Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

వీరేశలింగం వెలుగునీడలు

చాలా కాలం క్రితం, అంటే నేను విజయవాడలో చదువుకుంటున్న రోజుల్లో, లెనిన్ సెంటర్ దగ్గర నడుస్తూ వెళ్తున్నపుడు, ఫుట్ పాత్ పైన ఓ పుస్తకం దొరికింది. ఆ రోజుల్లో సాధారణ పుస్తకాలు కొని చదివేటంత డబ్బులు నా వద్ద ఉండేవి కావు. గ్రంథాలయాలకు వెళ్ళి చదివే అలవాటు మా తరంలో చాలా తక్కువ. పాత పుస్తకాల అంగళ్లలో మంచి విలువైన పుస్తకాలు కూడా తక్కువ ధరకు లభిస్తుంటాయి. అలా నేను కొనుక్కున్న పుస్తకమే "వీరేశలింగం వెలుగునీడలు". రాసింది దిగవల్లి వెంకటశివరావు గారు.

పుస్తకం మొదట్లోనే జీవిత చరిత్ర అనగా వ్యక్తిగతమైన మంచి చెడ్డలు అని రచయిత రాశారు. "చరిత్ర ప్రసిద్ధుడైన ఒక వ్యక్తి జీవితాన్ని రచించడంలో అతని బహిరంగ జీవితం మాత్రమే చరిత్ర కెక్కాలని, వ్యక్తిగత రహస్య జీవితము చరిత్ర కెక్కించ కూడదనే పూర్వకాలపు నాటి పిచ్చి అభిప్రాయాన్ని ఇప్పటికైనా వదలడం ఆవశ్యకం" అనే ఫ్రెడరిక్ మేనన్ (నెపోలియన్ చక్రవర్తి జీవిత చరిత్ర రచయిత) అభిప్రాయాన్ని ఉటంకించారు. పుస్తకం పేరు సూచిస్తున్నట్లు ఇందులో వీరేశలింగం పంతులు గారిలోని మంచి చెడులను చర్చించింది.

దిగవల్లి వెంకటశివరావు గారు వీరేశలింగం పంతులు గారిని బాగా ఎరిగిన వారే. రాజమహేంద్రవరంలోని వీరేశలింగం హైస్కూల్లో 1911 నుండి 1916 వరకు మొదటి ఫారం నుండి స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు.

"ఆంధ్రభాషకు, దేశానికి, ప్రజలకూ వీరేశలింగం గారు చేసిన అమూల్య సేవను గురించి నేను ఎరుగుదును. ఆయన మహా పురుషుడు, ప్రతిభాశాలి, కార్య శూరుడు. వీరేశలింగం గారిని గూర్చి ప్రస్తుతించడం లో నేనెవరికీ తీసిపోను గానీ చాలా మంది ఉపయోగించే అతిశయోక్తులను మాత్రం నేను హర్షించను" అని శివరావు గారు కుండబద్దలు కొట్టారు.

"వీరేశలింగం గారి గొప్పతనం అంతకు పూర్వమెవ్వరూ చేయని పని చేసారని గానీ, అంతకు పూర్వమెవ్వరూ రచించని కృతి రచించారని కాదు. అనేకులు మెల్లగా చెప్పిన మాటలను ఆయన గట్టిగా చెప్పినారు. అనేకులు కొంచెము కొంచెముగా సాధించిన కార్యములను ఆయన ఎక్కువగా సాధించారు. అనేకులు మాటలతో సరిపెట్టిన విషయములను ఆయన కార్యరూపంలో పెట్టినారు. అనేకులు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయంలో చూపిన తెలివితేటలను ఆయన ఒకే సమయంలో అనేక విషయాలలో చూపించారు" అని శివరావుగారు విశదీకరించారు.

