంటారు ఎందుకంటే వారికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కారణం ఉంది. తమ ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ ఇలానే ఉండాలని వారు దేవుడిని కోరుకుంటారు.అంతే కాకుండా కార్మికుల్లో చైతన్యం రాకుండా మతం అడ్డుకోగలుగుతుంది వాళ్ళు నమ్ముతారు.
“If we wish to diminish the love of money which, we are told, is the root of all evil, the first step must be the creation of a system in which everyone has enough, and no one has too much.” ఇదే ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి రస్సెల్ నినాదం. ఇది కేవలం నినాదంగా మిగిలిపోయే వాదం కాదు ఇది ఒక ఆచరణాత్మక విధానం.