
పలనాటి వీర చరిత్రలోని పూర్వకథలో చారిత్రకత అచారిత్రకతలు
శ్రీనాధుడి పలనాటి వీరచరిత్రకు పింగళి లక్ష్మీకాంతం గారు రాసిన పీఠిక ఆధారంగా పలనాటి వీరచరిత్ర యొక్క పూర్వకథలోని చారిత్రక అచారిత్రక అంశాలను పరిశీలించుటే ఈ వ్యాస ఉద్దేశము.
ఆంధ్రదేశ చరిత్రలో పన్నెండవ శతాబ్దం రాజకీయంగా చెడుకాలము. చాళుక్య రాజ్యము బలహీనపడిన దగ్గర నుండీ కాకతీయ సామ్రాజ్యం అవతరించి స్థిరపడే వరకు తెలుగు నేల ఒడిదిడుకులకు లోనయ్యింది.
ఒకే శాఖకు చెందిన వారైనప్పటికీ,ఈ కాలంలో వేంగి దేశం కోసం తరచూ తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యుల మధ్య యుద్ధాలు జరిగేవి. వేంగి దేశం ఆ కాలమున వెలనాడు, పలనాడు, పాకనాడు, కమ్మనాడు మొదలగు మండలాలుగా విభజితమై ఉండేది. ఇరువురు చక్రవర్తులకు జరిగే యుద్ధాలకు తోడు మాండలికులకు జరిగే యుద్ధాల వల్ల దేశం అల్లకల్లోలంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో వేంగీ దేశంలో సంభవించిన ఒకానొక యుద్ధమే పలనాటి యుద్ధం. ఇది దాయాదుల మధ్య జరిగినటువంటి పోరు. ఆ సమయంలో పలనాడును హైహయ వంశస్తులు పరిపాలిస్తుండేవారు. రాజరాజనరేంద్రుని అనంతరం అతని కొడుకు ఒకటవ కళోత్తుంగచోళుడు అధికారంలోకి వచ్చాడు. అతని పరిపాలనాకాలం క్రీ.శ 1061 నుండి క్రీ.శ 1118 వరకు. ఇతని అసలు పేరు రాజేంద్ర చాళుక్యుడు. రాజరాజనరేంద్రునికి, రాజేంద్రచోళుని కుమార్తె అమ్మంగాదేవికి పుట్టడం వల్ల ఇతను అటు తూర్పు చాళుక్య రాజ్యానికి, ఇటు చోళ రాజ్యానికి కూడా అధిపతి అయ్యాడు. కళోత్తుంగ చోళుని చివరి రోజుల్లో పశ్చిమ చాళుక్య రాజు విక్రమాదిత్యుడు క్రీ.శ 1118లో వేంగి దేశంపై దాడి చేసి ఆక్రమించుకున్నాడు. అపుడు పలనాటి హైహయులు విక్రమాదిత్యునికి తోడ్పడ్డారు.
హైహయ వంశస్తులు తాము కార్తవీర్యార్జుని సంతతి వాళ్ళమని శాసనాల్లో చెప్పుకున్నారు. ఇప్పటి జబల్పూర్ నుండి నాగపూర్ వరకు ఉన్న తావులని పురాతన కాలంలో చేధి దేశమని అనేవారు. హైహయ వంశస్తులు తొలుత చేధి దేశమును పరిపాలించేవారు. తరువాత ఉత్తర దేశం నుండి ఆంధ్ర దేశానికి వచ్చి చాళుక్యుల సామంతులుగా కోనసీమను, పల్నాడును పరిపాలించేవారు. పలనాడును పరిపాలించిన హైహయ రాజులు ఆరుగురు. వారు చాగి బేతరాజు, వీరకాముడు, బిరుదాంక రుద్రుడను బేతరాజు, అనుంగు కామరాజు, నలగామరాజు, మలిదేవరాజు. వీటికి ఆధారాలు శాసనాలు.
బిరుదాంకరుద్రుడను బేతరాజు క్రీ.శ 1129వ సంవత్సరంలో గురజాల త్రిమూర్తి దేవాలయంలో ఒక శాసనం వేయించాడు. బిరుదాంకరుద్రుడను మరోపేరులేని బేతరాజు పన్నెండవ శతాబ్దం మొదట్లో ఆదిత్యేశ్వర గుడికి భూదానం చేసినట్లు మరొక శాసనమున్నదట. అలానే క్రీ.శ 1147వ సంవత్సరంలో అనుంగు కామరాజు పలనాడును పాలిస్తున్నట్లు శాసనాలున్నవట. అలానే విజ్జలదేవి కుమారుడు మలిదేవరాజు, మైలలదేవి కుమారుడు నలగామరాజు పల్నాడును పాలించినట్లు కూడా శాసనాలున్నవట. అనుగురాజు కుమారులు నలగామరాజు, నరసింగరాజు, పెదమలిదేవరాజు, పినమలిదేవరాజు, బాల మలిదేవరాజులని పలనాటి వీరచరిత్ర ద్వారా తెలుస్తుంది. పింగళిగారు తన పీఠికలో అనుగురాజు తండ్రి బిరుదాంకరుద్రుడను బేతరాజు అనుట సబబుగానే ఉన్నప్పటికీ క్రీ.శ పన్నెండవ శతాబ్దం మొదట్లో వేయించిన శాసనంలోని బేతరాజు వీరకాముడి తండ్రియనుట సబబుగా ఉన్నట్లు లేదు.
