Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

ఆంధ్ర నాటకరంగ ప్రభాకరుడు బళ్ళారి రాఘవ

Bellary-Raghava

“బళ్ళారి రాఘవ అంట, గాడెవడో, నాకు తెల్వదు”. తెలుగు నాట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ సోపానాలు నిర్మించుకున్న ఓ రాజకీయవేత్త పలికిన పలుకులివి. బళ్ళారి రాఘవ గారి గురించి చదివినపుడల్లా నాకు ఈ వ్యాఖ్యలు గుర్తుకు వస్తుంటాయి. తెలుగువెలుగుల మూర్తి నిక్షిప్త ప్రాంగణంలో స్ఫూర్తిదాయకమైన విగ్రహాలను ప్రాంతీయ విద్వేషాలకు ఆహుతి చేసిన ఘటనను మా తరం ఎన్నటికీ మరచిపోలేదు.

తెలుగు దేశ చరిత్రలో యన్.టి.రామారావు గారి పౌరాణిక పాత్రలు అజరామరంగా నిలిచిపోతాయి. శ్రీ రామ, శ్రీ కృష్ణ, రావణ, కర్ణ, దుర్యోధన, భీష్మ, బృహన్నల పాత్రలతో తెలుగు జనతను మంత్రముగ్ధులను చేసిన యన్.టి.ఆర్ ఓ చలన చిత్ర యోధుడు. తెలుగు దేశ నాటక రంగంలో అంతటి స్థాయి కలిగిన వ్యక్తి బళ్లారి రాఘవ గారు. ఒక విస్మృత కళాకారుడి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించి భావి తరాలకు వారి గురించి తెలియజెప్పే బాధ్యత మరో కళాకారుడు తీసుకోవడం ముదావహం.

ఆంధ్ర నాటక పితామహుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యుల మేనల్లుడే బళ్ళారి రాఘవ గారు. వీరు 1880 ఆగస్టు రెండవ తారీఖున తాడిపత్రిలో నరసింహాచార్యులు,శేషమ్మ దంపతులకు జన్మించారు. నరసింహాచార్యులు గారు బళ్లారి మునిసిపల్ హై స్కూల్ లో తెలుగు పండితునిగా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవడం వల్ల జనవ్యవహారంలో ఇంటి పేరు బళ్ళారి గానే నిలిచిపోయింది. ఆనాడు బళ్లారిలో బసప్ప అనే అవధూత ఉండేవారట. ఆయన ఒకనాడు శేషమ్మ గారిని "అమ్మా, నీ గర్భములో బసవేశ్వరుడు అవతరించును" అని ఆశీర్వదించారట. ఆ అవధూత ఆశీర్వచము తరువాత జన్మించిన బిడ్డకు నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులు బసప్ప అని పేరు పెట్టారట. నరసింహాచార్యులు వైష్ణవ సంప్రదాయం ప్రకారం పుట్టిన బిడ్డను రాఘవ అని పిలిచేవారట. వాడుకలో అదే అసలు పేరుగా స్థిరపడిపోయింది.

తన ఎనిమిదవ ఏట బళ్లారి మునిసిపల్ స్కూల్ లో ఆరవ తరగతిలో చేరిన రాఘవ పదనాల్గొవ ఏట మెట్రిక్యూలేషన్ పాసయ్యారు. బళ్ళారి వార్డ్ల కళాశాలలో ఫెలో అఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి, అనంతరం మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బి.ఏ, లా కాలేజీలో బి.యల్ పూర్తి చేశారు. అప్పటి మద్రాస్ నగరం రాఘవ గారిలో నాటకాల పట్ల, క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడల పట్ల ఆసక్తిని పెంచింది. కళాశాలలో ఉండగానే షేక్స్పియర్ నాటకాల నటుడిగా రాఘవ గారు ఖ్యాతి గడించారు. న్యాయవాద విద్యను 1905లో పూర్తి చేసి 1906లో తన మేనమామ సహాయకునిగా న్యాయవాద వృత్తి చేపట్టారు. తరువాత స్వయంగా వృత్తి చేసుకొనటం మొదలుపెట్టారు.

