మార్క్స్ మార్గదర్శకత్వం
మార్క్సిజం, మార్క్సిస్ట్ అనే పదాల వలయంలో చిక్కుకోకుండా మార్క్స్ ఆలోచనలను అధ్యయనం చేయడం ఈ తరానికి అవసరం. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు మార్క్స్ ప్రాసంగికత ఉంటుంది. మార్క్స్ ఆలోచనలను పునాదిగా చేసుకుని పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థ రూపొందించుకోవడం మానవాళి కర్తవ్యం. “సిద్ధాంతాలు సరైనవే కావచ్చు కానీ సమగ్రం కావు” అనే అవగాహనకు వస్తే ఇజాలలో ఇంప్రిజన్ కాకుండా ఎప్పటికప్పుడు వాస్తవిక దృక్పథంతో ఆలోచించడం వీలవుతుంది. మార్క్సిజానికి ముప్పు మార్క్సిస్టులు పిడివాదులుగా మారి జడత్వంతో కూరుకుపోవడమేనేమో?
వ్యక్తులు కలిస్తేనే వ్యవస్థ ఏర్పడుతుంది. వ్యక్తుల ఆలోచనల్లో మార్పు రాకుండా విప్లవం రాదు. కాబట్టి వ్యక్తులు వికాసం చెందితేనే సమాజంలో అభ్యుదయం సాధ్యపడుతుంది. ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మార్క్సిజాన్ని వ్యక్తి వికాసం కోసం ఉపయోగించుకోవాలి.
మార్క్స్ ఆలోచనలను క్రమపద్ధతిలో అధ్యయనం చేయాలి. కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టోతో మొదలుపెట్టి గతి తార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదాలను అవగతం చేసుకుని థీసిస్ ఆన్ ఫ్యూయర్బ్యాక్, మనిషి గురించి మార్క్స్ అవగాహల మీదుగా కాపిటల్ గ్రంథాన్ని చేరుకొని, పెట్టుబడిని అన్ని కోణాల్లో అర్ధం చేసుకోవాలి. అంతటితో ఆగకుండా పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించాలి.
"ఇంత వరకూ సాగిన సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే" అనే వాక్యంతో కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక మొదలవుతుంది.
కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక యొక్క మౌలిక ప్రతిపాదన ఏంటంటే :-
"ప్రతి చారిత్రక యుగంలోనూ ఆనాడున్న ఆర్ధిక ఉత్పత్తి, మార్పిడి జరిగే విధానమూ, దానిని తప్పనిసరిగా అనుసరించే సామాజిక నిర్మాణమూ కలసి పునాదిగా ఉంటాయి. ఆ పునాదిపైన ఆ యుగపు రాజకీయ, బౌద్ధిక చరిత్ర నిర్మితమవుతుంది. ఆ పునాది ఆధారంగానే ఆ చరిత్రను వివరించడం సాధ్యమవుతుంది. కనుక మొత్తం మానవ జాతి చరిత్ర (భూమిపైన ఉమ్మడి యాజమాన్యం ఉండిన ఆదిమ గణ సమాజం రద్దైన నాటి నుంచీ) అంతా వర్గ పోరాటాల చరిత్రే. అది దోపిడీకి గురయ్యే వర్గాలకీ దోపిడీ చేసే వర్గాలకీ మధ్య పాలిత వర్గాలకీ పాలక వర్గాలకీ మధ్య జరిగే పోటీ, పోరాటాల చరిత్రే".
ప్రణాళికకు గుండెకాయ వంటి ఈ మౌలిక ప్రతిపాదన మార్క్సుదేనని ఫ్రెడెరిక్ ఏంగెల్స్ ప్రణాళికకు రాసిన ముందుమాటలో చెప్పారు.
"ప్రపంచ కార్మికులారా ఏకం కండి!" అనే వాక్యంతో ముగిసే కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో పై మౌలిక ప్రతిపాదనకు తోడు చరిత్ర, రాజ్యం, పెట్టుబడి,పెట్టుబడిదారీ వ్యవస్థల గురించి కీలక వివరణలు, వ్యాఖ్యలు ఉన్నాయి.
వాటి గురించి ...
అయితే మార్క్స్ సూత్రీకరణలు చదివేటప్పుడు అవి అప్పటి ఐరోపా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
"ఫ్యూడల్ సమాజపు శిథిలాల నుంచే ఆధునిక బూర్జువా వర్గం మొలకెత్తింది. చారిత్రకంగా ఈ పెట్టుబడిదారీ వర్గం అత్యంత విప్లవకరమైన పాత్ర పోషించింది."
"ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం పెట్టుబడిదారీ వర్గపు సమిష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే."
"పెట్టుబడిదారీ వర్గం మనిషికీ మనిషికీ స్వలాభం తప్ప, డబ్బు చెల్లింపులు తప్ప ఇక ఏ సంబంధాన్నీ మిగల్చలేదు." విద్య, వైద్యం దగ్గర నుండీ చావు పుట్టుకలు కూడా సరుకుగా మారడం చూస్తున్నాం.
"ఉత్పత్తి పరికరాల్లో నిరంతరాయంగా విప్లవం తేకుండా బూర్జువా వర్గం మనలేదు." ఆవిరి యంత్రం తో మొదలైన పారిశ్రామిక విప్లవం నేడు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వద్దకు చేరింది. మానవ జిజ్ఞాస కూడా కారణమైనప్పటికీ ప్రధానంగా ఇది ఉత్పత్తి పరికరాల అభివృద్ధి కోసం జరిగిన నిరంతర పరిశోధన ఫలితమే.