లియోనార్డు అనే అమెరికా దేశస్తుడు వీరేశలింగం గారి జీవితచరిత్ర గురించి పరిశోధించి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. వీరేశలింగం పంతులుగారు స్వీయ చరిత్రలో రాసిన సంగతుల నిజానిజాల గురించి లియోనార్డు బాగా పరిశోధించి పంతులుగారు తమ గొప్పతనం ప్రకటించుకోవడానికి, తమ చర్యలు సమర్ధించుకోవడానికి కొన్ని అసత్యాలు రాశారని లియోనార్డు అభిప్రాయపడ్డారు. అయితే లియోనార్డు పంతులు గారు రాసిన సంగతుల గురించి పరిశోధించారు గానీ, రాయకుండా వదిలేసిన సంగతుల గురించి సరిగా పరిశోధించలేదని శివరావు గారు రాశారు.

లియోనార్డు మరియు దిగవల్లి వెంకటశివరావు గారు చర్చించిన వీరేశలింగం మంచి చెడుల గురించి సంక్షేపంగా తెలపడమే ఈ వ్యాస ఉద్దేశం.

వీరేశలింగం గారు బ్రిటిష్ ప్రభు భక్తుడు. వందేమాతరం ఉద్యమానికి వ్యతిరేకి. దానిని తీవ్రంగా విమర్శించారు. అందులో పాల్గొన్న తన శిష్యుడైన కామరాజు హనుమంతరావు గారికి నిశ్చయమైన పెండ్లిని ఆపివేశారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిపై రాజద్రోహ నేరం మోపబడినపుడు వీరేశలింగం గారు ప్రభుత్వం తరపున కోర్టులో సాక్ష్యమిచ్చారు.

వీరేశలింగం పంతులు గారు చాలా తెలివైన వారు. మంచి విద్వాంసుడు. మంచి జ్ఞాపక శక్తి గలవారు. మంచి రచయిత. అయితే ప్రబలమైన కీర్తి కాంక్ష కలవారు. తనతో పని చేసేవారిని చాలా చులకనగా చూసేవారు. వారి లోపాలు సహించేవారు కాదు. ఆయతో కలసి పనిచేద్దామని 1906లో రాజమహేంద్రవరం వెళ్లిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారికి వీరేశలింగం పంతులు గారితో సరిపడక పోవడంతో తిరిగి గుంటూరు వెళ్ళిపోయారు.

వీరేశలింగం గారు కార్యసాధన కోసం మాయోపాయాలు గానీ, దౌర్జన్యాలు గానీ చేయించడానికి సంకోచించేవారు కాదు. ఆయన బాగా లౌక్యంకలవాడు.

ఆయనలో ఉపజ్ఞత కొరవడినా ఎవరైనా కొత్త సాహిత్య ప్రక్రియ ఆరంభించుట చూడగానే దానిని అనుకరించి వారి కన్నా బాగా చేసి చూపించేవారు.

పంతులు గారు తమ రాజశేఖర చరిత్రను వివేకవర్ధనిలో 1878లో సీరియల్ గా అచ్చువేసి 1880లో పుస్తక రూపంలోకి తెచ్చారు. 1872లో నరహరి గోపాల కృష్ణమ శెట్టి గారు శ్రీ రంగరాజ చరిత్ర అనే వచన ప్రబంధాన్ని రాశారు. అదే సంవత్సరం జులై నెల పురుషార్థప్రదాయిని సంచికలో శ్రీ రంగరాజ చరిత్ర గురించి సమీక్ష ఉన్నది. వీరేశలింగం గారి స్వీయ గ్రంథాలయంలో శ్రీ రంగరాజ చరిత్ర ఉన్నది. వీరేశలింగం పంతులు గారు శ్రీ రంగరాజ చరిత్ర చదివి కూడా అది ప్రస్తావించకుండా తెలుగులో మొదటి ప్రబంధమును నేనే రాశాను అని తన స్వీయ చరిత్రలో రాశారు.

గురజాడ అప్పారవుగారు 7 ఏప్రిల్ 1895న తన డైరీలో ఆంగ్లంలో వీరేశలింగం గారి గురించి అనేక విమర్శలు రాశారు. వాటిలో ముఖ్యమైనవి :-

No substantial contribution to literature. No solid work, only satires, farces and silly stories. No originality.