బళ్లారిలో లా ప్రాక్టీస్ మొదలుపెట్టినపుడే షేక్స్పియర్ క్లబ్ ఏర్పాటు చేసి ఒథెల్లో,జూలియస్ సీజర్, మర్చంట్ అఫ్ వెనిస్ వంటి నాటక ప్రదర్శనలిచ్చేవారు. బళ్లారిలో ఆ రోజుల్లో ధర్మవరం రామకృష్ణమాచార్యుల "సరస వినోదిని సభ", కోలాచలం శ్రీనివాసరావు గారి "సుమనోరమ సభ" నాటక ప్రదర్శనల్లో వినుతికెక్కినవి. రాఘవ గారు తన మేనమామ గారి నాటక సమాజాన్ని కాకుండా కోలాచలం శ్రీనివాసరావు గారి సమాజాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇందుకు కారణం రామకృష్ణమాచార్యుల నాటకాల్లో సంగీతం ఎక్కువ ప్రాధాన్యత వహించేది. అందుకు భిన్నంగా నాటకాల్లో అభినయాన్ని మరుగున పరిచే విధంగా సంగీతం ఆధిపత్యం వహించడాన్ని రాఘవ గారు వ్యతిరేకించేవారు. రామకృష్ణమాచార్యుల కొడుకైన వేణుగోపాలాచారి చెప్పిన దాని ప్రకారం :- వారి తండ్రిగారు మంచి గాయకుడు. అంతే కాకుండా రామకృష్ణమాచార్యులు నాటకీయ సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రాముఖ్యత తెచ్చారు. రాఘవగారికి సంగీతంలో అంతగా అభినివేశం లేకపోవడం వల్ల నాటకాల్లో సంగీతానికి తన తండ్రిగారు ఇస్తున్న ప్రాధాన్యతను వ్యతిరేకించేవారు. అంతే కాకుండా రాఘవ గారికి పౌరాణిక నాటకాల కన్నా చారిత్రక నాటకాలు, సామాజిక నైతికతను పెంపొందించే నాటకాలంటే మక్కువ ఎక్కువ.

రాఘవగారు తెలుగులో 35, కన్నడలో 10, ఇంగ్లీష్ లో 10, హిందీలో 3, తమిళంలో 2 మొత్తం కలిపి 60 నాటకాల్లో పాత్రలు ధరించేవారు. శివాజీ, చాణక్య, రామదాసు, పఠాన్ రుస్తుం, రావణ, రాణాప్రతాప్, దుర్యోధన, యమ, హరిశ్చంద్ర, అర్జున, దశరథ, హిరణ్యకశ్యప, నల, కీచక, నారద, కర్ణ, ఒథెల్లో, షైలాక్ , మాక్ బెత్ వంటి అనేక పాత్రలు ధరించేవారు.

మొదట్లో పౌరాణిక నాటకాలంటే ఆసక్తి చూపని రాఘవ గారు కోలాచలం వారు రచించిన హరిశ్చంద్ర నాటకం నుండీ పౌరాణిక నాటకాల్లో కూడా నటించడం ఆరంభించారు. నాటి పౌరాణిక నాటకాల్లో నేటి సామాజిక భావాలను ప్రతిపాదించి ప్రదర్శించడానికి రాఘవగారు అనుకూలురు. రాఘవ గారి దృష్టిలో చంద్రమతి ఆదర్శవతి, ఆమె లేకుంటే సత్య హరిశ్చంద్రుడు ఉండేవాడు కాదు, కేవలం హరిశ్చంద్రుడే ఉండేవాడు. సినిమాల్లో ఎన్ఠీఆర్ దుష్ట పాత్రలైన దుర్యోధన, రావణ వంటి పాత్రల్లో పాజిటివిటీని చూపించి ఎలా రక్తి కట్టించారో, నాటక రంగంలో రాఘవగారు కూడా అదే విధంగా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. రాఘవ గారు కోలాచలంవారి "ద్రౌపదీ మాన సంరక్షణము" అనే నాటకములో దుర్యోధన పాత్రను, అలానే కన్నడ నాటకకర్త వెంకటరామయ్య గారు రచించిన "మండోదరి" నాటకంలో రావణ పాత్రను ధరించారు.

