
బ్రహ్మం గారి దేశ కాల కుటుంబములు
సత్తెనపల్లిలోని శ్రీ వీరబ్రహ్మేంద్రాశ్రమంకు చెందిన జవంగుల నాగభూషణదాసు రాసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర 419వ పుటలో బ్రహ్మంగారు సమాధియందు ప్రవేశించబోవుచూ భక్తులకు కాలజ్ఞానం వినిపించే సందర్భంలో "కలియుగముననిప్పటికి 4694 సంవత్సరంబులాయను" అన్నారని ఉంది. దీనిని బట్టి బ్రహ్మంగారు క్రీ.శ 1592లో జీవసమాధి చెందారని భావిస్తూ వచ్చాను. అయితే పంగులూరి వీరరాఘవులు గారు రచించిన "ఆంధ్ర మహాభక్తులు" అనే పుస్తకంలో బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన దూదేకుల సిద్ధయ్య జీవితకాలం క్రీ.శ 1665 నుండి క్రీ.శ 1736 వరకు అని ఉంది. అలానే బ్రహ్మంగారు హైదరాబాద్ నగరాన్ని సందర్శించారనేది కూడా వారి జీవితచరిత్ర చదవడం వలన తెలుస్తుంది. ఇలా మరికొన్ని వైరుధ్యాల వలన బ్రహ్మంగారి జీవిత కాలం గురించి పరిశీలన చేయాలన్న ఆలోచన బలపడింది. ఈ క్రమంలో నాకు తారసపడిన పుస్తకమే డాక్టర్ కన్నెకంటి రాజమల్లాచారి గారు రచించిన పోతులూరి వీరబ్రహ్మంగారి జీవితం, రచనల పరిశీలన. ఆ పుస్తకం ద్వారా తెలుసుకున్న బ్రహ్మం గారి దేశ కాల కుటుంబ విషయాల గురించి తెలపడమే ఈ వ్యాస ఉద్దేశం.
బ్రహ్మంగారి కాలం గురించి విష్పష్టమైన చారిత్రక దృష్టితో తొట్ట తొలిగా కృషి చేసినవారు శ్రీ తాటికొండ రాఘవాచార్య గారు. వీరి "వీరాచార్య చరిత్ర" 1918 నాటికే సిద్ధమైంది. మఠంలోని సమాధులను బట్టి, బ్రహ్మంగారి వంశంలోని వ్యక్తుల జీవితకాలాలు పరిశీలించుకుంటూ బ్రహ్మంగారి జీవిత కాలాన్ని స్థూలంగా 17వ శతాబ్ది అని ఆయన తేల్చగలిగారు.
డాక్టర్ కొండూరి వీర రాఘవాచార్యులుగారి లెక్క కూడా ఇందుకు అనుగుణంగానే సాగింది.
శ్రీ కొడాలి లక్ష్మీనారాయణగారు మాత్రం ఖండితంగా 1608 నుండి 1693 వరకు జీవించి ఉంటారని తేల్చి చెప్పారు. ఈ చివరి వాదాన్నే డాక్టర్ కన్నెకంటి రాజమల్లాచారి గారు మరింత స్పష్టంగా సప్రమాణంగా స్థిరీకరించారు. 1987లో ప్రచురితమైన డాక్టర్ వేదవ్యాస గారి "వీరబ్రహ్మేంద్రయోగి పై పరిశోధన" అనే గ్రంథంలో వీరబ్రహ్మేంద్రస్వామి మహాసమాధి 17-04-1692 న మధ్యాహ్నం 12 గంటలకు జరిగినట్లు స్పష్టం చేశారు.
బ్రహ్మంగారికున్న అనేక పేర్లను పరిశీలిస్తే వారి మొదటిపేరు వీరనారాయణ అని చెప్పవచ్చు. బ్రహ్మం గారి తల్లిదండ్రులు అజ్ఞాత వ్యక్తులని అనుకోవచ్చు. వీరు కర్ణాటకలోని పాపాఘ్ని మఠంలో పెరిగారు. అక్కడ వారిని వీరప్ప అని పిలిచేవారు. అక్కడ నుంచి ఆయన దేశ సంచారం చేస్తూ కర్నూలు జిల్లాలోని పోతులూరు అనే గ్రామానికి వచ్చారు. అక్కడ నుంచి బనగానపల్లె వచ్చి గరిమరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువుల కాపరిగా చేరాడు. అక్కడే కాలజ్ఞానం రచించారు. బ్రహ్మంగారు క్రీ.శ 1644వ సంవత్సరం తరువాత కందిమల్లయ పల్లెలో ఇంటిని నిర్మించుకున్నారు.
పెద్దకొమెర్ల నివాసి శివకోటయాచార్య కుమార్తె గోవిందమ్మను పెండ్లి చేసుకున్నారు. కందిమల్లయపల్లెలో బ్రహ్మంగారు కుటుంబసమేతంగా వడ్రంగం, కుమ్మరం,శిల్ప వృత్తులను చేసుకుంటూ స్థిరపడ్డారు.
బ్రహ్మంగారికి ఐదుగురు కుమారులు, ఒక్క కుమార్తె. వారిలో సిద్ధలింగయ్య జ్యేష్ఠుడు, గోవిందయ్య ద్వితీయుడు, పోతులూరయ్య తృతీయుడు, శివరామయ్య నాలుగవవాడు, ఓంకారమయ్య ఐదవవాడు. కుమార్తె వీరనారాయణమ్మ.
బ్రహ్మంగారు కాలజ్ఞానం చెబుతుంటే బనగానపల్లె నివాసి బ్రహ్మంగారి శిష్యుడు అన్నాజయ్య తాటాకుల మీద రాశాడు.
మిగతా పరిశీలనలు ఎలా ఉన్నప్పటికీ, మరే తెలుగు ప్రాంతంతో పోల్చినా కడప జిల్లాపై బ్రహ్మంగారి ప్రభావం, అక్కడ వారి స్మృతులు అధికమనే విషయం సుష్పష్టం. అలానే బ్రహ్మంగారి జీవితకాలం పదిహేడవ శతాబ్దం అనే విషయం కూడా అధికంగా నమ్మదగ్గ నిర్ణయం.