"ఉత్పత్తి పరికరాల్లో వచ్చే విప్లవం ఉత్పత్తి సంబంధాల్లోనూ మొత్తం సామాజిక సంబంధాల్లోనూ విప్లవం తెస్తుంది." ఆర్ధిక సంస్కరణల తరువాత భారతదేశ సామాజిక జీవితంలో వచ్చిన మార్పు పైన చెప్పిన సూత్రీకరణను రూఢీ చేస్తుంది.
"ఉత్పత్తిలో నిత్య విప్లవమూ, సకల సామాజిక పరిస్థితులనూ నిరంతరాయంగా కల్లోలపరచడమూ, అంతులేని అనిశ్చయత్వమూ - ఇవే పెట్టుబడిదారీ యుగపు ప్రత్యేక లక్షణాలు.”
"తన ఉత్పత్తులకు నిరంతరాయంగా పెరిగే మార్కెట్ కావాలి గనుక పెట్టుబడిదారీ వర్గం ప్రపంచం నలుమూలలకూ వెళ్తుంది, ప్రతి చోటా గూడు కట్టుకుంటుంది, ప్రతి చోటా నివసిస్తుంది, అన్ని చోట్లా సంబంధాలను ఏర్పరచుకుంటుంది."
పద్దెనిమిది, పందొమ్మిదవ శతాబ్దాలలో తలెత్తిన సామ్రాజ్యవాదమూ, ఇరవై, ఇరవై ఒక్కటవ శతాబ్దాలలో వచ్చిన సరళీకృత, ప్రపంచీకరణ విధానాలు పై సూత్రీకరణను దృవపరుస్తున్నాయి.
"ఉత్పత్తి పరికరాలన్నీ అతి వేగంగా మెరుగవడం వల్లా, వార్తా రవాణా సౌకర్యాలన్నీ అపారంగా పెరగడం వల్లా, పెట్టుబడిదారీవర్గం అత్యంత ఆటవిక జాతులతో సహా అన్ని దేశాలనూ నాగరికతలోకి లాగుతుంది."
"పెట్టుబడిదారీ వర్గం గ్రామ సీమలను లోబడి ఉండేలా చేసింది. బ్రహ్మాండమైన నగరాలను సృష్టించింది. గ్రామీణ జనాభాతో పోలిస్తే నగరాల జనాభాని అపారంగా పెంచింది. ఈ పరిణామం గ్రామీణ జీవితంలోని మౌఢ్యాన్ని బలహీన పరచిందని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే రైతాంగ ప్రధాన దేశాలను పెట్టుబడిదారీ దేశాలపైనా, ప్రాచ్యాన్ని పశ్చిమం పైన ఆధారపడేలా చేసింది పెట్టుబడిదారీ వర్గం."
పెట్టుబడిదారీ వ్యవస్థలో తలెత్తే సంక్షోభాలకు దానిలో అంతర్గతంగా ఉన్న లోపాలే కారణం. అతి నాగరికత, అధిక వస్తూత్పత్తి, ప్రాణాధార వస్తువుల ధ్వంసం, అతి వాణిజ్యం వంటివి.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులకు వ్యతిరేక వర్గం శ్రామికులు. తమ శ్రమ శక్తిని అమ్ముకుని బ్రతికే వారే శ్రామికులు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామికుడికి శ్రమ చేసుకుని బ్రతికేందుకైనా పెట్టుబడిదారుడు గ్యారెంటీ ఇవ్వలేడు. తనకు పునాది ఐన శ్రమశక్తిని తానే నాశనం చేస్తూ ఉండటమే పెట్టుబడిదారీ వర్గానికి ప్రమాద హేతువు.
ఉత్పత్తికి లాభాపేక్ష కాకుండా సమాజ అవసరాలు ప్రాతిపదిక అవ్వడమే పెట్టుబడిదారీ వ్యవస్థ పతనానికి ఆరంభం.
మార్క్స్ కమ్యూనిస్టుల సిద్ధాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పచ్చు అన్నారు : "సొంత ఆస్తి రద్దు ". అయితే కమ్యూనిజం కోరేది ఏ ఆస్తినైనా రద్దు చేయడం కాదు, బూర్జువా ఆస్తిని రద్దు చేయడం మాత్రమే. పెట్టుబడిని అంటే పరిశ్రమలనంతటినీ ఉమ్మడి ఆస్తిగా మార్చాలి. పెట్టుబడి ఒక వ్యతిగత శక్తి కాదు. అది ఒక సామాజిక శక్తి. పెట్టుబడిని ఉమ్మడి ఆస్తిగా మారిస్తే, అంటే, మొత్తం సమాజ సభ్యులందరి ఆస్తిగా మారిస్తే, ఆస్తి తన వర్గ స్వభావాన్ని కోల్పోతుంది.
కమ్యూనిస్ట్ విప్లవం అంటే పాత సాంప్రదాయక ఆస్తి సంబంధాలతో అత్యంత మౌలికంగా తెగదెంపులు చేసుకోవడం. ప్రతి వ్యక్తీ స్వేచ్ఛగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే అందరూ స్వేచ్ఛగా అభివృద్ధి చెందగలరు. మార్క్స్ వాంఛించిన కమ్యూనిస్ట్ సమాజం ఇదే.