రాఘవ గారు బెంగళూరుకు చెందిన అమెచ్యూర్ డ్రమటిక్ అసోసియేషన్ తరపున కూడా నటించేవారు. ప్రసిద్ధ కన్నడ రంగస్థల నటుడు ఏ.వి.వరదాచార్య ఆహ్వానం మేరకు అమెచ్యూర్ డ్రమటిక్ అసోసియేషన్ తరపున నటించడం ఆరంభించారు. 1919లో అమెచ్యూర్ డ్రమటిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన లలితకళోత్సవంలో రాఘవ గారు "విజయనగర పతనం" అనే నాటకాన్ని ప్రదర్శించారు. అందులో పఠాన్ రుస్తుం పాత్రలో రాఘవ గారు ప్రదర్శించిన నటనను, ఆ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన విశ్వకవి రబింద్రనాథ్ టాగోర్ మెచ్చుకొని, వారిని తమ శాంతినికేతన్ కు రమ్మని కోరారు.

1927లో అమెచ్యూర్ డ్రమటిక్ అసోసియేషన్ వారు పండిట్ తారనాథ్ రచించిన "దీన బంధు కబీర్" నాటకాన్ని ప్రదర్శించారు. అపుడు నందికొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న మహాత్మా గాంధీ అమెచ్యూర్ డ్రమటిక్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు ఆ నాటకాన్ని చూడడానికి వచ్చారు. కొద్దిసేపు చూసి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో వచ్చిన గాంధీజీ రాఘవగారి నటన చూసి తన్మయత్వంతో నాటకాన్ని ఆసాంతం చూస్తూ ఉండిపోయారు. చివర్లో "రాఘవ మహారాజ్ కీ జై" అంటూ ప్రశంసలు కురిపించారు.

భారతీయ కళాప్రశస్తిని విదేశాల్లో ప్రకటించాలనే ఉద్దేశంతో రాఘవగారు 1928లో విదేశీ పర్యటనకు పూనుకున్నారు. ఆరు నెలల యూరోప్ పర్యటనలో ప్రసిద్ధ కళాకారులనెందరినో కలుసుకుంటూ రెండు నెలలు లండన్ నగరంలోనే గడిపారు. బెర్నార్డ్ షా తో సుమారు రెండు గంటల పాటు నాటక కళను గురించి, నటన గురించి సంభాషించారు. బెర్నార్డ్ షా కళాధర్మములు, కావ్య మర్మముల గురించి తెలుసుకోవడానికి మేమే భారతదేశం రావాలి అని రాఘవగారితో అన్నారట. ఈ పర్యటనలో రాఘవగారు సుమారు యాభై ఏడు నాటకాలను చూశారట.

కొందరి స్నేహితుల ప్రోత్సాహం వలన రాఘవగారు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1935 నుండి 40 మధ్య ద్రౌపది మాన సంరక్షణము, చండిక, రైతు బిడ్డ వంటి చిత్రాల్లో నటించారు. నాటకాల్లో సహజ, స్వతంత్ర నటనచే కీర్తిని పొందిన రాఘవగారికి చలనచిత్రాల్లోని కృతకమైన నటన కళ కాదని, అది నిరర్ధకమనీ తోచినది.

రాఘవ గారు “సరిపడని సంగతులు” అనే సాంఘిక నాటకాన్ని రచించారు. ప్రథమ ముద్రణ 1933లో బళ్లారిలో నారాయణ పవర్ ప్రెస్ లో జరిగింది. మళ్ళీ పునర్ముద్రణ జరగని ఈ నాటకాన్ని 2017లో ప్రజాశక్తి బుక్ హౌస్ వారు ముద్రించి వెలుగులోనికి తీసుకువచ్చారు. ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల ఆత్మగౌరవం, వితంతు వివాహం ఇతివృత్తాలుగా ఈ నాటకాన్ని రాశారు రాఘవ గారు. వ్యావహారిక భాషలో మూడు అంకాలుగా వెలువడిన ఈ నాటకం రెండు మూడు గంటల వ్యవధిలో ప్రదర్శించే విధంగా ఉంటుంది. ఇందులో రాఘవ గారు శ్రీధరశాస్త్రి అనే పాత్రను పోషించారు.