The practices of pantulu garu and his followers are not in consonance with principles of Brahma Samaj which they professed.

Gurazada Appa Rao garu condemned questionable methods followed in social reform movement and widow marriages and also leadership of Veeresalingam, his domination, arrogance, love of publicity, his contempt for his colleagues and enmity with his equals.

Gurazada Appa Rao criticised Andhra Kavula Charitramu. "This book is neither fish nor flesh nor red-herring. It is not lives of poets in any sense. It must be a misnomer to give the name of history to these determinations of the times of the poets which are arrives at by methods most unscientific.

వీరేశలింగం పంతులు గారు 1876 నవంబర్ ఒకటవ తేదీన రాజమహేంద్రవరం ప్రభుత్వ పాఠశాలలో నెలకు ఇరవై ఐదు రూపాయల జీతం గల రెండవ ఆంధ్రోపాధ్యాయులుగా చేరారు. 1874లోనే వారు వివేకవర్ధని పత్రిక స్థాపించి హిందూ సమాజంలో గల దురాచారాల గురించి తీవ్ర విమర్శలు చేయడం ఆరంభించారు. పంతులు గారి దగ్గర విద్యార్థులుగా ఉన్న ఆచంట లక్ష్మీపతి గారు, వల్లూరి సూర్యనారాయణ గారు వీరేశలింగం గారు క్లాసుల్లో సరిగా పాఠాలు చెప్పేవారు కాదని, సంఘ సంస్కారం గురించి చెబుతూ కాలం గడిపేవారని రాశారు.

బ్రహ్మ సమాజం పేరు చెప్పి ప్రార్థనా సమాజం నిర్వహించిన వీరేశలింగం పంతులు గారు తాము బ్రాహ్మణత్వాన్ని వదలలేకపోయారు. జెందెం తీసివేయలేకపోయారు. తాము జరిపించిన పెండ్లిలన్నీ వైదిక పద్ధతిలోనే చేశారుగానీ బ్రాహ్మ పద్ధతిలో చేయలేకపోయారు.

ఉపాధ్యాయ వృత్తిలో స్వేచ్ఛ ఉందని, అందుకే ఆ వృత్తిని ఎంచుకున్నట్లు, అదీనూ స్వదేశీయుల యాజమాన్యం క్రింద కాకుండా ప్రభుత్వ పాఠశాలలోనే స్వేచ్ఛకు స్థానమని తమ స్వీయ చరిత్రలో వీరేశలింగం గారు రాశారు. అయితే ఉపాధ్యాయ వృత్తి వారి అభిమాన వృత్తి కాదని, వారి దృష్టంతా న్యాయవాద వృత్తి మీదే ఉండేదని దిగవల్లి వెంకటశివారావు గారు రాశారు. పంతులు గారి పూర్వీకులు దేశపాండ్యాలైనా, తాత గారొక దివానై పెద్ద భవంతి కట్టించినా, తండ్రుల నాటికి ఆర్థికంగా చితికి పోయారు. నాలుగేళ్ల వయసున్నపుడు తండ్రిని, చదువు అవ్వక ముందే పెద తండ్రిని కోల్పోవడం వల్ల చిన్న వయసునుండే జీవిక చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

పంతులుగారు ఉద్యోగాన్వేషణలో ఏడేళ్ల పాటు కొనసాగారు. ఇంగ్లీష్ దొరలకు ట్యూషన్లు చెబుతూ నాలుగో సారి మెట్రిక్ పరీక్షకు కూర్చుని 1878లో ఉత్తీర్ణులైయ్యారు. ఎన్నెన్నో అవకాశాలను తానుగా వదులుకుని బడిపంతులు వృత్తి స్వీకరించినట్లు పంతులుగారు రాసింది నిజము కాదని శివరావు గారంటారు. అయితే పాఠ్య పుస్తకాలుగా ఉపకరించే రచనలు చేయటానికి, అలా పుస్తకాలను ఎన్నిక చేయించడానికి ఉపాధ్యాయ వృత్తి బాగా ఉపయోగపడింది. సంఘ సంస్కారం కొరకు రాసిన సాహిత్యం వల్ల, పాఠ్య పుస్తకాల రచనల వల్ల పంతులు గారు చాలా డబ్బును సంపాదించారు. ఆ కాలంలో ఆంధ్ర రచయితల్లో రచనా వ్యాసంగం మీద పంతులుగారు సంపాదించినంత ఎవ్వరూ సంపాదించలేదు. మద్రాస్, బెంగళూరు, రాజమహేంద్రవరంలోనూ ఆయన సొంత భవంతులు కట్టుకున్నారు. ప్రజోపయోగములైన భవంతులు నాలుగైదింటిని కట్టించి సంఘలకిచ్చారు.