పలనాటి వీరచరిత్ర ప్రకారం వెలనాటి చోడుడైన రెండవ గొంకయ అనుగురాజుకు తన కుమార్తె అయిన మైలలదేవిని ఇచ్చి పెండ్లి చేసినపుడు పలనాడును అతనికి స్త్రీ ధనంగా ఇచ్చాడు. అయితే హైహయ వంశస్తులు అనుగురాజుకు మొదటి నుంచీ పల్నాడును పాలిస్తున్నప్పుడు ఈ పరిణామం ఎలా తలెత్తింది?
క్రీ.శ 1135వ సంవత్సరంలో గోదావరీ తీరంలో పశ్చిమ చాళుక్యులకు చాళుక్య చోళులకు జరిగిన యుద్ధంలో రెండవ గొంకయ చాళుక్య చోళుల తరపున పోరాడి పశ్చిమ చాళుక్యులను ఓడించి వేంగీ దేశాధిపత్యాన్ని మళ్ళీ చాళుక్య చోళుల పరం చేశాడు. ఈ యుద్ధంలో పలనాటి హైహయులు పశ్చిమ చాళుక్యుల తరపున ఉండటంతో వారు రాజ్యాన్ని కోల్పోయి ఉంటారని పింగళి లక్ష్మీకాంతంగారు అభిప్రాయపడ్డారు. రెండవ గొంకయ చేసిన సేవను గుర్తించి ఇమ్మడి కళోత్తుంగ చోళుడు మహేంద్రగిరి శ్రీశైలం మధ్య ప్రాంతానికి కూడా రెండవ గొంకయనే రాజుగా చేశాడు. రెండవ గొంకయ తన అధికారాన్ని కట్టుదిట్టం చేసుకోవడానికి ధరణి కోట వారితోను ,పలనాటి హైహయులతోను కలుపుకున్నాడు. తన కుమార్తె మైలమాదేవిని అనుగురాజుకు ఇచ్చి పెండ్లి జరిపించాడు. స్త్రీ ధనంగా పలనాడును అనుగురాజు కిచ్చాడు.
పైన చర్చించుకున్న అంశాలన్నీ చారిత్రకంగా జరిగాయని నిశిత పరిశీలనతో నిర్ధారించినవి. పలనాటి వీర చరిత్ర కావ్యంలో ఉండే పూర్వ కథ మాత్రం ఈ విధంగా ఉంటుంది :-
"అనుగురాజు ఉత్తరదేశంలో పాలమాచాపురిని పరిపాలించేవాడు. తన పూర్వీకుడైన కార్తవీర్యార్జునుడు జమదగ్నిని చంపుట వలన కలిగిన బ్రహ్మహత్యాదోషం తొలగిపోవుట కొరకు తమ ఇలవేల్పైన చెన్నకేశవస్వామి ఆదేశంపై తీర్థయాత్రలకు వెళతాడు. ఆంధ్రదేశంలోని మోటుపల్లె వద్ద సముద్ర స్నానం చేయగా బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది. అక్కడ అనుగురాజు విడిది చేసి ఉండగా చందవోలు రాజుతో గొడవ జరుగుతుంది. అందువల్ల జరిగిన యుద్ధంలో చందవోలు రాజు ఓడిపోతాడు. అతను తన కుమార్తెను అనుగురాజుకిచ్చి పెండ్లి చేసి సంధి చేసుకుంటాడు. ఆమెకు ఆరణంగా పలనాడునిస్తాడు. అలా అనుగురాజు పలనాటి రాజవుతాడు."
చరిత్రను వస్తువుగా చేసుకుని వెలువడ్డ కావ్యాలన్నీ సాహిత్యాన్ని పరిపుష్టం చేశాయేమోకానీ చరిత్రకు మాత్రం కొంత ద్రోహం చేశాయని చెప్పక తప్పదు. చరిత్ర సాహిత్య సృజనకు వస్తువైనపుడు రససిద్ధి కొరకు కలుషితమైపోతుంది. అసత్యాలు, అభూతకల్పనలు చరిత్రతో పడుగూపేకల వలె కలిసిపోతాయి. పలనాటి వీర చరిత్రలో కూడా కొంతవరకు ఇది జరిగింది. అసత్యాలు, అభూతకల్పనలు మిళితమైన చరిత్ర నుండి అసలు కథను వేరుచేయడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలన చేయడమే మార్గం.