రాఘవ గారు 1906 నుండీ నాటకాలు ఆడుతున్నప్పటికీ 1920 వరకు తీరాంధ్ర ప్రాంతంలో ప్రదర్శనలివ్వలేదు. అందుకు కారణం తీరాంధ్ర ప్రజలు సంగీత ప్రాధాన్యమున్న నాటకాలను ఇష్టపడతారనే అనుమానంతో ఉండడం. అయినప్పటికీ లా కాలేజీలో తన సహవిద్యార్థి అయిన గూడూరి లక్ష్మణరావు ప్రోద్భలం వల్ల 1921లో విజయవాడలో ‘మోహిని రుక్మాంగద’ నాటకాన్ని ఆడారు. అయితే రాఘవ గారి అనుమానం నిజమయ్యింది. ప్రేక్షకులు మధ్యలోనే నాటక ప్రదర్శనను ఆపివేయాల్సిందిగా కేకలు వేశారట. దాంతో తీరాంధ్ర ప్రాంత పర్యటనను మధ్యలోనే ఆపివేద్దాం అనుకున్నారు రాఘవ. అయితే గుంటూరులో రచయిత, నిర్మాత అయిన కొప్పరపు సుబ్బారావు గారి ప్రోత్సాహంతో విజయవంతంగా నాటక ప్రదర్శన ఇచ్చారు. ఆ విజయం అందించిన విశ్వాసంతో తీరాంధ్ర ప్రాంతంలో మరిన్ని నాటక ప్రదర్శనలిచ్చారు.

ఒకమారు విజయవాడలోని దుర్గా కళామందిరంలో "చంద్రగుప్త" నాటక ప్రదర్శన జరుగుతున్నది. అందులో రాఘవ గారు చాణక్య పాత్ర ధరించారు. నందుని సభలో పరాభవానికి గురై అవమాన భారంతో రుద్రునివలె నటించే సన్నివేశం జరుగుతున్నపుడు అకస్మాత్తుగా ఓ కుక్క రంగస్థలంపైకి వచ్చిందట. అప్పుడు రాఘవగారు సమయస్ఫూర్తితో "ఓ శునకరాజమా ! నీకూ కూడా నేను లోకువయ్యానా?" అని సంభోదించడంతో ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారట.

రాఘవగారు జస్టిస్ పి.వి.రాజమన్నార్ గారితో కలసి "తెగని సమస్య" అనే నాటకం రాశారు. దాన్ని ప్రదర్శించాలని ఎన్ని సార్లు రిహార్సల్స్ చేసుకున్నా, ఏదో ఒక ఆటంకం వచ్చి ప్రదర్శన నిలిచిపోయేది. ఏమైనా సరే తన జీవితకాలంలో ఆ నాటకాన్ని ప్రదర్శించాలనే పట్టుదలతో మార్చ్ 23, 1946న బళ్లారిలోని మ్యాక్ స్టేడియంలో ప్రదర్శన ఏర్పాటు చేసి రాజమన్నార్ గారి సమక్షంలోనే విజయవంతంగా ప్రదర్శించారు. ప్రదర్శన ముగిసిన పదహైదు రోజులకు రాఘవగారి ఆరోగ్యం దెబ్బతింది. అది ఏప్రిల్ 16వ తేదీ , 1946వ సంవత్సరం పౌర్ణమి. హంపిలో విరూపాక్షుని రధోత్సవం జరుగుతున్నది. ఆంధ్ర నాటకరంగంలో ధ్రువతార జీవిత రంగము నుండి రాత్రి పదకొండు గంటలకు నిష్క్రమించింది.

రాఘవ గారికి నివాళులు అర్పిస్తూ :-
“ఆ విశాల లోచనాలు
అనంత భావాల దర్పణాలు
ఆనాసిక
అతిలోక సౌందర్యాని కనుప్రవేశిక
అతనివంటి నటకుడు నాడులేడు
ఇకరాడు
ఆజ్యోతికి సర్వప్రపంచం నివాళులిచ్చింది
ఆ మరణానికి కాలమే నిట్టూర్చింది” అని పుట్టపర్తి నారాయణాచార్యులు అన్నారు.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in September 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!