తన సంపాదనను సంఘ సంస్కరణ కొరకు, తన పేరు, పట్టుదల కొరకు బాగా ఖర్చు పెట్టారు. పంతులుగారు డబ్బును వడ్డీలకు కూడా తిప్పేవారని ఆయనను ఎరిగిన వారికి తెలుసు.

1880వ సంవత్సరంలో వీరేశలింగంగారు ప్రార్థన సమాజంలో హిందూమతం గురించి రెండు ఉపన్యాసాలిచ్చారు. ఆది శంకరాచార్యులు అద్వైతమును నిరీశ్వరవాదమని విమర్శించారు. హిందువుల కులములు అనాగరికమని కూడా విమర్శించారు.

1886 మార్చ్ 28వ తేదీన వితంతు వివాహ మహారాజపోషకుడైన పైడా రామకృష్ణయ్య గారు చనిపోయారు. ఆయన వితంతు వివాహ సమాజానికి పది వేల రూపాయలు విరాళం ఇస్తూ, దానికి ఆత్మూరి లక్ష్మీనరసింహం గారిని ట్రస్టీగా ఏర్పాటు చేసి విల్ రాశారు.  ఆత్మూరి గారు ట్రస్ట్ సొమ్ముతో ముందుగా పాత దంపతులకు సహాయం చెయ్యాలని అనగా, కొత్త వివాహాలకు ఖర్చు పెట్టాలని వీరేశలింగం గారు అన్నారు.

వితంతు వివాహాలు చేసుకున్నవారు 1893వ సంవత్సరంలో పంతులుగారికి కొత్త వివాహాలు చేసి పేరు సంపాదించాలనే కోరిక తప్ప తమ గతి గురించి ఆలోచించట్లేదని, వితంతు వివాహ సమాజం యొక్క డబ్బును ముందుగా తమ బాగోగుల కోసం వెచ్చించాలని పిటీషన్ వేశారు. అయితే డబ్బు సహాయం చేస్తామని చేసిన విధవా వివాహాలు అరవై మాత్రమే. ఆనాడు వేలకొలది ఉన్న వితంతు కన్యలు వితంతువులుగానే కాలం చేశారు.

వీరేశలింగం గారి వితంతు పునర్వివాహం అంటే బాల వితంతువులకే గానీ, కాపురం చేసి వితంతువులైన వారికి పునర్వివాహం కాదు. అప్పట్లో వారు అంతపని తలపెట్టలేదు. అది అసాధ్యం అనుకున్నారు.

బాల్య వివాహాలు క్రమంగా తగ్గిపోయి, యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయడం పెరిగినందునే వితంతు కన్యా పునర్వివాహ సమస్య సమసిపోయింది. రజస్వలా వివాహ ప్రచారం, ఉద్యమం వ్యాపించి శారదా చట్టం ఏర్పడిన తర్వాత స్త్రీల సమస్యకు మంచి పరిష్కారం దొరికింది.

వీరేశలింగం పంతులు గారు బ్రిటీష్ దొరల పట్ల వినయ విధేయతలు కలిగి, వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. అనేక పనులు కోసం ఉద్యోగులను ఆశ్రయించేవారు. 1885వ సంవత్సరంలో పంతులు గారికి "రాయ సాహెబు" బిరుదు వచ్చింది. మరో ఎనిమిదేళ్ళకు "రావు బహదూర్" బిరుదు వచ్చింది.

ఏలూరి లక్ష్మీ నరసింహం గారు రాజమహేంద్రవరం మున్సిపాలిటీకి మొదటి నాన్ అఫిషియల్ చైర్మన్. వారు బాగా చదువుకున్న వారు. ప్రధానోపాధ్యాయుడుగా పని చేశారు. న్యాయవాదిగా కూడా ఉన్నారు. ప్రకాశం పంతులు గారు ఆయన మున్సిపాలిటీలో కిరీటం లేని రాజులాగా చెలామణీ అయ్యారని రాశారు. ఏలూరి వారు 1878వ సంవత్సరంలో ప్రార్థనా సమాజం స్థాపించారు. వీరేశలింగం పంతులుగారికి మొదటి నుంచీ అన్ని కార్యకలాపాల్లో తోడ్పాటునిచ్చారు. ఇటువంటి వ్యక్తి విషయంలో వీరేశలింగం పంతులు గారు చాలా అన్యాయం చేశారని, తమ స్వీయ చరిత్రలో ఆయననొక దుర్మార్గునిగా చిత్రీకరించారని, స్వీయ చరిత్రలో అడుగడుగునా ఆయన పట్ల అసూయ, ద్వేషం కనబడతాయని శివరావు గారు విమర్శించారు. లియోనార్డు ఏలూరి లక్ష్మీనరసింహం గారి జీవిత విశేషాలను చక్కగా వివరిస్తూ ఆయనొక మహాపురుషునిగా వర్ణించారట. అప్పటి రాజమహేంద్రవరంలో న్యాపతి సుబ్బారావు పంతులు గారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు, నేతి సోమయాజులు గారు ఒక వర్గంగా మారి ఏలూరి లక్ష్మీ నరసింహం గారిని ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉండేవారట. వీళ్ళకు వీరేశలింగం పంతులు గారు, ఆయన వివేకవర్థని పత్రిక తోడయ్యాయి. ఆ పత్రికలో ఏలూరి గురించి వ్యంగ్యంగా అనేక చిత్ర కథలు రాయడంతో ఆయన పరువు నష్టం దావా వేశారు. ఆ కేసును విచారించిన న్యాయాధిపతి పరువునష్టం జరిగిన మాట నిజమేనని తీర్పునిస్తూ నష్ట పరిహారం విషయంలో దయ తలచి నిమిత్త మాత్రంగా ఒక అణా డిక్రీగా ఇచ్చారు.

ఏ వ్యక్తికైనా మచ్చలేని వ్యక్తిగా భావించి ఆరాధించడం పొరపాటు. ఓ వ్యక్తి గొప్పవాడు కావచ్చు, అలా అని అతనిలో ఉన్నదంతా మంచి అనుకోలేం. మనిషి మంచి చెడుల మిశ్రమం. ఎక్కువ మంచి లక్షణాలు కలిగి సమాజంపై మంచి ప్రభావం చూపిన వ్యక్తులని గొప్పవారిగా పరిగణిస్తాం. అందుకే జీవితచరిత్రలు తెలుసుకునేటప్పుడు ఆబ్జెక్టివ్ దృక్పథంతో చదివితేనే వాస్తవాలు తెలుసుకోగలం.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in December 2024, సాహిత్యం

1 Comment

  1. డా. నరేంద్ర బాబు సింగూరు

    నిజమే… ప్రతి వ్యక్తి ఓ మంచి చెడుల మిశ్రమం. మహా వ్యక్తుల గొప్పదనాన్ని మీరన్నట్టు సమాజం పై వారు చూపించిన పెంచిన మంచిని చూడాలి. మహా వ్యక్తులు గురించి తెలుసుకోవడం తప్పని సరి. ఇది తొలివయసులో ఉన్న పిల్లలకు తప్పని సరి చేస్తేనే ఓ మంచి సమాజాన్ని నిర్మించగలం. మీ ద్వారా మరో సారి మహా వ్యక్తి గురించి స్మరించుకునే అవకాశం కలిగింది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!